
IPL 2023 New Rules: క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతున్న పరిస్థితులు, ఆటను అభిమానులకు ఆసక్తికరంగా మార్చే ఉద్దేశంతో ఐసీసీ అనేక మార్పులు చేస్తోంది. ఐసీసీ తో పాటు ఐపీఎల్ వంటి లీగ్ లు నిర్వహించే దేశాలు కీలకమైన నిబంధనలను ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులకు ఆటను మరింత కనువిందు చేస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది ఐపీఎల్ లో మరిన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ప్రాంచైజీలు తమ తుది జట్లను తమ తుది జట్లను, ఇంపాక్ట్ ప్లేయర్ పేరు వివరాలను టాస్ తరువాత ప్రకటించే వెసులుబాటు కల్పించింది బీసీసీఐ. దీంతో టాస్ గెలుపోవటముల ఆధారంగా ఫ్రాంచైజీలు అత్యుత్తమ జట్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎంచుకునే విషయంలో ఈ కొత్త రూల్ చాలా ఉపయోగపడనుంది. మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఒక జట్టును, అదే మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే మరో జట్టును ఎంచుకునే అవకాశం ఆయా ప్రాంచైజీలకు దక్కుతుంది. గత సీజన్ వరకు కెప్టెన్లు టాస్క్ ముందే తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను వెల్లడించేవారు. ఇలా చేయడం వల్ల ఫ్రాంచైజీలకు ఉపయోగకరమైన తుది జట్టును ఎంచుకున్న విషయంలో కాస్త అసంతృప్తి ఉండేది.
దక్షిణాఫ్రికా t20 లీగ్ లో అమలు..
ఈ సరికొత్త రూల్ ను కొద్దిరోజుల కిందట నిర్వహించిన దక్షిణాఫ్రికా t20 లీగ్ లో అమలు చేశారు. ఫ్రాంచైజీలు టాస్ తరువాత తుది జట్టును ప్రకటించే ముందు టీమ్ షీట్ 13 మంది ప్లేయర్లు వివరాలు ఉంచాల్సి ఉంటుంది. ఈ జాబితా నుంచే 11మంది ప్లేయర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ లో మరిన్ని కొత్త రూల్స్..
దీంతోపాటు మరిన్ని కొత్త రూల్స్ ను వచ్చే ఐపిఎల్ లో అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. నిర్దిష్ట సమయ వ్యవధిలో బౌలర్ ఓవర్ పూర్తి చేయకుంటే ఓవర్ రేట్ పెనాల్టీ ఉంటుంది. ఓవర్ రేట్ పెనాల్టీ పడితే 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే అనుమతించబడతారు. అలాగే ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ అన్యాయమైన కదలికలకు పాల్పడితే బంతిని డెడ్ బాల్ గా ప్రకటించి ప్రత్యర్థికి ఐదు పెనాల్టీ పరుగులు ఇస్తారు. ఈ నిబంధనలన్నీ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు బీసీ సీఐ కు చెందిన కీలక అధికారి ఒకరు ఈ వివరాలను ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం అవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచులు జరగనున్నాయి.

కొత్త నిబంధనలతో బ్యాటింగ్ జట్టుకు మేలు..
కొత్తగా తీసుకు వస్తున్న నిబంధనలతో బ్యాటింగ్ చేసే జట్టుకు కొంత ఉపయోగకరంగా ఉంటుందన్న భావనను క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వికెట్ కీపర్, ఇతర ప్లేయర్స్ ఎలా వ్యవహరించిన బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎటువంటి లాభము లేదు. కానీ ఇకపై ఐదు పరుగులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఏ సమయంలో ఫీల్డింగ్ జట్టు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండేందుకు ఈ నిబంధన దోహదం చేయనుంది.