
Ramoji Rao Margadarshi Case: మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు గత కొద్దిరోజులుగా హడావిడి చేస్తున్నారు. తనిఖీల పేరుతో మార్గదర్శి కార్యాలయాలను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు. ఇక మొన్నటికి మొన్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఈనాడు కిరణ్ నివాసంలో విచారించారు. అయితే ఈ క్రమంలో ఒక్కొక్క మీడియా ఒక్క విధంగా వార్తలు పబ్లిష్ చేసింది. జగన్ మీడియా అయితే చేసిన తప్పులు మొత్తం రామోజీరావు ఒప్పుకున్నాడని రాసేసింది. మార్గదర్శి వ్యవహారంలో తప్పులు చేశారని, చందాదారుల నుంచి డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర మార్గాల్లోకి మళ్ళించారని చెప్పుకొచ్చింది.. ఇంత వరకూ ఫారం 12 సమర్పించ లేదని, కేంద్ర చిటిఫండ్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించలేదని వివరిస్తోంది.. ఇదే సమయంలో రామోజీరావు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అలాగని విచారణ జరపకుండా ఆగకూడదని కోర్టు ఆదేశించింది. దీంతో సిఐడి తర్వాత ఎటువంటి స్టెప్ వేయాలని ఆలోచిస్తోంది.
అయితే మార్గదర్శి కేసులో జగన్ ప్రభుత్వం మాత్రమే ఇంప్లీడ్ అయింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. దీనినే సాకుగా చూపి రామోజీరావు సిఐడి విచారణ నుంచి కొంత వెసలు బాటు పొందే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గత వ్యవహారాలను మొత్తం కూడా కోర్టు ఎదుట ఉంచారని, రామోజీరావు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారని అంటున్నారు. అదే కాదు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కాని విషయాన్ని ప్రస్తావిస్తూ తనపై కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారని కోర్టుకు చెప్పినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఇక సిఐడి అధికారుల దాడుల నేపథ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ లలో చిట్స్ సేకరణ దాదాపుగా నిలిచిపోయింది. ఇది ఒక రకంగా రామోజీరావుకు కోలుకోలేని దెబ్బ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో మార్గదర్శికి వందల కొద్ది బ్రాంచ్ లు ఉన్నాయి. రామోజీ గ్రూప్ సంస్థల్లో మార్గదర్శి మాత్రమే విపరీతమైన లాభాల్లో ఉంది. అయితే ఎలాగైనా రామోజీరావును ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, తన తండ్రి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కాకపోయినప్పటికీ మార్గదర్శిలో లొసుగుల ఆధారంగా జగన్ ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్ళొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మార్గదర్శి కేంద్ర ప్రభుత్వ చిట్ ఫండ్ చట్టాన్ని పాటించడం లేదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అమలు చేయడం లేదు. పైగా మాతృ సంస్థ అంటూ నగదు అందులోకి మళ్ళిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఏవీ మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ల వద్ద లేవు. ఇదే విషయాన్ని రామోజీరావును అడిగితే అవన్నీ కూడా మా మేనేజర్ల వద్ద ఉన్నాయంటూ బుకాయిస్తున్నారు.. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫారం_12 ను కూడా సమర్పించకపోవడం ఇక్కడ విశేషం. అయితే తెలంగాణ హైకోర్టు నుంచి వెసలు బాటు పొందిన నేపథ్యంలో.. ఈ లొసుగులను కోర్టు ముందు ఉంచాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా దేవుడు దిగి వచ్చినా రామోజీరావును కాపాడలేడని చెబుతున్నాడు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, అందుకే దేశంలో కి రాలేకపోతున్నారని గుర్తు చేశారు. వారంతా కూడా బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ భారత ప్రభుత్వం అరెస్టు చేసింది అని ఉండవల్లి వివరిస్తున్నారు.. రామోజీరావు మార్గదర్శి విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, సరైన ఆధారాలు మా వద్ద ఉన్నాయని, కోర్టుకు సమర్పించి ఆయనను జైల్లోకి లాగుతామని ఆయన పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిఐడి దర్యాప్తులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఇస్తున్న ఆధారాలు కూడా ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మరి తదుపరి సిఐడి స్టెప్ ఎలా వేస్తుందో వేచి చూడాల్సి ఉంది.