Indus Civilization: ప్రపంచంలోని తొలి నాగరికతలలో ఒకటి సింధు నాగరికత. సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆధునిక భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించింది. ఈ నాగరికత తర్వాతనే అఖండ భారత దేశంలో సామాజిక మార్పులు వచ్చాయి. భాష, లిపి, పంటల సాగు, పోడు వ్యవసాయం, జీవన విధానంలో మార్పులు, సామాజికవర్గాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాయని పరిశోధకులు చెబుతారు. అయితే ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న నాగరికత ఎలా అంతమైంది అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలింది. ఎన్ని పరిశోధనలు చేసినా పురాతన సమాజం గురించిన చాలా విషయాలు కొనుగొనలేకపోయారు.
సింధు నాగరికత భాష ఏమిటి? బరువు కొలత వ్యవస్థ? దాని కళాఖండాలు కొన్ని? అనేవి ఇప్పటికీ తెలియదు. కానీ సింధు లోయ నాగరికత ఎలా, ఎప్పుడు, ఎందుకు అదృశ్యమైంది అనే విషయాల గురించి ఇటీవలే పరిశోధకులు కచ్చితమైన ఆధారాలు కనుగొన్నారు. ఎందుకు అదశ్యమైంది?
హిమాలయాల్లో రహస్యం
సుమారు 4,200 సంవత్సరాల క్రితం సింధు లోయలో కరువు వచ్చిందని పరిశోధకులు గుర్తించారు. అయితే కచ్చితమైన సంవత్సరం, కాలం మాత్రం తెలియలేదు. ఈ అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు హిమాలయాల్లోని ధర్మజలి గుహలో దాగి ఉన్నాయని పేర్కొన్నారు. నిస్సారమైన ఈ గుహ చివరలో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న పరిశోధకులు సింధు నాగరికత కాలం నాటి ఆధారాలతో కూడిన స్టాలగ్‌మైట్‌ను కనుగొన్నారు. గుహ నిర్మాణం వాతావరణ–అనుకూలమైన నివాస స్థలంలో ఉంది. పురాతన కాలంలో ఏర్పడినట్లుగా గుర్తించారు. స్టాలగ్‌మైట్‌లోని లేయర్డ్ ఖనిజ నిక్షేపాల ఆధారంగా, పరిశోధకులు 4,200 సంవత్సరాల క్రితం వర్షపాతం లెక్కలు అంచనవేస్తున్నారు.
వివరణాత్మక చిత్రం..
తాజా పరిశోధనలు మునుపటి నిపుణుల ఫలితాలతో పోచ్చితే పురాతన జీవితం కన్నా.. కొంచెం భిన్నమైన, మరింత వివరణాత్మక చిత్రాన్ని అందించాయి. సుమారు 100–200 సంవత్సరాల పాటు కొనసాగిన సింధూ నాగరికత 4,200 నుంచి 3,900 సంవత్సరాల మధ్య అంతరించిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ 25 నుంచి 90 ఏళ్ల మధ్య కాలంలో మూడు ప్రధాన కరువులను గుర్తించారు.
కరువుతోనే కనుమరుగు..
ఈ కరువులు స్వల్పకాలిక సంక్షోభం కాదని, సింధు ప్రజలు నివసించిన పర్యావరణ పరిస్థితుల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు. గుహలో లభించిన ఆధారాలతో తీవ్రమైన కరువుతోనే సింధు నాగరికత అంతమైనట్లు స్పష్టమైన సాక్ష్యాలను కనుగొన్నామని రచయిత కామెరాన్ పెట్రీ ఏప్రిల్ 24న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తెలియజేశారు. కరువు సమయంలో వేసవి మరియు శీతాకాల వర్షపాతం రెండూ తగ్గాయని అధ్యయనం తెలిపింది. కరువు సింధూ స్థావరాలకు నీటి సదుపాయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని, అవసరమైన పంటల కోసం ఊహించదగిన వర్షపాతం, నది వరదలను ప్రభావితం చేసిందని గుర్తించారు.

సింధు నాగరికత దండయాత్రలు లేదా అంతర్గత వైరుధ్యాలతో అంతమైందని గత పరిశోధనలు తెలిపాయి. కానీ, కరువు లేదా వరదలు వంటి వాతావరణంలో మార్పులు సింధు లోయ నాగరికత పతనానికి దోహదపడి ఉండవచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.