
IND vs AUS : బోర్డర్ గవస్కార్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా సత్తా చాటింది. ఎన్నో ఆశలతో పోటీపోటీ ఇస్తుందని ఇండియాలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా తోకముడిచింది. భారత స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియాలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 91 పరుగులకే కుప్పకూలడం గమనార్హం.
తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో రవీంద్రజడేజా ఆస్ట్రేలియా పతనాన్ని శాసిస్తే.. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆస్ట్రేలియా పని పట్టాడు. ఏకంగా 5 వికెట్లు కూల్చి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు.జడేజా 2 వికెట్లుతో రాణించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ కూడా పట్టుమని 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒక్క స్వీట్ స్మిత్ మాత్రం అందరూ ఔట్ అవుతున్నా అడ్డంగా ఒకవైపు నిలబడ్డాడు. అతడు తప్పితే మిగతా ఆస్ట్రేలియన్లు అంతా ఒకరి వెనుక ఒకరు క్యూ కట్టారు. స్మిత్ (25) నాటౌట్ గా మిగలగా.. మిగాతా అందరూ క్యూ కట్టారు.
టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బలమైన ఆస్ట్రేలియాను కొట్టడం సాధ్యం కాదంటూ ఆ వర్గం మీడియా, మాజీలు గొప్పలకు పోయారు. బెంగళూరులో పది రోజుల ముందే దిగిన ఆస్ట్రేలియా మన అశ్విన్ లాంటి బౌలర్ తో తెగ ప్రాక్టీస్ చేసింది. అయినా కూడా తొలి టెస్టులో తేలిపోయింది. మన స్పిన్నర్ల దెబ్బకు పేకమేడలా కుప్పకూలిపోయింది.
ఈ తొలి టెస్టులో చాలా రోజుల పునరాగమనం తర్వాత ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా అటు బ్యాట్ తో.. ఇటు బంతితో రాణించడం విశేషం. ఈ మ్యాచ్ లో మన స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియన్లను వణికించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘోరంగా ఓడిపోవడం విశేషం.
భారత్ బ్యాట్స్ మెన్ కూడా స్పిన్నర్ల విషయంలో తడబడ్డారు. కానీ రోహిత్ 120, జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించడంతో భారత్ 400 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లు పెద్దగా రాణించలేదు. మొత్తంగా టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ లు జట్టుగా బలంగా మారారు. ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా మున్ముందు ఎలా పుంజుకుంటుందన్నది వేచిచూడాలి.