Home Blog Page 8512

కరోనా సోకితే అంటరానితనంగా భావించొద్దు..!


రాష్ట్రంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పేందుకు సీఎం జగన్ ప్రయతించారు. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల్లో టెస్టింగ్‌ సౌకర్యాలను పెంచుకున్నామని, కరోనా వైద్య పరీక్షల కోసం రాష్ట్రంలో 9 వీఆర్‌డీఎల్‌, 44 ట్రూనాట్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు.

సోమవారం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రెడ్ జోన్‌లో 63, ఆరెంజ్‌ జోన్‌లో 54, గ్రీన్‌ జోన్‌లో 559 మండలాలున్నాయని, 5 కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్‌ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించొద్దు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది.

కరోనా ఉన్నట్లుగా 80శాతం మందికి తెలియనే తెలియదు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా వ్యాపిస్తుంది. 81శాతం మందికి ఇళ్లల్లో ఉంటేనే నయమవుతున్నాయి. కేవలం 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి. రోగ నిరోధకశక్తి పెంచుకునేలా ఆహారపు అలవాట్లు ఉండాలి. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో చేసిన 70శాతం పరీక్షల్లో…1.61 శాతం మాత్రమే పాజిటివ్‌ కేసులొచ్చాయి. భౌతికదూరం కచ్చితంగా పాటించాలి. మనిషికి, మనిషికి మధ్య ఒక మీటర్‌ దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి ఇంటికి మాస్కులు అందిస్తున్నాం. ప్రతి మనిషికి మూడు మాస్కులు ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 40 వేల బెడ్స్‌లో 25 వేలు సింగిల్‌ ఐసోలేషన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలో మాస్కులు, ప్రొటెక్షన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, టెక్నీషీయన్లను అద‌నంగా భర్తీ చేశాం. 14410 టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం. ఆర్థికలోటు ఉన్నా.. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. నెలరోజుల్లో మూడుసార్లు రేషన్‌ అందించే ఏర్పాట్లు చేశాం. ప్రతి పేద కుటుంబానికి రూ.వెయ్యి సాయం అందించాం. 56 లక్షల మందికి పెన్షన్‌ అందించామని తెలిపారు.

జగన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వని మోడీ..!


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడే అవకాశం లభించలేదు. దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చే క్రమంలో గత సమావేశంలో అవకాశం లభించిన ముఖ్యమంత్రులకు ఈ సారి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అవకాశం ఇవ్వాలేదు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా సీఎంలకు మాత్రమే అవకాశం లభించింది.

వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మే 3వ తేదీ అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. సీఎం జగన్ కు అవకాశం ఇస్తే కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయమని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని అనుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా పెంచామని, 10 లక్షల మందికి 1,396 పరీక్షలు చేస్తూ దేశంలో ప్రధమ స్తానంలో ఉన్నామని ప్రధానికి తెలియజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 1.5 శాతం మాత్రమే ఉన్నట్లు, టెస్టుల సంఖ్య పెంచినందువల్ల కేసుల సంఖ్య అధికంగా ఉందన్న విషయాన్ని వివరించాలని అనుకున్నారు. రాష్ట్రంలో 80 శాతం మండలాలు గ్రీన్ జోనలో ఉన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ముగిశాక అధికారులతో సమావేశమైన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులు, పరీక్షల వివరాలపై చర్చించారు.

ప్రణీతపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు


హీరోయిన్ ప్రణీత పెద్దమనస్సును చాటుకుంది. పేదల కోసం తానే స్వయంగా భోజనం తయారీచేసి 21రోజుల్లో 75వేలమందికి పంపిణీ చేసింది. ఇప్పటికే ప్రణీత సీని కార్మికులకు ఆదుకునేందుకు తనవంతు ‘సీసీసీ’ లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎంతోమంది చిన్నసాయం చేసి పెద్ద పబ్లిసిటీ చేసుకుండగా ప్రణీత మాత్రం వీటికి దూరంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె పేదలకు చేస్తున్న సేవపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రణీత అందంతోపాటు మంచి మనస్సు నటి అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

ప్రణీత తెలుగులో ‘అత్తారింటికి దారేది’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మూవీ సక్సస్ తర్వాత ఆమె పలుభాషల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రణీత కన్నడలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. లాక్డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమతయ్యారు.

https://www.instagram.com/p/B_Z3k3XArNI/

 

కరోనా టైంలో కొందరు సెలబ్రెటీలు మేకప్ ఛాలెంజ్ లు, పిల్లో ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రణీత మాత్రం ప్రజల ఆకలి తీరుస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా టైంలో కావాల్సింది ‘పిల్లో ఛాలెంజ్.. మేకప్ ఛాలెంజ్.. ది రియల్ మేన్ ఛాలెంజ్’లు కాదని ప్రణీత చేస్తున్న ‘ఫుడ్ ఛాలెంజ్’ లు కావాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్లు ప్రణీతను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

గ్లామర్ రూట్లోకి ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్..


‘గ్యాంగ్ లీడర్’ మూవీతో ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. హీరో నానికి జోడిగా నటించి మెప్పించింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ప్రియాంక. తాజాగా ఈ భామ అందాల అరబోతకు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అంధాధున్’ తెలుగు రీమేక్లో ప్రియాంక అరుళ్ మోహన్ గ్లామర్ చూపించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

సినీ పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్లకే ఎక్కువ అవకాశాలు దక్కుతాయనడంలో సందేహం లేదు. నటనకుతోడు గ్లామర్ తోడైతే ఆ హీరోయిన్ స్టార్డమ్ రావడం ఖాయం. గ్లామర్ హీరోయిన్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పటివరకు నటనకే ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్లు కూడా గ్లామర్ బాట పడుతోన్నారు. ఇప్పటివరకు సంప్రదాయ దుస్తుల్లో అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా అందాల అరబోతకు సిద్ధమవుతోంది.

నితిన్ హీరోగా నటిసున్న ‘అంధాదున్’ రీమేక్ కోసం ప్రియాంక పేరును దర్శక, నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఈమేరకు ఆమెను సంప్రదించగా నితిన్ కు జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ‘అంధాదున్’ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య బోల్డ్ సీన్స్ తెలిసే ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగులోనూ ఈ తరహా బోల్డ్ సీన్లను నితిన్-ప్రియాంక మధ్య తెరకెక్కించేందుకు దర్శకుడు మేకపాటి గాంధీ ప్లాన్ చేస్తున్నాడట. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు గ్లామర్ బాటపట్టిన ప్రియాంకకు ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్టు అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

భారత్ లో కరోనా మరోసారి సోకడం లేదు


భారత దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతూ ఉండడంతో పాటు, కరోనా మహమ్మారి నుండి రోగులు సహితం క్రమంగా కోలుకొంటున్న సందర్భంలో ఒక సారి ఈ వైరస్ సోకిన వారికి మళ్ళి సోకక పోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది.

దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా మెరుగుప‌డుతోంద‌ని కేంద్రం తెలిపింది. రిక‌వ‌రీ రేటు 22.71శాతంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది.

కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

చైనా వూహాన్‌తో పాటు అనేక ఐరోపా దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ మళ్ళి సోకుతూ ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోలుకోలేమనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్‌లో కరోనా సోకి కోలుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇలా ఉండగా, గత 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా నిర్ధారిత పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది.

భారత్‌లో ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఒక్కరోజులో 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వివాదాస్పద చైనా కిట్ లు వెనక్కు..


కరోనా పరీక్షల కోసం చైనా నుండి దిగుమతి చేసుకున్న కిట్ లు నాణ్యత ప్రమాణాల పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాటిని వెనుకకు పంపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం వాటి వాడకాన్ని నిలిపివేయమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ఆదేశించడం తెలిసిందే.

క‌రోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమ‌తి చేసుకోగా వాటిని మ‌ళ్లీ వెన‌క్కి పంపించేందుకు చర్య‌లు ప్రారంభించింది. చైనా కు చెందిన గ్వాంగ్జౌ వోన్డ్‌ఫో బయోటెక్, జుహాయి లివ్‌జాన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల ఉత్పత్తుల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది.

ఈ కిట్లు కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వస్తాయని కంపెనీ భరోసా ఇచ్చింది, కానీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపించిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.

కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఈ కిట్‌ల‌ను దిగుమతి చేసుకున్నాయని, వెంట‌నే వీటి వాడకాన్ని నిలిపివేసి, చైనాకు తిప్పి పంపించాలని ఆదేశించింది.

మొదటి నుండి భారత దేశంలో అనుసరిస్తున్న ఆర్టీ-పీసీఆర్ విధానం ద్వారా నిర్వహించే పరీక్షలే కరోనా నిర్ధారణకు ప్రామాణికమ‌ని ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. ఈ విధానం ద్వారానే కరోనాను తొలి దశలోనే గుర్తించడం సాధ్యమ‌ని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ఆర్టీ-పీసీఆర్ విధానమే అత్యుత్తమ మార్గ‌మ‌ని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా టైంలో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆవేశం దేనికోసం?


తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయి. సోమవారం టీఆర్ఎస్ 20వ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ జెండాను మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి వంటి వాడని చెప్పారు. తన నియోజకవర్గానికి అన్ని తానేనని.. ఇక్కడికి ఎవరూ రావాలన్నా తన అనుమతి తీసుకోవాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించారు. ఒక తల్లికి.. తండ్రికి పుట్టినవాళ్లయితే తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్నా అంటూ రాజయ్య ఆవేశానికి లోనయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన కడియం శ్రీహరిని ఉద్దేశించి చేశారనే చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తోంది. వీరిమధ్య ఎప్పటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో రాజయ్య మద్దతుగా కడియం శ్రీహరి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో రాజయ్య స్వల్ప మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే.

తాజాగా స్టేషన్ ఘాన్ పూర్లో కడియం శ్రీహరి మళ్లీ పట్టుకోసం ప్రయత్నిస్తుండటంతోనే రాజయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదనలు నియోజకవర్గంలో విన్పిస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..! ప్రస్తుతం రాజయ్య వ్యాఖ్యలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.

కార్డు లేని సినీ కార్మికులకు మా ఆర్టిస్టుల‌ సాయం


టాలీవుడ్ లో నిత్యావ‌స‌రాల సాయం గురించి తెలిసిందే. అవ‌స‌రార్థులైన 24 శాఖ‌ల కార్మికుల‌కు ఈ సాయం అందుతోంది. అయితే ఏ శాఖ‌కు చెంద‌కుండా యూనియ‌న్ కార్డ్ లేకుండా పొట్ట పోషించుకోవ‌డానికి వ‌చ్చిన కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఎలా? అన‌ధికారికంగా ఇలాంటి వాళ్లు వేల‌ల్లో ఉన్నారు. అందుకే అలా కార్డ్ లేకుండా క‌ష్టాల్ని ఎదురీదుతున్న పేదల్లో కార్డ్ లేని వారికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు మూవీ ఆర్టిస్టుల సంఘం ఆర్టిస్టులు. మా స‌భ్యుల్లో హేమ‌, సురేఖా వాణి, రజిత, జయలక్ష్మి, సనా, ప్రవీణ,, హిమజ, మాధవి, మా మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వెంకట గోవిందరావు, ఇంకా హేమ కూతురు ఈషా, సురేఖవాణి కూతురు సుప్రీత, జయలక్ష్మి కూతురు శృతి త‌దిత‌రులు కార్డ్ లేని అసిస్టెంట్ల‌కు డొనేష‌న్లు అందించారు.

ఈ సంద‌ర్భంగా హేమ మాట్లాడుతూ… “కార్డ్ లేని అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాయం చేస్తున్నాం. సెట్లో మ‌మ్మ‌ల్ని బాగా చూసుకునేది అసిస్టెంట్లే. కొంద‌రు డొనేష‌న్లు ఇచ్చిన మ‌హిళా ఆర్టిస్టులు రాలేక‌పోయారు. వారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు. సురేఖా వాణి మాట్లాడుతూ.. “అంద‌రూ నిత్యావ‌స‌రాలు పంచుతున్నారు. అవే కాకుండా ఇంట్లో ఇంకా అవ‌సారాలుంటాయి. గ్యాస్ .. పాలు స‌హా ఇంకా అర్జెంట్ నీడ్స్. అందుకే వారికి డ‌బ్బును సాయం చేస్తున్నాం“ అని తెలిపారు. రజిత మాట్లాడుతూ ఈ కరోనా కారణంగా చాలామంది ఇబ్బంది గురవుతున్నారు అసోసియేషన్ లో ఉన్న కొంత మంది కార్మికులకి సహాయం అందుతుంది కార్డు లేని వారికి సాయం చేయాలని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు ఇవ్వడం జరిగింది” అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఆర్టిస్టులు పాల్గొన్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు: గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్


గాంధీలోని ముస్లిం రోగులకు రంజాన్ కానుకగా మాంసాహారం అందిస్తున్నారని వస్తున్న వార్తలపై ఆసత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. గాంధీలోని కరోనా పేషంట్లకు ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గాంధీలోకి మాంసాహారాన్ని అనుమతించేదని స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా ఎవరైనా ఇంటి నుంచి రోగులకు మాంసాహారాన్ని తీసుకొచ్చినా వాటిని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీనికి బదులుగా రోగులకు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని క‌రోనా బాధితులందరికీ దాదాపుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు వైద్యులు డైట్ అమలు చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు గాంధీలో మాంసాహారం అందిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మాంసాహారం, మసాలా ఆహారం తీసుకోవడం వల్ల రోగులకు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బయటి నుంచి తెచ్చే ఆహారాన్ని కూడా అనుమతించడం లేదని తెలిపారు. గాంధీలోని రోగులకు వెజిటబుల్‌ బిర్యానీ, కిచిడీ, తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్‌, కోడిగుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. క‌రోనా రోగుల‌కు గాంధీ ఆస్ప‌త్రిలో పెడుతున్న ఆహారంపై మంత్రి ఈట‌ల ఇటీవలే స్ప‌ష్ట‌తనివ్వగా తాజాగా ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ రాజారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

పారిశుధ్య కార్మికులకు శేఖర్ కమ్ముల సాయం


పారిశుధ్య కార్మికులకు దర్శకుడు శేఖర్ కమ్ముల సాయమందించేందుకు ముందుకొచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నార్త్ జోన్లో పనిచేసే వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు నెలరోజులపాటు పాలు, మజ్జిగ అందించనున్నాడు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శేఖర్ కమ్ముల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. తమ ఏరియాలో ప్రతీరోజు పారిశుధ్య కార్మికులను చూస్తుంటానని.. వారంతా ఎండలో కష్టపడుతుంటారని తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తనవంతుగా వెయ్యిమంది కార్మికులకు నెలరోజులపాటు పాలు, మజ్జిగ అందించనున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని.. ప్రస్తుతం మనిషికి మనిషి తోడుండాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. లాక్డౌన్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అన్నారు. కాగా కొందరిలో ఇంకా మార్పు రావాల్సి ఉందన్నారు. కరోనాకు మందులేదని.. స్వీయనియంత్రణ మార్గమని అన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు. దర్శకుడు శేఖర్ కమ్ముల పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం గురించి ఆలోచించి సాయమందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల శేఖర్ కమ్ముల వంటి దర్శకులు వారిపై చూపుతున్న ప్రేమకు ధన్యావాదాలు తెలిపారు. కరోనా లాంటి అపత్కర సమయంలో ఎవరూ కూడా బయటికి రావద్దని కోరారు. కొద్దిరోజులు సంయమనం పాటిస్తే అన్ని పరిస్థితులు చక్కబడుతాయని అన్నారు.

‘కెజిఎఫ్’ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్


బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ క్రమంలో ఇపుడు రాబోయే చిత్రాలన్నీ తన రేంజ్ కి తగ్గ విధంగా విభిన్న దర్శకులతోనే చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇపుడు ఒక పర భాషా దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. కె జి ఎఫ్ చిత్రం తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇపుడు ప్రభాస్ తో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారు.రీసెంట్ గా ధూమ్ 4 చిత్రం లో చేయమని బాలీవుడ్ నుంచి అఫర్ వస్తే ప్రభాస్ వదులు కొన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు . .

నిజానికి ప్రశాంత్ నీల్.. తన ” కె జి ఎఫ్ 2 ” చిత్రం పూర్తి కాగానే ..ఎన్ . టి. ఆర్ తో గాని , మహేశ్ బాబు తో గాని సినిమా చేయాలను కొన్నాడు .. కానీ ఆ ఇద్దరికి వేరే దర్శకులతో కమిట్ మెంట్ ఉండటం తో ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ వైపు మొగ్గు చూపాడట …మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రభాస్ కి చాలా రోజుల క్రితం అడ్వాన్స్ ఇచ్చి వున్నారు. దాంతో వాళ్ళు ప్రశాంత్ నీల్ లైన్ లోకి రాగానే ప్రభాస్ కి కథ చెప్పించి సినిమా ఒకే చేయించారు . ప్రశాంత్ నీల్ ఇంతవరకు తీసింది. రెండే రెండు చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. `కె జి ఎఫ్ ` చిత్రానికి ముందు ప్రశాంత్ నీల్ “ఉగ్రమ్ ” అనే మూవీ తీయడం జరిగింది.అది కన్నడ నాట విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లు రాబట్టింది . ఇక తరవాత తీసిన `కె జి ఎఫ్ ‘. చిత్రం డైరక్టర్ ప్రశాంత్ నీల్ స్టామినాను ఇండియా అంతటా చాటింది .ఇపుడు ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ కి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం తప్పదు. ఆ ధైర్యం తోనే మైత్రి మూవీ మేకర్స్ ముందుకు కదులు తున్నారు .

హాట్ స్పాట్ ల వరకే లాక్ డౌన్ పరిమితం కానుందా?


దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను సడలిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయమై మే 3 తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాలలో జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయని ఆయన ముఖ్యమంత్రులతో సంతోషం వ్యక్తం చేశారు.

కరోనాపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని, వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని, ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయని0 తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల విభజన చేసుకోవాలని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు. అయితే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడగింపు వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. వారు ఒడిశా, గోవా, మేఘాలయ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు.

కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని సూచించారు. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుందని చెబుతూ అందుకే మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలని స్పష్టం చేశారు.

దేశం ఇప్పటికే 2 లాక్‌డౌన్లు చూసిందని అంటూ ఇక ముందు ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని సూచించారు. హాట్‌స్పాట్ – రెడ్ జోన్లలో  ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

కాగా, వైరస్ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు. గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి.. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.

అలాగే లాక్‌డౌక్‌ కారణంగా ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడటంతో.. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు.

కిట్ల కొనుగోళ్లలో అవినీతిపై విచారణ చేయండి: కన్నా


రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుండి రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చేసిన ఫిర్యాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా చేసిన అవినీతి పై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా పేరుతో రాపిడ్ కొనుగోలులో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టాన్ని కలిగించే విధంగా ఎపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

కరోనా ఎదుర్కోవడంలో పగలు, రాత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కరోనపై పోరుకు అవసరమైన పరీక్షా పరికరాలు, వస్తు సామగ్రి, పిపిఇఎస్, వెంటిలేటర్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరిందని చెప్పారు. రాపిడ్ టెస్ట్ కిట్లను సరఫరా చేస్తున్న ఐసిఎంఆర్ కిట్లను సరఫరా చేయడానికి దక్షిణ కొరియా కంపెనీకి ఎస్డి బయోసెన్సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చిందని, అయితే ఎపి ప్రభుత్వం పారదర్శక విధానాన్ని విస్మరించి తక్షణ సేకరణ అనే సాకుతో కొంత ఆర్థిక ప్రయోజనం పొందటానికి మధ్యవర్తి ద్వారా కిట్ల కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జీఎస్టీని మినహాయించి రూ .14.60 కోట్లకు

రెండు లక్షల కిట్ల కొనుగోలు కోసం నోడల్ ఏజెన్సీ ఏప్రిల్ 7న సాండోర్ మెడికేడ్స్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచ్చిందన్నారు. ప్రతి కిట్‌కు రూ. 730, జీఎస్టీ ధర అదనంగా నిర్ణయించగా, ఏడు రోజుల్లో ఆర్డర్‌ను అమలు చేయాల్సి ఉందని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రి టిఎస్‌సింగ్ డియో ట్విట్టర్‌లో ట్వీట్ చేసినప్పుడు ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా కంపెనీ నుండి జీఎస్టీ కలపకుండా
రూ .337, కొనుగోలు చేశారన్నారు. ఎపి రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కాకుండా రూ .730, టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా చట్టవిరుద్ధమని అన్నారు. మధ్య వర్తుల ద్వారా కొనుగోలు ఒప్పందం చేయడం‌ వల్ల కోట్ల రూపాయల అవినీతి జరిగిందాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, దక్షిణ కొరియా సంస్థకు మధ్యవర్తిగా ఉన్న సంస్థకు ఎపి ప్రభుత్వ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా డైరెక్టర్ అని, శ్రీ విశ్వనాధ వెంకట సుబ్రమణ్యం ఆంజనేయ సి మరియు శ్రీ బుగ్గన హరిహరనాధ్ ఒక కంపెనీలో కో డైరెక్టర్లుగా ఉన్నార తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థ కు కొనుగోలు ఆర్డర్ ఇచ్చారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చూపిన అభిమానవాదం మరియు పక్షపాత వైఖరి అనేది స్పష్టమవుతుందని తెలిపారు. చత్తీస్‌గఢ్, ఎపి రెండు రాష్ట్రాల మధ్య ధర వ్యత్యాసాన్ని వివరించడానికి నేను ఒక ట్వీట్ చేశానన్నారు.

ఎంపీ వి. విజయసాయిరెడ్డి, నాపై పరువు నష్టం కలిగేలా నా పై ఆరోపణలు చేశారని తెలిపారు. వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 640 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే, పారదర్శకతను నిరూపించమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదన్నారు. బిజెపి నాయకుల పై వ్యక్తిగత ఆరోపణల ద్వారా సమస్యను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కిట్లు కొనుగోళ్లలో మధ్యవర్తిని తీసుకురావడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో దాని ప్రాముఖ్యత దృష్ట్యా మొత్తం లావాదేవీలను పరిశీలించమని నేను మిమ్మల్ని కోరుతున్నానట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు

ఎన్నికల వాయిదా నిర్ణయంలో గోప్యత అవసరం..!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంలో ఈసీ అఫిడవిట్ కు రిప్లై పిటీషన్ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో పలు కీలక విషయాలను నిమ్మగడ్డ వెల్లడించారు.

ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ విధుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితంగా ఉంటాయన్నారు.

ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాతే తాను సంతకం చేశానని వెల్లడించారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల కమిషనర్ కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుందన్నారు.

ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదనే విషయాన్ని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఎస్.ఈ.సి తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘము కార్యదర్శి రామసుందర రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ లో లేవనెత్తిన అంశాలపై మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన పిటీషన్ లో సమాధానం ఇచ్చారు.

మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం


తెలంగాణలోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో షరతులతో కూడిన చేపలవేటకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో మే7 వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోపాటు పరిమిత రంగాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం చెరువుల్లో చేపల వేటకు అనుమతించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మూడు లక్షల మంది మత్స్యకారులకు తిరిగి ఉపాధి లభించనుంది.

చెరువుల్లో చేపలు వెళ్లే మత్స్యకారులు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్య్సకారులు కరోనా బారినపడకుండా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా అన్నిరంగాలతోపాటు మత్స్య పరిశ్రమ ఇప్పటివరకు చాలా నష్టపోయింది. లాక్డౌన్ కు ముందు రాష్ట్రంలో 3లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం ఉండేది. లాక్డౌన్ వల్ల చేపల ఉత్పత్తి భారీగా తగ్గి కొరత ఏర్పడింది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల మత్స్యకారులు తిరిగి వ్యాపారాలను నిర్వహించి లాభాలను పొందే అవకాశం ఉంది.

లాక్డౌన్ కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తి పెంచే పండ్లు, ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో చేపలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ నెలకొంది. చేపల్లో రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రస్తుతం వీటి ధర కూడా పెరిగి అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే చికెన్, కోడిగుడ్డు, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో చేపల ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. ప్రభుత్వం ఓ వైపు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కొందరు వ్యాపారులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించి ధరలు పెరగకుండా చూడాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేయండి


దౌర్జన్యాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేయించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. కడప, ఇతర జిల్లాలో ఏకగ్రీవలు జరిగిన తీరును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు రాసిన లేఖలో వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో పాల్పడిందని ఆరోపించారు.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ లలో జరిగిన అనేక అవకతవకల వలన ఇప్పుటివరకూ జరిగిన నామినేషన్ ప్రక్రియను రద్దు చెయ్యాలని కోరారు. ఇందుకు పలు ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు కూడా సహకరించారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తాను ఇలాంటి దౌర్జన్యకాండ ఎన్నడూ చూడలేదన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక వైసీపీ రాష్ట్రంలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కు రాసిన మరో లేఖలో విశాఖపట్నం నగరంలో తాజాగా జరిగిన భూ కబ్జాపై విచారణ జరిపించాలని కోరారు.

బాలయ్య వెంట ఏజెంట్ ఆత్రేయ


బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది మాస్ ఆడియన్స్ తో పాటు ,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా బోయపాటి తగిన శ్రద్ద తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం లో బాలయ్యకు ప్రక్కనే ఎప్పుడు వుండే క్యారెక్టర్ ఒకటుందట…. అయితే ఆ పాత్ర కోసం పలువురిని అనుకోని చివరకు ఓ యంగ్ హీరో ను సెలెక్ట్ చేశారట…గత సంవత్సరం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో డిటెక్టివ్ గా కనిపించి అందరి మన్ననలు అందుకున్న ‘నవీన్‌ పొలిశెట్టి’ ఇపుడు బాలయ్య పక్కన కీలక పాత్రలోనటించ బోతున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని `జయ జానకి నాయక ` ఫేమ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు కాగా అందులో ఒక పాత్ర అఘోరా కావడం విశేషం .

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. బోయపాటి – బాలకృష్ణ కలయికలో ` సింహ , లెజెండ్ `వంటి చిత్రాలు వచ్చి భారీ హిట్స్ కావడం తో ఈ మూడో చిత్రం ఫై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. .