KCR : సాధారణంగా మనం గొప్ప వాళ్లం అని నిరూపించడానికి ఒక పోలిక అవసరం. ఆ పోలిక మన పక్కవాళ్లు కావచ్చు.. మన అన్నాదమ్ములు కావచ్చు. వారిని పోల్చి మనం ఎక్కువ అని నిరూపిస్తాం.. మొన్నటివరకూ అన్నాదమ్ములుగా కలిసి ఉండి ఇప్పుడు ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటున్న తెలంగాణ, ఆంధ్రుల మధ్య ప్రస్తుతానికి ఏ పంచాయితీ లేదు. రెండురాష్ట్రాల ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉంది. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆంధ్ర, తెలంగాణ మధ్య పోలికలు చెప్పి ఆశ్చర్యపరిచారు.

టీఆర్ఎస్ పుట్టి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అధికారం అనుభవిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రపై కన్నేశారు. సమైక్య పాలకులు వేయని నిందలు.. పెట్టని తిప్పలు లేవని ఆడిపోసుకున్నారు. ఎన్ని చేయాలో అన్నీ చేశారని ఆంధ్రులపై కేసీఆర్ నిప్పులు పోశారు. రాజ్యసభలో బిల్లు పాసయ్యే ముందు కూడా కుట్రలు చేశారని ఆరోపించారు. మనం కూడా అంతే పట్టుదలతో ముందుకు సాగామని రాష్ట్రం సాధించామని ఘనతను చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఆంధ్రులను, ఆంధ్రా నేతలను విమర్శించిన కేసీఆర్ ఆశ్చర్యకరంగా ఆంధ్రాలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవడం విశేషం. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేతకాదని.. భూముల ధరలన్నీ పడిపోతాయని ఆంధ్రా నేతలు దుష్ర్పాచారం చేశారని.. ఏడేళ్లలో అవన్నీ అపోహలని పటాపంచలు అయ్యి ఇప్పుడు దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని కేసీఆర్ కొనియాడారు.
దళితబంధు ప్రకటించాక కేసీఆర్ కు ఆంధ్రా నుంచి కూడా వేల పిలుపులు వస్తున్నాయని.. ఆంధ్రాలో పార్టీ పెట్టాలని గెలిపించుకుంటామని అంటున్నారట.. కేసీఆర్ చెప్పిన చోద్యం విన్నాక టీఆర్ఎస్ శ్రేణులు చప్పట్లో కొట్టినా.. రాష్ట్రం విడిపోవడానికి.. ఆంధ్రుల దుస్థితికి కారణమైన ఆంధ్ర ప్రజలు మాత్రం ఈ కేసీఆర్ ప్రకటనను అస్సలు సహించరని చెప్పొచ్చు.
ఇలా కేసీఆర్ తనను తాను ప్లీనరీలో ప్రొజెక్ట్ చేసుకోవడంతోపాటు ఆంధ్రాలోనూ పార్టీ పెడుతా.. పాటుపడుతానంటూ బయలు దేరారు. దీన్ని బట్టి టికెట్ల కోసం.. తెలంగాణ గొప్పతనం చాటేందుకు ఆంధ్రోళ్లకు కేసీఆర్ బిస్కెట్ వేశాడని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. మరి ఇంతటి ఆంధ్రా విభజనకు కారణమైన కేసీఆర్ ను అక్కడి ప్రజలు అక్కున చేర్చుకుంటారా? ఆదరిస్తారా? అన్నది వేచిచూడాలి.