Tirupati Gangamma Jatara 2023: ప్రాచీన ఆచార వ్యవహారాలకు, సంస్కృతులకు ప్రతిబింబం జాతర. ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంగరరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతర ప్రత్యేకం బూతులు తిట్టడం. తిరుపతిలో గత నాలుగు రోజులుగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో రకరకాల వేషధారులు బూతులు తిడుతూ కనబడతారు. దీనిని రాష్ట్ర పండుగ చేసేందుకు ప్రభత్వం సిద్ధమవుతోంది.
జాతర చరిత్ర
గతంలో తిరుపతి ప్రాంతంలో పెద్ద పాలెగాడు ఉండేవాడట. అతను స్త్రీలోలుడు. కన్ను పడిన ఏ యువతిని, మహిళను అనుభవించేవరకు వదిలేవాడు కాడట. అతని ఆగడాలు శృతిమించినా అడ్డు చెప్పేందుకు అందరూ వెనుకడుగువేసేవారు. ఒకసారి అతను తన చెలికత్తెలతో వస్తున్నప్పుడు ఏటి గట్టున్న కూర్చొని ఉన్న గంగమ్మను చూసి మోహించాడని చరిత్రకారులు చెబుతున్నారు. దాంతో గంగమ్మ వారం రోజుల్లో సంహరిస్తానని ప్రతిన బూనిందట. అక్కడున్న వారు ఆమె మహిమకలది ఆమె జోలికి ఎందుకు వెళ్లావని సదరు పాలెగాడికి చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయాడు. ఎట్లాగైనా అతని బయటకు రప్పించేందుకు గంగమ్మ వివిధ వేషాలతో బూతులు తిడుతూ తిరిగేదట. బూతు తిడితే ఎవరికైనా రక్తం మరగడం ఖాయం. పాలేగాడు బయటకు వస్తే సంహరించవచ్చని గంగమ్మ ప్లాన్. మొదటి రోజు బైరాగిలా, రెండో రోజు బండలా, మూడో రోజు తాటిలా, నాలుగో రోజు దొరలా, ఐదో రోజు మాతంగిలా, ఆరో రోజు సున్నపు కొట్టంలా, ఏడో రోజు సప్పరాల వేషాల్లో గంగమ్మ తిరుగుతూ అతడిని సంహరించిందట. అతను పీడ విరగడవండంతో ఊరంతా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు.
తిరుపతి ఆడబిడ్డ గంగమ్మ
స్వయానా వేంకటేశ్వర స్వామి చెల్లెలు అయిన గంగమ్మను అప్పటి నుంచి ప్రజలు పూచించడం మొదలుపెట్టారు. తిరుపతి ఆడబిడ్డగా గంగమ్మను భావిస్తుంటారు ఇక్కడి ప్రజలు. అనాదిగా నిర్వహిస్తున్న ఈ జాతరను తిలికించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. మొక్కలు తీర్చుకుంటారు. జాతరలో గంగమ్మ వేసిన వేషాలతో కళాకారులు కనబడుతుంటారు. ఏడు రోజులు గంగమ్మ వేసిన వేషాలతో కనిపిస్తూ బూతులు తిడుతూ ఉంటారు. ఇక్కడ బయల్పడిన ఆలయ స్తంభాలను బట్టి పల్లవుల నాటివిగా చెబుతుంటారు.
రాష్ట్ర జాతరగా..
తిరుపతిలో నిర్వహిస్తున్న గంగమ్మ జాతరను రాష్ట్ర జాతరగా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రకరకాల కళాకారులు, వివిధ రకాల కళాకారులు నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, ధింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల నడుమ సారెలను తీసుకువచ్చి సమర్పిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు జాతర జరగనుంది. వేసవి సెలవుల్లో తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు ఈ జాతరను కూడా తిలకించవచ్చు.