Homeజాతీయ వార్తలుPM Narendra Modi Mother Heeraben : మోడీతో తల్లి హీరాబెన్ కు ఉన్న...

PM Narendra Modi Mother Heeraben : మోడీతో తల్లి హీరాబెన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం

PM Narendra Modi Mother Heeraben : కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్(100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. హెరాబెన్ రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రికి తరలించారు.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు మొదట చెప్పారు.. కానీ హఠాత్తుగా గురువారం అర్ధరాత్రి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మరలి రాని లోకాలకు వెళ్ళిపోయింది.. ఇటీవలే ఆమె తన వందో పుట్టిన రోజు జరుపుకున్నది. హీరా బెన్ గాంధీనగర్ శివారులోని రైసన్ గ్రామంలో మోడీ తమ్ముడు పంకజ్ మోడీతో కలిసి నివసిస్తున్నారు.

ప్రత్యేక అనుబంధం

మోడీకి,హీరా బెన్ కు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో మోడీ తన తల్లి ఘనత గురించి ప్రస్తావించారు.. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి పాత్ర ఎంతో ఉందని గుర్తు చేసుకునేవారు..మోడీ ఎక్కడ ఉన్నా ఫోన్ లో తన తల్లి యోగక్షేమాలు కనుక్కునేవారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా అక్కడ విస్తృతంగా ప్రచారం చేసినప్పుడు తన తల్లి వద్ద మోడీ ఎక్కువ ఉన్నారు.. డిసెంబర్ 4న గాంధీనగర్ లో హీరా బెన్ ను చివరి సారి గా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పాదాలను ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చుని టీ తాగారు. గుజరాత్ ఎన్నికలకు ముందు జూన్ 18న తన వందో పుట్టినరోజు సందర్భంగా మోడీ తన తల్లిని కలిశారు. జూన్ 23 న ఆమె పుట్టినరోజు నాడు, సెప్టెంబర్ 17 తన పుట్టినరోజు నాడు… మోడీ కచ్చితంగా హీరా బెన్ వద్దకు వెళ్తారు. ఈసారి సెప్టెంబర్ 17న రాలేకపోయానంటూ బాధపడిన సందర్భం కూడా ఉంది. ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే అయినట్టు.. తన తల్లిని చూడగానే మోదీ చిన్నపిల్లాడయిపోయేవారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 11, 12 తేదీల్లో గుజరాత్ లో రెండు రోజుల పర్యటనలో ఉన్నప్పుడు.. మార్చి 11 రాత్రి 9 గంటలకు తల్లి హీరా బెన్ ను కలిసేందుకు గాంధీ నగర్ చేరుకున్నారు. అక్కడ ఆశీర్వాదం తీసుకొని, ఆమెతో కలిసి కిచ్చీలు తిన్నారు.

ఇదీ హీరా బెన్ నేపథ్యం

హీరా బెన్ స్వస్థలం వాద్ నగర్. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్ చంద్. వీరికి కుమారులు, ఒక కుమార్తె.. మూడవ సంతనంగా నరేంద్ర మోడీ జన్మించారు.. పెద్ద కుమారుడు పేరు సోమ మోదీ.. ఆరోగ్య శాఖలో విశ్రాంత అధికారి.. రెండో కుమారుడు పంకజ్ మోదీ.. ఈయన ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్.. నాలుగో కుమారుడు అమృత్ మోదీ. లేత్ మిషన్ విశ్రాంత ఆపరేటర్. అయిదో కుమారుడు ప్రహ్లాద్ మోదీ. ఈయన రేషన్ షాప్ డీలర్. కూతురు పేరు వాసంతీ బెన్. భర్త చనిపోయిన తర్వాత హీరా బెన్ తన చిన్న కొడుకు పంకజ్ మోడీ ఇంట్లో ఉంటున్నారు. 2016లో ఆమె మొదటిసారి ఢిల్లీలోని నరేంద్ర మోడీ అధికారిక నివాసాన్ని సందర్శించారు.. 2016 నవంబర్లో నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు, తన కుమారుడు నిర్ణయానికి మద్దతుగా ఆమె ఏటీఎం వద్ద క్యూలో నిలబడి అందరిని ఆకట్టుకున్నారు.. 2019 లోక్ సభ ఎన్నికల్లో మోడీ తరపున ప్రచారం చేశారు. 97 ఏళ్ల వయసులో ఆమె ఓటు వేశారు. మొన్న గుజరాత్ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా తన తల్లి మరణం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు..” వంద సంవత్సరాలు సుదీర్ఘంగా బతికిన నా తల్లి ఈశ్వరుడి వద్దకు వెళ్లిపోయిందని” ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా హీరా బెన్ మృతి పట్ల నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాధినేతలు ఫోన్ చేసి పరామర్శించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular