BCCI Sensation: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టోర్నీలో కెప్టెన్ గా, ఆటగాడిగాను విఫలం కావడంతో విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించాలన్న డిమాండ్ పెరిగింది.
ఇండియన్ క్రికెట్ లో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ కూడా ఒకడు. కెప్టెన్ గాను తన సత్తాను ఐపీఎల్ లో నిరూపించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో మరో కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డులను మన పేరిట లిఖించుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత జట్టును విజయవంతంగా నడపగలడన్న భావన అభిమానులతోపాటు బీసీసీఐ ఉన్నతాధికారుల్లోనూ వ్యక్తమైంది. అందుకు అనుగుణంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. అయితే, డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓటమి తర్వాత పెద్ద ఎత్తున రోహిత్ శర్మపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కెప్టెన్ గా తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్..
డబ్ల్యూటిసి ఫైనల్ లో రోహిత్ శర్మ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గాను ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఒకానొక దశలో ఆ డిమాండ్లకు బీసీసీఐ తలొగ్గిందన్న ప్రచారం జరిగింది. అయితే, రోహిత్ శర్మపై వెస్టిండీస్ పర్యటన తర్వాత వేటు వేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనకు ప్రకటించిన టీమును రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. విండీస్ పర్యటన తర్వాత మాత్రం టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీ పై నీలిమేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు ఆడబోతోంది. ఈ రెండు టెస్టులను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు వ్యక్తిగతంగా రోహిత్ శర్మ భారీగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. తనని తాను నిరూపించుకోవడంతోపాటు జట్టును విజయ పథాన నడిపించాల్సిన బాధ్యత రోహిత్ శర్మపై ప్రస్తుతం ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం తక్షణమే జట్టు పగ్గాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
రోహిత్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దగ్గర
వెస్టిండీస్ పర్యటనలో ఒకవేళ రోహిత్ శర్మ ఫెయిల్ అయితే మాత్రం కెప్టెన్ గా వేటుపడే అవకాశం ఉంది. అదే జరిగితే భారత జట్టు కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి. మళ్లీ విరాట్ కోహ్లీకి పగ్గాలను అప్పగిస్తారా..? లేకపోతే టి20 కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు మూడు ఫార్మాట్ల బాధ్యతలను ఇస్తారా..? అన్న చుడాల్సి ఉంది. లేకపోతే జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారికి అవకాశాలు కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది.