NTR Health University Issue- Kapus and Kamma: ‘కాపులు.. మరొకరికి కాపుకాసేవారేనా.? మరొకరి పల్లకి మోసేవారేనా? ఐక్యత లేని వారేనా? పీత కథకు దగ్గరగా పోలిక ఉన్నవారేనా..’ ఇదీ కాపుల విషయంలో ఇతర సామాజికవర్గం వారు దెప్పిపొడిచే అంశాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయినా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లోనైనా సామాజికవర్గపరంగా, అటు జనాభాపరంగా కాపులదే సింహభాగం. అయినా అడుగడుగునా అణచివేతకు గురవుతూ వస్తున్నారు. రాజకీయంగా కూడా దగా పడ్డారు. కాపుల కంటే తక్కువ శాతం ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ సామాజికవర్గం వారు తెలుగు రాష్ట్రాలను ఏలినా.. అందులో కాపులకు భాగస్వామ్యం లేకపోవడం విచారకరం. కాపులు రాజ్యాధికారం కోసం ప్రయత్నించిన ప్రతీసారి అదే కాపు సామాజికవర్గంలో రాజకీయ చిచ్చు పెట్టి చలిమంట కాచుకున్న సందర్భాలు అనేకం. కానీ ఎదుటి వారిని అని ఏం లాభం. కాపుల్లోనే ఐక్యత కొరవడడం వల్లే మిగతా సామాజికవర్గాల వద్ద చులకనయ్యారన్న ప్రచారం అయితే నిత్యం వినిపిస్తుంటుంది. అయితే ఆ అనైక్యతారాగం ఎదుట సామాజికవర్గాల వారికి వరంగా మారుతోంది. అది అనాదిగా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతునే ఉంది.

ఉమ్మడి కృష్టా జిల్లా పునర్విభజనతో చిన్న జిల్లాలుగా ఏర్పడింది. అప్పట్లో వంగవీటి జిల్లాగా ఏదో ఒక జిల్లాకు పేరు పెట్టాలన్న డిమాండ్ బాగా వినిపించింది. కానీ జగన్ సర్కారు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇటు ఎన్టీఆర్ పేరుతో రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ జిల్లాలకు వారి నేతల పేర్లు పెట్టుకున్నారు.. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటిని విస్మరించారు. కాపు సామాజికవర్గంపై ఉన్న దుగ్ధను చాటుకున్నారు. అయితే నాడు పునర్విభజన సమయంలో ఒక్కరంటే ఒక్క కాపు నాయకుడు నోరు తెరవలేదు. కాపు సంఘాల నాయకులూ ప్రశ్నించలేదు. చీటికి మాటికి ప్రభుత్వానికి లేఖలు రాసే ముద్రగడ పద్మనాభం సైతం సైలెంట్ అయ్యారు. అటు వైసీపీలో కాపులమంటూ అమాత్య పదవులు దక్కించుకున్నవారు మిన్నకుండా పోయారు. అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలోని కాపు నాయకులు సైతం తమకు పట్టకుండా వ్యవహరించారు. జనసేనకు చెందిన కాపు నేతలు కాస్తా స్పందించినా వారికి కంఠశ్వాసే మిగిలింది తప్పించి… వారి డిమాండ్ ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు.
అదే కమ్మ సామాజికవర్గం విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. వారి హక్కులకు భంగం కలిగితే మాత్రం రాజకీయ, వర్గ అజెండా పక్కన పెట్టి మరీ ఒక్కటవుతారు. కొట్లాటలు, కయ్యాలు పక్కనపెట్టి ఒకటే అజెండాగా పనిచేస్తారు. తమ సామాజికవర్గం వారు కష్టాల్లో ఉన్నారంటే రెక్కలు కట్టి మరీ వాలిపోతారు. గ్రామ స్థాయి నుంచి అమెరికా వరకూ ఐక్యతను చాటుతారు. వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నా జాతి ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకే రూట్లోకి వస్తారు. రాజకీయ వైరుఢ్యాలతో ఉన్న సామాజికవర్గపరంగా చాలా దగ్గరగా ఉంటారు. హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరును తొలగించారో లేదో… వేర్వేరు రంగాల్లో ఉన్నవారు ఇట్టేస్పందించారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తృణప్రాయంగా వదిలేశారు. వైసీపీతో అంటగాకుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దని సీఎం జగన్ నే వేడుకున్నారు. లక్ష్మీపార్వతి రాజీనామాకు రెడీ అయ్యారు. కొడాలి నాని రుసరుసలాడుతున్నారు. అటు వైసీపీలో ఉన్న కమ్మ నాయకులు మానసిక క్షోభతో విలవిల్లాడుతున్నారు. ఒక్క సంఘటనకే కమ్మ సామాజికవర్గమంతా తెగ బాధపడుతున్నారు.

అదే కాపు సామాజికవర్గం విషయానికి వచ్చేసరికి మాత్రం అంతలా ఐక్యత ఏదీ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాపు ఉద్యమ నాయకులపై లాఠీచార్జి చేయించినా స్పందించరు. వంగవీటిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖండించరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులను కించపరచినా మనకెందుకులే అని భావిస్తారు. కాపు రిజర్వేషన్లపై మాట్లాడడానికి సహసించరు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించే తీరిక కూడా కాపు నేతలకు లేదు. ఒకదాంట్లో మాత్రం ముందుంటారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం పావుగా ఉపయోగపడతారు. పదవులపై ఆశతో తిట్టరాని తిట్లతో సొంత సామాజికవర్గం నాయకులపై విరుచుకుపడతారు. చివరకు సొంత సామాజికవర్గాన్ని కూడా తూలనాడతారు.అదే కమ్మలకు, కాపులకు ఉండే తేడా అంటూ ఈ రెండు కులాల గురించి గుర్తెరిగే మిగతా సామాజికవర్గాల వారు నిత్యం ఇలానే విశ్లేషిస్తారు