
KCR vs BJP : వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. కచ్చితంగా కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం.. అమిత్ షా నుంచి బండి సంజయ్ దాకా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. మరి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో బలం ఉందా? 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బలమైన కేడర్ ఉందా? క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఎలా ఉంది? ఇన్ని ప్రశ్నలకు లేదనే సమాధానం వస్తున్నది. మరి ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటేనే కెసిఆర్ ను ఢీకొట్టగలుగుతుంది. లేకుంటే అంతే సంగతులు.
భారత రాష్ట్ర సమితితో బీజేపీ రాజకీయంగా ఢీ అంటే ఢీ అంటున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం బలమైన అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏటేటా పార్టీ పుంజుకొంటున్నా.. ఇప్పటికీ సగానికి పైగా నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నా, దానిని సొమ్ము చేసుకునే అవకాశం బీజేపీకి ఉన్నా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వలేమి ప్రధాన అడ్డంకిగా మారింది. . ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో అనూహ్యంగా కమలం పార్టీ టికెట్ కోసం పోటీ ఏర్పడింది. ఒక్కో సెగ్మెంట్‌లో నలుగురు, ఐదుగురు బలమైన నేతలు టికెట్ రేసులో ఉన్నారు. ఇదే సమయంలో.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పలు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల్లో మండల, మునిసిపాలిటీ స్థాయి నాయకులే నియోజకవర్గ స్థాయి నేతలుగా వ్యవహరించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలతోపాటు కొన్ని మారుమూల ప్రాంతాల నియోజకవర్గాల్లోనూ మండల స్థాయి నాయకులు కూడా చెప్పుకోదగ్గవారు లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 45-50 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి గట్టి అభ్యర్థులున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల (హుజూరాబాద్, దుబ్బాక, గోషామహల్)తోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించిన సెగ్మెంట్లు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బలమైన నాయకులకు గట్టి పట్టున్నవి ఈ కేటగిరీలో ఉన్నాయి. మరో 20-25 నియోజకవర్గాల్లో ఓ మోస్తరు బలమైన నాయకులున్నారు. ఇక 55-60 సెగ్మెంట్లలో పార్టీ ఓ మోస్తరు బలమైన నాయకులనూ అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లా ల్లో.. ఖమ్మంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకుగాను 9 చోట్ల బలమైన అభ్యర్థుల్లేరు. ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి.
ఇక్కడ పోటాపోటీ
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గోషామహల్ (సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్)ను మినహాయిస్తే, మిగతా నియోజకవర్గాల్లో తాము బలహీనంగా ఉన్నమాట వాస్తవమేనని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 డివిజన్లు కైవసం చేసుకోవడంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలపడిందని వారు చెప్పారు. దీంతో, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన రాజధాని పరిసర సెగ్మెంట్లలో ముగ్గురు, నలుగురు చొప్పున బలమైన నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్‌చెరు, నారాయణఖేడ్ వంటి సెగ్మెంట్లలో పోటీ ఎక్కువగా ఉంది. వీటితోపాటు నిజామాబాద్ అర్బన్, వేములవాడ, పెద్దపల్లి, ముథోల్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, దేవరకద్ర, నారాయణపేట వంటి నియోజకవర్గాల టికెట్ కోసం కూడా ఇద్దరు, ముగ్గురు బలమైన నేతలు పోటీ పడుతున్నారు.
బలమైన అభ్యర్థులు కావాల్సింది ఇక్కడే..
చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, బోథ్, నిర్మల్, బాన్సువాడ, బాల్కొండ, సిద్దిపేట, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, మేడ్చల్, ధర్మపురి, మంథని, జగిత్యా ల, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, యాకత్‌పుర, కొడంగల్,జడ్చర్ల, వనపర్తి, అలంపూర్, నాగర్‌కర్నూలు,అచ్చంపేట, దేవరకొండ, నా గార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం, ఘన్‌పూర్, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట, ములుగు, పినపాక, ఇల్లందు, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి.