
ఈరోజు విజయసాయి రెడ్డి ఢిల్లీ లో ఓ సంచలన ప్రకటన చేసాడు . పోలవరం రేటెండరింగ్ , పీపీఏ సమీక్ష లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా ప్రధానమంత్రి, హోం మంత్రి లతో మాట్లాడి వాళ్ళ ఆమోదంతోనే చేస్తున్నాడని ప్రకటించాడు. ఇది ఆశ్చర్యకర విషయమే. ఒకవైపు జలశక్తి మంత్రి పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తుంటే రెండోవైపు విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయటం ఆశ్చర్యకరం. అలాగే విద్యుత్తూ రంగం లో పీపీఏ ల సమీక్షపై కూడా ఆ శాఖా మంత్రి అసంతృపి వ్యక్తం చేయటమే కాకుండా దీనివలన ప్రపంచ వ్యాప్తంగా పరపతి పడిపోతుందని ప్రకటించాడు. వీటికి తోడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాష్ట్రప్రభుత్వ చర్యలపై విమర్శలు ఎక్కుపెట్టింది. వీటన్నిటి సంఘటనలకు యాంటీ క్లైమాక్స్ గా ఈరోజు విజయసాయి రెడ్డి ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. మోడీ, అమిత్ షా లు ఈ ప్రకటనను ఖండించానన్నా ఖండించాలి లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పినది నిజమని నమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి మోడీ, అమిత్ షా కోర్టు లో వుంది.
ఇదే నిజమయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎలాగైనా చంద్రబాబు నాయుడు ని జైలుగోడల్లోకి నెట్టాలనే సంకల్పం అటు మోడీ కి ఇటు జగన్ మోహన్ రెడ్డి కి బలంగా వుంది. అదే వీళ్ళిద్దరిని ఒకచోటకు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన మోడీ, చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలకోసమని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. మోడీ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మోడీ వ్యతిరేక కూటమికి కీలకంగా వ్యవహరించాడు. తన చర్యలని నమ్మిన ప్రతిపక్షనాయకులు చంద్రబాబు కి పెద్దపీట వేశారు. ఇదంతా చూస్తే అసలు ముందు ముందు బీజేపీ కి వ్యతిరేకంగా అందరికీ నాయకత్వం వహిస్తాడని భావించారు. రాజకీయాల్లో ఆరితేరిన మమతా బెనర్జీ , శరద్ పవార్ లాంటి నాయకులు కూడా చంద్రబాబు ని పూర్తిగా నమ్మారు.
కానీ ఎన్నికలఫలితాలు వెలువడగానే వాళ్ళను పలకరించటం , వాళ్ళతో మాట్లాడటం మానేసాడు. వాళ్లెవరో తెలియదన్నంతగా తన ప్రవర్తన వుంది. మొదట్లో జనం మనస్తాపంతో అలా ఉన్నాడేమో అనుకున్నారు. కానీ అసలు విషయం రాను రానూ బయటపడింది. బీజేపీ తో సఖ్యతోకోసం ప్రయత్నిస్తున్నాడని ఆ తర్వాత పరిణామాలు తెలిపాయి. తనకి కుడి భుజం, ఎడమ భుజం అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీ లో చేరటం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహం ఉందని జనం నమ్ముతున్నారు. తను ప్రత్యక్షంగా మోడీతో మాట్లాడటానికి మొహం చెల్లక తన నమ్మినబంటు ల ద్వారా నాటకానికి తెర దించాడు. ఈ వ్యూహం తెలియనంత అమాయకులేం కాదు మోడీ, అమిత్ షా. ఆరోజుకు రాజ్యసభలో వీళ్లందరి అవసరం ఉందికాబట్టి అందుకు సరేనన్నారు. ఈరోజు విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అదంతా కేవలం ఎత్తుగడ మాత్రమేనని అర్ధమవుతుంది.
మోడీ పాత సంఘటనలను అంత తొందరగా మరచిపోయే మనిషికాదు. ఒకవైపు ఆయన నమ్మిన బంటుల్ని పార్టీలో చేర్చుకొని రెండోవైపు చంద్రబాబు నాయుడు ని ఎలా దెబ్బ తీయాలనే వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు చిదంబరం వ్యవహారం తర్వాత మోడీ ఏమిటో చంద్రబాబు కి ఇంకా బాగా అర్ధమయ్యింది. ఎప్పటికైనా జైలుగోడలు చూడాల్సివస్తుందేమోనని భయం వెంటాడుతుంది. ఒకవైపు మోడీ, రెండోవైపు జగన్ చంద్రబాబు ని వేటాడటం మొదలుపెట్టారు. దాని పర్యవసానమేంటో చంద్రబాబు కి బాగా తెలుసు. అందుకే చివరి ఎత్తుగడగా ఆయన మనుషుల్ని ఒక్కొక్కరిని బీజేపీ లోకి పంపిస్తున్నాడు. మోడీ ఎత్తుకు పైఎత్తులు వేయటం లో మొనగాడు. ఆయన వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్ధంకావు. ఇవన్నీ చూసి చంద్రబాబు వెన్నులో చలిమొదలయ్యిందని పరిశీలకులు అనుకుంటున్నారు. చివరకి ఆయనకున్న దింపుడుకల్లెం ఆశల్లా జ్యూడిషరీ . జ్యూడిషరీ లో చంద్రబాబు కి గట్టి పలుకుబడి ఉందని అందరూ నమ్ముతున్నారు. తనపై ఇన్నాళ్లు కేసులు లేకుండా కాపాడింది కూడా ఈ పలుకుబడివలనే నని అందరూ అనుకుంటున్నారు. ఏమైనా ఇంకా మోడీకి 5 సంవత్సరాలటైముంది. అదే చంద్రబాబు కి భయం పట్టుకుంది. చూద్దాం ఏమవుతుందో