Home Blog Page 8513

ఇక అన్ని సినిమాలు హైదరాబాద్ లోనే


కరోనా లాక్ డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ అస్తవ్యస్తంగా తయారైంది. తారల కాల్ షీట్స్ దగ్గర నుంచి షూటింగ్ షెడ్యూల్స్ దాకా అన్నీ గందరగోళం లో పడ్డాయి. ఇంకా చెప్పాలంటే సినీ రంగం దిక్కు తోచని స్థితిలో ఉంది. అలాగే అవుట్ డోర్ షూటింగ్ సగం ,సగం అయిన వారి పరిస్థితి మరీ దారుణం గా ఉంది షూటింగ్ సగంలో ఆగిపోయిన సినిమాలకు తారల డేట్స్ వేస్ట్ అవ్వడం వలన రెడ్డొచ్చి మొదలెట్టినట్టు అయ్యింది. హైదరాబాద్ దాటి బయట షూటింగ్ చేయాల్సిన సినిమాలకు ఇపుడు చెప్పనలవి కానీ కస్టాలు వచ్చాయి. కథ తో ముడి పడి ఉన్న అవుట్ డోర్ లొకేషన్ లలో ఇపుడు షూటింగ్ చేయలేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆ క్రమంలో పలు సినిమాలు కధలో మార్పులు చేసుకోవడం తో పాటు ,బాలన్స్ ఉన్న అవుట్ డోర్ వర్క్ ని ఇక్కడే హైదరాబాద్ లో సెట్స్ వేసి ఫినిష్ చేయాలని నిశ్చయించు కొన్నాయి .

నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందే ఒక చిత్రానికి ఇండియా లో సగం , అమెరికాలో సగం షూటింగ్ జరపాల్సి ఉండగా, ఇపుడు అమెరికా షెడ్యూలు క్యాన్సల్ చేసుకొని కథను మార్చి హైదరాబాద్ లోనే షూటింగ్ చేయబోతున్నారు. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా రూపొందే ఫైటర్ సినిమా కూడా ఇపుడు హైదరాబాద్ కి షిఫ్ట్ కాబోతుంది. ముంబై లోని ధారావి ప్రాంతంలో కొంతవరకు షూటింగ్ చేసిన ` ఫైటర్ ` సినిమాని ఇపుడు మారిన పరిస్థితుల వల్ల హైదరాబాద్ లోనే ధారావి సెట్స్ వేసి పూర్తి చేయబోతున్నారు అదే క్రమంలో ఇంకా షూటింగ్ మొదలుకాని పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబో చిత్రం కూడా జార్జియా లో షూటింగ్ చేద్దాం అనుకోని ఇపుడు హైదరాబాద్ లోనే చేయబోతున్నారు .

ఆ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకొంది. కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. లాక్ డౌన్ ముగియగానే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేయబోతున్నారు. ఇంకా ఎన్ని సినిమాలు తమ షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకొని హైదరాబాద్ లో ఫినిష్ చేస్తోరో .తొందర్లోనే తెలుస్తుంది .

పరీక్షలే జరుపకుండా కరోనా తగ్గింది అంటున్న తెలంగాణ


తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదన్నది మాత్రం నిజం. అయితే తప్పుడు అంకెలతో మొత్తం పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడం కోసం ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక బహిరంగ లేఖలో ప్రభుత్వ ఎత్తుగడను ఎండగట్టింది.

పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చుకొంటే తెలంగాణలో ఏదో దాస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పేర్కొన్నది. రాష్ట్రలో కోవిద్ టెస్ట్ లను గణనీయంగా పెంచడం ద్వారా మాత్రమే వైరస్ ఏ మేరకు వ్యాపించిందో వెల్లడి కావడానికి దారితీయగలదని స్పష్టం చేసింది.

చాలా కాలం వరకు తెలంగాణ కన్నా బాగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కేసుల విషయంలో చాలా ముందుకు వెళ్ళడానికి అక్కడ పరీక్షలు ఎక్కువ జరగడమే కారణం కావడం గమనార్హం. ఏపీలో ఇప్పుడు ఈ సంఖ్యా 1177కు వెళ్లగా, తెలంగాణలో మాత్రం ఇప్పుడు 1000 దాటడం గమనార్హం.

తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జరిగిన పరీక్షలతో పోల్చుకొంటే వైరస్ సోకినా వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఏపీలో 1.66 శాతం మాత్రమే ఉంటె, తెలంగాణలో మాత్రం 5.35 శాతంగా ఉన్నది. అంటే తెలంగాణలో వైరస్ ఏపీలో కన్నా 3.2 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

అందుకు కారణం జరుపుతున్న టెస్టులు మాత్రమే. ఏపీలో 62 వేలకు పైగా టెస్ట్ లు జరిపితే, తెలంగాణలో 20 వేలకు లోపుగానే జరిపారు. అంటే మూడోవంతకన్నా తక్కువగా టెస్ట్ లు ఇక్కడ జరుగుతున్నాయి. అందుకనే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు చూపగలుతున్నారు.

తెలంగాణలో కేసులు తక్కువగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలను జెఎసి తెలిపింది. అవి తక్కువగా టెస్ట్ లు ఉండడం, ఆసుపత్రులలో మృతి చెందుతున్న వారిని కరోనా మృతులుగా గమనించక పోవడం. పాజిటివ్ కేసుల సెకండరీ కాంటాక్ట్ లకు టెస్ట్ లు జరుపవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం.

వైరస్ ఉధృతిని కప్పిపుచ్చడం ద్వారా దీనిని కట్టడి చేయలేమని, కేవలం విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారానే సాధ్యం కాగడాలని టిజెఎసి స్పష్టం చేసింది. కేసులు తక్కువ అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ధ్వజమెత్తింది. వేలసంఖ్యలో టెస్ట్ లు జరపడం ద్వారానే ఈ వైరస్ మహమ్మారిని అంతమొందించ గలమని వెల్లడించింది. .

అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాగలదు.

నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు


ప్రత్యేక తెలంగాణే సాధనగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ తో టీఆర్ఎస్ 20ఏళ్ల ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. సోమవారం టీఆర్ఎస్ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళ్లర్పించారు. అనంతరం టీఆర్ఎస్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే.కేశవరావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. నేతలంతారూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించారు.

టీఆర్ఎస్ ప్రస్థానం.. ప్రత్యేక రాష్టం ఏర్పాటు..
2001 ఏప్రిల్‌ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి వారం రోజుల్లోనే ఆయన పార్టీ ప్రకటించారు. తదనంతరం అన్నివర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001 మే 17న తెలంగాణ ‘సింహగర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని నాడు కేసీఆర్ ప్రకటించారు. నాటి నుంచి కేసీఆర్ తనదైన రాజకీయ చతురతతో ముందుకెళ్లారు.

2009 నవంబర్ 29న ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ఉద్యమంలో కీలక మలుపు తీసుకుంది. 2009 డిసెంబర్‌ 9న నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాల ఆంధ్రా ప్రాంత నాయకులు పలు అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగింది. లోక్‌సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మార్చి 1న తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజిట్‌లో 2014 జూన్‌ 2 ‘అపాయింటెడ్‌ డే’ గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.

మారుతి కొత్త సినిమాకి కథ రెడీ


‘ఈ రోజుల్లో’ వంటి చిన్న చిత్రం తో కెరీర్ ఆరంభించి నేడు హిట్ డైరెక్టర్ల లిస్ట్ లో ఒకడిగా పేరు సంపాదించు కొన్న మారుతి తన కొత్త చిత్రానికి కథ రెడీ చేసాడంట …మతిమరుపు , ఓ సి డి (అటు శుభ్రత) వంటి లోపాలను కథలో మెయిన్ పాయింట్ గా తీసుకొని వాటికి కామెడీ , ఎమోషన్స్ జోడించి చక్కని సినిమా తీయడం లో మారుతి సిద్ద హస్తుడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ” భలే భలే మగాడివోయ్, మహానుభావుడు ” చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఇక గత డిసెంబర్ లో విడుదల అయిన ” ప్రతిరోజూ పండగే ” మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ తీయడం జరిగింది. సాయి (ధరమ్) తేజ్, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలై అతిపెద్ద విజయం సాధించింది.

కాగా దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రానికి కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ కథనే సిద్ధం చేస్తున్నాడట. “ప్రతిరోజూ పండగే ‘ చిత్రంలో మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తి తన చివరి రోజులను సెలెబ్రేట్ చేసుకోవాలని చెప్పిన మారుతీ ఈ సారి ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యం తెలిపేలా కథ రెడీ చేస్తున్నాడట… కాగా ఈ చిత్రాన్ని కూడా “ప్రతిరోజూ పండగే ” చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ మరియు G A 2 బ్యానర్ వారే సంయుక్తంగా నిర్మించ బోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ ని దృష్టిలో ఉంచుకొని మారుతి రాసినట్టుగా తెలుస్తోంది .

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం భారత్ వైపు ప్రపంచం


నేడు ప్రపంచంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ నుండి విముక్తి కోసం వాక్సిన్ తయారు చేయడం కోసం పలు దేశాలలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా దేశాలు ఈ దిశలో ముందంజలో ఉన్నాయి. అయితే ప్రపంచం మాత్రం ఈ విషయమై భారత్ వైపు చూస్తున్నది.

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు విజయవంతమైతే, వచ్చే అక్టోబర్‌ నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

జ‌న‌రిక్ డ్ర‌గ్స్‌, వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేయ‌డంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉన్నది. మరోవంక ప్ర‌పంచంలో అత్య‌ధిక స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది కూడా మనమే. ప్ర‌స్తుతం కోవిడ్‌19 వ్యాధి కోసం వ్యాక్సిన్ త‌యారీ చేసేందుకు సుమారు అర‌డ‌జ‌ను కంపెనీలు భారత్ లో కృషి చేస్తున్నాయి.

దీంట్లో సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌ధాన‌మైంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక వ్యాక్సిన్లు త‌యారు చేసేది ఈ కంపెనీయే. డోసుల ఉత్ప‌త్తి, వాటి అమ్మ‌కాల ఆధారంగా ఈ విష‌యాన్ని చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు చూస్తుంటే, ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యాక్సిన్ డోస్‌లు అవ‌స‌రం కాగా ఈ సంస్థకు సుమారు 500 మిలియ‌న్ల డోస్‌లు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ది.

మరోవంక, భార‌త్‌, అమెరికా కూడా క‌లిసి వ్యాక్సిన్ అభివృద్ధిపై ప‌నిచేస్తున్న‌ట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో ప్రకటించపారు. గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి రెండు దేశాలు వివిధ వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయని చెప్పారు. డెంగ్యూ, ఎంట్రిక్ డిసీజెస్‌, ఇన్‌ఫ్లూయాంజా, టీబీ లాంటి వాటికి వ్యాక్సిన్లు త‌యారు చేశారు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్‌కు మాత్రం ట్ర‌య‌ల్స్ చేయాల్సి ఉంది.

53 ఏళ్ల కంపెనీ సీర‌మ్ ఇన్సటిట్యూట్ ప్ర‌తి ఏడాది 1.5 బిలియ‌న్ల వ్యాక్సిన్ డోస్‌ల‌ను త‌యారు చేస్తుంది. పుణెలో ఆ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు నెద‌ర్లాండ్స్‌, చెక్ రిప‌బ్లిక్‌లో చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు ఏడు వేల మంది ప‌నిచేస్తున్నారు.

165 దేశాల‌కు ఈ కంపెనీ సుమారు 20 టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ప్రపంచంలోనే చాలా తక్కువ ధరకు 80 శాతం వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ప్ర‌స్తుతం సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ కంపెనీ.. అమెరికాకు చెందిన కోడాజెన‌క్స్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌ర్చుకున్న‌ది.

ఇద్ద‌రూ క‌లిసి లైవ్ అట్యునేటెడ్ వాక్సిన్‌ను త‌యారు చేస్తున్నారు. దీంతో వైర‌స్‌ను పూర్తిగా చంప‌లేక‌పోయినా.. దాని హాని‌క‌ర ల‌క్ష‌ణాల‌ను మాత్రం చంపేయ‌గ‌ల‌దు. ఏప్రిల్‌లో జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సీరమ్ కంపెనీ సీఈవో తెలిపారు.

మరోవంక, హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా అమెరికాలోని విస్కాన్‌సిన్ మాడిస‌న్ వ‌ర్సిటీతో లింకు పెట్టుకున్న‌ది. ఫ్లూజెన్ కంపెనీతో జ‌త‌క‌లిసి సుమారు 300 మిలియ‌న్ల డోస్‌లు త‌యారు చేస్తున్నారు. జైడ‌స్ క్యాడిల్లా సంస్థ రెండు వ్యాక్సిన్ల‌పై వ‌ర్క్ చేస్తున్న‌ది.

బ‌యోలాజిక‌ల్ ఈ, ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్‌, మిన్‌వాక్స్ సంస్థ‌లు కూడా వ్యాక్సిన్అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిపై భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ భార‌తీయ ఫార్మ‌సీ కంపెనీల‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కొనియాడారు.

కరోనా వైరస్ లో దేశంలో 7 స్థానంలో హైదరాబాద్!


కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంతగా తాపత్రయ పడుతున్నా మిత్ర పక్షం ఎంఐఎం నుండి వస్తున్న రాజకీయ వత్తిడులకు తల వంచక తప్పక పోవడంతో వైరస్ ఉధృతిలో హైదరాబాద్ నగరం నేడు జాతీయ స్థాయిలో పేరొందుతున్నది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్‌ 10 జిల్లాల్లో హైదరాబాద్‌ 7 స్థానంలో ఉంది.

శుక్రవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 2.7 శాతం హైదరాబాద్‌కు చెందినవే ఉన్నాయి. కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉన్న 27 జిల్లాల వివరాలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెల్లడైనది.

దేశవ్యాప్తంగా ముంబైలో 13.8 శాతం, ఢిల్లీలో 11.6 శాతం, అహ్మదాబాద్‌లో 7.7, ఇండోర్‌‌ 4.5, జైపూర్‌‌ 3.8, పుణెలో 3.5, హైదరాబాద్‌ 2.7, సూరత్ 2.2, థానేలో 2 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్, టెస్టింగ్ ద్వారా ఈ జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేయాల్సి ఉందని తెలిపారు.

ఇక తెలంగాణలోని కరోనా కేసుల్లో 55.9 శాతం హైదరాబాద్‌‌లోనే ఉన్నాయని అమితాబ్‌‌ కాంత్‌‌ పేర్కొన్నారు. మొత్తం 1001 కేసుల్లో దాదాపు 570 కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. ఆదివారం తెలంగాణలో నమోదైన 11 కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా హైదరాబాద్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ లాక్‌‌డౌన్ ఉల్లంఘనలు జరుగుతుండడంతో ఓ బృందాన్ని పరిశీలన కోసం పంపింది. పాతబస్తీలోని హాట్ స్పాట్ లలో కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యువకులు, చివరకు వైరస్ ప్రభావం గల వారు సహితం సవైరవిహారం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది.

100 మందికి పైగా ఆరోగ్య అధికారులకే వైరస్ !


ఒక విధంగా మొన్నటి వరకు రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు కరోనా కట్టడిలో కీలక భూమిక వహించవలసిన ఆరోగ్య శాఖ స్వయంగా ఈ వైరస్ కాటుకు గురవుతున్నది. దానితో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

నలుగురు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులతో పాటు వంద మందికి పైగా సిబ్బందికి ఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఖంగారు పడుతున్నారు. ఇంతకు ఈ వైరస్ ఆ శాఖలో ఎవ్వరి నుండి ఎవ్వరికీ వ్యాపించిందో తెలుసుకోలేక తికమక పడుతున్నారు.

ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి పల్లవి జైన్ తో పాటు ఈ శాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, భద్రతా విభాగ అధికారిలు కూడా వైరస్ కు గురయ్యారు. ఇక దిగువ స్థాయి ఉద్యోగులతో కలుపుకొని మొత్తం వందమందికి పైగా వైరస్ కు గురయ్యారు.

మొదట అందరు పల్లవి జోషి ద్వారానే ఈ వైరస్ అందరికి వ్యాపించినట్లు భావించారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా ఆమెపై సీరియస్ అయింది. అమెరికాలో చదువుతున్న ఆమె కుమారుడు జనవరి మధ్యలో తిరిగి వచ్చి, ఆమెతోనే ఉండడంతో అతని ద్వారా ఆమెకు, ఆమె ద్వారా మిగిలిన వారికి వ్యాపించి ఉండవచ్చని అనుమానించారు.

అయితే రెండు సార్లు టెస్ట్ జరిపినా అతనికి నెగిటివ్ అని రావడంతో అతని ద్వారా వైరస్ వ్యాపించలేదని స్పష్టమైనది. ఇప్పుడు ఎలా వచ్చిదో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. కొందరు ఫైల్స్ ద్వారా వ్యాపించి ఉండవచ్చని అనుకొంటుంటే, మరి కొందరు కరోనా కంట్రోల్ రూమ్ నుండి అందరికి వ్యాపించి ఉండవచ్చని కధనాలు వ్యాప్తి చేస్తున్నారు.

అమిత్ షా మౌనం వ్యూహాత్మకమేనా!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే అక్కడ మూడు రోజులపాటు అల్లర్లు జరగడం, పోలీసులు ఆ సమయంలో ప్రేక్షక పాత్ర వహించడం జరిగినప్పటి నుండి బీజేపీలో, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యంత బలవంతుడిగా భావిస్తున్న హోమ్ మంత్రి అమిత్ షా ప్రాబల్యం మసకబారినట్లు అనిపిస్తున్నది. ప్రభుత్వంలో ఆయన అప్పటి నుండి ప్రముఖంగా కనిపించడం లేదు.

లాక్ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరా సక్రమంగా జరిగేటట్లు చేయడం కోసం గత నెలలో ఏర్పాటు చేసిన 15 మంత్రులతో కూడిన అత్యున్నత కమిటీకి రాష్ట్రాల వ్యవహారాలు చూసే అమిత్ షా నాయకత్వం వహించాలి. కానీ రక్షణ మంత్రి నాయకత్వం వహించడం, ఆ కమిటీలో అమిత్ షా దాదాపు ప్రేక్షక పాత్ర వహించడం చాలామందికి ఆయనను పక్కన పెట్టారనే అనుమానాలు కలగడానికి దారితీసింది.

అయితే ప్రభుత్వాన్ని, బిజెపిని ఏకపక్షంగా నడిపిస్తున్న మోదీ, అమిత్ షాల మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని, ఇప్పటికి వారిద్దరూ ఒక జట్టుగానే, ఉమ్మడిగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తున్నది. కేవలం వ్యూహాత్మకంగా ప్రస్తుతం అమిత్ షా తెరపైకి ఎక్కువగా కనిపించడం లేదని చెబుతున్నారు.

కరోనా పై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. క్షేత్ర స్థాయిలో నిజమైన పోరాటం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాస్తవానికి కేంద్రం ఆలస్యంగా మేల్కొన్నది. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్రాలు భారీగా వనరులు సమీకరిస్తున్నాయి.

ఈ సందర్భంగా కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘర్ వంటి పలు ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సామరస్యంగా వ్యవహరింపనిదే కరోనా విషయంలో కేంద్రం ఏమీ చేయలేదని ప్రధానికి తెలుసు.

కానీ బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిర పరచడంలో, వారికి అడ్డంకులు సృష్టించడంలో అమిత్ షా పేరొందారు. ఆయన సారధ్యంలో లాక్ డౌన్ అమలు జరిగితే రాష్ట్రాలతో ఘర్షణలకు తెరలేపినట్లు కాగలదని వెనుకడుగు వేసిన్నట్లు వెల్లడి అవుతున్నది. అందుకనే వ్యూహాత్కామగా ఇప్పుడు అమిత్ షా ను పక్కన ఉంచినట్లు తెలుస్తున్నది.

అయితే అమిత్ షా ప్రాధాన్యతను తెలియచెప్పడం కోసం ప్రధాని ఏప్రిల్ 11న ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో తొలుత కొన్ని మాటలు మాట్లాడు మాట్లాడిన తర్వాత అమిత్ షా తో మోడరేట్ చేయించారు. అంతకు ముందు మార్చ్ 20, ఏప్రిల్ 2 లలో ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లలో అమిత్ షా దాదాపు ప్రేక్షక పాత్ర వహించారు. ఆ సమావేశాలను కాబినెట్ కార్యదర్శి మోడరేట్ చేశారు.

అయితే ప్రభుత్వంపై తన పట్టు కోపోలేదని చెప్పడం కోసం అమిత్ షా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ అమలు సరిగ్గా జరగడం లేదని అంటూ కొన్ని రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల బృందాలను పంపించారు.

ఈ బృందాలను పంపడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ అభ్యంతరం తెలపడం గమనార్హం. ఒక మధ్య ప్రదేశ్ తప్ప ఆయన బృందాలను పంపిన రాష్ట్రాలు అన్ని బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవే కావడం గమనార్హం.

ఏపీ రాజ్ భవన్ కి పాకిన కరోనా..!


విజయవాడ నగరంలోని కరోనా ఉధృతి రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ పేటలో ఉన్న రాజ్ భవన్ లో పని చేస్తున్న వారిలో అనుమానిత లక్షణాలు కలిగి ఉండటంతో ఉన్నతాధికారులు పరీక్షలకు ఆదేశించారు. పరీక్షల అనంతరం నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని క్వారంటైన్ కు తరలించారు. వైరస్ భారిన పడిన వారిలో రాజ్ భవన్ చీఫ్ సెక్యూరిటీ అధికారి, వైద్య సిబ్బందిలో ఒకరు, ఇద్దరు పని మనుషులు ఉన్నారు. మొత్తం ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కూడా కరోనా స్వాబ్ టెస్టింగ్ చేయించుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చినట్లుగా సమాచారం.

కరోనా పాజిటివ్ గా తేలిన సిబ్బంది పనిచేసిన ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన రసాయనాలను రాజ్ భవన్ ఆవరణలో పిచికారీ చేయడం కొద్దిరోజుల కిందటే అధికారులు ప్రారంభించారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా రాజ్ భవన్ లోకి కరోనా వైరస్ చేరడం ఆందోళన కలిగిస్తోంది.

‘ఆదిలోనే అప శకునం’ ఎదుర్కొంటున్న హీరోలు


కరోనా దాటికి ఇద్దరు నూతన హీరోల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ఎన్నో ఆశలతో ,ఎంతో నమ్మకం తో తమ తొలి చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువ నటులకు ఆశాభంగం ఎదురయ్యింది. హీరోగా అరంగేట్రం చేసిన తొలి సినిమాని తెరపైన చూడాలి, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని అనుకొన్న వారి కల అంతకంతకు దూరం అవుతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యాంకర్ ప్రదీప్ ల ప్రస్తుత పరిస్థితి అదే.

మెగా మేనల్లుడు సాయి (ధరమ్ ) తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ తొలి సారిగా ” ఉప్పెన ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. నూతన దర్శకుడు సాన బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం లోని పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. దానికి తోడు తమిళ రీమేక్ రైట్స్ కూడా అమ్మడం జరిగింది. ఇక విడుదల అయితే విజయం తధ్యం అనుకుంటున్న వేళ కరోనా లాక్ డౌన్ అడ్డంకి గా మారింది. సినిమా విడుదల ఆగిపోయింది .

ఇక బుల్లి తెర యాంకర్ గా పాపులర్ అయ్యి , ఇపుడు హీరోగా మారిన ప్రదీప్, తొలిసారిగా నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. కాగా ఈ మూవీపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం లో సిద్ శ్రీరామ్ పాడిన ` నీలి నీలి ఆకాశం ` సాంగ్ శ్రోతల్ని బాగా ఆకట్టుకొని బంపర్ హిట్ అయ్యింది. ఆ క్రమం లో సినిమా హిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఏర్పడింది అలా ఈ ఇద్దరు హీరోల తొలి చిత్రాలు విడుదలకు ముందే ఆగి పోయి వారిని టెన్షన్ పెడుతున్నాయి.

OTT ప్లేట్ ఫారం వైపు అడుగులేస్తున్న చిత్రాలు


కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కి చిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. సినిమా థియేటర్స్ బంధ్ కావడంతో చాలా చిత్రాల విడుదల ఆగిపోయింది. దీనితో కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన చిత్రాలు ఆగిపోయాయి. దాంతో పెట్టుబడి పెట్టిన నిర్మాతలు వడ్డీల భారంతో నష్టాల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది.

దిల్ రాజు వంటి బడా నిర్మాత తీసిన ” వి ” చిత్రం కూడా లాక్ డౌన్ కారణంగా విడుదలకు ఆమడ దూరంలో నిల్చి పోయింది. కాగా కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు తమ చిత్రాల్ని డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో మొదటి చిత్రంగా నిలిచింది `అమృతా రామమ్.`. అమెరికా నేపథ్యంలో సాగే `అమృతా రామమ్’ చిత్రం డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లలో ఒకటైన ” జీ 5 ” లో విడుదల కానుంది. దరిమిలా ఈనెల 29 నుండి `అమృతా రామమ్.` చిత్రం ‘ జీ5 ‘ లో అందుబాటులో ఉండనుంది. ఇక ఇప్పటికే పూర్తయి విడుదలకు నోచుకోని అనేక సినిమాలు O T T ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వాటిలో తమిళం నుంచి హీరో సూర్య భార్య జ్యోతిక నటించిన ” పొన్ మగళ్ వందాల్ ” చిత్రం ఒకటి కాగా రెండోది హిందీలో అక్షయ్ కుమార్ హీరో గా నటించిన కాంచన రీమేక్ “లక్ష్మి బాంబ్ “. ఈ రెండు చిత్రాలు కూడా త్వరలో O T T ప్లాట్ ఫార్మ్ లో దర్శనమివ్వ నున్నాయి .

లూసిఫెర్ రీమేక్ లో రెండో హీరో పవర్ స్టార్ !


2019 మార్చ్ 28 న విడుదలైన మళయాళ చిత్రం `లూసిఫెర్’ మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే మళయాళ సినీ చరిత్రలో అల్ టైం హిట్ గా నిలిచింది. మన తెలుగు తో పోల్చుకొంటే చాలా చిన్న ఫిలిం మార్కెట్ అయిన మల్లు వుడ్ లో లూసియర్ చిత్రం 200 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం ద్వారా మళయాళ హీరో పృథ్విరాజ్ డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తి అద్భుత విజయాన్ని సాధించాడు. అలాంటి అల్ టైం హిట్ సినిమాని రీమేక్ చేయడానికి అన్న భాషల నిర్మాతలు, ,హీరోలు ఉవిళ్ళూరారు. ఇక తెలుగు వరకు వస్తే `లూసిఫెర్ ` చిత్రం యొక్క రీమేక్ హక్కుల్ని మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కొనుగోలు చేసాడు..

`లూసిఫెర్’ రీమేక్ హక్కుల్ని తీసుకొన్న చెర్రీ ఈ చిత్రాన్నితన తండ్రి అయిన మెగా స్టార్ చిరంజీవి తో పునర్ నిర్మాణం చేసేందుకు రెడీ అవుతున్నాడు.` సాహో ` ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రీమేక్ అవుతున్న లూసిఫెర్ చిత్రం లో మెగా స్టార్ చిరంజీవి సూచనల మేరకు పలు మార్పులు చేర్పులు జరుగు తున్నాయి.

మలయాళం లో సీరియస్ పొలిటికల్ డ్రామా గా సాగే ఈ చిత్రానికి తెలుగులో కొంత ఎంటర్టైన్మెంట్ జోడించాలని అనుకొంటున్నారు. అలాగే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ కి జోడీ ఉండదు. కానీ తెలుగులో చిరంజీవికి హీరోయిన్ లేకుండా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అన్న సంశయం తో రెండు ఐటెం సాంగ్స్ పెట్టి ఇద్దరు నటీమణుల్ని తెరమీద చూపాలను కొంటున్నారు. అలాగే ఈ చిత్రం లో కీలక మైన హీరో తమ్ముడి పాత్ర ని కూడా ఇంప్రూవ్ చేయమని చిరంజీవి కోరాడట ఆ క్రమం లో తమ్ముడి పాత్ర కోసం మెగా ఫామిలీ మెంబెర్ అయిన పవన్ కళ్యాణ్ ని ఎన్నిక చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు .

ఎన్నికలు+అధికారం = జర్నలిస్టుల జీవితం


బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టేనే అందలం.. మొన్నటివరకు అధికారంలో ఉన్న పత్రికలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షమైన పత్రిక ఇప్పుడు అధికారపక్షమైంది. అందుకే ఈ మార్పు ఆ రెండు సంస్థల జర్నలిస్టుల జీవితాల్లోనూ స్పష్టమైన మార్పును తీసుకువచ్చిందంటే అతిశయోక్తి కాదు..

*ఒక్క ఎన్నిక.. జర్నలిస్టుల జీవితాలు తలకిందులు
ఎన్నికలు.. అధికారం.. ఇప్పుడు ఇవే జర్నలిస్టుల జీవితాలను రోడ్డున పడేయాలో.. కాపాడాలో నిర్ధేశిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.. అవును మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీకి కాపుకాసిన పత్రికలే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కుదేలయ్యాయి. జర్నలిస్టులను పక్కనపెట్టాయి. అధికార అండ లేకపోవడం.. కొత్త సర్కారు టైట్ చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇక దీనికి రివర్స్ గా అధికారంలోకి వచ్చిన అధికార మీడియా పరిస్థితి ఉంది.. అందులో జర్నలిస్టుల తీసివేతలు ప్రస్తుతానికి లేవు. జీతాల కోతలు లేవు. అంటే ఒక్క ఎన్నికలు జర్నలిస్టుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయన్నది ఇక్క సుస్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలు+అధికారం ఉంటేనే జర్నలిస్టుల జీవితాలు బాగుంటాయి.. లేదంటే అథోగతి పాలవుతాయి. ఈ అక్షర సత్యం.. అక్షరాలు రాసే జర్నలిస్టులకు ఇప్పుడు అర్థమవుతోంది.

*ఆ రెండింటిలో కోత.. ఈ రెండూ సేఫ్
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి దగ్గరైన ఆ రెండు పత్రికలు మీడియాలో జర్నలిస్టుల కోతలు కొనసాగుతున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణ, ఏపీల్లో అధికారంలో ఉన్న మీడియాలో ఇప్పటివరకు జర్నలిస్టుల తొలగింపులు.. జీతాల కోతలు లేవు. సో అధికారమే వీరిని కాపాడిందన్న చర్చ సాగుతోంది.

*జర్నలిస్టుల బతుకుబండి నడిపేది అధికారమేనా?
ముందు నాలుగు అగ్రశ్రేణి మీడియా వర్గాలు కూడా ఒకే దారిలో లాక్ డౌన్ లో జర్నలిస్టులను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాయట.. కానీ మొదట ప్రతిపక్ష పత్రికలు తొందరపడ్డాయి. దాని పర్యవసనాలు ఘోరంగా బయటకొచ్చాయి. దీంతో అధికార పత్రికలు సుదులాయించుకున్నాయి. వెంటనే అలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టాయి. తీసేద్దామని లిస్ట్ రెడీ చేసుకొని మరీ ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టాయి. ఇలా అధికార పార్టీ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు బతికిపోయారట.. దీన్ని బట్టి జర్నలిస్టుల బతుకు బండిని నడిపేది అధికారమనేది ఇట్టే అర్థమవుతోంది.

*వచ్చే ఐదేళ్లకు మళ్లీ ట్రెయిన్ రివర్స్
ఇప్పుడు అధికార పార్టీల్లో ఉన్న జర్నలిస్టులు పచ్చగా ఉన్నారు. మరో నాలుగేళ్లలో ఎన్నికల్లో తలకిందులైతే మళ్లీ ట్రెయిన్ రివర్స్. అప్పుడు అధికారంలోకి వచ్చిన మీడియాకు రాజకీయ అండ. ఇలా గాలిలో దీపంలా మారిపోయాయి జర్నలిస్టుల బతుకులు. అధికారం ఉన్నా లేకపోయినా అన్నేళ్ల సేవ చేసిన జర్నలిస్టులకు గుర్తింపు లేదా? సంస్థలు ఎందుకు పట్టించుకోవు అంటే మాత్రం దానికి సమాధానం దొరకడం చాలా కష్టం. అదో మిలియన్ డాలర్ల ప్రశ్న?

–నరేష్ ఎన్నం

తెగిన ఆంధ్ర పదజాలం.. పరుచుకున్న తెలం‘గానం’

CMKCR


అది ఉమ్మడి రాష్ట్రం.. ఆంధ్రా నేతల ఏలుబడి.. పాలన అయినా.. సినిమాలైనా తెలం‘గానం’ కామెడీకే పనిచేసింది. స్వయం ప్రతిపత్తి, స్వావలంబన కోసం ఆరాటపడింది. ఒకప్పుడు తెలంగానం అన్నా.. తెలంగాణ సంస్కృతి అన్నా ఉమ్మడి ఏపీలో ఏహ్యభావమే. అయితే మారుతున్న కాలం అన్నింటిని మార్చేసింది. తెలంగాణ తెచ్చింది. తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేసింది. బతుకమ్మకు గౌరవమొచ్చింది.. బోనాలు నెత్తిన ఎక్కి కూర్చింది.

ఉమ్మడి ఏపీ విడిపోయాక ఎన్నో సంస్కరణలు. పక్కా తెలంగాణ వాధి.. భాష పిపాసి కేసీఆర్ అన్నింటిని తెలంగాణాకీరించారు. ఆంధ్రా భావజాలం పదజాలాన్ని పక్కనపెట్టి తేట తెలంగాణ పదాలను కూర్చారు. పథకాల నుంచి వాడుక వరకు అంతటా తెలంగానం చేశారు.

అయితే ఇప్పటికీ తెలంగాణలో ఖరీఫ్, రబీలను ఆ పేరుతో ఎవరూ పిలవరు. తాత ముత్తాల నుంచి వానాకాలం పంట.. యాసంగి అని ఖరీఫ్, రబీలను పిలుస్తూనే ఉంటారు. అయితే మన పత్రికలు.. ప్రభుత్వాలు రాసుకోవడానికి వాడడానికి ఖరీఫ్, రబీ అంటూ తెగ జన బాహుల్యంలోకి ప్రచారం చేసిన సగటు తెలంగాణ వాది మాత్రం వానాకాలం, యాసంగినే వాడతుంటారు.

తెలంగానమన్నా.. ఇక్కడి సంస్కృతి అన్న పెద్దపీట వేసే కొసుకునే కేసీఆర్ ఊరుకుంటారా? మన పండుగలు పబ్బాలు.. పథకాల పేర్లు ఏంటీ అన్నింటిని మార్చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణ సాగులోనూ సంస్కరణ బాట వేశారు. కాళేశ్వరం నీటితో పంటను ఈ సంవత్సరం అత్యధికంగా పండించి రికార్డు సృష్టించారు. అంతేకాదు.. రాబోయే రోజుల్లోనే భారతదేశానికి తెలంగాణను ధాన్యాగారంగా మార్చే పనిలో పడ్డారు. అంత చేసిన కేసీఆర్ సాగు సంస్కరణలు చేయకుండా ఉంటారా? అదీ చేసేసారు.

తాజాగా తెలంగాణ పంట సీజన్ల పేర్లను మారుస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్, రబీ పేర్లను మారుస్తూ వానాకాలం పంట మరియు యాసంగిగా మార్చాలని ఆదేశించారు, ఇన్నాళ్లు ఖరీఫ్ , రబీ అంటే ఎవరికీ అర్థం అయ్యేది కాదని.. అందుకే ఈ తెలంగాణ పదాలు అందరికీ అర్థమయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుంచి పంట విత్తనం నుంచి కోసే వరకు వ్యవసాయ లెక్కలు.. పత్రాలు.. బ్యాంకు రుణాలు అన్నింటికి ఈ పదాలే ఆధారంగా చేసేశారు. డిపార్ట్‌మెంటల్ ఆర్డర్లు, కార్పొరేషన్లు, వ్యవసాయ సంస్థలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలు మరియు సిలబస్‌లలో ఈ మేరకు ఈ పదాలను మార్చి ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇలా తెలంగాణ విడిపోయాక తెలం‘గానం’ నిజంగానే వినిపిస్తోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు అక్షరసత్యాలను చేస్తూ కేసీఆర్ అదే పంథాలో పయనిస్తున్నారు. తెలంగాణ భాష, యాసకు ఇన్నాళ్లుగా జరిగిన వివక్షకు చరమగీతం పాడుతున్నారు. తెలంగానాన్ని అందలమెక్కిస్తున్నారు..

కష్టకాలంలో కూడా ఇంత నిర్లక్ష్యమా?


మొన్న మొన్నటి వరకు మాస్కులు లేవని మోత్తుకున్నారు. గ్లౌజ్‌లు ఇవ్వడంలేదని గోల చేశారు. పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయని గోడవ చేశారు. ఎట్టకేలకు ఇత్యాది సమస్యలు ఎంతోకొంత సర్దుమనిగాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడ్డది. ప్రజలు వారు ఉపయోగించుకున్న మాస్కులు, గ్లౌజ్‌లను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరో సమస్యకు కారణమౌతున్నారు. ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను విధుల్లో, రోడ్లపైన పడేస్తూ ఉన్నారు.

కరోనాపైన యావత్తు భారతావని యుద్ధం చేస్తున్న తరుణంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పోరు సల్పుతున్న సమయంలో, పేషెంట్లకు వైద్య సేవలందించడంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మునిగిపోయిన ఈ విపత్కర కాలంలో కొంతమంది ప్రజలు మాస్కులను, గ్లౌజ్‌లను, వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్ల) ను ఇలా విధుల్లో, రోడ్లపైన, ఇంటి గేట్ల ముందు పడేయడం అనేకమందిని విస్మయానికి గురిచేస్తుంది.

ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను, గ్లౌజ్‌లను, వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్ల)ను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని, వీటిని రోడ్లపై, నివాసాల్లోని చెత్త బుట్టల్లో పడేయడం వల్ల వాటిని పెంపుడు జంతువులు, వీధుల్లో సంచరించే పశువులు తాకితే వైరస్‌ వ్యాప్తిచెంది అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంత మంది ఈ హెచ్చరికలను భేఖాతారు చేయడం సిగ్గుచేటు. అంతేకాకుండా చిత్తుకాగితాలు ఏరుకునే వారు వాటిని సేకరించి మళ్లీ విక్రయించే అవకాశం ఉందని అది మరింత ప్రమాదమని కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కింకర్తవ్యం

ఎవరైతే మాస్కులు, గ్లౌజ్‌లను ఉపయోగిస్తున్నారో వారు వ్యక్తిగత బాధ్యత వహించి వినియోగించిన మాస్కులు, గ్లౌజ్‌లను ముక్కలుముక్కలుగా చేసి తగిన పద్దతిలో డిస్పోజ్ చేయాలి. ప్రజారోగ్య సిబ్బంది కూడా వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక సంచుల ద్వారా వాటిని సేకరించిన మాస్కులను,గ్లౌజ్‌లను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్‌ చేస్తే పరోక్షంగా వైరస్ కట్టడికి సహకరించినవారౌతారు. అలాగే ఎవరికైనా రోడ్లపైన, విధుల్లో ఎక్కడైనా మాస్కులు, గ్లౌజ్‌లు కనిపించినట్లయితే వాటిని సేకరించి ముక్కలుముక్కలుగా చేసి తడి పొడి చెత్తతో కాకుండా విడిగా ఓ పేపరు కవర్‌ లోగానీ, ప్యాకెట్‌ లోగానీ కాగితంలో చుట్టి చెత్తసేకరణకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందజేయాలి. ప్రజలు పెంపుడు జంతువుల విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత వహించి వైరస్ నియంత్రణకు సహకరిస్తారని ఆశిద్దాం…

మళ్ళీ తెలుగులో నటిస్తాను అంటున్న ఉపేంద్ర


కన్యాదానం , ఒకే మాట, నీతోనే ఉంటాను చిత్రాల తరవాత చాల గ్యాప్ తీసుకొని 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో స్పెషల్ పాత్రలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగులో నటించాలని ఉంది అంటున్నాడట …నిజానికి ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా ఉపేంద్రకి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది . అయితే ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.

కాగా ఈ మధ్య జరిగిన మీడియా ఇంటర్వ్యూ లో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగు లో నటించక పోవడానికి కారణం కన్నడలో బిజీగా ఉండటమే అని చెప్పడం జరిగింది .అదీగాక . సినిమాలతో పాటు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నాను. అన్నాడు .

ప్రస్తుతం ఉపేంద్ర , మెగా హీరో వరుణ్ తేజ్ కధానాయకుడిగా నటిస్తున్న ‘బాక్సర్’ అనే చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు . ఇదిలా ఉండగా ఉపేంద్ర సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర నటించబోతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘కబ్జా’ పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మాణ మౌతోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ సమర్పణలో చంద్రశేఖర్ నిర్మిస్తుండగా ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు – తమిళం – కన్నడ – మలయాళం – ఒరియా – మరాఠీ భాషల్లో పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న అండర్ వరల్డ్ చిత్రమిది. ఈ లెక్కన తెలుగులో పాగా వేయడానికి ఉపేంద్ర గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అని తేలుతోంది .

నాడు ద్వేషించినవాళ్లే.. నేడు ప్రేమిస్తున్నారు: కేటీఆర్


రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకించారని.. కానీ నేడు వారంతా ఆయనను ప్రేమిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరంగా పాటిస్తూ తమ ఇళ్లపై టీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని కోరారు. వారంరోజులపాటు రక్తదాన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ఆవిర్భావించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు స్ఫూర్తినిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు లాంటి మహానుభవాలను గుర్తుంచుకుంటామన్నారు. ఒకరిద్దరితో మొదలైన పార్టీ ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో అజయ శక్తిగా మారిందన్నారు. టీఆర్ఎస్ దేశ రాజకీయాలపై ప్రత్యక్షంగా కాకపోయిన పరోక్షంగా ప్రభావం చూపిస్తుందన్నారు. కరోనా పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్గ దర్శనం చూసిన తర్వాత ఆయన నాయకత్వం మరో పదిహేనేళ్లు కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అందులో తానొక్కడినిని చెప్పారు.

ప్రపంచంలోని అతిపెద్ద మల్టిస్టేజ్ ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం హరితవిప్లవంతోపాటు క్షీరవిప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, జలవిప్లవాలను సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు కేసీఆర్ చేపడుతున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని తెలుగువాళ్లంతా ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ అనంతరం పార్టీ ఆవిర్భావ వేడుకలు, కార్యకర్తలకు శిక్షణ వంటి వాటిపై ఆలోచిస్తామని కేటీఆర్ వివరించారు.