https://oktelugu.com/

Ramadan 2024: నేడు రంజాన్.. ముస్లింలు ఈ పండుగకు ఎందుకు ప్రాధాన్యమిస్తారు.. దీని వెనుక ఉన్న ప్రత్యేకతలేంటి?

ముస్లింలు తమ మత విశ్వాసాల ప్రకారం ఈద్ ఉల్ ఫితర్ కు విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. దీన్ని ఈద్ లేదా రంజాన్ అని పిలుస్తారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లింలు ఈ పండగ జరుపుకుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 11, 2024 9:06 am
    Ramadan 2024

    Ramadan 2024

    Follow us on

    Ramadan 2024: నెలవంక దర్శనం ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ప్రార్థనలతో మసీదులు కిటకిటలాడుతున్నాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ముస్లింలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

    ముస్లింలు తమ మత విశ్వాసాల ప్రకారం ఈద్ ఉల్ ఫితర్ కు విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. దీన్ని ఈద్ లేదా రంజాన్ అని పిలుస్తారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లింలు ఈ పండగ జరుపుకుంటారు. ఈ నెలలో ముస్లింలు కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉదయం, సాయంత్రం నమాజ్ చేస్తారు. ఆ సమయంలో ఖురాన్ చదువుతారు. అల్లాను ఆరాధిస్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ అనేది తొమ్మిదవ మాసం. షవ్వాల్ అనేది పదవ నెల. ఈనెల ప్రారంభం రోజునే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ జరుపుకుంటారు. ఏప్రిల్ 9న సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారతదేశంలో నెలవంక దర్శనం కాలేదు.. పదవ తేదీ సాయంత్రం దర్శనం కావడంతో 11న అంటే గురువారం ఈ పండగను జరుపుకుంటున్నారు.

    ఇస్లామిక్ క్యాలెండర్ ను హిజ్రీ అంటారు. దీని ప్రకారం 29 లేదా 30 రోజులపాటు ముస్లింలు ఉపవాసం ఉంటారు. గత నెల 11న ఉపవాస దీక్షలను ప్రారంభించారు. ఈ ఏడాది రంజాన్ దీక్ష 30 రోజులు పూర్తయింది. ఆ లెక్క ప్రకారం ఏప్రిల్ 9న మంగళవారం ఈద్ నెలవంక కనిపించాలి. కానీ ఆరోజు కనిపించలేదు. ఏప్రిల్ 10న నెలవంక దర్శనం ఇవ్వడంతో మరుసటి రోజు ముస్లింలు ఘనంగా రంజాన్ జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, టర్కీ, ఈజిప్ట్, ఇరాన్, మిడిల్ ఈస్ట్, మిడిల్ వెస్ట్, ఇతర 30 దేశాలలో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ బుధవారం నాడు రంజాన్ జరుపుకున్నారు.

    ఇస్లాం మత ఆచారాల ప్రకారం ఐదు నియమాలను అత్యంత నిష్టగా ముస్లింలు పాటిస్తారు. వాటిల్లో నమాజ్, హజ్ యాత్ర, విశ్వాసం, ఉపవాసం, జకాత్ అనే వి ముఖ్యమైనవి. క్రీస్తుశకం 624 లో తొలిసారిగా రంజాన్ జరుపుకున్నారు. ఇక ఇస్లాం చరిత్ర ప్రకారం సౌదీ అరేబియాలోని మదీనా పరిధిలో బదర్ నగరంలో ముస్లింలు తొలిసారిగా యుద్ధం చేశారు. అందుకే దానిని జంగ్ – ఎ – బాదర్ అని పిలుస్తారు. యుద్ధంలో ముస్లింలు విజయం సాధించారు. ఇక అరబిక్ నిఘంటువులో ఉపవాసాన్ని సౌమ్ అంటారు. ఫార్సీ భాషలో ఉపవాసాన్ని రోజా అంటారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం సూర్యోదయానికి ముందు ఫజ్ర్ ఆజాన్ తో మొదలవుతుంది. అంటే రంజాన్ నెలలో సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు.. దీనిని సెహ్రీ అంటారు. ఈ సమయాన్ని ముందుగా నిర్ణయిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. దీనిని ఇఫ్తార్ అంటారు. ఉపవాస సమయంలో ముస్లింలు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆహారం వారికి శక్తిని ఇస్తుంది.