Home Blog Page 8493

సిఎస్ పదవీకాలం పెంపునకు ఒకే అన్న జగన్..!

అధికారంలో ఉన్నావారెవరైనా తమకు అనుకూలంగా ఉన్న వారిని అధికారులు నియమించుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం సిఎస్ గా పని చేస్తున్న నీలం సాహ్నిని కావాలని కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా ఎల్.వి సుబ్రహ్మణ్యంను తప్పించి ఆయన స్థానంలో గత ఏడాది నవంబర్ లో ఏపీకి సీఎస్ గా తీసుకువచ్చారు. ఆమె పదవీ కాలం జూన్ తో ముగియనున్న నేపథ్యంలో ఆరు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను సానుకూలంగా పని చేస్తుండటంతో నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారు. దీనికి తోడు కరోనా ప్రభావం సీఎస్ కలిసి వచ్చిందనే చెప్పాలి.

మరోవైపు, కరోనా నేపథ్యంలో రిటైర్ కావాల్సిన అధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇదే విధంగా నీలం సాహ్ని పదవీకాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి సీఎస్ టాక్కర్ పదవీ కాలాన్ని రెండు పర్యాయాలు పొడిగించారు. గతంలో వైయస్ మరణించిన సమయంలో అప్పటి సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. ఏపీ విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని నాలుగు నెలలు పొడిగించింది. దీంతో నీలం సాహ్ని ఏపీకి సి.ఎస్ గా మరో ఆరు నెలలు పని చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికలప్పుడే కేసీఆర్‌ కు రైతుబంధు గుర్తొచ్చేది!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వస్తే పెరుగన్నం తినొచ్చన్నారు..హాయిగా ఉండొచ్చొన్నారని, పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా రావడం లేదని ద్వజమెత్తారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌ కు రైతు బంధు గుర్తొస్తుందన్నారు. తను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే.. కల్యాణ లక్ష్మి ఇస్తానని కేసీఆర్‌ అంటారేమోనని ఎద్దేవాచేశారు. మంత్రి హరీష్‌రావు ఉమ్మడి జిల్లా మెదక్‌ కు చేసిందేమీ లేదన్నారు. సంగారెడ్డిలో హరీష్‌రావు మీటింగ్ పెడితే హాజరై రైతుబంధుపై నిలదీస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.

పోర్న్ స్టార్ తో రాంగోపాల్ వర్మ న్యూడ్ ఫిల్మ్

దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. వివాదాలతో కాలక్షేపం చేయడం వర్మకు కొత్తేమీ కాదు. సినిమా హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలన్నీ సంచనాలను సృష్టిస్తుంటాయి. తాజాగా రాంగోపాల్ వర్మ మరో సంచలనాన్ని సృష్టించేందుకు రెడీ అవుతోన్నారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఓ న్యూడ్ ఫిల్మ్ తెరకెక్కించేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి ‘క్లైమాక్స్’ అనే టైటిల్ ఖరారు చేశాడు. దీనికి సంబంధించిన టీజర్ సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీటర్లో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

గతంలోనూ వర్మ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(GST) అనే న్యూడ్ ఫిల్మ్ తెరకెక్కించాడు. దీనిపై అప్పట్లో మహిళా సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే వారందరికీ వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే న్యూడ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. నేటి సాయంత్రం 5గంటలకు ఈ ఫీల్మ్ టీజర్ విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీటర్లో ట్వీట్ చేశాడు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తానంటూ వర్మ చెప్పారు.

తెలంగాణ విద్యార్థుల గోడు పట్టని కేటీఆర్ 

 వాట్స్ యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారెవ్వరు   సంప్రదించినా వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఉంటారని  మీడియాలో తరచూ వార్తలు చూస్తుంటాము. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడే కాక కాబోయే ముఖ్యమంత్రిగా పేరొందారు. తెరవెనుక నిజమైన అధికార కేంద్రంగా  వ్యవహరిస్తున్నారని ప్రతీతి. 

దేశ విదేశాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన తెలంగాణ వారిని వెనుకకు రప్పించడానికి ఎంతో శ్రమిస్తున్నట్లు నిత్యం మీడియాలో కనిపించే ఆయన ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. 

పంజాబ్ లోని జలంధర్లో  చిక్కుకు పోయిన సుమారు 400 మంది విద్యార్థులకోసం  కేంద్ర రైల్వే మంత్రి ప్రత్యేక రైలు ఏర్పాటుకు సిద్ధంగాఉండడంతో, తెలంగాణకు వచ్చెందుకు అనుమతింపమని కేటీఆర్ కు, ఇతర ముఖ్య అధికారులకు ఎన్ని వినతులు పంపుతున్నా స్పందనే కనిపించడం లేదు. 

లాక్ డౌన్ కారణంగా పంజాబ్ లోని జలంధర్ లో చిక్కుకు పోయిన సుమారు వేయి మంది తెలుగు విద్యార్థులు ఆర్ ఎస్ ఎస్ చొరవతో ఇంటికి చేరుకొనే మార్గం ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించడంతో ఆ రాష్ట్రానికి చెందిన 600 మంది విద్యార్థులు బుధవారమే బయలుదేరి, గురువారం సాయంత్రంకు విజయవాడ చేరుకోనున్నారు. 

జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చ్ 22 నుండి హాస్టల్స్ మూసివేసి, బయటకు పంపివేయడంతో, రవాణా సదుపాయం లేక వారక్కడ చిక్కుకు పోయారు. వారిలో కొద్దీ మందికి స్థానిక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు భజన, వసతి ఏర్పాట్లు చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారం ఎం యాదిరెడ్డి వారిని సంప్రదించగా మొత్తం 1000 మంది తెలుగు విద్యార్థులు అక్కడ దిక్కుతోచని స్థితిలో, తల ఒక చోట ఉండిపోయారని తెలుసుకున్నారు.

వెంటనే బిజెపి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, తెలంగాణ బిజెపి ఇంచార్జ్ కృష్ణ దాస్ ల ద్వారా కేంద్ర రైల్వే మంత్రిని సంప్రదించారు. వారికోసం ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే మంత్రి అంగీకరించారు. 

ఆ తర్వాత సంప్రదించగా ఏపీ ప్రభుత్వం స్పందించి ప్రత్యేక రైలులో వచ్చేవారిని వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దానితో ఒక ప్రత్యేక రైలులో బుధవారం 600 మంది బయలుదేరారు. ఆ రైలులో మరో 60 బెర్త్ లు ఖాళీగా ఉండగా, తెలంగాణకు చెందిన విద్యార్థులు సహితం కొద్దిమంది బయలుదేరారు. వారు వరంగల్ లో దిగుతారు. 

అయితే తెలంగాణ విద్యార్థులు తిరిగి రావడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు. ఆ విద్యార్థులు స్వయంగా మంత్రి కె టి ఆర్ కు, ఇతర ప్రముఖులకు  వాట్స్ యాప్ లో ఎన్ని సార్లు వినతులు పంపినా స్పందించడం లేదు. దానితో వారింకా అక్కడే ఉండిపోయారు. 

జలంధర్ లోనే రైలు ఎక్కే సమయంలోనే వైద్యుల బృందం వారికి ఆరోగ్య పరిక్షలు జరిపి, వారికి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతనే రైలులో ఎక్కించారు. రైలులో సహితం భౌతిక దూరం, మాస్క్ లు వంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

అవసరం అనుకొంటూ రైలు దిగే సమయంలో సహితం స్థానిక అధికారులు వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు జరిపించి, వారిని స్వీయ నిర్బంధంలో ఉండేవిధంగా తమ తమ ఇళ్లకు పంపవచ్చని యాదిరెడ్డి తెలిపారు. 

శ్రీవారి దర్శనం రోజులో ఎంతమందికి దక్కనుంది?

దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. కేవలం పూజారులు దేవాలయాల్లో నిత్యపూజలు చేస్తుండగా భక్తులకు దర్శనాలను రద్దుచేశారు. ఇటీవల కేంద్రం గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో సడలింపులు ఇస్తుంది. ఈనేపథ్యంలోనే దాదాపు అన్నిరంగాలకు కేంద్రం షరతులతో కూడిన అనుతమలను ఇస్తోంది. కేవలం సామూహికంగా, ఎక్కువ సంఖ్యలో గుమ్మికూడే ప్రాంతాలైన దేవాలయాలు, సినిమా థియేటర్లు, భారీ పరిశ్రమలకు వంటి వాటికి మాత్రమే ఇప్పటివరకు అనుమతి లభించడం లేదు. అయితే ఈనెల 17తో లాక్డౌన్ 3.0 ముగియనుండటంతో దేవాలయాలకు సడలింపులిచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లాక్డౌన్ కారణంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో దేవాదాయ శాఖ వేలకోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోయింది.  ఈ పరిస్థితుల్లో దేవాలయ సిబ్బంది, కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దేవాయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వ్యాపారులు భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో తిరిగి దేవాలయాలు తెరుచుకోనుండటంతో ఆయా దేవాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిచ్చేందుకు సన్నహాలు చేస్తుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొందరిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయినట్లు సమాచారం.

శ్రీవారి దర్శనానికి ప్రతీరోజు 14గంటలపాటు భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు 500మంది మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మూడురోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతి ఇవ్వనున్నారు. తర్వాత 15రోజులపాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంతో రోజుకు 7వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తొలిగా మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు టికెట్లను టీటీడీ విక్రయించనుంది. ఈమేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అన్నిరకాల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.

నిత్యం శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రించాల్సిన ముగ్గురు : మంచు విష్ణు

హీరో మంచు విష్ణు స‌రికొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. భారత సాయుధ ద‌ళాల గురించి.. ప్ర‌త్యేకించి అందులో తెలుగు వీర జ‌వాన్ల గురించి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గురువారం త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా ఆయ‌న తెలియ‌జేశారు. ఆర్మీలో తెలుగు జ‌వాన్ల వీర‌త్వాన్ని లేదా త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవ‌రి ద‌గ్గ‌రైనా ఉంటే త‌న‌కు పంపించాల్సిందిగా కూడా ఆయ‌న కోరారు.
“ప్ర‌పంచంలో మ‌నం నిత్యం శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రించాల్సిన వారు ముగ్గురు.. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి, మ‌న ఆక‌లి తీర్చే రైత‌న్న‌, త‌న కుటుంబానికి దూర‌మై మ‌న భ‌ద్ర‌త కోసం కాప‌లా కాసే వీర జ‌వాన్‌. ఈ ముగ్గురికి ల‌భించాల్సిన గుర్తింపు ద‌క్క‌ట్లేద‌ని నా భావ‌న‌. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆద‌ర్శ‌నీయులైన క‌న్న‌త‌ల్లుల్ని, క‌ష్ట‌జీవులైన రైత‌న్న‌ల‌ను క‌లిసే అదృష్టం నాకు క‌లిగింది. కానీ వీర జ‌వాన్ల‌ను క‌లిసే అదృష్టం నాకెప్పుడూ క‌ల‌గ‌లేదు. ఇప్పుడు భార‌త ఆర్మ్‌డ్ ఫోర్సెస్ గురించి తెలుసుకొనే కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్నాను. ప్ర‌పంచంలో ఎంతో స‌మ‌ర్థ‌వంత‌మైన భార‌త ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో అడుగుపెట్టి మ‌న దేశాన్ని గ‌ర్వింప‌జేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ న‌మ‌స్క‌రిస్తూ.. ముఖ్యంగా ఆర్మీలో త‌మ ముద్ర‌వేసిన తెలుగు వీర‌జ‌వాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవ‌రి ద‌గ్గ‌రైనా మ‌న తెలుగు వీర‌సైనికుల త్యాగాల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాళ్ల పేర్లు ఉంటే నా సోష‌ల్ మీడియా అకౌంట్‌కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్ర‌పంచంతో వాళ్ల వీర‌క‌థ‌ల్ని పంచుకుందాం. జై జ‌వాన్.. జై కిసాన్‌.. జై హింద్‌! అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని విష్ణు షేర్ చేశారు.

జగన్ సర్కార్ పై ఫైర్ అయిన హరీష్ రావు!

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్ సర్కార్ జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 805 అడుగుల స్థాయి లో లిఫ్ట్ పెడుతున్నారంటే తెలంగాణపై ఎంతగా కుట్రలకు పాల్పడుతున్నారో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం ఉన్నతస్థాయి కమిటీ అనుమతి కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్నదానికి చాలా తేడా ఉంటోదని హరీష్ అన్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై గతంలోనే కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు కూడా హరీష్ చెప్పారు.రాయలసీమ ఎత్తిపోతల పై మళ్లీ కేంద్రానికి, కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని హరీష్ చెప్పారు.

ఎల్‌.జి.పోలీమర్స్ విషవాయు ప్రభావంపై ఆందోళన

ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిసర గ్రామాల్లో స్ట్రైరీన్‌ విషవాయువు ప్రభావం అదుపులోకి రాకపోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. బాధిత గ్రామాల్లో గత మంగళవారం ఇద్దరు వాలంటీర్లు, ఒక ఆశ వర్కర్లు స్పృహ తప్పిపడిపోవడం గమనార్హం. గ్రామాల్లోకి వచ్చిన స్థానికులు సహితం అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.

మరోవైపు బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన దానికి వాస్తవంలో అందిస్తున్న మొత్తానికి భారీ తేడా ఉండటంతో స్థానికులు ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వం మాటతప్పిందని మండిపడుతున్నారు. మంత్రుల ముందే వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రమాద ఘటనతో గ్రామం విడిచి వెళ్లిపోయిన తమ బంధువుల ఇళ్లలోనూ, పునరావాస కేంద్రాల్లోనూ తలదాచుకున్న వెంకటాపురం, ఇతర నాలుగు గ్రామాల ప్రజలు ఊళ్లలోకి రావడం మొదలుపెట్టారు. అయితే, వీరు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.

ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదంలో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన బాధితులకు పరిహారం చెల్లింపులో కూడా ప్రభుత్వం మాట తప్పింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఒకరొక్కరికి లక్ష్య రూపాయలు చొప్పున ఇవ్వవలసి ఉండగా, రూ 25 వేలు మాత్రమే పంపిణి చేయడం స్థానికులతో తిరుగుబాటుకు దారితీస్తుంది. కొందరికి పరిహారం ఇవ్వకుండానే డిశ్చార్జ్ చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇలా ఉండగా, మొదటి నుండి కంపెనీ యాజమాన్యాన్ని కాపాడటం కోసం పట్లనే శ్రద్ద చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం పట్ల దృష్టి సారింపకుండా వారికి ప్రయోజనం కలిగించేందుకు ఎంతవరకైనా వెళ్ళడానికి వెనుకాడటం లేదు.

తాజాగా, సుమారు రూ.91 కోట్ల విలువైన స్టైరిన్‌ తరలింపు అందులో భాగమేనని తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీ తిరిగి తెరుచుకోవడానికి ఆరు నెలల వరకు పెట్టె అవకాశం ఉన్నందున అవి వృద్దా అయి కంపెనీకి నష్టం జరుగకుండా కొరియాకు ప్రభుత్వమే దగ్గర ఉంది తరలించినట్లు తెలుస్తున్నది.

ఏపీలో అన్ని దుకాణాలకు అనుమతి..!

రాష్ట్రంలో కంటోన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో షాపులు తెరుచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఈ మార్గదర్శకాలను అనుసరించి గ్రామాల్లో షాపులు, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న షాపులతో పాటు, అతి తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర దుకాణాలు తెరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. షాపుల యజమానులు ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను పాటించాలని తెలిపింది. వినియోగదారులు, కొనుగోలుదారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, దుకాణాల వద్ద శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని వెల్లడించింది

సున్నాన్ని చూసి బ్లీచింగ్ అనుకుంటార్లే..!

బ్లీచింగ్ కొనుగోళ్ళలో చిన్న చితక చిలక్కొట్టుళ్ళు గ్రామ పంచాయితీల్లో చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. కరోనా కాలంలో బ్లీచింగ్ పేరుతో రూ. కోట్ల మొత్తంలో కుంభకోణం వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు బహిరంగ ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల నుంచి రూ.70 కోట్లు పైబడి నకిలీ బ్లీచింగ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

కుంభకోణం ఎలా జరిగిందంటే..తెల్ల సున్నానికి బ్లీచింగ్ వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మేశారు గుంటూరు జిల్లా వ్యాపారులు.

కుంభకోణం ఎలా జరిగిందంటే..తెల్ల సున్నానికి బ్లీచింగ్ వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మేశారు గుంటూరు జిల్లా వ్యాపారులు. పిడుగురాళ్ల నుంచి కాకినాడకు బ్లీచింగ్ సరఫరా జరిగినట్లు సమాచారం. బ్లీచింగ్ సరైంది కాదంటూ కాకినాడ కలెక్టర్‌ దృష్టికి కింది స్థాయి అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై వెంటనే గుంటూరు కలెక్టర్‌కు కాకినాడ కలెక్టర్ సమాచారం అందజేశారు. దీనిపై విచారణ జరుపగా అసలు పిడుగురాళ్లలో బ్లీచింగ్ తయారీ కంపెనీ లేదని గుర్తించారు. గుంటూరు జిల్లాలో కూడా ఇదే నకిలీ బ్లీచింగ్ సరఫరా అయినట్లు గుర్తించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ విచారణకు ఆదేశించారు. పిడుగురాళ్లలో 2 రోజుల క్రితం సున్నం మిల్లులో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బ్లీచింగ్ ఇక్కడి నుంచే సరఫరా చేశారా అనే సందేహాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా విచారణ జరుపుతున్నారు.

రానా పెళ్లి పనులు షూరు..!

హీరో రానా ఇటీవల తన ప్రేమాయణాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టాడు. తన ప్రియురాలు తన లవ్ ను ఓకే చేసిందని ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో పలువురు సెలబ్రెటీలు రానాకు విషెష్ తెలిపారు. ఈనేపథ్యంలో రానా పెళ్లి త్వరలోనే జరుగనుందని క్లారిటీ వచ్చింది. ఈమేరకు రానా తండ్రి, టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు పెళ్లిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రానా-మిహీకాలు ఒకరికొకరు చాలారోజులుగా తెలుసని అన్నారు.

కానీ వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని విషయం తెలియదని చెప్పారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని తాను అనుకోలేదని చెప్పారు. అయితే రానా పెళ్లి విషయం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని సురేష్ బాబు తెలిపారు.

లాక్డౌన్ సమయంలో రానా తనకు పెద్ద పని పెట్టాడని సురేష్ బాబు అన్నారు. ఇప్పటి నుంచి రానా పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అన్ని పనులు కలిస్తే రానా పెళ్లి డిసెంబర్లోనే చేసేందుకు రెడీ అన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఇటీవల దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన విక్టరీ వెంకటేష్ తన కూతురి వివాహం అంగరంగ వైభవంగా చేశారు. తాజాగా సురేష్ బాబు తన కుమారుడు రానాకు త్వరలోనే పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో దగ్గుపాటి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

సింపుల్ గా పెళ్లికానిచ్చేసిన నిఖిల్

 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. శామిర్ పేటలోని ఓ ప్రయివేట్ అతిథిగృహంలో గురువారం ఉదయం 6.31గంటలకు నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇరుకుటుంబాలకు చెందిన కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరు ఒక్కటయ్యారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ నిఖిల్ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు.

నిఖిల్ పెళ్లి తొలుత ఏప్రిల్ 16న అనుకున్నప్పటికీ దేశంలో లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత మే 14న పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే దేశంలో లాక్డౌన్ పొడగిస్తుండటంతో మరోసారి పెళ్లి వాయిదా వేసుకునేందుకు నిఖిల్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకునేందుకు ఇరుకుటుంబాలు అంగీకరించారు. నిన్న ఇరు కుటుంబాల ఇంట్లో సింపుల్ గా వివాహ వేడుకలు జరుగగా నేడు ఉదయం పెళ్లితో నిఖిల్-పల్లవి వర్మలు ఒక్కటయ్యారు. పల్లవి వర్మ వైద్యురాలిగా సేవలందిస్తుంది. ఇక నిఖిల్ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నాడు. వీరిద్దరి ప్రేమ వివాహం. ఎట్టకేలకు నిఖిల్ ఓ ఇంటివాడు కావడంతో అభిమానులు, పలువురు సెలబ్రెటీలు వివాహా శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్‌టిసి బస్సులపై రేపే కేసీఆర్ నిర్ణయం..

కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విషయమై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఆర్ టి సి బస్సులను నడపడం, సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తెరవడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గత వారం నుండి కేంద్రం సూచనలమేరకు పలు సడలింపులు ఇచ్చారు.

ఇప్పట్లో రైళ్లను నడపవద్దని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కోరిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా కేంద్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండడం వల్ల తలెత్తున్న సమస్యలు, దీని వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులపై కూడా ఈ సమీక్షలో లోతుగా చర్చించనున్నారు.

కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఇక దానితో కలిసి జీవించే అంశాలపై కూడా లోతుగా సమాలోచనలు చేయనున్నారు. గత 5న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మద్యం షాప్ లతో పాటు ఆర్‌టిఎ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వంటి ప్రభుత్వ కార్యాలయాలు సహితం తెలంగాణలో తెరుచుకున్నాయి.

ఇదే తరహాల్లో ఆర్‌టిసి బస్సులను నడిపే విషయంలో కూడా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెండు మాసాలుగా పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ఆర్‌టిసిని ఆర్ధిక నష్టాల నుంచి గట్టెక్కించడానికి వీలైనంత త్వరగా బస్సులను నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

అయితే ఈ బసులను నడపడం వల్ల కరోనా వైరస్‌ను ఏ మేరకు నియంత్రించేందుకు అవకాశముంటుంది? ఒకవేళ అనుమతులను ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తదితర అంశాలపై ఇప్పటికే సిఎం కెసిఆర్ రవాణా శాఖ అధికారులతో కూలంకషంగా చర్చించినట్లుగా చెబుతున్నారు.

పలు రాష్ట్రాల్లో ఇంటి వద్దకే మద్యం

మద్యం దుకాణాలు తెరవడంతో ఒకేసారి జనం గుంపులుగా ఎగబాకడంతో లాక్ డౌన్ ప్రయోజనాలు అన్ని నీరుగారి పోతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో ఇంటివద్దకు మద్యం సరఫరా చేసే ఆలోచనలు చేయమని సుప్రీం కోర్ట్ సూచించడం తెలిసిందే.

ఈ సూచన పట్ల ఇప్పుడు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ మేరకు తమ ఎక్సైజ్‌ పాలసీల్లో సవరణలకు సిద్ధమవుతున్నాయి.

కేరళలో ఆన్‌లైన్‌లో ఈ-టోకెన్ల జారీ చేసి, టేక్‌ అవే ద్వారా మద్యం సరఫరా చేయనున్నారు. మహారాష్ట్రలో నేటి నుంచి మద్యం హోమ్‌ డెలివరీ చేస్తున్నారు. ఢిల్లీలో ఈ-కామర్స్‌ సంస్థల సాయంతో మద్యం హోమ్‌ డెలివరీ ప్రతిపాదన చేస్తున్నారు.

తమిళనాడులో మద్యం హోమ్‌ డెలివరీకి లాజిస్టిక్‌ సంస్థల సాయాన్ని తీసుకోవడంపై మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ:లో పైవేటు సంస్థల సాయంతో మద్యం హోమ్‌ డెలివరీకి పరిశీలన చేస్తున్నారు. కర్ణాటకలో ఆన్‌లైన్‌, హోమ్‌ డెలివరీ ద్వారా మద్యం అమ్మకాలను ప్రారంభించే యోచన చేస్తున్నారు.

భూముల వేలానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా..!

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం అర్రులు చాస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్రానికి ఆదాయం 70 శాతం వరకూ తగ్గినట్లు ఓ అంచనా. మరోవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చించాల్సి రావడం, మరోవైపు లోటు బడ్జెట్ కారణంగా ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ప్రారంభమైయ్యాయి. దీంతో రాష్ట్రంలోని విలువైన భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. తొలివిడతగా విశాఖ, గుంటూరులో ఉన్న 9 ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించడంతో రూ. 300 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూముల ఇ-వేలం ప్రక్రియ బిల్డ్‌ ఏపీ మిషన్ ఆధ్వర్యంలో జరగనుంది.

వేలం వేసే భూముల వివరాలు (విశాఖ):

చిన గడ్లీ- 1 ఎకరం
రిజర్వ్ ధర: రూ. 16.64 కోట్లు.

చినగడ్లీ- 75 సెంట్లు.
రిజర్వ్ ధర: రూ. 14.47 కోట్లు.

అగనంపూడి- 50 సెంట్లు
రిజర్వ్ ధర: రూ. 3.25 కోట్లు.

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.04 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 4.67 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 35 సెంట్లు.
రిజర్వ్ ధర: రూ. 1.47 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.93 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 8.39 కోట్లు

వేలం వేసే భూముల వివరాలు (గుంటూరు):

నల్లపాడు- 6.07 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 16. 96 కోట్లు.

శ్రీనగర్ కాలనీ- 5.44 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 75.41 కోట్లు.

మెయిన్ జీటీ రోడ్- 1.72 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 67.36 కోట్లు.

14మంది వలస కూలలు దుర్మరణం!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కూలీల బాధలు వర్ణనాతీతం. సొంత ప్రాంతాలకు వెళ్లేవారు కాలినడకన నడుస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల దుర్మరణం మారువకముందే తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలలో పద్నాలుగు మంది వలస కార్మికులు మరణించడం బాధాకరం.

ఉత్తర్ ప్రదేశ్, బిహార్ కు చెందిన వలస కూలీలు తమ ప్రదేశాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటనలు జరిగాయి. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ వద్ద వలస కూలీలపై ఒక బస్ దూసుకు వెళ్లగా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. . బిహార్ కు చెందిన వీరంతా పంజాబ్ నుంచి తమ స్వగ్రామానికి కాలినడకన వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించారు. మద్యప్రదేశ్ లో జరిగిన మరో ఘటనలో ఎనిమిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర నుంచి సుమారు 60 మంది వలసకూలీలు లారీలో తమ స్వస్థలానికి బయలుదేరగా గుణ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. లారీ్,బస్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు.

యువతి ప్రాణం తీసిన లాక్ డౌన్..!

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కొందరికి శాపంగా మారింది. తప్పనిసరి పరిస్థితిలో మరో గ్రామానికి వెళ్లినా అక్కడ వాలంటీర్ల సాహాయంతో వారిని గుర్తించి వెనక్కి పంపుతున్న సంఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. మరోవైపు లాక్ డౌన్ వల్ల తెలంగాణా నుంచి ఏపీకి రావడానికి అనుమతి లేకపోతే పోలీసులు అంగీకరించక పోవడంతో ఆ తల్లిదండ్రులు కుమార్తెను హైదరాబాద్ లొనే ఉండాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన వీర వల్లిక అనే యువతి, తానుండే అపార్టుమెంట్ 15వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మణికొండలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వీర వల్లిక అనే యువతి, మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి, ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ల్యాంకో హిల్స్ లో నివాసం ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయం మూత పడటంతో హైదరాబాద్ లోనే చిక్కుకుపోయింది. ఆమె స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో తనను ఎలాగైనా తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులను కోరింది. ఈ సమయంలో రావద్దని, గ్రామంలో సైతం కొత్త వారిని రానివ్వడం లేదని, లాక్ డౌన్ ముగిసేంత వరకూ హైదరాబాద్ లోనే ఉండాలని వారు సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా కరోనా కాలంలో కన్న తండ్రిని కొడుకులు ఇంటికి రానివ్వని ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్న తన సోదరుడు ఇంటికి మార్చిలో వెళ్ళాడు. అనంతరం లాక్ డౌన్తో ఇన్నాళ్లు అక్కడే ఉండిపోయాడు. ఈ నెల 10వ తేదీన తెనాలి వచ్చాడు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో రోడ్డుపైనే ఉన్నాడు. స్థానిక సి.ఐ రాజేష్ కుమార్ కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రిని ఇంటికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకున్నారు.