
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడిచిన ఐదువారాలుగా రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతో అన్నిరంగాలకు చెందిన కార్మికులు, కూలీలు, యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఉండటంతో ప్రభుత్వం కొన్నిరంగాలకు షరతులతో కూడిన అనుమతులిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయరంగానికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ధాన్యం కోతలకు వచ్చిన దశలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కొన్నిరంగాలకు లాక్డౌన్లో మినహాయింపులిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది.
లాక్డౌన్ గడచిన 36రోజులుగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈమేరకు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత పరిశ్రమలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్, స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, వరికోత యంత్రాలు రిపేర్ షాపులను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణలో వరిపంటలు కోతకు వచ్చాయని దీంతో రాష్ట్రంలోని దాదాపుగా 15వేలకు పైగా వరికోత యంత్రాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వరికోతలు జరుగుతున్న సమయంలో కొన్ని యంత్రాలు మరమ్మతులకు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాక్టర్, వరికోత యంత్రాలు రిపేర్ చేసే షాపులకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కరోనా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరింది. మాస్కులు, సామాజిక దూరంగా పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించింది. పనిలోకి వెళ్లే కూలీలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ డీజీపీ, అన్నిజిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మత్స్యకార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం తాజాగా కొన్ని పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో ఆయారంగాల్లో పనిచేసే సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని చూస్తే తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా లాక్డౌన్ ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మే7వరకు లాక్డౌన్ కొనసాగనుంది.