Munugodu KCR : మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో హీట్ పెంచుతోంది. ఎన్నికల ప్రచారం కూడా రెండు రోజుల్లో ముగియనుంది. ప్రచార ఘట్టంలో మూడు ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అదే సమయంలో వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలకు కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అన్ని పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకమే. వరుసగా ఉప ఎన్నికల్లో సత్తాచాటుతూ వస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఒక ఉప ఎన్నికకు కేసీఆర్ రెండుసార్లు ప్రచారం చేసిన సందర్భాలు లేవు. అటువంటిది మునుగోడుకు ఆదివారం కేసీఆర్ రెండోసారి వస్తున్నారు. అయితే ఒక బ్రహ్మాస్త్రంతో సీఎం మునుగోడు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఊరువాడా ప్రచారం చేస్తున్నాయి. లక్ష మంది ప్రజలు సభకు హాజరవుతారని భావిస్తున్నారు. కాగా సభలో కేసీఆర్ ఎటువంటి ప్రసంగం చేస్తారని సర్వత్రా ఆశగా ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. భారీ బహిరంగ సభను వేదికగా చేసుకొని పార్టీని ప్రకటించారు. అటు తరువాత మునుగోడు ఉప ఎన్నిక ముంచుకు రావడంతో బీఆర్ఎస్ కార్యాచరణ అడుగులు కాస్తా వెనుకబడ్డాయి. అటు తరువాత కేసీఆర్ ఎటువంటి సభల్లో పాల్గొనలేదు. అయితే ఈ సభపై చాలా అంచనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడడం, బీజేపీ కీలక నేతల ప్రమేయమున్నట్టు ఆరోపణలు రావడం తదితర పరిణామాలు సీఎం సభపై అంచనాలు పెంచేశాయి. బీజేపీ నేతలను టార్గెట్ చేసుకొని కేసీఆర్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండడంతో పొడిపొడిగా మాట్లాడి వదిలేస్తారో.. లేక సీరియస్ గా తన ఆరోపణల పరంపరను కొనసాగించి రాజకీయాల హీట్ ను పెంచుతారో చూడాలి మరీ.
మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. కేసీఆర్ తో పాటు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, సాంబశివరావులు సైతం రానున్నారు. అటు బీజేపీపై టీఆర్ఎస్ ఆరోపణలను అమ్ ఆద్మీ కూడా సమర్థిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ను విస్తరించాలని చూస్తున్న కేసీఆర్ కు ఒక రకమైన అనువైన వాతావరణం ఏర్పడింది. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కలిసివస్తోంది. దీనిని ఎలాగైనా రాజకీయ సానుకూల వాతావరణంగా మలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి సిద్ధం కావాలని యోచిస్తున్నారు. అటు వామపక్షాలతో పాటు ఆప్ స్నేహాన్ని పదిల పరచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన రద్దయ్యింది. దీనిని కూడా కేసీఆర్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ ముందే తోక ముడిచిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే భారీ బహిరంగ సభలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగంలో సైతం మాటల తూటాలు పేలుతాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.