Afghanistan: ‘నీకు పండంటి బిడ్డ పుట్టబోతోంది. కాసేపట్లో ఆపరేషన్ చేస్తాం..’ అని ఓ మహిళకు డాక్టర్లు తెలిపారు. కానీ ఆమె వైద్యులతో ‘నాతో పాటు నా బిడ్డను కూడా చంపేయండి.. ఇక్కడ బతకలేం..నేను బతకడానికే ఇక్కడ కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరికి జన్మనెలా ఇవ్వగలను’ అని ఓ గర్భిణి ప్రాథేయపడిందని అప్ఘనిస్తాన్ కు చెందిన డాక్టర్లు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం అప్ఘనిస్తాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రమైంది. ముఖ్యంగా మహిళలు పోషకాహారంతో బలహీనంగా మారారు. ఆసుపత్రులకు బిడ్డలకు జన్మనివ్వడానికి తల్లులు వస్తున్నారు. ఈ తల్లుల్లో పుట్టే బిడ్డకు పాలు ఇవ్వడానికి కూడా సరిపోయే శక్తి వారి దగ్గర లేదని అక్కడి వైద్యులు తెలుపుతున్నారు. సెంట్రల్ అప్ఘనిస్తాన్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక చిన్న చిన్న గ్రామాల్లో ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో రెండువారాల్లో పుట్టిన ఐదుగురు శిశువులు ఆకలి బాధకు తట్టుకోలేక చనిపోయారని ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు.
అప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో కరువు విలయతాండవం చేస్తోంది. కనీస తిండి కరువై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అంతర్జాతీయంగా వీరికి అందే సాయం కూడా ఆగిపోవడంతో తిండి దొరకక చాలా మంది మరణిస్తున్నారు. దేశంలో వైద్య, ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. మహిళలకు, బాలికలకు ప్రాథమిక హక్కులు కల్పించని ప్రభుత్వానికి నిధులు ఇవ్వడానికి ఇతర దేశాలు ముందుకు రావడం లేదు. ఇక తాలిబన్ల నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి తాజాగా చెప్పిన గుణాంకాల ప్రకారం.. దేశంలో కనీసం 1.4 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నీ మూతపడేలా ఉన్నాయి. ఇప్పటికే 2300 దవాఖానాలను క్లోజ్ చేశారు. దీంతో ప్రజలకు అందాల్సిన కనీస మెడిసిన్స్ అందడం లేదు. కాబుల్ ప్రముఖ పిల్లల ఆసుపత్రిలో పోషకాహార లోపంతో వచ్చేవారి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఆసుపత్రిలో స్థాయికి మించి రోగులు ఉన్నారు. ఈ సంక్షోభంలో ఎక్కువగా చిన్నపిల్లలే మరణించడం బాధాకరం. శీతాకాలం అయినందుకు ఇక్కడ చలి విపరీతంగా పెరుగుతోంది. రోగులను వెచ్చగా ఉంచేందుకు కలప కొరత కూడా తీవ్రమైంది. దీంతో చెట్ల కొమ్మలు నరికి చలిమంట కాగమని సూచిస్తున్నారు. అవికూడా అయిపోతే ఏం చేయలేని పరిస్థితి అని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇక ఉన్నవారికి చికిత్స చేస్తున్న సమయంలో ఎంతో నరకం చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి ఆపరేషన్ చేస్తుండగా కరెంట్ పోతుంది. దీంతో బయటకి వచ్చి దీపం వెలిగించమని అడిగాను. అప్పుడు కారు ఉన్న ఓ వ్యక్తి తన ఇంధనాన్ని ఇవ్వడంతో జనరేటర్ సాయంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వైద్యులు కష్టాలు చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సవాళ్లతో పనిచేస్తున్నా వైద్య సిబ్బందికి జీతాలు ఇంకా చెల్లించలేదు.
Also Read: మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి హానికరమంటున్న వైద్యులు.. ఎందుకంటే?
అయితే ఇటీవల తాలిబన్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ లేఖను కొవిడ్ రోగులకు చికిత్స చేసే హెరాత్‌లోని ఓ ఆసుపత్రి డైరెక్టర్ దానిని ఇతరులకు షేర్ చేశాడు. ఈ లేఖలో నిధులు సమకూరేవరకు సిబ్బంది జీతాలు లేకుండానే పనిచేయాలని రాశారు. అయితే ఆ నిధులు అందని పక్షంలో ఆసుపత్రి మూసివేయాల్సి వస్తుందని ఆ వైద్యులు పేర్కొంటున్నారు. ఇక కొందరు రోగులను గోలుసుతో తీసుకొస్తున్నారు. వారికి చికిత్స అందించడం కష్టంగా ఉంది. ఒక రకంగా ఆసుపత్రిలాగా కాకుండా.. జైలులాగా అనిపిస్తుందని అంటున్నారు.
ఐక్యరాజ్య సమితి నవంబర్ 10న దేశాన్ని ఆదుకునేందుకు 15 మిలియన్ డాలర్ల సహాయాన్ని చేసింది. అందులో 8 మిలియన్ డాలర్లతో సుమారు 23,500 మంది వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించారు. అయితే ఇతర దేశాలు కూడా ఈ విధంగా సాయం చేస్తేనే మనుగడ ఉంటుంది. అదీగాక తొందర్లోనే నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అక్కడి వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం ముగింట అప్ఘనిస్తాన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు చనిపోవడం ఖాయమంటున్నారు.
Also Read: ప్రతిరోజు చపాతీలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Serious food crisis in afghanistan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com