
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయి. సోమవారం టీఆర్ఎస్ 20వ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ జెండాను మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి వంటి వాడని చెప్పారు. తన నియోజకవర్గానికి అన్ని తానేనని.. ఇక్కడికి ఎవరూ రావాలన్నా తన అనుమతి తీసుకోవాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించారు. ఒక తల్లికి.. తండ్రికి పుట్టినవాళ్లయితే తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్నా అంటూ రాజయ్య ఆవేశానికి లోనయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన కడియం శ్రీహరిని ఉద్దేశించి చేశారనే చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తోంది. వీరిమధ్య ఎప్పటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో రాజయ్య మద్దతుగా కడియం శ్రీహరి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో రాజయ్య స్వల్ప మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే.
తాజాగా స్టేషన్ ఘాన్ పూర్లో కడియం శ్రీహరి మళ్లీ పట్టుకోసం ప్రయత్నిస్తుండటంతోనే రాజయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదనలు నియోజకవర్గంలో విన్పిస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..! ప్రస్తుతం రాజయ్య వ్యాఖ్యలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.