MI Vs RCB 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. అద్భుత బ్యాటింగ్ తో భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా చేదించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ముంబై జట్టు. సూర్య కుమార్ యాదవ్ అరవీర భయంకరమైన బ్యాటింగ్ తో జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లో భాగంగా మంగళవారం సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టిన ముంబై జట్టు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా చేదించి విజయం సాధించింది. ముంబై బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్, నేహల్ వధేరా భారీ హిట్టింగ్ తో విరుచుకుపడడంతో ముంబై జట్టు అలవోకగా విజయం సాధించింది.
భారీ లక్ష్యాన్ని విధించిన బెంగుళూరు జట్టు..
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లేసిస్ 41 బంతుల్లో 65 పరుగులు, మాక్స్ వెల్ 33 బంతుల్లో 68 పరుగులు, దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో బెంగుళూరు జట్టు భారీగా పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బెహ్రండూఫ్ నాలుగు ఓవర్లలో 36 పరుగులు వచ్చి మూడు వికెట్లు తీయగా, గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ ఒక్కో వికెట్ తీశారు.
ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ ఇద్దరూ..
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ధాటిగానే చేజింగ్ ను ప్రారంభించింది. ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంతో పవర్ ప్లే లో ముంబై జట్టు భారీగానే పరుగులు రాబట్టుకుంది. 4.3 ఓవర్ లో 51 బంతులు చేసి పటిష్ట స్థితిలో ముంబై జట్టు నిలిచింది. అయితే ఐదో ఓవర్ బౌలింగ్ కు వచ్చిన హసరంగ తన తొలి ఓవర్ నాలుగో బతికి ఇషాన్ కిషన్ ను, ఆరో బంతికి రోహిత్ శర్మ 7(8)ను అవుట్ చేసి బెంగళూరు జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు లభించిన ఆనందం బెంగుళూరు జట్టుకు ఎంతో సేపు లేదు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, నేహాల్ వదేరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలు, సిక్సులతో అదరగొట్టారు. సూర్య కుమార్ యాదవ్ 35 బంతుల్లో ఆరు సిక్సులు, ఏడు ఫోర్లుతో అదరగొట్టి 83 పరుగులు చేశాడు. రెండో ఎండ్ లో వధేరా కూడా మంచి సహకారాన్ని అందించాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు బాది 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో భారీ పరుగులు అయినప్పటికీ మరో 21 బంతులు మిగిలి ఉండగా అద్భుత విజయం నమోదు చేసింది ముంబై జట్టు. బెంగళూరు జట్టులో వసిందు హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు.
మూడో స్థానానికి చేరుకున్న ముంబై జట్టు..
తాజా విజయంతో ముంబై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. బెంగుళూరు జట్టు ఈ అవకాశాలను మరింత క్లిష్టం చేస్తుకుంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో గుజరాత్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చెన్నై జట్టు రెండో స్థానంలోనూ, ముంబై జట్టు మూడో స్థానంలోనూ, లక్నో జట్టు నాలుగో, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదో స్థానంలో, కోల్కతా జట్టు ఆరో స్థానంలో, బెంగళూరు జట్టు ఏడో స్థానంలో, పంజాబ్ జట్టు ఎనిమిదో స్థానంలో, హైదరాబాద్ జట్టు తొమ్మిదో స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదో స్థానంలో కొనసాగుతోంది.