
TSPSC Question Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎవరిది తప్పు? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఎవరి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ చైర్మన్ జవాబుదారి అని చెబుతున్నాయి. కమిషన్ నిబంధనలు_16 లోని పదో రూల్ ప్రకారం పేపర్ సెట్టింగ్, పేపర్ భద్రపరిచే అధికారం చైర్మన్ కి మాత్రమే ఉంటుంది. ఈ లీకేజీ వ్యవహారంలో చైర్మన్, ఇతర సభ్యులు మాత్రం తమకేం తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ సెక్రటరీ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జి శంకర లక్ష్మికి దగ్గరకు ఎలా వెళ్ళింది? అనే ప్రశ్నకు ఎవరూ చెప్పడం లేదు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతేకాదు లీకేజీ వ్యవహారంలో మా వేళ్ళు మొత్తం చైర్మన్ జనార్దన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని వివరిస్తున్నాయి.. జనార్దన్ రెడ్డి అసలైన దోషి అని, ఆయన నియామకం నుంచే తమకు అనుమానాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు.
అప్పటికప్పుడు జనార్దన్ రెడ్డితో ముఖ్యమంత్రి స్వచ్ఛంద రాజీనామా చేయించారు. ఆ తర్వాత మరుసటి రోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. .ముందు నుంచి పకడ్బందీగా జరిగిన కుట్ర అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. “సీఎం కార్యాలయంలో పది సంవత్సరాలుగా పనిచేస్తూ.. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ బండి లింగారెడ్డిని సభ్యుడిగా నియమించారు. కెసిఆర్ కు వీరాభిమాని తనోబా సత్యనారాయణ మాజీ విలేఖరి. భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. మరో సభ్యుడు కారం రవీందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని” ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

“ఈ వ్యవహారంలో హనీ ట్రాప్, హ్యాకింగ్ అనేది ఒక బోగస్.. ఒక పకడ్బందీ ప్రణాళికతో పేపర్ లీక్ చేయించారు. పెద్దలను గట్టెక్కిస్తున్నారు. లీకేజీని విమర్శించే రాజకీయ పార్టీల నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. నిజానికి నోటీసులు ఇవ్వాల్సింది కమిషన్ చైర్మన్, సభ్యులకని” విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు..”మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ స్కాం జరిగింది. క్రమంగా అక్కడ సాక్షులను హతమార్చారు. ఇక్కడ కూడా అలాంటిది జరగకముందే సాక్షులు, నిందితులకు భద్రత కల్పించాలని” విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పేపర్ లీకేజ్ కు సంబంధించి కమిషన్ పెద్దలకు ముందే తెలుసు. అందుకే, తమ ఉద్యోగుల ఓఎంఆర్ షీట్ లలో డబుల్ బబ్లింగ్ చేయించి, ముందుగానే వారిని డిస్ క్యాలిపై చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కైనట్టు సిట్ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది..వీరు ఏఏ కోచింగ్ సెంటర్లకు ప్రశ్న పత్రాలు అమ్మారు? అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. వీరితో పాటు సురేష్ కూడా కోచింగ్ సెంటర్లకు ప్రశ్న పత్రాలను లీక్ చేశాడా అనే దానిపై ఇంకా నిర్ధారించాల్సి ఉంది. తాజాగా పట్టుబడిన నలుగురి అరెస్టు చూపిన తర్వాత, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని, విచారిస్తామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.