
గాంధీలోని ముస్లిం రోగులకు రంజాన్ కానుకగా మాంసాహారం అందిస్తున్నారని వస్తున్న వార్తలపై ఆసత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. గాంధీలోని కరోనా పేషంట్లకు ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గాంధీలోకి మాంసాహారాన్ని అనుమతించేదని స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా ఎవరైనా ఇంటి నుంచి రోగులకు మాంసాహారాన్ని తీసుకొచ్చినా వాటిని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీనికి బదులుగా రోగులకు పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని కరోనా బాధితులందరికీ దాదాపుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు వైద్యులు డైట్ అమలు చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు గాంధీలో మాంసాహారం అందిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మాంసాహారం, మసాలా ఆహారం తీసుకోవడం వల్ల రోగులకు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బయటి నుంచి తెచ్చే ఆహారాన్ని కూడా అనుమతించడం లేదని తెలిపారు. గాంధీలోని రోగులకు వెజిటబుల్ బిర్యానీ, కిచిడీ, తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, కోడిగుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రిలో పెడుతున్న ఆహారంపై మంత్రి ఈటల ఇటీవలే స్పష్టతనివ్వగా తాజాగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు.