Home Blog Page 8510

ఓహో… కిమ్ అదృశ్యానికి కారణం ఇదా!

గత నాలుగు నెలలుగా కరోనా వైరస్ వార్తలు, రెండు వారాలుగా కిమ్ జోంగ్ ఉన్ అదృశ్యం ప్రపంచ దేశాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏప్రిల్ 15 నుంచి కనిపించకుండాపోయాడు. అప్పట్నుంచి ఈ వార్త ప్రపంచ దేశాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అదృశ్యం వెనుక అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా మరో ఆసక్తికర అప్‌ డేట్ బయటకి వచ్చింది.

కరోనా వైరస్ భయాందోళనతోనే కిమ్ జోంగ్ ఉన్ బయటి ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చునని ఉత్తర కొరియా వ్యవహారాలకు సంబంధించిన దక్షిణ కొరియా మంత్రి తాజాగా అభిప్రాయపడ్డారు. కిమ్‌ కి ఏదో అయిపోయిందని.. అతను మరణం అంచుల్లో ఉన్నాడని సర్వత్రా ప్రపంచం జరుగుతున్న వేళ.. అసలు ఉత్తర కొరియాలో అలాంటి ఛాయలేవి కనిపించట్లేదన్నారు. కిమ్‌ కి ఏదైనా జరిగితే కచ్చితంగా ఆ దేశంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుని ఉండేవని.. కానీ అవేవీ కనిపించట్లేదని నొక్కి చెప్పారు.

కరోనాకి భయపడే కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారన్న వార్తలపై కొరియా రిస్క్ గ్రూప్ సీఈవో కరోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే స్థానిక మీడియా నవ్వుల పాలవుతుందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లడం విమర్శలకు తావిస్తుందన్నారు. అంతేకాదు,ఒకవేళ కరోనా బారిన పడకుండా ఉండేందుకే కిమ్ రహస్య ప్రదేశంలో తలదాచుకుని ఉంటే.. ఆయన ఫోటోలు,వీడియోలు విడుదల చేయవచ్చు కదా అన్నారు. తద్వారా ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలకు చెక్ పెట్టవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.

కిమ్ ఇలా కనిపించకపోవడం కూడా ఇదేమీ కొత్త కాదని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే కిమ్ యోన్-చుల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు దాదాపుగా 20 రోజుల పాటు కనిపించకుండా పోయారని చెప్పారు. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయంపై స్పందిస్తూ.. అక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.

కరోనా వేళ.. చిన్నారుల్లో వింత లక్షణాలు..!


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అన్నిదేశాలకు కరోనా పాకింది. చైనాలో కంటే చైనాయేతర దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, యూరప్ దేశాలు కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. బ్రిటన్లో కరోనా వైరస్ విజృంభిస్తుండగానే మరోవైపు అక్కడి చిన్నారులు పెద్దసంఖ్యలో అనారోగ్యం బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటన్లోని చిన్నారుల్లో టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానిక వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడురోజులుగా కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధుపడుతున్న వందలాది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కరోనా బాధితుల్లోనూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలని కోరింది. అనుమానితులను గుర్తించి ఐసీయూల్లో చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.

ఒకవైపు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు సెంటిస్టులు కష్టపడుతుండగా మరోవైపు చిన్నారుల్లో కొత్త లక్షణాలు బయటపడుతుండటం కలవరం రేపుతోంది. కాగా బ్రిటన్లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఒక లక్షా 69వేలకు చేరుకోగా 24వేల మంది మృత్యువాతపడ్డారు.

ప్లాస్మా చికిత్స చట్ట విరుద్ధమని కేంద్రం స్పష్టం


కరోనా కట్టడికి తగిన చికిత్స విధానం అందుబాటులో లేకపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా విధానాన్ని అనుసరిస్తున్న సమయంలో అది ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ కేంద్రం వారికి షాక్ కలిగించింది. మొదటగా ఈ విధానాన్ని అమలు పరచిన ఢిల్లీ ప్రభుత్వం ఒక రోగి విషయమై విజయవంతమైన్నట్లు ప్రకటించి సంబరం చేసుకోవడం తెలిసిందే.

అయితే ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉన్నదని, ఇంకా నిరూపితం కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత వైద్య పరిశోధన మండలి పరిశోధన జరుపుతున్నదని, ఖచ్చితమైన ఫలితాలు వచ్చే వరకు రాష్ట్రాలు ఒక చికిత్స విధానంగా అమలు పరచవద్దని హితవు చెప్పింది.

ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరమని, అంతేకాకుండా చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని, కరోనాకు ఇదే చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు.

ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు.

మరోసారి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయమందించేందుకు పలువురు సెలబెట్రీలు ముందుకొచ్చారు. ఈమేరకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తనవంతు సాయంగా ప్రధానమంత్రి సహాయనిధికి 25కోట్ల భారీ విరాళాన్ని అందించిన సంగతి తెల్సిందే. అంతటితో ఆగిపోకుండా కరోనాపై పోరాడుతున్న వారికి సాయం అందిస్తున్నాడు. ఈనేపథ్యంలో ముంబైలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అక్షయ్ కుమార్ ముంబై మున్సిల్ కార్పొరేషన్ రూ.3కోట్ల విరాళాన్ని అందించి గొప్పమనస్సును చాటుకున్నాడు.

తాజాగా మరోసారి రూ.2కోట్ల భారీ విరాళాన్ని అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ఇటీవల ముంబైలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు కరోనా సోకి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ వారి సేవలను గుర్తించి కొనియాడారు. ఈమేరకు ముంబై పోలీసు ఫౌండేషన్ కు రూ.2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అక్షయ్ కుమార్ సాయంపై ముంబై సీపీ అక్షయ్‌కి ట్వీటర్లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళాన్ని కలుపుకుంటే మొత్తంగా 30కోట్లు అవుతోంది. ఇంతపెద్దమొత్తంలో విరాళం అందించడంతో ఆయనపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షయ్ రియల్ హీరో అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

రేషన్ ఇవ్వలేమంటున్న డీలర్లు..!


రాష్ట్రంలో మూడవ విడత రేషన్ పంపిణీ మా వల్ల కాదంటూ రేషన్ డీలర్లు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా మరో 70 వేళా మందికి ప్రభుత్వం కార్డులు పంపిణీ చేసింది. కరోనా నేపథ్యంలో మూడు విడతలుగా బియ్యం, కందిపప్పు కార్డుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి, రెండవ విడత రేషన్ పంపిణీలో కార్డుదారుల వేలిముద్రలు ఈ-పోస్ మిషన్లపై తీసుకోలేదు. వేలిముద్రలు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడవ విడత రేషన్ పంపిణీలో వెలిముద్ర తప్పనిసరి చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శ్రీధర్ ఆదేశాలు ఇచ్చారు.

ఒక్కో రేషన్ డిపోలో 600 నుంచి వెయ్యి వరకు కార్డులు ఉన్నాయి. వీరందరి వేలిముద్రలు ఈ-పోస్ యంత్రంపై తీసుకుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ చేసి వైరస్ బారిన పడలేమని డీలర్లు అంటున్నారు. గత రెండు విడతల్లో శానిటైజర్, సోప్, మాస్కులు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడాన్ని డీలర్లు తప్పుబడుతున్నారు. రేషన్ డీలర్లకు వాలంటీర్ల తరహాలో బీమా సౌకర్యం లేదని ఏ దైర్యంతో తాము రేషన్ పంపిణీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేలిముద్రలు తీసుకుని తాము రేషన్ పంపిణీ చేయలేమని స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల సంఘము అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ విషయాన్ని మీడియాకు వెల్లలించారు.

నో బయోపిక్ అంటున్న నరేష్


ప్రస్తుతం సోషల్ మీడియా అంతా పుకార్ల పల్లకిలో ఊరేగు తోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంలా అవాస్తవాలు అక్షర రూపంలో దర్శన మిస్తున్నాయి. ముందు వార్త రావడం ఆ తరవాత ఆ వార్త తాలూకు వ్యక్తులు దాన్ని ఖండించడం మీడియా లో సర్వసాధారణమై పోతోంది. ఇపుడు అలాంటిదే మరో వార్త మీడియాలోకి దూసుకొచ్చింది . తెలుగు చిత్రసీమలో మహిళా దర్శకురాలుగా చెరగని ముద్ర వేసి, గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించు కొన్న నటి , కృష్ణ గారి శ్రీమతి అయిన , దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు తెలుగు నాట వీర విహారం చేశాయి.అంతేకాదు ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు కూడా నొక్కి చెప్పాయి .

కాగా ఈ వార్తలపై స్పందిస్తూ విజయనిర్మల కుమారుడు సీనియర్ నరేశ్ .” అమ్మ పేరుతో బయోపిక్ ను నిర్మించడం లేదని… ఇతరులు ఎవరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు ” అని నొక్కి చెప్పారు. దీంతో విజయ నిర్మల గారి బయోపిక్ చిత్ర వార్తలకు తెర పడినట్టయింది.

తెలుగు సినీ చరిత్రలో మరపురాని రోజు


సినిమాల పరంగా సెంటిమెంట్స్ బాగా పాటిస్తారు నిర్మాత , దర్శకులు. ఒక సినిమా విడుదలై సక్సెస్ అయితే ఆ రోజు కి ఒక ప్రాధాన్యత వస్తుంది. ఫలానా సినిమా ,ఫలానా రోజున విడుదలై ఘన విజయం సాధించింది అంటూ లెక్కలు వేసుకొని మరీ తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ఒక్కోసారి ఆ లెక్క నిజమౌతుంది కూడా … అలాంటిదే ఈ ఏప్రిల్ 28 వ తారీకు.

ప్రముఖ దర్శకుడు కె . రాఘవేంద్ర రావు యొక్క సినీ జీవితంలో ఏప్రిల్ 28 మరపురాని రోజని చెప్పొచ్చు. దర్శకుడు కె .రాఘవేంద్ర రావు ని స్టార్ డైరెక్టర్ గా మార్చిన రోజు కూడా ఇదే. అప్పటి దాకా దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలు అంతంత మాత్రం గా ఆడాయి. ఆ క్రమంలో నందమూరి తారక రామారావు తో కన్నడం లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన , రాజ్ కుమార్ చిత్రం ” గందధ గుడి ” చిత్రాన్ని రీమేక్ చేసి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. తన సినీ ప్రస్థానం లో ఊహించని స్థాయి కి ఎదిగాడు. అప్పటిదాకా తెలుగు సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన అడవి రాముడు చిత్రం , 43 ఏళ్ల క్రితం ఇదే ఏప్రిల్ 28 న విడుదలైంది. .

విచిత్రం గా అదే ఏప్రిల్ 28 న మరో చారిత్రాత్మక విజయం సాధించిన మరో చిత్రం కూడా విడుదలైంది. హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి 2 విడుదల అయిన రోజు కూడా ఇదే ఏప్రిల్ 28 కావడం మరో విశేషం. 2017 ఏప్రిల్ 28 న విడుదల అయిన బాహుబాలి 2 ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యి నేటికీ తెలుగు సినీ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోయింది .

రాష్ట్రానికి కేంద్రం బృందం వస్తోందా?


రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కంటే రెట్టింపు కేసులు ఉన్న తెలంగాణాను వెనక్కి నెట్టి ముందుకెళ్లడం ప్రజల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం నాటికి పాజిటివ్ కేసులు 1,259కి చేరాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332, గుంటూరు జిల్లాలో 254, కృష్ణా జిల్లాలో 223 ఈ మూడు జిల్లాలోనే రాష్ట్రంలోని 64.25 శాతం (809) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గోప్యంగా ఉంచుతూ పూర్తి వెల్లడిచడం లేదని అన్ని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సీఎం తొలిసారి లాక్ డౌన్ ముగిసే సమయంలో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మాత్రమే వైరస్ ప్రభావం ఉందని, కేసులు లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ తొలగించాలని ప్రధానికి సీఎం జగన్ వివరించడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించడం జరుగుతుందని చెబుతోంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించకపోవడంతో అక్కడ వైరస్ ప్రభావం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసులు దాస్తోందని టిడిపి, బీజేపీ, సీపీఐ పార్టీలు విమర్శిస్తున్నాయి. బీజేపీ నాయకులు ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసుల సంఖ్యను దాచే యత్నం చేయవద్దని సీఎస్ లను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణా లోను కేంద్ర బృందం పర్యటిస్తోంది. మే 3న రెండవ విడత లాక్ డౌన్ గడువు ముగియడంతో తదనంతర నిర్ణయాలు తీసుకోవడం కోసం కేంద్రానికి దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉండటంతో రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ఖాయంగా తెలుస్తోంది.

24గంటల్లో 1543 కరోనా పాజిటివ్ కేసులు!

భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసులు 29,435కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు చేరువవుతుండటం గమనార్హం. గడచిన 24 గంటల్లో కొత్తగా భారత్‌ లో 1543 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా 62 మంది మృతి చెందినట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకూ భారత్‌ లో కరోనా బారిన పడిన వారిలో 6,864 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా నుండి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నట్లు లవ్ అగర్వాల్ ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, సాంకేతికతను ఉపయోగించి కరోనా కేసులను గుర్తిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

మే‌ నాటికి అందుబాటులో స్వ‌దేశీ క‌రోనా టెస్టు కిట్లు


కరోనా టెస్ట్ కిట్ ల కోసం విదేశాలపై ఆధార పడకుండా, దేశంలోనే పెద్ద ఎత్తున తయారుకు రంగం సిద్ధమవుతున్నది. మే నాటికి స్వదేశీ కిట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్ష వర్ధన్ ప్రకటించారు. మే చివరి నాటికి లక్ష కిట్లు అందుబాటులోకి రాగలవని భావిస్తున్నారు.

చైనా నుండి దిగుమతి చేసుకున్న కిట్లు నాసిరకంవని వెల్లడి కావడంతో వాటిని వెనుకకు పంపుతున్న సందర్భంగా దేశీయంగానే వీటి ఉత్పత్తి పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. తి త్వ‌ర‌లోనే భార‌త్ లో త‌యారైన ఆర్టీ – పీసీఆర్, ర్యాపిట్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

వాటి అభివృద్ధికి ప‌లు కంపెనీలు, ప‌రిశోధ‌న సంస్థ‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పురోగతి సాధిస్తున్నాయి. భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) ఆమోదంతో త్వ‌ర‌లోనే అవి క‌రోనా టెస్టు కిట్ల ఉత్ప‌త్తి ప్రారంభించ‌బోతున్నాయి.

అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మే నెల‌లో స్వ‌దేశీ క‌రోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయ‌ని చెప్పారు.

క‌రోనాను గుర్తించేందుకు అత్యంత ప్రామాణిక‌మైన ఆర్టీ – పీసీఆర్ టెస్టు కిట్స్ తో పాటు యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టు కిట్లు కూడా భార‌త్ లోనే త‌యార‌వ‌బోతున్నాయ‌ని మంత్రి తెలిపారు.

కరోనా టైంలో.. హిమచల్‌ ప్రదేశ్‌లో భూకంపం


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమై ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస భూకంపాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12.17నిమిషాలకు చంబా ప్రాంతంలో భూప్రకంనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

గతంలోనూ ఈ ప్రాంతంలో స్వల్పంగా భూకంపం వచ్చిందని అప్పటి తీవ్రత 3.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భౌగోళిక స్థానం కారణంగా ప్రతీయేటా హిమచల్ ప్రదేశ్లో తేలికపాటి భూకంపాలు తరుచూ సంభవిస్తుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంగానీ జరుగలేదని అధికారులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్న సమయంలో భూకంపాలు వస్తుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల దేశరాజధాని ఢిల్లీలోనూ వరుసగా రెండ్రోజుల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడం ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా టైంలో వరుసగా భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనపై నిర్లక్ష్యం వహించింది ఇద్దరే ట్రంప్, జగన్


జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్, సాధారణ జ్వరం అంటూ జగన్ అవగాహనలేమి వల్ల కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనాను సీరియస్ గా తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి అత్యంత తేలిక భావంతో ఉన్నారని తెలిపారు. ప్రపంచంలో కరోనా పట్ల మూర్ఖంగా మాట్లాడిన మొదటి వ్యక్తి ట్రంప్ అయితే.. రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సీఎం తీరు వల్లే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ప్రబలుతున్నాయని జగన్, వైసీపీ ధనదాహానికి టెస్టింగ్ కిట్లలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరుగిందని తెలిపారు. వైద్య సిబ్బందికి మాస్కులు లేవని, కనీస సదుపాయాలు కూడా వారికి కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో 13 జిల్లాల్లో రైతుల కోసం జగన్ తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రక్రియ మొదలైన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఎన్ని టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది, ఎంతమేర చెల్లింపులు చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడులు వస్తే రెండు, మూడు లక్షలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. వీటికి కూడా సరిగా నగదు చెల్లింపులు చేయలేదని తెలిపారు. 13 జిల్లాల్లో వరి ఎంత పండింది, ఎంత కొనుగోలు చేశారు, రైతులకు చెల్లించిన మొత్తం తదితర అంశం పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, పూలతోటల రైతులు నాశనం అయ్యారన్నారు. ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. 40 రోజుల వ్యవధిలో ఒక్క టన్ను రొయ్యలు కానీ, చేపలు కానీ కొన్నారా అని ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించారా. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందన్నారు. కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వలేదు.

రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారని, అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, కులవృత్తులు చేసుకునే వారు పస్తులతో ఉంటున్నారని తెలిపారు. దీనికి కారణం జగన్ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందన్నారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని, కరోనాతో జీవితాంతం ఉండాల్సి వస్తుందని నిన్న జగన్ మాట్లాడటం అసమర్థతకు నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించబట్టే కరోనా విస్తృతమవుతోందని, జగన్ పేద కుటుంబాలను ఏ విధంగానూ ఆదుకోలేదని తెలిపారు. దీనిపై టీడీపీ పోరాడుతుందని చెప్పారు.

ఆ మంచి పనికి మేము సిద్ధం:అసదుద్దీన్

Owaisi

కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌ కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు అసదుద్దీన్.

హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను వైద్యులు సేకరించనున్నారు. సీరియస్‌ కండీషన్‌ లో ఉన్నవారికి ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు

కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కరోనా‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని వైద్యులు నిరూపిస్తున్న తరుణంలో కరోనాను జయించిన వాళ్లు ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు అసదుద్దీన్‌ తెలిపారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రశంసలు!


తెలంగాణలో కరోనా కట్టడికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసలు కురిపిస్తోంది. తెలంగాణలో లాక్‌ డౌన్‌ ఫలితాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. కాబట్టి లాక్ డౌన్ ని డిసెంబరు వరకు పొడిగించాలని ఆయన తెలిపారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడటం పిచ్చి చర్య అవుతుందన్నారు. రాహుల్‌ గాంధీ.. కేవలం లాక్‌ డౌన్‌ వల్లనే కరోనాను కట్టడి చేయలేమని మాత్రమే అన్నారని, లాక్‌ డౌన్‌ ఎత్తివేయాలని చెప్పలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తోందని, తన నియోజకవర్గంలో తానే స్వయంగా ప్రారంభించానని, రైతులకు చెక్కులు కూడా అందించామని చెప్పారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కు తమ పార్టీ తరఫున లేఖ రాస్తానన్నారు. రానున్నవన్నీ సామూహిక పండుగలే అయినందున.. లాక్‌ డౌన్‌ పొడిగింపు అవసరమని పేర్కొన్నారు. చానల్‌ తో, సీఎల్పీ సమావేశంలో, ఒక ప్రకటనలో జగ్గారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.  పండుగల పేరుతో లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే ఇప్పటివరకూ ప్రభుత్వం పడిన కష్టమంతా వృథా అవుతుందన్నారు. పండుగల వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు. లాక్‌ డౌన్‌ ను పొడిగించుకుని వచ్చే ఏడాది ఈ పండుగలను ఘనంగా జరుపుకుందామని అన్నారు. దీంతో ఇబ్బంది పడే దినసరి కూలీలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయాలన్నారు. వైద్యుల పర్యవేక్షణలో పరిశ్రమలను నడిపి వలస కూలీలను ఆదుకోవాలని సూచించారు.అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తరఫున చేయూత ఇవ్వాలన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని తెలిపారు.

తెలంగాణలో కొన్ని పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్..


తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడిచిన ఐదువారాలుగా రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతో అన్నిరంగాలకు చెందిన కార్మికులు, కూలీలు, యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఉండటంతో ప్రభుత్వం కొన్నిరంగాలకు షరతులతో కూడిన అనుమతులిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయరంగానికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ధాన్యం కోతలకు వచ్చిన దశలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కొన్నిరంగాలకు లాక్డౌన్లో మినహాయింపులిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది.

లాక్డౌన్ గడచిన 36రోజులుగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈమేరకు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత పరిశ్రమలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్, స్టోన్‌ క్రషర్లు, ఇటుక బట్టీలు, వరికోత యంత్రాలు రిపేర్‌ షాపులను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణలో వరిపంటలు కోతకు వచ్చాయని దీంతో రాష్ట్రంలోని దాదాపుగా 15వేలకు పైగా వరికోత యంత్రాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వరికోతలు జరుగుతున్న సమయంలో కొన్ని యంత్రాలు మరమ్మతులకు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాక్టర్, వరికోత యంత్రాలు రిపేర్‌ చేసే షాపులకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కరోనా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరింది. మాస్కులు, సామాజిక దూరంగా పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించింది. పనిలోకి వెళ్లే కూలీలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ డీజీపీ, అన్నిజిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మత్స్యకార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం తాజాగా కొన్ని పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో ఆయారంగాల్లో పనిచేసే సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని చూస్తే తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా లాక్డౌన్ ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మే7వరకు లాక్డౌన్ కొనసాగనుంది.

సందీప్ వంగా మూడో చిత్రం హిందీలోనే


తెలుగు సినిమా ఇపుడు మార్పు కోరుకొంటోంది. ఆ క్రమంలో కొత్త దర్శకులు వెరైటీ కథలతో తెరమీదకి వస్తున్నారు. అలా `అర్జున్ రెడ్డి’ అనే బోల్డ్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నాడు. యంగ్ డైరెక్టర్ సందీప్ వంగా అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం తో రెడీ అయ్యాడు. అయితే సందీప్ ఈ సారి బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడట.

నిజానికి సందీప్ వంగా తన మూడో సినిమాని తెలుగులో తీయాలని ప్రయత్నించాడు. కానీ తెలుగు హీరో లెవరూ ముందుకు రాలేదు. దాంతో సందీప్ వంగా తన మూడో సినిమాని హిందీలో తీయడానికి నిశ్చయించు కొన్నాడు. నిజానికి హిందీ నిర్మాతలు సందీప్ వంగా సినిమాల కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత లైన భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని సందీప్ వంగా తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ గా ఉన్నారు. వీరితోపాటే సందీప్ వంగా అన్నయ్య , ప్రణయ్ వంగా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కానున్నాడు . ఇక ఈ చిత్రానికి `డెవిల్ ` అనే టైటిల్ ని అనుకొంటున్నట్టు తెల్సింది .

అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేస్తున్న కరోనా


నేడు ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను కావిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సోకగా సోకింది. ఇప్పటి వరకు దీని కట్టడికి వ్యాక్సిన్ గాని, మందు గాని లేకపోవడంతో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంతో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పటివరకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రపంచాన్ని ఆడిస్తున్న అగ్రరాజ్యాలే ఇప్పుడు ఈ వైరస్ కు కకావికలం అవుతున్నాయి.

మరోవంక, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కరోనాతో ఎక్కడ బైటపడతాయో అనే అనేకమంది ఆందోళన చెందుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి సాధార‌ణంగా ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. అందుకే ఎవ‌రిలోనైనా పాజిటివ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే చాలు వారిని వెంట‌నే ఐసోలేషన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే, ప్ర‌జ‌ల ప్రాణాలను రక్షించడం కోసం అధికారులు చేప‌డుతున్న ఈ చ‌ర్య‌లవ‌ల్ల అక్రమ సంబంధాలు కలిగి ఉన్న కొంద‌రి ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌ట్లుగా త‌యార‌య్యింది.

ఇటీవ‌ల భోపాల్‌లోని ఒక యువ‌తికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అందరిని అడిగిన‌ట్లుగానే ఆమె ప్రైమ‌రీ కాంటాక్టుల వివ‌రాల‌ను పోలీసులు ఆరాతీశారు. దీంతో ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌ విషయం చెప్పింది. కూతురు చెప్పింది విని అప్ప‌టిదాకా ఆ విషయం తెలియ‌ని త‌ల్లిదండ్రులు షాకయ్యారు.

ఆమె బాయ్‌ఫ్రెండ్‌ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. భోపాల్‌ పట్టణానికే చెందిన మరో యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని ప్రైమరీ కాంటాక్టుల వివరాలు అడగ్గా గర్ల్‌ఫ్రెండ్‌ విషయం చెప్పాడు. ఇప్పుడు షాకవడం పోలీసుల వంతయ్యింది.

ఎందుకంటే ఆ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు ముందుగా మరో బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన యువతి, ఆ యువతి ఒక్కతేనని తెలిసింది. అంటే ఒకే యువతి ఒకరికి తెలియకుండా ఒకరిని ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ తో చెలగాటమాడుతున్నది.

ఇక బెంగళూరులో ఇలాంటిదే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఫార్మసీలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించి, అతని కొలీగ్స్‌, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరిలో నెగెటివ్‌ వచ్చింది.

మరి అతనికి కరోనా ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. వెంటనే ఆమెను గుర్తించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.

కరోనావల్ల నిత్యం ఇలాంటి అక్రమ సంబంధాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారి విస్తరణ మొదలైన తర్వాత కూడా తమ అక్రమ సంబంధాలను కొనసాగించిన వారు మాత్రమే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కానీ, దేశంలో కరోనా కాలుమోపక ముందు నుంచే తమ సంబంధాలకు బ్రేక్‌ ఇచ్చిన వారు మాత్రం బతికిపోతున్నారు.