Pawan – CM Jagan : అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది కూలీలుగా మారిపోయారు. ధాన్యాన్ని బస్తాల్లో నింపి స్వయంగా ట్రాక్టర్లలో లోడ్ చేసి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం రాజుపాలెంలో మంగళవారం రాత్రి ఈ దృశ్యాలు వెలుగుచూశాయి. కొద్దిరోజుల కిందట అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం కలిగిన సంగతి తెలిసిందే.రబీలో వేసుకున్న ధాన్యం, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. ధాన్యం రంగు మారిపోయింది. మొక్కజొన్న కంకెలకు మొలకలు వచ్చాయి. రంగుమారిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం లేదు. రైతుల నుంచి ప్రజాప్రతినిధులకు ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ పర్యటన ఉండడంతో ప్రభుత్వం హైరానా పడుతోంది. ఎటువంటి విమర్శలు ఎదురవుతాయోనని తెగ ఆందోళన చెందుతోంది.
కూలీలుగా మారి..
కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరులో పవన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అందులో పి.గన్నవరం మండలం రాజులపాలెం కూడా ఉంది. అయితే అక్కడ రంగుమారిన ధాన్యం, మొలకలు వచ్చిన మొక్కజొన్న పంట కల్లాల్లో భారీగా పేరుకుపోయాయి. దీనిపై పవన్ రియాక్షన్ తట్టుకోలేమని భావించి రాత్రికి రాత్రే ధాన్యాన్ని వేరేచోటకు తరలించే పనిలో పడ్డారు. అయితే కూలీలు దొరకలేదు. దీంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూలీల అవతారమెత్తారు. స్వయంగా గోనె సంచుల్లో ధాన్యాన్ని నింపారు. ట్రాక్టర్లకు లోడింగ్ చేశారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, వీవోఏలు ఇలా అందరూ వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. స్వయంగా ఆర్డీవోనే పర్యవేక్షించారు. అయితే ఈ విషయం మీడియాలో వెలుగుచూసింది. దీంతో అధికారులు, ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో..
ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రైతులకు నష్టపరిహారం అందించాలన్న ధ్యేయంతో వారి కోసం పర్యటిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో పవన్ పర్యటన ఉండేలా షెడ్యూల్ ను రూపొందించారు. ముందుగా కడియంలో అకాల వర్షాలతో పాడైపోయిన పంటలు, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలిస్తారు. కొత్తపేట అవిడి గ్రామంలో వరి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పి.గన్నవరం మండలం..రాజులపాలం గ్రామంలో మొక్కజొన్న…రైతులు మాట్లాడి భరోసా కల్పిస్తారు. చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నిబంధనల పేరిట..
అకాల వర్షం పంట నష్టాల విషయం ప్రభుత్వం ప్రకటించిన దానికి.. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది. తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మొలక వచ్చిందని, రంగు మారిందని, తేమ శాతం అధికంగా ఉందని చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తామని రైతులు అంటున్నా అధికారుల్లో స్పందన లేదు. తేమ శాతం, నూక, తాలు పేరిట మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే పవన్ పర్యటనతో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో స్థానిక అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు.
