
తెలంగాణలో కరోనా కట్టడికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసలు కురిపిస్తోంది. తెలంగాణలో లాక్ డౌన్ ఫలితాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. కాబట్టి లాక్ డౌన్ ని డిసెంబరు వరకు పొడిగించాలని ఆయన తెలిపారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడటం పిచ్చి చర్య అవుతుందన్నారు. రాహుల్ గాంధీ.. కేవలం లాక్ డౌన్ వల్లనే కరోనాను కట్టడి చేయలేమని మాత్రమే అన్నారని, లాక్ డౌన్ ఎత్తివేయాలని చెప్పలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తోందని, తన నియోజకవర్గంలో తానే స్వయంగా ప్రారంభించానని, రైతులకు చెక్కులు కూడా అందించామని చెప్పారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ కు తమ పార్టీ తరఫున లేఖ రాస్తానన్నారు. రానున్నవన్నీ సామూహిక పండుగలే అయినందున.. లాక్ డౌన్ పొడిగింపు అవసరమని పేర్కొన్నారు. చానల్ తో, సీఎల్పీ సమావేశంలో, ఒక ప్రకటనలో జగ్గారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకూ ప్రభుత్వం పడిన కష్టమంతా వృథా అవుతుందన్నారు. పండుగల వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు. లాక్ డౌన్ ను పొడిగించుకుని వచ్చే ఏడాది ఈ పండుగలను ఘనంగా జరుపుకుందామని అన్నారు. దీంతో ఇబ్బంది పడే దినసరి కూలీలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయాలన్నారు. వైద్యుల పర్యవేక్షణలో పరిశ్రమలను నడిపి వలస కూలీలను ఆదుకోవాలని సూచించారు.అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తరఫున చేయూత ఇవ్వాలన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని తెలిపారు.