Raghunandan Rao vs Bandi Sanjay : మొన్నటిదాకా క్రమశిక్షణకు మారుపేరు అని భారతీయ జనతా పార్టీకి గుర్తింపు ఉండేది. అయితే ఆ పార్టీ కూడా మిగతా వాటి లాగానే అని నిరూపించుకుంది. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ అధి నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ” నాడు కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బండి సంజయ్ పోటీ చేసినప్పుడు డబ్బులు లేవు. తన భార్య పుస్తెలు అమ్మి ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. కానీ అనతి కాలంలోనే ఆయన సంపద పెరిగింది. 100 కోట్లతో పార్టీ తరుఫున పేపర్లకు ప్రకటనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇందులో ఆయన వాటా కూడా ఉంది అని ఇది ఎలా సాధ్యం?” అని రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేసినట్టుగా పలు మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీలో కలకలం చెలరేగింది. వాస్తవానికి కొంతకాలంగా రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. కార్యకలాపాల్లో అంత యాక్టివ్ గా లేరు. ఇదే సమయంలో తనకు అధిష్టానం చేస్తున్న అన్యాయాన్ని కొంతమంది విలేకరులకు ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా ఇన్ సైడ్ గా వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల ఓ పత్రిక ప్రధానంగా ప్రచురించింది. అయితే ఈ వ్యాఖ్యలపై అధికారికంగా ఆయన మాట్లాడినట్టు రికార్డ్ కానీ వీడియో కానీ లేదు.
ఇక సోమవారం నాటి విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు ఆరోపణలు చేసినట్టుగా ఆ వీడియోల్లో పేర్కొంటున్నారు. కేవలం బండి సంజయ్ మీద ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆయన విమర్శించారు. తెలంగాణలో శాసనసభకు బిజెపి తరఫున పక్ష నేత లేడనే విషయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తెలియకపోవడం విచారకరమని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తాను భారతీయ జనతా పార్టీకి చేస్తున్న సేవకు ప్రతిఫలం దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు వైప్లస్ కేటగిరి భద్రత కల్పించిన కేంద్రం.. ఎందుకు తనను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బండి సంజయ్ ఫోటో కాకుండా తన ఫోటో, ఈటల రాజేందర్ ఫోటో ఉంటేనే ఓట్లు పడతాయని రఘునందన్ రావు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
దీంతో ఇన్నాళ్లపాటు నివురు గప్పిన నిప్పులాగా ఉన్న అసమ్మతి భారతీయ జనతా పార్టీలో ఒక్కసారిగా బయటపడింది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి దీనిపై ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా పుస్తెల అమ్మి పోటీ చేసిన బండి సంజయ్ 100 కోట్లు ఎలా సంపాదించారో అని రఘునందన్ రావు ఆరోపణలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
మరి ఇవి మీడియా సంస్థలు పుట్టించినవేనని.. తాను పార్టీ మారుతున్నట్టు.. బీజేపీ నేతలు, అధిష్టానంపై తిరుగుబాటు చేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని రఘునందన్ రావు స్వయంగా వెల్లడించారు. కిషణ్ రెడ్డి ఆఫీసుకొచ్చిన తాను విలేకరులతో చిట్ చాట్ గా పిచ్చాపాటిగా మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించి తనను అభాసుపాలు చేశారని.. తాను బీజేపీని, జేపీనడ్డాను, బండి సంజయ్ ను విమర్శించలేదని రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=YR8m3cbDgTc