TDP Leadership Strategy 2026 Elections: ఏ పార్టీకైనా సమర్థ నాయకత్వం అవసరం. ఉన్న నాయకత్వం విఫలమైతే వెంటనే ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు టిడిపి నాయకత్వం ఆలోచన కూడా అదే. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. జనసేన, బిజెపితో కలిసి నడిచింది. మూడు పార్టీలు ఉమ్మడిగా 164 సీట్లను సాధించాయి. ఇందులో ఒక్క తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీలోనే ఇది ఒక రికార్డు విజయం. గతంలో ఆ పార్టీ గెలుపొందని నియోజకవర్గాలను సైతం సొంతం చేసుకుంది. అయితే మరోసారి అదే విజయం సాధించాలన్న ఆలోచనతో అధినేత చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేస్తున్నారు.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
* ప్రత్యామ్నాయ నేతలు సిద్ధం..
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు( CM Chandrababu)అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినా సరే కొందరి తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సొంత సర్వేలు చేయిస్తున్నారు. నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడటం లేదు. వారిని హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అందుకే ఎక్కడికక్కడే సిట్టింగులకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఎమ్మెల్యేలకు దీటుగా ఉన్న ప్రత్యామ్నాయ నేతలను ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
* కొత్తవారికి అవకాశం..
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నూతన నాయకత్వానికి టికెట్లు ఇచ్చింది. కొన్నిచోట్ల వారసులను తెరపైకి తెచ్చింది. అయితే ఇందులో కొంతమంది పనితీరు ఎంత మాత్రం బాగాలేదు. వారి వైఖరి మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. సర్వేల్లో కూడా ఇదే తేలుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే మొన్నటి ఎన్నికల్లో టికెట్ల మార్పుతో చాలామంది నేతలకు మొండిచేయి దక్కింది. వారంతా ఇప్పుడు పార్టీలోనే యాక్టివ్గానే ఉన్నారు. అయితే పార్టీ పరంగా ఇప్పుడు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని హై కమాండ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చూస్తే మాత్రం సదరునేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటివారు రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 70 మంది నేతల వరకు గుర్తించినట్లు తెలుస్తోంది. సిట్టింగులు దారికి వస్తే సరి.. లేకుంటే మాత్రం టికెట్ మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే టిడిపి హై కమాండ్ ముందే జాగ్రత్త పడినట్లు అయింది.