మంత్రి కేటీఆర్ ఈ మధ్య పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అనవసర విషయాల్లో తలదూరుస్తూ పలుచన అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తమకు సంబంధం లేని విషయాలను ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఫలితంగా నెటిజన్ల కు సైతం ఆగ్రహం తెప్పిస్తున్నారు. తమవి కాని ఫొటోలు షేర్ చేస్తూ ప్రతిపక్షాల విమర్శలకు తల పట్టుకుంటున్నారు.

తాజాగా ఏపీలో ‘ఇంటింటికి వ్యాక్సిన్’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వీధులు, పొలాలు, పనుల వద్దకు వెళ్లి ఏపీ కార్యకర్తలు టీకాలు వేస్తున్నారు. ఈక్రమంలోనే పొలాల్లోని రైతులకు వెళ్లి వేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే తెలంగాణలోనూ ఇదే తరహాలో టీకాలు వేస్తున్నారని.. రాజన్న సిరిసిల్ల , నల్గొండ జిల్లాలో పొలాల వద్దకు వెళ్లి టీకాలు వేస్తున్న ఆశాకార్యకర్తల ఫొటోలను ఇటీవల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
పొలాల వద్దకు వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న ఆశా కార్యకర్తల ఫొటోలను ట్విటర్ లో పోస్టు చేశారు. కానీ అవి ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల క్రితం అక్కడి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫొటోలని తేలింది. దీంతో కేటీఆర్ పెట్టిన షేర్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వేరే వాళ్ల ఫొటోలు పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పెదవి విరుస్తున్నాయి. దీంతో వారి విమర్శలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఈనాడు, సాక్షి పేపర్లో పబ్లిష్ అయిన ఫొటోలను షేర్ చేసి ఇవి తెలంగాణలో వేసినవే అని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి చెక్ పడింది.
మంత్రి కేటీఆర్ ఈ మధ్య ఇలా అనవసర ట్వీట్లతో అభాసుపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం అలర్ట్ గా ఉండి మంత్రి ట్వీట్లలో లూప్ హోల్స్ వెతికి విమర్శలు చేస్తున్నారు. మంత్రి ఎందుకు ఇలాంటి వివాదాల్లో తలదూరుస్తున్నారో వారికే తెలియాలని పలువురు హితవు పలుకుతున్నారు. ఎవరో పంపిన ఫొటోలను షేర్ చేస్తూ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.