ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఫలితాలు చూశాక తెలుగు తమ్ముళ్లు అంతా ఒకటే అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్కదాంతోనే ఏపీలో అధికారం సాధ్యం కాదని.. జనసేన కలిసి వస్తే ఏపీలో అధికారం సాధ్యమని.. 2014లో పొత్తు పెట్టుకొని ఏపీలో అధికారం కొల్లగొట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మరోసారి ఏకం కావాలని టీడీపీ మాజీ మంత్రులంతా ఉబలాటపడుతున్నారట.. తాజాగా వెలువడిన పరిషత్ ఫలితాలతో ఇప్పుడు టీడీపీ సీనియర్ల నోట ఇదే వినిపిస్తోంది..

ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. జగన్ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కనీసం డబుల్ డిజిట్ రాకుండా ఓడించేస్తున్నారు. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికల్లో టీడీపీ మరీ తీసికట్టుగా ఓడిపోయింది. అదే సమయంలో జనసేన కాస్త సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పలు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన పొత్తు లేదు. కానీ ఈ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పొత్తుతో ఎంపీపీ, ఉపాధ్యక్ష పీఠాలు కైవసం చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీచేసి జగన్ చేతిలో చిత్తయ్యారు. ఫలితంగా జగన్ ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. టీడీపీ కేవలం 23 సీట్లకు పడిపోయింది. జనసేన అయితే పవన్ సైతం ఓడిపోయి ఒకే ఒక్క సీటు గెలిచింది.
ఈ క్రమంలోనే తత్త్వం బోధపడిన జనసేన ఒంటరిపోరుకు స్వస్తి పలికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది. ఇప్పుడు ఏపీలో పొత్తు పెట్టుకొని ముందుకెళుతోంది. అయితే ఏపీలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుండడంతో టీడీపీ, జనసేన పునరాలోచనలో పడిపోయాయి. అందుకే స్థానిక ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి అధ్యక్ష పీఠాలు కైవసం చేసుకున్నాయి.
తాజాగా జరిగిన ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల్లో అధికారికం కాకున్నా లోపాయికారీగా స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో జనసేన-టీడీపీ నేతలు పరస్పరం సహకరించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన అవగాహన ఓపెన్ గా కనిపించింది. అయితే ఇది అధినేతల అంగీకారంతో కాదని.. స్థానికంగా తీసుకున్న నిర్ణయాలని చెబుతున్నారు.
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని గెలిచాయి. వైసీపీని నిలువరించాయి. సానుకూల ఫలితాలు రావడంతో తిరిగి ఇప్పుడు ఈ రెండు పార్టీల పొత్తు అంశం తెరమీదకు వచ్చింది. పశ్చిమగోదావరిలోని అచంటలో టీడీపీ-జనసేన కలిసి ఎంపీపీ గెలుచుకున్నారు. తూర్పుగోదావరిలోని రాజోలు, మలికిపురం ఎంపీపీలను ఈ రెండూ పార్టీలు గెలిచాయి.
ఈ క్రమంలోనే టీడీపీ మాజీ మంత్రుల్లో ఇప్పుడు ఆశ మొదలైంది. జనసేన-టీడీపీ తిరిగి పొత్తు పెట్టుకోవాలని.. దీని ద్వారా సంచలనాలు జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి పితాని, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారం సాధ్యమంటున్నారు. మరి జనసేనాని పవన్ టీడీపీ నేతల ఆఫర్లకు కరుగుతారా? టీడీపీతో కలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.