Tidco Houses : టిడ్కో ఇళ్ల వివాదం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో పురపాలక సంస్థలు టిడ్కో ఇళ్లను కొన్ని నిర్మించి అసంపూర్తిగా వదిలేసింది. అప్పుడు చంద్రబాబు శూరుడు.. ధీరుడు అని ఇదే టీడీపీ, దాని పచ్చమీడియా ఇప్పుడు జగన్ హయాంలో సగం పూర్తయ్యాయంటూ గగ్గోలు పెడుతోంది. జగన్ పరువును బజారుకీడుస్తున్నారు.
కేంద్రం నిధులతో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొదటివిడతలా లక్షన్నర ఇళ్లు మాత్రమే పూర్తి చేసింది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. వ్యయం ఎక్కువైంది. అందుకే సగమైనా పూర్తి చేసింది. చంద్రబాబు సగంలో వదిలిన ఇళ్లను జగన్ కేంద్రం నిధులతో పూర్తి చేశాడు. ఇద్దరిదీ ఇందులో తప్పు ఉంది. కానీ నెపం మాత్రం జగన్ పైనే వస్తూ టీడీపీ , దాని అనుకూల మీడియా టిడ్కో ఇళ్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టిడ్కో ఇళ్లపై వాస్తవాలు ఇవీ..
టిడ్కో గృహాలు పేదలపాలిట మహా సౌధాలుగా ఉన్నాయి. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా డిజైన్ చేయబడిన ఈ ఫ్లాట్స్ వస్తే తాము తమ పిల్లా పాపలతో అక్కడ ఉందాం అని పేద, దిగువ మధ్యతరగతి జీవులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే వీటిని ఎవరు నిర్మించారు.. ఎవరు వీటికోసం ఎక్కువ నిధులు కేటాయించారు. పేదలకు తక్కువ ధరకే, ఇంకా చెప్పాలంటే 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఐతే ఉచితంగానే ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిగతా 365, 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందించారు. ఇంకా అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్ లక్షలమంది కళ్ళలో సంతోషాన్ని విరబూయించేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు.
మొత్తం ప్రాజెక్టు నిధుల్లో కనీసం పదిపైసల వంతు కూడా ఖర్చు చేయకుండానే అంతా తామే చేసాం అంటూ అక్కడ సెల్ఫీలు దిగి ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు, టిడిపి కార్యకర్తలు వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే మొత్తం ఖర్చు చేయాల్సింది రూ.28వేల కోట్లపైనే. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుచేసింది సగం కంటే తక్కువే. అలాంటప్పుడు తామే కట్టేశామని అనడం అవాస్తవం. జగన్ కట్టిన ఇళ్లను ఇప్పుడు చంద్రబాబు కట్టినట్టుగా టీడీపీ పచ్చ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది.
వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.8734 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62000 ఇళ్లు పూర్తి చేశారు. టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాలు కోసం దాదాపు మూడు వేలకోట్లు ఖర్చుపెట్టింది. రోడ్లు, సీవరేజి…ఇలా అద్భుతమైన నివాస సముదాయాలుగా మార్చింది. గత ప్రభుత్వం వదిలివెళ్లిపోయిన బిల్స్ రూ.3వేల కోట్ల బకాయిలు కూడా తీర్చింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు ఋణం చెల్లించాలి. అంటే ఇరవయ్యేళ్ళ తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7. 2 లక్షలు అవుతుంది. అయితే ఆ 300 అడుగుల ఇంటిని వైయస్.జగన్ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం రూ. 5,340 కోట్లు. కానీ ప్రభుత్వం ప్రజలకోసం ఆ భారాన్ని భరిస్తోంది.
365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది. దీనిపై ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు. ఉచిత రిజిస్ట్రేషన్ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది. 143600 మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు చేసింది జగన్ ప్రభుత్వం. 365, 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2. 62 లక్షలు.. సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్లు .. ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు.. ఇలా మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్లు. ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినవి 61,948 కోట్లుగా ఉంది. ఈ ఏడాది చివరకు అందించే ఫ్లాట్స్ 2, 62, 216గా ఉన్నాయి.
ఇంత భారీగా జగన్ ప్రభుత్వం ప్రజలకు పూర్తి ఉచితంగా అందిస్తుంటే అది మరిచిపోయి జగన్ కట్టించిన ఇళ్లను కూడా చంద్రబాబు కట్టించినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాస్తవాలు కప్పిపుచ్చి ఈ యేడాది చివరికి మొత్తం లబ్ధిదారుల ఇళ్లల్లో వెలుగులు నింపే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దీన్ని కూడా పచ్చమీడియా, చంద్రబాబు క్యాష్ చేసుకొని లబ్ధి పొందుతుంటే వైసీపీ ప్రభుత్వం అసలు వాస్తవాలు గణాంకాలను బయటపెట్టింది.