CM YS Jagan : అంతపుర రహస్యాలు బయటపడి సామ్రాజ్యలే కూలిపోయిన చరిత్ర ఉంది. వ్యక్తిగత గోప్యత దాటి బయటపడిన సందర్భాల్లో చాలారకాలుగా యుద్ధాలే జరిగాయి. పెద్దపెద్ద అనర్థాలకు దారితీశాయి. అటువంటి స్థితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. కక్కలేని.. మింగలేని పరిస్థితి. అయితే ఆయన ప్రజాజీవితంలో ఉన్నారు కాబట్టి గుంభనంగా ఉంటున్నారు. మనో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. లేకుంటే బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో వెలుగుచూస్తున్న ప్రతీ అంశం ఆయనకు ఒక గుణపాఠమే. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసుకున్న పునాదిని పెకిలించేదే. అందుకే ఈ విషయంలో జగన్ అచీతూచీ వ్యవహరిస్తున్నారు. కాలం ఆడుతున్న వైకుంఠ పాళిలో పాముకు దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.
బాధితులు, నిందితులు వారే..
వివేకా హత్య కేసులో బాధితులు, నిందితులు, అనుమానితులు.. అంతా వైఎస్ కుటుంబమే కావడం గమనార్హం. తండ్రి హత్యపై కుమార్తె సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విపక్షాలు తన వైపు దూసుకొస్తున్నారు. ఇవి చాలవన్నట్టు తాను గతంలో వదిలిన బాణం అని చెప్పుకునే సోదరి షర్మిళ.. అంతకు మించి శరవేగంగా బాణాలను సంధిస్తున్నారు. బయటపడే మార్గం లేక.. మార్గం తెలియక సీఎం జగన్ నానా తంటాలు పడుతున్నారు. కాలం ఆడుతున్న గేమ్ లో ఎలా ఆడాలో తెలియడం లేదు. ఈ క్రమంలో కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న ఆత్మగౌరవం కళ్లెదుటే పతనమవుతుండడం చూసి లోలోపల మదనపడుతున్నారు.
మసకబారుతున్న చరిత్ర..
సీబీఐ పట్టుబిగుస్తున్న కొలదీ వైఎస్ కుటుంబ చరిత్ర మసకబారేలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఎప్పుడైతే కుమార్తె సునీత కేసు విషయంలో దూకుడు కనబరచడంతో.. అదే స్పీడుతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో వెలుగుచూసిందే వివేకా రెండో భార్య షమీమ్ వ్యవహారం. అంతవరకూ వివేకాకు రెండో భార్య ఉందని కొంతమందికే తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ సమాజం మొత్తం తెలిసిపోయింది. ఆయన ఆస్తులు, ఆర్థిక ఇబ్బందులు సైతం బయటకు వచ్చాయి. చివరాఖరుకు ఆయన డబ్బులకు ఇబ్బందిపడి సెటిల్మెంట్లకు సైతం దిగారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఆ కుటుంబాన్ని అభిమానించే వారికి చేదు గుళికలుగా మారాయి.
షర్మిళ చేసిన ధైర్యం చేయలే…
అయితే కుటుంబ విషయాలు బయటపడేసరికి షర్మిళ ధైర్యంగా మీడియా ముందుకొచ్చారు. బాబాయ్ వివేకా అటువంటి వారు కాదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ జగన్ అటువంటి ధైర్యం చేయలేదు సరికదా.. ఆ తప్పుడు ఆరోపణలు కూడా తన మీడియా ద్వారా చేసి దోషిగా నిలబడ్డారు. కుటుంబ పరువు పోతున్నా.. ఎక్కడ వైకుంఠ పాళిలో దొరికిపోతానన్న భయంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మరోవైపు కుప్పకూలిపోతున్న కుటుంబ పరువును తలచుకొని లోలోపల తెగ కుమిలిపోతున్నారు. అందుకే అంటారు ఎంతటివారికైనా కష్టాలు తప్పవని…