RR Vs GT: మ్యాచ్ అంటే ఇది.. అనుక్షణం ఉత్కంఠ.. అడుగడుగునా టెన్షన్.. బంతి బంతికి సమీకరణం మారిపోయింది. విజయం దోబూచులాడింది. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్ లు జరిగాయి కానీ.. ఈ మ్యాచ్ మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ వినోదాన్ని అందించింది కాబట్టి.. మైదానం లో కూర్చున్న ప్రేక్షకులే కాదు.. మైదానంలో ఆడిన ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ను మర్చిపోలేరు.. వాస్తవానికి గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. బోరింగ్ గా ఉంటుందని.. బోర్ కొట్టకుండా చూడాలని.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు.. కానీ మ్యాచ్ చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో వారికి టీ -20 మజా అందించింది ఈ మ్యాచ్..
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ జట్టు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 3 లాస్ అయి 196 రన్స్ చేసింది. రియాన్ పరాగ్(48 బంతుల్లో; 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 76), సంజూ సాంసన్(38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో; 68*) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
197 పరుగుల విజయ లక్ష్యంతో గుజరాత్ జట్టు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. గిల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో; 72), సాయి సుదర్శన్ (29 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్ తో; 35) సత్తా చాటారు. చివర్లో రాహుల్ తేవాటియా(20*), రషీద్ ఖాన్ (24*) అద్భుతంగా ఆడటంతో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
197 పరుగుల భారీ విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు.. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. కులదీప్ సేన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాతి ఓవర్లో మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్ (1) ను కులదీప్ సీన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన విజయ్ శంకర్ సాయంతో కెప్టెన్ గిల్ 35 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో చాహల్ బౌలింగ్లో విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే సమయంలో గిల్ ను కూడా స్టంప్ ఔట్ గా పెవిలియన్ పంపించాడు.
ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షారుక్ ఖాన్ 14 పరుగులతో సత్తా చాటినప్పటికీ.. ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో క్రికెట్ల ముందు దొరికిపోయాడు.. దీంతో గుజరాత్ విజయ సమీకరణం 12 బంతుల్లో 35 పరుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కులదీప్ సేన్ వేసిన 19 ఓవర్ లో రషీద్ ఖాన్, రాహుల్ తేవాటియా మ్యాచ్ స్వరూపాన్ని మార్చారు. 20 పరుగులు పిండుకున్నారు.. దీంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్ లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆవేష్ ఖాన్ బౌలింగ్లో రషీద్ తొలి నాలుగు బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఐదో బంతికి రాహుల్ 3 పరుగులు తీసే క్రమంలో రన్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ కొట్టి గుజరాత్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గుజరాత్ జట్టు వరుస ఓటములకు చెక్ పెట్టింది. ఇదే సమయంలో ఈ సీజన్లో తొలి ఓటమిని రాజస్థాన్ జట్టు చవి చూసింది.