Chicken: చికెన్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టంగా తినే ఆహారం. యూఎన్వోకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) అంచనా ప్రకారం.. భారతదేశంలో ఏటా చికెన్ వినియోగం 45 లక్షల టన్నుల కన్నా ఎక్కువగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ప్రకారం భారత్‌లో చికెన్ తలసరి వినియోగం ఏటా 3.1 కిలోలుగా ఉంది. కూరగాయలు, ఆకుకూరలతోపాటు కోడిమాంసం ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల దీని వినియోగం ఎక్కువగా ఉంది. చికెన్‌లో ప్రొటీన్లు, శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలా మంది ప్రజలు ఇష్టంగా తినే చికెన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్కిన్ చికెన్ మంచిదేనా?
కొందరు చికెన్‌ను స్కిన్‌తో వండుకొని తింటారు. మరికొందరు స్కిన్లెస్ తింటారు. చికెన్ స్కిన్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుందని దీన్ని పక్కన పెడతారు. నిజానికి చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో మూడింట రెండొంతులు మంచి కొవ్వు, మరో వంతు చెడు కొవ్వు ఉంటుంది. మంచికొవ్వు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ను స్కిన్‌తోపాటు కలిపి తింటే దీనిలో ఉండే కొవ్వు వల్ల ఎక్కువ క్యాలరీలు అదనంగా శరీరంలోకి చేరతాయి. ఈ అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకూడదనుకుంటే చికెన్ నుంచి నుంచి స్కిన్‌ను వేరుచేసి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు.. వండేటప్పుడు చికెన్ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు తీసేస్తే మంచిదని సూచిస్తున్నారు.
చికెన్ మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?
షాప్ నుంచి చికెన్ తీసుకొచ్చాక చాలా మంది వండటానికి ఇంకా సమయం ఉంటే అది పాడవకుండా ఫ్రిజ్‌లో ఉంచుతారు. వండే ముందు దాన్ని బయటకు తీస్తారు. అయితే కొందరు ఇలా ఫ్రిజ్ నుంచి బయటకు తీసి చాలాసేపు బయట ఉంచి మళ్లీ ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాంసాన్ని వండిన తర్వాత మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని చెబుతున్నారు. వండిన తర్వాత అందులోని సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి.
పసుపు, గులాబీ రంగు చికెన్.. ఏది మంచిది?
కోడి మాంసం రంగు అనేది కోళ్లు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కోళ్లకు మొక్కజొన్నను.. మరికొన్నింటికి జొన్నలు, గోధుమలను ఆహారంగా పెడతారు. దీన్ని బట్టి వాటి మాంసం రంగు మారుతుంది. అయితే పోషకాలపరంగా చూస్తే పసుపు రంగులో ఉండే చికెన్, లేత గులాబీ రంగులో ఉండే చికెన్ మధ్య ఎలాంటి తేడాలు ఉండవన్నది నిపుణుల మాట. అందుకే ఏ రంగు చికెన్ తిన్నా ఒకేరకమైన పోషకాలు అందుతాయి.
వండే ముందు చికెన్ కడగకూడదా?
సాధారణంగా షాప్ నుంచి తీసుకురాగానే చికెన్‌ను కడుగుతుంటాం. ఆ తర్వాతే దాన్ని వండుతాం. కానీ ఇలా క్లీన్ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉందని బ్రిటన్‌కు చెందిన ‘ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ’ హెచ్చరిస్తోంది. పచ్చి మాంసాన్ని ట్యాప్ కింద కడిగేటప్పుడు దానిమీద ఉండే బ్యాక్టీరియా నీటి ద్వారా తుళ్లి ఇతర వంటపాత్రలు, మనం వేసుకున్న బట్టలు, మన చేతులపైకి చేరే అవకాశం ఉంటుంది. అలా ఆ నీరు తుళ్లిన పాత్రల్లో ఏదైనా ఆహారం తిన్నా, మాంసాన్ని కడిగిన చేతులతో ఏదైనా తిన్నా ఆ బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. సాధారణంగా పచ్చిమాంసంలో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ’క్యాంపిలోబ్యాక్టర్’ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులోకి చేరితే డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్‌ను కడగకుండా తగిన ఉష్ణోగ్రత వద్ద ఉండికించి వండుకొని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కడగడం తప్పనిసరి అనుకుంటే నీళ్లు తుళ్లకుండా కడగాలి. తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకున్నాకే ఇతర పాత్రలను, కూరగాయలు, ఆహార పదార్థాలను తాకాలి.
సరిగా ఉడకని చికెన్ తినొద్దు
ఎంతో ఇష్టంగా తినే చికెన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. దీన్ని శుభ్రం చేసేటప్పుడు, వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పచ్చి మాంసంలో కొన్నిరకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే సరిగ్గా ఉడకబెట్టని చికెన్‌ను తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఈ రకమైన చికెన్‌ను ఇతర ఆహారాలు, డ్రింకులతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ కావొచ్చు.
= పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు ఇతర ఆహారపదార్థాలతో కలపకుండా విడిగా ఉంచాలి.
= చికెన్ కట్ చేశాక చాపింగ్ బోర్డు, కత్తి, చికెన్ ఉంచిన పాత్రలను శుభ్రంగా కడగాలి.
= పచ్చి చికెన్‌ను తాకినా, వండినా ఆ తర్వాత చేతులను తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Are you eating chicken but know these things
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com