Aarudra : ఆరుద్ర… సినీ పాటల రచయితగా చాలా మందికి పరిచయం ఉన్న పేరు. పర్సనాలిటీని గుర్తించకపోయినా.. పేరు సుపరిచితమే. ఆరుద్రని గనక ఒక్కసారి కలిసి ఉంటే.. ఆయనతో మాట్లాడి ఒక్కకాఫీ తాగగలిగి వుంటే, ఆరుద్రతో ఒక్కరోజు గడపగలిగి ఉంటే, ఆయన ఉపన్యాసం వినగలిగి వుంటే.. ఎంత బాగుండు అనిపిస్తుంది తెలుగు సాహిత్యాభిమానులకు.. ‘అపరాధ పరిశోధకుణ్ణి’ కలిశాను అని గొప్పగా చెప్పుకుంటారు ఆయనతో కలిసినవారు. ఆ అవకాశం సీనియర జర్నలిస్ట్ తోట భావనారాయణకు దక్కింది. మద్రాసు నగరంలో ఆరుద్రతో ఏకంగా ఐదేళ్లు స్నేహం చేశాడు. కబుర్లు, జోకులు, గ్రీన్ టీ లు రుద్ర డిక్టేట్ చేస్తుంటే ఇష్టంగా, శ్రద్ధగా రాయడం.. తస్సాదియ్యా, అనుభవం అంటే అది కదా! ఆరుద్ర పాదముద్రలతో పునీతమైన తెలుగుసాహితీపూదోటలో భావనారాయణ పోగుజేసుకున్న పరిమళాల జ్ఞాపకాలివి..
ఆంధ్రప్రభలో మార్పు..
‘‘1993లో ఆంధ్రప్రభలో చాలా మార్పులు తీసుకురావాలని ఎడిటర్ దీక్షితులు నిర్ణయించుకున్నారు. రకరకాల సప్లిమెంట్లతోబాటు సినిమా సమాచారం పెంచటం, ఆదివారం అనుబంధంలో కొత్త శీర్షికలు ప్రవేశపెట్టటం లాంటివి అందులో చాలా ఉన్నాయి. అలాంటి కొత్త శీర్షికలలో ఒకటి ఆరుద్రగారి జ్ఞాపకాలు రాయించటం. అప్పుడు నేను మద్రాస్ ఆంధ్రప్రభలో ఉండటం వల్ల వారం వారం ఆయన దగ్గరికెళ్లి రాయించి తీసుకొచ్చే బాధ్యత నాకప్పజెప్పారు. దీక్షితులు గారు అప్పటికే ఆరుద్రగారికి ఫోన్ చేసి ఒప్పించి ఉండటంతో నేను వెళ్లి పరిచయం చేసుకోవటం కొంత సులువే కావచ్చు గానీ, అంత పెద్దాయనను కలుసుకోబోతున్నానన్న నిజం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏమైతేనేం, కలం పేరుతో ‘ఆరుద్ర’గా అందరికీ తెలిసిన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి లాంటి పేరుమోసిన సినీ గీత రచయిత, 13 సంపుటాల సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర వెలువరించిన పరిశోధకుడు, అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకడు, అనేక సాహితీ ప్రక్రియలలో ప్రతిభను చాటినవాడు అయిన ఆరుద్ర అనే మహానుభావుణ్ణి కలుసుకున్నా.
సందులో ఇలు.. బీరువాల్లో వస్తువులు..
టీ నగర్ పాండీ బజార్‌లో పూలమార్కెట్ పక్క సందులోని ఇల్లు, దానికి కొనసాగింపుగా వేసిన షెడ్డులో ప్రశాంతంగా కూర్చొని నాట్యశాస్త్ర గ్రంధమొకటి చదువుతూ ఉన్నారు. పక్కనే మూడు బీరువాల్లో పుస్తకాలు, ఒక పాత టైప్‌రైటర్ కూడా ఉన్నాయి. నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నా. కాసేపటికి ఆరుద్ర వదినగారు( రామలక్ష్మి గారి అక్కగారు) గ్రీన్ టీ తెచ్చారు. అదే మొదటి సారి గ్రీన్‌టీ తాగటం. అప్పటినుంచి వారానికి కనీసం రెండు సార్లు ఆయనదగ్గరికి వెళ్లడం, గ్రీన్ టీ తాగుతూ మాట్లాడుకోవటం దాదాపు ఆయన చనిపోయేదాకా ఐదేళ్ల పాటు సాగింది.
అలా మొదలైంది..
మొదటిరోజే ఆయన డిక్టేషన్ మొదలైంది. నా అక్షరాలు తప్పుల్లేకుండా కుదురుగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇంట్లోంచి వస్తూ రామలక్ష్మి గారు ‘‘అబ్బాయ్, టీ తాగావా’’ అనగానే ఉలిక్కి పడి అటు చూశా. ఆరుద్రగారు సమాధానమిచ్చాకగాని ఆమె పిలిచింది నన్ను కాదని, ఆరుద్ర గారిని అలా పిలుస్తారని అర్థమైంది. ఆమెకు నన్ను పరిచయం చేశాక నేను రాసింది చదివి ‘‘టైపిస్ట్ టెన్త్త్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు, సొంత పైత్యం ఉపయోగిస్తాడు అని ఖాసా సుబ్బారావు గారు అనేవారు. కానీ నువ్వు మాత్రం చెప్పింది చెప్పినట్టే రాశావ్’’ అన్నారు. అలా మార్కులు కొట్టేశా. అప్పుడప్పుడూ రామలక్ష్మి గారు కాసేపు కబుర్లు చెప్పేవారు. ఇంటిపని మాత్రం వాళ్ల అక్కగారిదే.
‘‘బ్రాహ్మణుణ్ణే కానీ, జంధ్యం వేసుకోలేదు. పెళ్లిచేసుకున్నాను గాని తాళి కట్టలేదు.’’ అనే ఆరుద్ర గారి డైలాగ్ సంగతేమోగాని రామలక్ష్మి గారికి ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదట. గర్భిణిగా ఉన్నప్పుడు సిటీ బస్సెక్కితే ఆమె బోసి మెడ చూసి ‘‘అయ్యో ఈ వయసులో ఇన్ని కష్టాలా?’’ అన్నట్టు బాధపడేవాళ్లని చెబుతూ నవ్వేవారు.
రావిశ్రాస్తి గురించి..
ఆంధ్రప్రభ కాలమ్ మాత్రమే కాకుండా పుస్తక సమీక్షలు మొదలు వ్యాసాల దాకా ఏది రాయాలన్నా, ఆరుద్ర గారు అలా ఫోన్ చేసి పిలవగానే వెళ్లి రాసిపెట్టడం అలవాటుగా మారింది. ఆ రోజుల్లో రావిశాస్త్రిగారు చనిపోయారు. ఆరుద్రగారి స్పందన తీసుకోమని హైదరాబాద్ నుంచి కల్లూరి భాస్కరం గారి ఫోన్. వెంటనే ఆరుద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఎప్పుడు రమ్మంటారని అడిగితే ‘‘నేను చెప్పటం, నువ్ రాసుకోవటం అలవాటేగా, ఇక్కడిదాకా ఎందుకులే, రాసుకో’’ అన్నారు. ‘‘రావిశాస్త్రి పెన్ను మూశారు’’ అంటూ చెప్పటం మొదలుపెట్టారు. ఆరోజు అదే శీర్షిక కూడా అయింది. ఆ తరువాత సాహిత్యకారులెవరు చనిపోయినా ఆ ప్రయోగం ఒక ఆనవాయితీ గా మారింది.
రామోజీ బ్లాంక్ చెక్..
ఒకరోజు వెళ్లగానే ఆరుద్రగారు నాకో కవర్ చేతికిచ్చారు. చూడగానే అది ఈనాడు (ఉషోదయ పబ్లికేషన్స్) నుంచి అని అర్థమైంది. తెరచి చూస్తే అది రామోజీరావుగారి సంతకంతో ఆరుద్రగారికి రాసిన పర్సనల్ లెటర్. దాంతోపాటు ఒక బ్లాంక్ చెక్. ఆ లెటర్ లో స్థూలంగా చెప్పిందేమటంటే, ‘‘అందరూ నేను సాహిత్యానికి వ్యతిరేకినని అనుకుంటారు. కానీ దినపత్రికలలో సాహిత్యానికి మాత్రమే వ్యతిరేకిని. ‘భారతి’ స్థాయిలో ఒక సాహిత్య పత్రిక పెట్టాలని అనుకుంటున్నాను. అది కూడా మీరు సారధ్యం తీసుకుంటే. మీ ఒప్పుకోలుకు సూచనగా ఈ చెక్కు తీసుకోండి’’ అని. అప్పటికే చదివి ఉన్నారు కాబట్టి నేను చదవటం పూర్తయిందని గ్రహించగానే ‘‘ఏమంటావ్? నువ్వూ వస్తావా?’’ అన్నారు. క్షణం ఆలోచించకుండా ‘‘సరే’’నన్నా .
రిప్లయ్.. ఇలా..
‘‘అయితే రాసుకో’’ అంటూ లెటర్ డిక్టేట్ చేయటం మొదలు పెట్టారు. అందులో ‘‘ మూత్రపిండాల వ్యాధితో నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాగుంట సుబ్బారామిరెడ్డిగారు నాకు సహాయం చేశారు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. ఆయన ఒక వీక్లీ పెట్టే ఆలోచన ఉందని తెలిసి, ఆయన అడక్కపోయినా దానికోసం పనిచేస్తానని మాటిచ్చాను. అందువలన మీరిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నా’’ అంటూ లెటర్ ముగించారు. ఈ లెటర్‌తోపాటు రామోజీరావు గారి బ్లాంక్ చెక్ వెనక్కి వెళ్లిపోయింది. సాహిత్య పత్రిక ఆలోచన వాయిదా పడింది. ఈ మధ్య కాలంలో కొన్నేళ్ళపాటు నడిచి ఆగిపోయిన ‘తెలుగు వెలుగు’ బహుశా ఆ ఆలోచన కొనసాగింపు కావచ్చు.