
ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత అనేక పాఠాలను నేర్చుకొని ఒక బలమైన పార్టీగా అవతరించింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రజలకోసం, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మంచి పేరునే గడించింది. 23అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కంటే కూడా ప్రజలు జనసేనతోనే వారి సమస్యలను విన్నవించుకుంటున్నారు. మొన్న ఇసుక సమస్య, నిన్న రైతు సౌభాగ్య దీక్షలు అందుకు ఉదాహరణలు. అలానే వైసీపీ నేతలు, టీడీపీ కంటే జనసేన మీదే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు అంటే జనసేన ప్రతిపక్ష స్థానాని ఆక్రమించినట్లే అని చెప్పొచ్చు. ఈ విధంగా జడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్తున్నారు..అందుకు గల కారణాలను విశ్లేషిద్దాం..
వ్యక్తిగతంగా ఏదో ఆశించి అది నెరవేరక పార్టీని విడిచి వాళ్ళు కొంతమంది, బలమైన జగన్ సర్కార్ ని ఎదిరించలేక వైసీపీ ప్రలోభాలకు లోబడి వెళ్లే వాళ్ళు మరికొంతమంది కాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చక వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. మొదటి రెండు కారణాల వల్ల పార్టీని విడిచిపోయే వాళ్ళ గూర్చి జనసేన పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ పవన్ ప్రవర్తన వల్ల పార్టీని విడిచిపెడితే కొంచం ఆలోచించాలి. ఎందుకంటే నాయకుడు అన్ని కోణాలలో నాయకత్వ లక్షణాలను కనపర్చాలి. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో, కొంతమంది వ్యక్తులకో కొమ్ము కాసినట్లయితే.. పార్టీ భవిష్యత్ ప్రశాంర్ధకం అవుతుంది.
పవన్ కళ్యాణ్ విధి విధానాలు, ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకోలేక పార్టీని విడిచిపెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది.. ఒకవేళ అదే నిజమైతే.. కలిసి పని చేసిన వాళ్ళకే అర్థం కాకపోతే ప్రజలకు ఎలా అర్థమౌతుంది..? పవన్ విధి విధానాలు గొప్పవే కావొచ్చు కానీ వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. క్షేత్రస్థాయిలోకి పవన్ విధి విధానాలను తీసుకెళ్లడంలో జనసేన విఫలమైతే.. మరి కొంత మంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపొలేదు. ఎమ్మెల్యే రాపాక కి కూడా పార్టీలో తగిన స్థానం, గౌరవం దక్కకపోవడంతో ఆతను కూడా జనసేనని విడిచి పెడుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ పవన్ పై నమ్మకం, పార్టీ నుంచి ప్రజలు వెళ్లిపోకుండా జాగ్రత్త పడితే మంచిది.