Pawan Kalyan: వైసీపీ సర్కారు తీరుపై జనసేనాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని..నమస్కారం పెడితే.. ప్రతి నమస్కారంగా ఏం వ్యాఖ్యలు చేస్తారో తెలియనంతగా పరిస్థితులు మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడానికి వైసీపీ నేతల తీరే కారణంగా చెప్పుకొచ్చారు. విశాఖకు చెందిన జనసేన నాయకులు, వారి కుటుంబాలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల విశాఖలో మంత్రులపై దాడిచేశారని ఆరోపిస్తూ తొమ్మిది మంది నేతలపై పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. వారందరికీ స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో జనసేన లీగల్ సెల్ విభాగం హైకోర్టు నుంచి వారికి బెయిల్ తెచ్చే ఏర్పాట్లు చేసింది. బెయిల్ పై విడుదలైన నేతలు తమ కుటుంబాలతో పవన్ ను మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి పవన్ ఆత్మీయంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? బలంగా నిలబడింది ఎందుకో వారికి వివరించారు. వైసీపీ సర్కారు తీరుపై కీలక వ్యాఖ్యానాలు చేశారు. మానవాళి మనుగడకు ప్రజాస్వామ్యం ఒక వరమన్నారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సంక్షేమ, ప్రభుత్వ ఫలాలు సరిగ్గా అందుతాయని చెప్పారు. రాజ్యాంగంలో హక్కులు, విధులు అందరికీ సమానమేనన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇక్కడ నియంత పోకడలు చెల్లవన్నారు. కానీ వైసీపీ సర్కారు నియంత పాలన సాగిస్తోందన్నారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతాయన్న రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి జనసేన జనవాణి కార్యక్రమం చేపడితే తట్టుకోలేని వైసీపీ దానిని అడ్డుకొనే ప్రయత్నంలో చేసినదే విశాఖ విధ్వంసంగా చెప్పుకొచ్చారు. జనసైనికులు భయపడాల్సిన పనిలేదని.. నాయకత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో జనసేన అడ్డుకుంటుందన్నారు. నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి తీరని విఘాతంగా పవన్ చెప్పుకొచ్చారు. పాలకులు రౌడీలు మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన అభిమతమన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేకుండా సమాజాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. గత మూడున్నరేళ్లుగా వైసీపీ సర్కారు వ్యవహార శైలిని గమనిస్తూ వచ్చానని.. కానీ రోజురోజుకూ అరాచకాలు పెరగడంతో దహించే మనసుతో బయటకు వచ్చినట్టు పవన్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన విధులు, హక్కులు తమకు మాత్రమేనన్న భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారని.. దానికి మూల్యం తప్పదని హెచ్చరించారు.
విశాఖ ఘటన తరువాత తాము ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎదుర్కొన్న సమస్యలను జనసేన నేతలు పవన్ కు వివరించే ప్రయత్నంచేశారు. తాము పడిన ఇబ్బందులను ఏకరువు పెడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. వారి పరిస్థితిని చూసి పవన్ చలించిపోయారు. తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూనే… తాను రాజకీయాల్లో ఎందుకు ఉంటున్నది తన స్వీయ అనుభవాన్ని వారికి వివరించే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ కార్యాలయంలో ఉన్న తనను ఓ మహిళ కలిశారని.. తన 14 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని.. కనీసం ఎవరూ పట్టించుకోలేదని చెప్పడంతో మనసు కకావికలమైందని పవన్ చెప్పుకొచ్చారు. స్కూల్ నుంచి వస్తున్న బాలికను రక్షించే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు ఎందుకీ రాజకీయాలు అంటూ అసహ్యం వేసిందన్నారు. నాడు దహించిన మనసుతోనే రాజకీయాల్లో నిలబడి మార్పు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నాలు చేయాలని డిసైడ్ అయ్యానని పవన్ పార్టీ శ్రేణులతో చెప్పారు. ఈ క్రమంలో పోరాట మార్గమే ఎంచుకున్నానని.. రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని పెకిలించాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నానని పవన్ సగర్వంగా ప్రకటించారు.