Margashir Amavasya : హిందూ శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు శివ, విష్ణువులను పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ప్రతి నెలలో అమావాస్య వస్తుంటుంది. కానీ కొన్ని పర్వదినాల సందర్భంగా వచ్చే అమావాస్యలకు ప్రాధాన్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పుణ్యస్నానంతో పాటు దానాలు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఎవరైనా తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే మార్గశిర అమావాస్య పై చాలామందికి సందేహం ఉంది. ఈ అమావాస్య డిసెంబర్ 30నా? లేదా 31నా? అనే ఆందోళనలతో ఉన్నారు. దీంతో అసలు అమావాస్య ఏ రోజు ఒకసారి పరిశీలిద్దాం..
సాధారణంగా ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ చివరి వారంలో అమావాస్య వస్తుంటుంది. అయితే 2024 సంవత్సరంలో డిసెంబర్ 30న అమావాస్య అని క్యాలెండర్లో సూచిస్తుంది. కానీ కొందరు 31న అమావాస్య జరుపుకోవాలని అంటున్నారు. అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం.. అలాగే వైదిక క్యాలెండర్ ప్రకారం మార్గశిర కృష్ణపక్ష అమావాస్య తిథి డిసెంబర్ 30న తెల్లవారుజామున 4.01 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది తిరిగి డిసెంబర్ 31వ తేదీ 3.56 గంటలకు ముగుస్తుంది. దీంతో డిసెంబర్ 30న మార్గశిర అమావాస్య అని తెలుస్తుంది.
మార్గశిర అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మార్గశిర అమావాస్యను సోమతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యంతో పాటు కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే?
మార్గశిర అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. ఆ తర్వాత ఈ రోజున శుభ్రమైన దుస్తులు ధరించాలి. దేవుళ్ళతో పాటు పితృదేవతలను కూడా స్మరించుకోవడం మంచిది. పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఈ రోజున దక్షిణ వైపు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. అలాగే ఈరోజు రావి చెట్టు కింద పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో భాగంగా రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి రావి చెట్టు వద్ద దీపం వెలిగించాలి. ఇదే సమయంలో పితృదేవతలను స్మరిస్తూ చాలీసా చదవడం వల్ల వారి అనుగ్రహం పొందుతారు.
మార్గశిర అమావాస్య రోజున ప్రత్యేక పూజలతోపాటు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం ఎక్కువగా తగ్గుతుంది. ఈరోజు బ్రాహ్మణులకు ఆహారం అందించాలి. అలాగే పెరుగు పాలు వస్త్రాలు నల్ల నువ్వులను కూడా దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారు.