మామ చిత్రానికి అల్లుడి రీమేక్
1981 లో రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా “నెట్రి కాన్ ” ఇప్పుడు మరోసారి తెర కెక్కబోతోంది.ప్రఖ్యాత దర్శకుడు కె బాలచందర్ తన కవితాలయ బ్యానర్ ఫై ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దాన్ని తెలుగులో ముసలోడి దసరా పండుగ పేరుతొ అనువదించడం కూడా జరిగింది. కాగా ఇపుడా చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రజనీకాంత్ తండ్రిగా, కొడుకుగా డబుల్ రోల్ చేశారు.విశేషం ఏమిటంటే ఇదే సినిమాని 1992 లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రాజశేఖర్ హీరోగా అహంకారి పేరుతొ పునర్ నిర్మించడం జరిగింది. అంతేకాదు ఇదే కథాంశం ఆధారంగా చిరంజీవి హీరోగా అందరివాడు చిత్రం ,,అజయ్ ప్రధాన పాత్రలో దిక్కులు చూడకు రామయ్య అనే చిత్రాలు వచ్చాయి.
ఇక ఈ రీమేక్ చిత్రం లో కథానాయకిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ను తీసుకోవాలని ధనుష్ అనుకొంటున్నాడట.. అపట్లో ఒరిజినల్ వెర్షన్లో రజనీకాంత్ సరసన ఒక హీరోయిన్ గా నటించిన మేనక ఈ కీర్తి సురేష్ కి తల్లి కావడం విశేషం. ఇక ‘అసురన్, ఎన్నై నొక్కి పాయుమ్ తూటా , పటాస్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని దూకుడు మీదున్న ధనుష్ త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.
Remakes are safe bets
వచ్చే నెలలో జగన్ మంత్రివర్గంలో మార్పులు!
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం వచ్చే నెలలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనమండలి రద్దు ప్రతిపాదనతో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, పశు సంవర్థకశాక మంత్రి మోపిదేవి వెంకటరమణ లను రాజ్యసభకు పంపుతున్నారు. వారిద్దరి స్థానంలో ఇతరులను తీసుకోవడంతో పాటు, కొందరు సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించగలరని తెలుస్తున్నది.
రెండన్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ తొలుత చెప్పిన మాటలకు భిన్నంగా సాధ్యమైనంత త్వరగా కేబినెట్‌లోకి కొత్త ముఖాలను తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన తప్పదంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికితోడు స్థానిక సంస్థాల ఎన్నికల్లో ఓటమి చెందితే అందుకు బాధ్యులుగా ఉన్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించడం తెలిసిందే.
తొలి మంత్రి వర్గ విస్తరణలో జగన్ అనేకమంది సీనియర్ నేతలను జగన్ పక్కన పెట్టారు. ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల లెక్కలతో కొందరికీ తొలి విస్తరణలో చోటు దక్కలేదు. పార్టీ కోసం కష్టపడ్డవారికి కూడా జగన్ ఇవ్వలేకపోయారు. దానితో పాటు ప్రస్తుత మంత్రులు పలువురి పనితీరు సంతృప్తికరంగా లేదని, వారు పార్టీలో అందరిని కలుపుకు వెళ్లలేక పోతున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు రాబోయే రోజులలో ప్రజలలో ప్రభుత్వంపై ఈ వ్యతిరేకత పెరిగితే ఎదుర్కోవడానికి సీనియర్లకు అవకాశం ఇవ్వాల్వసిందే అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖపట్నం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్, పశ్చిమగోదావరి నుంచి గ్రంధిశ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, గుంటూరు జిల్లా నుంచి చిలకలూరిపేల ఎమ్మెల్యే విడదల రజని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోటాలో మరోకరికి మంత్రి పదవి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హైకోర్టులో సవాల్ చేసిన అశోక్ గజపతిరాజు
మహరాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టు చైర్మన్‌గా సంచయితను నియమించడంతో పాటు.. మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన ఆ రెండు జీవోల అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ మంగళవారం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విజయనగరంలో తమ తాత అలక్ నారాయణ్ గజపతి పేరుతో 1958లో స్థాపితమైన ట్రస్టుకు తమ తండ్రి పీవీజీ రాజు, సోదరుడు ఆనందగజపతిరాజు చైర్మన్లుగా వ్యవహరించారని, ఈ ట్రస్టుకు చైర్మన్ లేదా ప్రెసిడెంట్‌గా కుటుంబంలో పెద్దవాడైన పురుష వారసుడే ఉండాలని ట్రస్టు దస్తావేజుల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
అదే విధంగా సొసైటీ ప్రెసిడెంట్ మాత్రమే కౌన్సిల్/బోర్డుకు ఇద్దరు స్వతంత్ర సభ్యులను, వ్యవస్థాపక కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను నామినేట్ చేయగలరని పేర్కొన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం ఈ నిబంధనలన్నీ రిజిస్టరై ఉన్నాయని తెలిపారు. ఆ నిబంధనల మేరకు 2016 వరకు ఆనందగజపతిరాజు చైర్మన్‌గా వ్యవహరించారని.. ఆయన మరణానంతరం వారసుల్లో పెద్దవాడినైన తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని.. ఇందుకు ప్రభుత్వ సమ్మతి కూడా ఉందని వెల్లడించారు.
చైర్మన్‌గా నిబంధనల మేరకు ఇద్దరు సభ్యులను ట్రస్టుకు నామినేట్ చేశానని తెలిపారు. ఈ నేపథ్యంలో గత 3వ తేదీన రాష్ట్ర రెవెన్యూ (దేవాదాయ-2) శాఖ మాన్సాస్ ట్రస్టుకు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ముగ్గురిని నియమిస్తూ జీవో 73, చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ జీవో 74ని జారీ చేసిందని తెలిపారు. ట్రస్టు నిర్వహణ కోసం రొటేషన్ విధానంలో సంచయితను చైర్మన్‌గా నియమించినట్లు అందులో పేర్కొన్నారని.. ట్రస్టు బైలాలో ‘రొటేషన్’ పదమే లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మాన్సాస్ చైర్మన్‌గా తమ కుటుంబంలో పెద్దవాడైన పురుష వారసుడు ఉండాలని ట్రస్టు నిబంధనలు చెబుతుండగా, ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని.. ట్రస్టు దస్తావేజులకు విరుద్ధంగా వ్యవహరించడానికి దానికి ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. ట్రస్టు కరస్పాండెంట్ నియామకం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 2006లో న్యాయస్థానం సైతం స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పూనుకుందని.. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. తన పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు.
సింధియా బాటలో పలువురు కాంగ్రెస్ నేతలు!
కాంగ్రెస్ నుండి నిష్క్రమించి బీజేపీలో చేరుతున్న జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా రాజస్థాన్, మహారాష్ట్రాలలోని ప్రభుత్వాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింధియాకు సన్నిహితుడైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హర్యానా యువ నాయకుడు దీపేందర్ సింగ్ హుడ్డా, మహారాష్ట్ర యువ నాయకుడు మిలింద్ దేవరా తదితర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. వీరంతా కుడా రాహుల్ గాంధీ కి సన్నిహితులు కావడం గమనార్హం. ఈ పరిణామాలు కాంగ్రెస్ లో కలవరాన్ని కలిగిస్తున్నాయి.
ఇదిలాఉండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా సింధియా రాజీనామాపై స్పందించక పోవడం గమనార్హం. సుమారు రెండు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న తనను పార్టీలో అవమానాలు జరుగుతూ ఉండడంతో అసంతృప్తిగా ఉన్నా సోనియా, రాహుల్ పట్టించుకొనక పోవడం పట్ల సింధియా ఆగ్రహంతోనే పార్టీని విడిచారని ప్రచారం జరుగుతున్నది.
వీరి బాటలోనే మహారాష్ట్రలోని శివసేనకు చెందిన పలువురు ఎమ్యెల్యేలు సహితం బిజెపి నాయకులతో సంప్రదింపులతో ఉన్నట్లు చెబుతున్నారు.
పట్టువదలని విక్రమార్కుడు కమల్ హాసన్
చిత్ర రంగంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనుకోని వడుదుడుకులు , అవాంతరాలు ఇక్కడ సహజం. అందుకే ఇక్కడ ఓడలు బండ్లు అవుతాయి. వాటిని అన్నింటిని తట్టుకొని నిలబడిన వాడే చిత్ర రంగంలో హీరో అవుతాడు. ఇపుడు కమల్ హాసన్ పరిస్థితి కూడా అదే. ఊహించని సంక్షోభం లో ఆయన కెరీర్ ఊగిసలాడుతోంది. ఈ మధ్యనే భారీ వ్యయ ప్రయాసలకు ఓర్చి భారతీయుడు సీక్వెల్ సినిమా ఆరంభిస్తే అదికాస్తా ఆగిపోయింది. షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు సాంకేతిక నిపుణులు చనిపోవడం జరిగిది.దాంతో యూనిట్ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అలా ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఐనా గాని కమల్ హాసన్ అధైర్య పడకుండా మరో రెండు సీక్వెల్స్ కి శ్రీకారం చుట్ట బోతున్నాడు.
1992. అక్టోబర్ 25 న విడుదలై ఘన విజయం సాదించిన కమల్ హాసన్ చిత్రం తేవర్ మగన్ {తెలుగులో క్షత్రియ పుత్రుడు } ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దాన్ని నిర్మిస్తుంది మరెవరో కాదు సాక్షాత్తు ఆ చిత్ర కథానాయకుడు కమల్ హాసనే. తలైవన్ ఇరుక్కిన్ డ్రాన్ పేరుతొ తెరకెక్క బోతున్న ఈ చిత్రం ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్సకత్వంలో సంగీత సొగసులు అద్దుకో బోతోంది. ఇక ఈ చిత్రం తో పాటు మరో చిత్రం కూడా సీక్వెల్ గా రూపొంద బోతోంది.
2006 వ సంవత్సరం లో కమల్ హాసన్ , కమలిని ముఖర్జీ జంటగా నిర్మించబడి సూపర్ హిట్ అయిన వెట్టై యాడు విలయాడు (తెలుగులో రాఘవన్ ) చిత్రం ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ గత చిత్ర నిర్మాత ఇసారి గణేష్ నేతృత్వం లోనే నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణానికి కూడా కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెల్సింది.
Confidence is strength
నానీ సినిమాకి ఖరీదైన కథ
తన గత చిత్రం గ్యాంగ్ లీడర్ తో ఊహించని పరాజయం చవి చూసిన ఇక ముందు చేయబోయే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. .నేచురల్ స్టార్ నాని ఫిబ్రవరి 25 న ” వి “చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు..ఇటీవల విడుదలైన టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇక ఈ చిత్రం తర్వాత నాని…టక్ జగదీష్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది.నిన్నుకోరి చిత్రం మంచి విజయం అందుకొన్న నేపధ్యం లో టక్ జగదీష్ చిత్రం ఫై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం చేస్తూనే నాని మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసాడు.
గతంలో విజయ్ దేవరకొండతో “టాక్సీవాలా”’ వంటి థ్రిల్లర్ చిత్రం తీసి హిట్ కొట్టిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ఇదిలావుంటే ఈ చిత్రం కథని నాని 50 లక్షలకి కొనుగోలు చేసాడని తెలుస్తోంది.ఓ ఆడియో కంపెనీకి చెందిన వ్యక్తి దగ్గర నాని ఈ కథని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కొనుగోలు చేసిన కథే అయినా మార్పులు అవసరమని నాని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ పలు జాగ్రత్తలు సూచించాడట… ఏది ఏమైనా కథల విషయంలో నాని తీసుకొంటున్న జాగ్రత్తలు నానికి మరిన్ని విజయాలు తెచ్చి స్టార్ గా నిలబెట్టడం
ఖాయం అనిపిస్తోంది.
Sweet are the uses of adversity
ఐపీఎల్ కు కరోనా వైరస్ గండం!
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆటలకు వచ్చి చూసే ప్రజల సంఖ్య తగ్గిపోతే, ఆదాయం గణనీయంగా పడిపోతుందని కలవరం చెందుతున్నారు.
మరోవంక, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ హోమ్‌గ్రౌండ్ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు సమాచారం. లీగ్‌ను వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్
ఉద్యోగికి కరోనా సోకిందని ఇటీవలే గుర్తించారు. అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తి దాదాపు 2,666 మందిని తాకినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో, బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉన్న ప్రదేశాల్లోని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి రాష్ట్ర సర్కారు స్పష్టం చేసిందని బెంగళూరులోని దిగ్విజన్ 24/7 అనే టీవీ చానల్ కథనం ప్రసారం చేసింది. దాంతో, బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ట్రైలర్ తోనే సినిమా చూపించిన ‘ప్రేమపిపాసి’
‘ప్రేమపిపాసి’(Searching for True Love) మూవీ ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ మొత్తం బోల్డ్ కంటెంట్.. ముద్దు సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా కన్పిస్తాయి. వీటితోనే యువతను సినిమా థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తుంది చిత్రయూనిట్. ‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్స్-100’ మూవీ తరహాలో మాదిరిగానే బోల్డ్ కంటెంట్ తో ‘ప్రేమపిపాసి’ మూవీ రాబోతుంది.
‘ప్రేమపిపాసి’ మూవీలో జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీవర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మురళీ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎస్.రామకృష్ణ (ఆర్కే) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ స్కూల్ ఏజ్ నుంచి టీనేజ్ వరకు ఓ యువకుడు పలువురు అమ్మాయిలతో ప్రేమలో పడతాడని తెలిపాడు. ఆ యువకుడు నిజాయితీగా ప్రేమిస్తాడు కానీ అమ్మాయిలు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా చూపించామంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో మొత్తంగా 12 లిప్ లాక్స్ సీన్లు ఉన్నాయని.. కథ డిమాండ్ చేయడంతోనే బోల్డ్‌గా తీశామని చెప్పాడు. తమ హీరోకి బెస్ట్ లిప్ కిస్సర్ అవార్డ్ ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే స్టోరీ, కామెడీ చక్కగా కుదిరాయని తెలిపారు. వందకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రం మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీ హిట్టు తర్వాత టాలీవుడ్లో ఇలాంటి ట్రెండ్ బాగా పెరిగిపోయింది. లవ్ స్టోరీల పేరుతో ‘ఏ’ గ్రేడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్లో మూవీలు తెరకెక్కుతుండటం శోచనీయంగా మారింది.
‘లవ్ స్టోరీ’ మూవీ హోలీ పోస్టర్..

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. ఈ సినిమాని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ కు మంచి ఆదరణ లభించింది. “ఏయ్ పిల్లా” ఫుల్ లిరికర్ వీడియోను మర్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. హోలీ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది టీం. ఇందులో బైక్ మీద కూర్చున్న హీరో నాగ చైతన్య తో హీరోయిన్ సాయి పల్లవి ఎదో టీజ్ చేస్తున్నట్టుగా ఉన్న తీరు క్యూట్ గా ఉంది. సోషల్ మీడియా లో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న లవ్ స్టొరీ ఈ వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కరోనా భయంతో కేరళలో పాఠశాలలు, సినిమాలు బంద్
దేశంలోని మొదటిసారిగా కరోనాకు ముగ్గురి గురయిన కేరళ రాష్ట్రం ఇప్పుడు ఈ వైరస్ తో కలవరం చెందుతున్నది. తమ రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిందని చెప్పారు.
దానితో, ఈ నెల 31వ తేదీ వరకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తరగతులు, పరీక్షలను నిర్వహించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అన్ని ట్యూషన్ క్లాసులు, అంగన్వాడీలు, మదర్సాలను ఈ నెల 31వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
బెంగళూరులో సహితం ఐదవ తరగతుల వరకు పాఠశాలలకు నిరవధికంగా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. రేపటి నుండి మార్చి 31 వరకు కేరళలో సినిమా థియేటర్లు మూసివేయబడతాయని మళయాళం సిినిమా ఆర్గనైజేషన్ తెలిపింది. కరోనా ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ఇదిలా ఉండగా మంగళవారం దేశంలో కొత్తగా 9 కరోనా కేసులు బైట పడడంతో దేశం మొత్తం మీద కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 56 కి చేరింది. పూణేకు చెందిన ఒక జంట వైరస్ టెస్ట్ లు చేయగా వారిద్దరికి ..పాజిటివ్ కేసు నమోదైంది. మహారాష్ట్రలో నమోదైన మొదటి కేసులివి. వీరిద్దరూ అంతకుముందు దుబాయ్ లో ఉండి ఇండియాకు వచ్చినట్టు తెలిసింది. వారు ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉన్నారు.
ముకేశ్ అంబానీ ఇక ఆసియాలో మొదటి సంపన్నుడు కాదు!
సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు పోరాటం ప్రారంభమై చమురు ధరలు పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదాను కోల్పోయారు. గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరోనా భయానికి రష్యా-సౌదీఅరేబియాల చమురు ప్రతిష్టంభన తోడవడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.
దీంతో చమురు ఆధారిత కంపెనీల షేర్లు అసాధారణ స్థాయిలో పతనమయ్యాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర సోమవారం నాడు భారీగా (12 శాతం) పతనమవడంతో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సంపదలో దాదాపు రూ 42,000 వేల కోట్లు తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో.. ఇప్పటివరకూ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన ఈ స్థానాన్ని అలీబాబా సంస్థ అధినేత జాక్‌మాకు కోల్పోవాల్సి వచ్చింది.
అలీబాబా సంస్థకు చమురు రంగంతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో తాజా తుఫానును జాక్‌మా కొంత మేర తట్టుకోగలిగారు. అయితే 2021 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కున్న నికర అప్పులను సున్నాకు చేర్చాలేది అంబానీ లక్ష్యం కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది.
రిలయన్స్ చమురు సంస్థల్లో కొంత వాటాను సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద చమురు రంగ సంస్థ ఆరామ్‌కోకు విక్రయించడంపైనే అంబానీ లక్ష్యం ఆధారపడి ఉంది. కానీ తాజా పరిణామాలతో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో అంబానీకి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.





కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా కరోనానే. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.









మిల్కీ బ్యూటీ తమన్నా సీనిరంగానికి వచ్చి ఇటీవల 15ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తమన్నా నటించి మెప్పింది. తమన్నాకు కుర్రకారులో భారీ క్రేజీ ఉంది. ఆమె గ్లామర్, నటన, డాన్సులకు యువత పిచ్చెక్కిపోతున్నారు. తెరపై తమన్నా కనిపిస్తే చాలు కళ్లర్పకుండా చూస్తుండిపోతున్నారు. హీరోలకు ధీటుగా తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఈ 15ఏళ్ల కెరీర్లో ఎన్నో మరుపురాని హిట్లను మిల్కి బ్యూటీ తన ఖాతాలో వేసుకుంది.
‘మీటూ’ పై కియారా అద్వానీ హాట్ కామెంట్
బాలీవుడ్లో తనుశ్రీ దత్త ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికారు. ఆ తర్వాత ఒక్కొక్కరు తాము సీనీ రంగంలో ఎదుర్కొన్న లైంగిక వైధింపులపై పెదవివిప్పారు.ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ‘మీటూ’పై స్పందించారు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. మహిళలతో దర్శకులు, హీరోలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కాజోల్ వ్యాఖ్యానించింది.
తాజాగా హాట్ బ్యూటీ కియారా అడ్వాణీ ‘మీటూ’పై స్పందించారు. ‘మీటూ’ వల్ల పెద్ద మార్పు ఏమి జరుగలేదని చెప్పింది. ‘మీటూ’ వల్ల ప్రపంచమేమీ మారిపోలేదని పేర్కొంది. మహిళలంతా ‘మీటూ’ తర్వాతి దశకు చేరుకోలేదని.. దీని ఫలితం ఇంకా రాలేదని కియారా వ్యాఖ్యానించింది. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీతో కియారా అడ్వాణీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే రాంచరణ్ కు జోడీగా ‘వినయవిధేయరామ’ మూవీలో నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.