Tadipatri Town CI: ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక ఎక్కువ మంది బలవన్మరణాలను ఆశ్రయిస్తుంటారు. అన్నిదారులు మూసిపోయాక మనస్తాపంతో తనువులు చాలిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో ఇటువంటి చావులు అధికమయ్యాయి. వ్యవస్థల కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కడపకు చెందిన వెంకట సుబ్బారెడ్డి అయితే ఏకంగా సీఎం పేరిట సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. భూ సమస్య విషయంలో రెవెన్యూ వ్యవస్థ బాధ్యతగా వ్యవహరించకపోవడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవస్థలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో సీఎం ఉండడంతో ఏకంగా ఆయన పేరును రాసి మరీ తనువు చాలించడం విచారకరం.
అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. డ్యూటీ ముగించుకొని ఇలా వెళ్లారో? లేదో ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నారు. పోలీస్ అధికారులు మాత్రం కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలుగా ప్రకటించారు. కానీ పని ఒత్తిడి మూలంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుమార్తె చెబుతున్నారు. తాడిపత్రిలాంటి ప్రాంతంలో పోలీస్ శాఖ పై ఎంతటి ఒత్తిడి ఉంటుందో ఆ శాఖ అధికారులకు తెలియంది కాదు. కానీ సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలను లింకు పెట్టి వదిలేయ్యడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది.
ఇటీవల ఏపీలో వింత పోకడలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అధికారుల వేధింపులు, పోలీసుల వేధింపులు, టార్చర్ భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక వేళ రాజకీయ బాధితులు కానీ పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి వారిపైనే కేసులు నమోదుచేస్తున్నారు. విపక్షాలపై దాడులు చేస్తే అదే పార్టీలో ముఠా తగాదాలు చెప్పి పోలీసులు తప్పించుకుంటున్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే దానికి ప్రస్టేషన్ అన్న పదాన్ని జోడించారు తప్ప చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సొంత శాఖ అధికారి మరణం వెనుక ఉన్న అసలు మర్మాన్ని బయటపెట్టలేని స్థితిలో ఏపీ పోలీస్ శాఖ ఉండడం విచారకరం.