Pawan Kalyan’s tears : జనసేనాని పవన్ కళ్యాణ్ కదిలిపోయారు. వాళ్ల బాధలు విని చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతటి దౌర్భగ్యమైన పాలన పరిస్థితులు.. న్యాయం ఎండమావేనా? అని బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన జనవాణికి అపూర్వ స్పందన వచ్చింది.

కాకినాడ జనవాణిలో వెల్లువలా సమస్యలు తెలిపారు ప్రజలు.. అధికార పార్టీ దాష్టికాలు.. దౌర్జన్యాలపై ప్రజాగ్రహం పెల్లుబుకింది.. ఓపికగా ప్రతి సమస్యను విన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ప్రతి ఒక్కరికీ నేనున్నాంటూ భరోసా ఇచ్చిన జనసేనాని వారిని దగ్గరకు తీసుకొని మరీ ఓదార్చారు.

‘అద్భుతమైన పోర్టు ఉన్న కాకినాడకు అన్ని విధాలా అభివృద్ధి అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తీర ప్రాంతం ఉన్నచోట అభివృద్ధి అనేది సహజంగా ఉంటుంది. అయితే అందరి మాటలు విన్న తర్వాత కాకినాడ నగరం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేకపోయింది అని అర్థమవుతుంది. పాలకుల తీరు దీనికి ఒక కారణం అయితే, అవినీతిమయమైన నాయకులను ప్రజలు చట్టసభలకు పంపించడం కూడా మరో కారణం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.

శనివారం ఉదయం కాకినాడలో జనసేన వారాహి విజయం యాత్రలో భాగంగా కాకినాడలో సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. “జనసేన పాలనలో స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకత, సుపరిపాలన అనే అంశాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తాం. జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తాం. ప్రజా పద్దులోని ప్రతి రూపాయికి కచ్చితంగా ప్రజలకు లెక్క చూపించే బాధ్యతను తీసుకుంటాం. సహజ వనరుల దోపిడీని పూర్తిగా అరికట్టేలా చర్యలు ఉంటాయి. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. సమాజంలో ఉన్న వారందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అది ఏ వర్గాలను ప్రభావితం చేస్తుందో వారి అందరి నిర్ణయాలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అన్న దానిపై జనసేన కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, మేధావులుతో పూర్తిస్థాయిలో చర్చిస్తున్నాం. చెప్పే ప్రతి మాటను వింటున్నాం. ఇది కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో సుపరిపాలనకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ ప్రజలు, బాధితులకు భరోసానిచ్చారు.

