Home Blog Page 8492

దేశంలో 20 లక్షలకు చేరిన కరోనా టెస్టులు

ఈ నెల చివరికల్లా దేశం రోజుకు లక్ష కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 20 లక్షల టెస్టుల మార్క్‌కు చేరుకున్నామని కూడా చెప్పారు. మంత్రి జాతీయ అంటువ్యాధుల నిరోధక కేంద్రం (ఎన్‌సిడిసి) కేంద్రంలో అతి తక్కువ సమయంలో కోవిడ్19 టెస్టింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్), ఎన్‌సిడిసిలు కలిసి కోవిడ్19 శాంపిల్స్‌ను పరీక్షించడానికి 500 ల్యాబ్‌లను అభివృద్ధి చేశాయని చెప్పారు. రోష్ కంపెనీకి చెందిన కోబాస్6800 యంత్రాన్ని ప్రారంభిస్తూ ఇది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రమని, రాత్రిపూట పని చేయనప్పటికీ రోజుకు 800 టెస్టులు నిర్వహించగలదని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఇలాంటి యంత్రాలను భువనేశ్వర్‌లోని ఐసిఎంఆర్‌లో ఒకటి, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఒకటి ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు ఎన్‌సిడిసిలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మరిన్ని యంత్రాలకు ఆర్డర్ చేసిందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యే రేటు 13.9 శాతానికి తగ్గిందని హర్షవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా గత 24 గంటల్లో14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు.

దామన్, డయ్యు, సిక్కిం, నాగాలాండ్, లక్షదీవుల్లో ఇప్పటివరకుఒక్క కరోనా కేసు కూడా రాలేదని కూడా ఆయన తెలిపారు. ‘గత 14 రోజులుగా డబ్లింగ్ రేటు 11.1 రోజులుగా ఉండగా, గత మూడు రోజులుగా అది 13.9 రోజులకు తగ్గడం సంతోషించదగ్గ పరిణామం’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇలా ఉండగా, 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,722 పాజిటివ్ కేసులు నమోదుకాగా, దేశంలో మొత్త కేసుల సంఖ్య 78,003కు చేరున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 134 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,549కి చేరుకుంది.

మెగాస్టార్ ను సూపర్ స్టార్ ఢీ కొడుతారా?

ప్రతీయేటా సంక్రాంతికి బడా హీరోల సినిమాలు థియేటర్లలో కనువిందు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈయేడాది సంక్రాంతికి కూడా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.‘అలవైకుంఠపురములో’ మూవీతో అల్లు అర్జున్, ‘సరిలేరునీకెవ్వరు’తో మహేష్ బాబు ఇద్దరు కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుందుకొని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ల్ లన్నీ వాయిదాపడటంతో ఈసారి సంక్రాంతి పోటీ ఓ రేంజ్లో ఉండేలా కన్పిస్తోంది.

2021 సంక్రాంతి పోటీలో ఇద్దరు బిగ్ స్టార్లు పోటీపడుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఈసారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. రజనీకాంత్ మూవీలన్నీ మూడేళ్లుగా సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. 2020 సంక్రాంతి ‘దర్బార్’, 2019లో ‘పేట’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా షూటింగ్ జరుపుకుంటున్న ‘అన్నాత్తే’ మూవీని దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీతోపాటు కీర్తిసురేష్, సీనియర్ హీరోయిన్లు ఖుష్భూ, మీనా నటిస్తున్నారు.

డైరెక్టర్ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ అభిమానులకు అలరించేలా ‘ఆచార్య’ను తీర్చిదిద్దుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. తొలుత దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సినిమా వాయిదాపడటంతో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలువనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీరోల్ చేస్తున్నారు. రాంచరణ్ డేట్స్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చరణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే ఈ మూవీ ఉగాదికి పోస్టుపోన్ అవడం ఖాయంగా కన్పిస్తుంది. కాగా ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. చిరు పక్కన యంగ్ హీరోయిన్ రెజీనా ఆడిపాడనుంది. ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి సంక్రాంతి మెగాస్టార్-సూపర్ స్టార్ తలపడనుండటంతో వీరిద్దరిలో గెలుపెవరిదీ అనే చర్చ మొదలైంది.

వర్మ స్టైల్లో.. ఆకట్టుకున్న ‘క్లైమాక్స్’ టీజర్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తాజాగా అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఈనెల 14న సాయంత్రం 5గంటలకు రాంగోపాల్ వర్మ ట్వీటర్లో ప్రకటించాడు. అన్నట్లుగానే రాంగోపాల్ ‘క్లైమాక్స్’ టీజర్ తన ట్వీటర్లో విడుదల చేశారు. ఈ టీజర్ వర్మ స్టైల్లో ఆద్యంతం అభిమానులను అలరించింది. టీజర్ చూస్తే ఇది ఓ స్పస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఎడారిలో మియా మాల్కోవా తన ప్రియుడితో కలిసి నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశిస్తుంది. వారి ఓ ముసుగు వేసుకున్న బృందం వెంటాడుతూ తర్వాత ఏం జరుగబోతుందనే సస్పెన్స్ ను తలపిస్తోంది. ఇక ఎడారిలో మియా మాల్కోవా అందాల ప్రదర్శన యువతను కిక్కించేలా ఉన్నాయి. ఇక చివర్లో ఈ మూవీ ట్రైలర్ ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు వర్మ టీజర్లో చూపించాడు.

గతంలోనూ దర్శకుడు వర్మ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(GST)అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. ఇందులో మియా మాల్కోవా నగ్నంగా నటించడంపై అప్పట్లో మహిళా సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమయింది. వారందరికీ వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చి సంచలనం సృష్టించాడు. సన్నీ లియోన్ తర్వాత ఇండియన్ సినిమాలో నటించిన పార్న్ స్టార్ గా మియా మాల్కోవా నిలిచింది. ఆర్జీవీ అభిమాన తార అయిన అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 2018లో కలిసి పని చేశాడు. తాజాగా మరోసారి ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కోవాతో జతకలిశాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘క్లైమాక్స్’ అభిమానుల్లో ఆద్యంతం అలరించడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ మూవీకి మియా మాల్కోవా అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి. ఇక ఈ మూవీ కోసం పని చేస్తున్న ఇతర నటీనటులు, ఇతర టెక్నిషియన్ల వివరాలను తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్లో దూసుకెళుతోంది.

Here is the TEASER of CLIMAX starring @MiaMalkova ..It is a scary action packed thriller set in a desert ..A RSR production A @shreyaset presentation https://t.co/QsgwbRNjAs

లాక్ డౌన్4.0లో సడలింపులు ఇవేనా?

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడోవ దశ లాక్ డౌన్ ఈ నెల 17 తో ముగియనుంది.18వ తేదీ నుంచి నాలుగో ద‌శ లాక్‌ డౌన్ అమ‌లు కానుంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్4.0లో ఎటువంటి ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తారు, ఎక్క‌డెక్క‌డ స‌డ‌లింపులు ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. నాలుగో ద‌శ లాక్‌ డౌన్ కొత్త రూపంలో ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు హాట్‌ స్పాట్ కాని జోన్ల‌లో లోక‌ల్ బ‌స్సులు న‌డిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కేంద్ర‌ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ద్వారా తెలుస్తుంది. ఆటోలు, ట్యాక్సీల‌ను కూడా ప్ర‌యాణికుల సంఖ్య‌ను కుదించి న‌డ‌పనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బ‌స్సులను నడుపనున్నారు.  అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌కు కూడా కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశాలు ఉన్నాయి.  అయితే ట్రావెల్ పాసులు ఉన్న‌వారు మాత్ర‌మే మ‌రో రాష్ట్రానికి బ‌స్సు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

దేశీయ విమాన స‌ర్వీసుల‌ను కూడా వచ్చే వారం ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక రైళ్ల స‌ర్వీసులు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం నిత్యావ‌ర‌స వ‌స్తువులే కాదు, ఇక నుంచి అన్ని ర‌కాల వ‌స్తువులకు హోం డెలివ‌రీ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు అన్ని కోణాలపై కేంద్రం దృష్టి సారించనుంది.

అవ భూముల కొనుగోలుకు హైకోర్టు బ్రేక్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో ఇళ్ళ పట్టాలపై కుంభకోణం జరిగిందంటూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. బూరుగుపూడికి చెందిన రైతు వేసిన ఈ పిటిషన్ లో 600 ఎకరాల భూమి కొనుగులులో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. తూర్పుగోదవరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో ఎకరం రూ. 7.20 లక్షల విలువ చేసే భూమికి ప్రభుత్వం రూ. 45 లక్షలు చెల్లించింది. అదేవిధంగా ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాలకు ఇస్తున్నారని, ఆ కొనుగోలులో, ఆరు రెట్లు అధిక ధర ఇచ్చారంటూ, కోర్ట్ దృష్టికి తెచ్చారు పిటీషన్ తరుపు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు. అధికారులు, నాయకులు కుమ్మక్కు అయ్యి ప్రజాధనం వృధా చేసారని చెప్పారు. అక్కడున్న 20 అడుగులు లోతు గుంతలు పుడ్చాలంటే వందల కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని కోర్ట్ కు తెలిపారు.

ఈ విషయంలో హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భూములు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరుపు వాదనలను అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇలాంటి కేసు పై దక్షిణ ఆఫ్రికాలో జడ్జిమెంట్ లను ఆయన ప్రస్తావించారు. అయితే సుప్రీం తీర్పులే దీని పై ఉదాహరణగా ఉన్నప్పుడు, ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకుని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తమకు కౌంటర్ దాఖలు చెయ్యటానికి సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరటంతో కేసును హైకోర్ట్ వాయిదా వేసింది.

రాజమండ్రి అర్బన్, రూరల్ మండల ప్రాంతంలోని 42,742 మంది పేదలైన లబ్దిదారులకు నవరత్నాలు పేరిట ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది మన ప్రభుత్వం. ఈ మేరకు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లభ్యం లేకపోవడంతో రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, కోరుకొండ మండలంలో 177 ఎకరాల్లో ఉన్న ఈ ఆవ భూములు కొనుగోలు చేసే విధంగా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. ఈ భూములు గోదావరి ప్లడ్ ఎఫెక్ట్డ్ ల్యాండ్ ప్రాంతంగా ఉందని మార్చి 9 వ తేదీన జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ ఒక లేఖ కూడా రాసారు. జలవనరులశాఖ నివేదిక ఇచ్చినా అధికారులు పక్కన పెట్టేశారు.

రాజధాని రైతుల కోరిక నెరవేరేనా..!

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 150 వ రోజుకు చేరుకున్నాయి. మన అమరావతి మన రాజధాని నినాదంతో రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో నిర్మాణ పనులు నిలిపివేసి, ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం ఉందంటూ ప్రకటన చేసింది.

దీంతో రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ ఆందోళనను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసింది. అయినా దృఢ సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. పోలీసుల కేసులకు వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ఇళ్లల్లోనే దీక్షలు చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించి రైతుల మనోభావాలకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఉద్యమం 150 రోజులకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలియజేయనున్నారు.

మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటుకు తెచ్చిన బిల్లు శాసనమండలిలో ఆమోదానికి నోచుకోలేదు. మరోవైపు అమరావతి శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పుకొస్తోంది. శాసన రాజధాని వల్ల ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వివాదం ఇలా ఉండగా విశాఖ నగరానికి 20 లారీలలో సీఎం క్యాంపు కార్యాలయ ఫర్నిచర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో ఉన్న ఒక ప్రదేశానికి తరలించింది. అయితే హైకోర్టులో రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో బిల్లుకు ఆమోదం లభించే వరకూ తరలింపునకు చర్యలు చేపట్టమని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల కోరిక నెరవేరుతుందా అనే సందేహం కలుగుతోంది. ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తుందని విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజధాని రైతులు మాత్రం అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘సుప్రీం’కు ఇంగ్లీష్ మీడియం పంచాయితీ..!

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఎస్‌ఈఆర్టీని వాడుకుంది. ప్రభుత్వం బలవంతంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు తప్పవు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 24 తీసుకొచ్చింది. ఎస్‌ఈఆర్టీ ఇచ్చిన 59 పేజీల నివేదిక ప్రకారం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు అందులో పేర్కొంది.

ఏ మాధ్యమంలో చదవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని బీజేపీ నేత సుదీష్ రాంబోట్ల అంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా శాఖ విడుదల చేసిన 80, 81 జి.ఓలను కొట్టేసింది. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసిన ఆయన ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఇంగ్లీష్ మిడియంను తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను సుప్రీంకోర్టు సాయంతో అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలుగు మీడియం కావాలని కోరిన 53,947 మంది విద్యార్థుల కోసం మండలానికొకటి చొప్పున 672 తెలుగు మీడియం స్కూలు నడపనున్నట్లు పేర్కొందని, అయితే, తమిళ, ఒరియా, కన్నడ, ఉర్దూ మీడియం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రభుత్వం ఆ జీవోలో చెప్పిందన్నారు. దీనిప్రకారం తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు ఏపీలో చాలా కష్టాలు ఎదురవుతాయని, ఏపీలో మండల కేంద్రానికి 50 – 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం మండలంలో కొన్ని గ్రామాలు ఆ మండల కేంద్రానికి వెళ్లాలంటే మరో నాలుగైదు మండలాలను దాటి వెళ్లాలన్నారు. అలాగే మిగతా జిల్లాల్లోనూ మండల కేంద్రానికి 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న గ్రామాలున్నాయన్నారు. అలాంటి చోట తెలుగు చదవాలనుకునే విద్యార్థులకు అసలు బడికి వెళ్లడమే కష్టమవుతుందన్నారు.

పెరుగుతున్న అద్దె గొడవలు!

కరోనా కారణంగా.. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరికి ఎటునుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. గత 50 రోజులనుండి ఇంట్లో ఉన్నవారందరు కూర్చొని తినడమే తప్ప, ఎటునుంచి రూపాయి ఆదాయం ఏమిలేకుండా పోయింది. దీంతో రాజధాని లో ఇంటి యజమానులకు, అద్దెకు ఉంటున్న వారికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా ఈ విషయంపై 8 మంది ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను ఒత్తిడి చేయవద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో విద్యార్థులు అద్దెఇళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. తమను అద్దె ఇవ్వాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు చేసిన ఫిర్యాదుల మేర తాము 8మంది ఇంటియజమానులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇంటి యజమానులకు నెలరోజుల పాటు జైలు శిక్ష లేదా రూ.200 ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి అద్దె డిమాండుపై ఫిర్యాదులు రావడంతో తాము కేసులు నమోదు చేశామని డీసీపీ విజయంత ఆర్యా చెప్పారు.

తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ విధమైన గొడవలు బాగానే జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైద్రాబాద్ ప్రాంతాలలో వసతి గృహాలలో ఉంటున్నవారికి యజమానుల నుండి, అద్దెలకు ఉంటున్నవారికి ఇంటి యజమానుల నుండి అద్దె కట్టమని తీవ్రమైన వత్తిడులు వస్తున్నాయి.విద్యార్థులు, అద్దె కి ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇంటి అద్దెలు ఇప్పట్లో వసూలు చేయవద్దని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది.

సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత!

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న అర్థరాత్రి అస్వస్థకు గురైయ్యారు. ఆమెకు ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

సబితా ఆరోగ్యంపై పలువురు మంత్రులు, నేతలు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సబిత ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. “అమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లు నార్మల్‌ గానే వచ్చాయని వైద్యులు తెలిపారు. మరి కొద్ది సేపట్లో డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకోనున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని” విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..!

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలు తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. విద్యుత్తు తీగలు కూలీల పాలిట మృత్యు దండాలుగా మారాయి. సంఘటనకు సంబంధించిన వివరాలోకి వెళితే మిరప కాయ కోతకు వెళ్లిన కూలీలు పని ముగించుకుని ట్రాక్టర్ లో ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. మార్గ మద్యంలో ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని డీ కొట్టింది. స్తంభం విరిగి ట్రాక్టర్ ట్రక్కుపై పడింది.

ట్రక్కులో కూర్చుని ఉన్న కూలీలు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో మొత్తం 20 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కరోనా కంట్రోల్: కేసీఆర్ కు మూడో ముప్పు

తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరలేదు. నెరవేరే చాన్స్ కూడా కనిపించడం లేదు. ఏప్రిల్ చివరి వారం వరకు తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ఒకానొక విలేకరుల సమావేశంలో ఘనంగా చాటాడు. కానీ పరిస్థితి తలకిందులైంది. ప్రారంభంలో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారితో తెలంగాణలో కరోనా వ్యాపించింది.. ఆ తర్వాత ఢిల్లీలో తబ్లిఘీ జమాత్ సమావేశానికి హాజరైన వారితో తెలంగాణలో రెండోదశలో కరోనా ముదిరింది. ఇప్పుడు తెలంగాణలో మూడో దశ కరోనా విస్తృతంగా వ్యాపించడానికి ఈ అంటువ్యాధి కాచుకు కూర్చుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*వలస తెస్తున్న కరోనా ముప్పు
తెలంగాణకు వలసలు పోటెత్తుతున్నాయి. రైళ్లు ప్రారంభంతో బిహార్, యూపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణ మిల్లులు, భవన ఇతర రంగాల్లో పనిచేయడానికి రైళ్లలో తరలివస్తున్నారు. తెలంగాణలో ధాన్యం విపరీతంగా ఉత్పత్తి కావడంతో మిల్లుల్లో హమాలీలుగా చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. ఈ పరిణామంతోనే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత ఐదురోజులలో కనీసం 35 మంది వలసదారులకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. మొన్నటివరకు 10 లోపే కరోనా కేసులు వెలుగుచూసినా తెలంగాణలో ఇప్పుడు 50 దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రం ప్రభుత్వానికి ఇదో హెచ్చరికగా మారింది. దీంతో వలసదారులను తనిఖీ చేసి పరీక్షలు చేశాకే అనుమతించాలని యోచిస్తున్నారు.

*తెలంగాణలో కంట్రోల్ కేసీఆర్ తో కష్టమేనా?

తెలంగాణలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 2న నిర్ధారణ చేశారు. ప్రతీసారి కరోనా కేసులు ఇక ముగిశాయని కేసీఆర్ భావిస్తూ విలేకరుల సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి సోకుతుందో తెలియని వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పుడు వలసదారులతో తెలంగాణ కొత్త సవాలును ఎదుర్కొంటోంది.గత నెలలోనే సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. మే 8 వరకు తెలంగాణలో అధిక రికవరీలు, డిశ్చార్జిలు జరిగి వ్యాధి నుంచి రాష్ట్రం విముక్తి చెందుతుందని ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండడం వారి ఆశలను అడియాసలు చేస్తోంది.

*తలకుమించిన భారంగా వలసదారుల ట్రాకింగ్
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని.. తబ్లిఘీ జమాత్ కు హాజరైన వారిని వారి కాంటాక్టులను ఈజీగా గుర్తించి, పరీక్షలు జరిపిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వలసదారులను ట్రాక్ చేయడం అధికారులకు తలకుమించిన భారం అవుతోంది. లాక్ డౌన్ సడలింపులతో చాలా మంది లారీలు, నడిచి, ఇతర మార్గాల్లో వివిధ రకాల మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో వలసదారులు, ప్రజలు తెలంగాణకు వస్తున్నారు. వీరిని గుర్తించడం అంత ఈజీకాదు.. ఇప్పటికే చాలా మంది గ్రామాలకు చేరుకున్నారు కూడా.. ఇప్పటివరకు 41805 మంది వలసదారులు రోడ్డు మార్గం ద్వారా తెలంగాణకు చేరుకున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 239 మంది రైలులో వచ్చారు. ఇక ఇతర దేశాల నుంచి విమానాల ద్వారా 798మంది వచ్చినట్టు అధికారులు తెలిపారు.

*మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ముప్పు
అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది తెలంగాణకు వలస వచ్చినట్టు అధికారుల లెక్కల్లో తేలుతోంది. ప్రస్తుతం దేశంలోనే 26వేలకు కేసులకు పైగా నమోదై మహారాష్ట్ర అతలాకుతలంగా ఉంది. దీంతో వారి ద్వారా మన తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఏర్పడింది.

*తెలంగాణలో ముసురుకున్న ముప్పు
రైళ్లు, ఇతర రవాణా మార్గాలను ఇప్పటికే సడలించడంతో చాలా మంది తెలంగాణకు వచ్చేశారు. ఇప్పుడు చెక్ పోస్టుల వద్ద సరైన స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందు చాలా మంది ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించి వారి గ్రామాలకు చేరుకొని కరోనా బాంబులుగా ప్రమాదకరంగా ఉన్నారు. వలసదారుల రాకతో రెండు వారాలుగా కొత్త కేసులు కనిపించని 26 జిల్లాల్లో కొన్ని రెడ్ జోన్ లోకి మారిపోయే ప్రమాదంలో పడ్డాయి.

*వలస ముప్పును అరికట్టడం కష్టమే..
తెలంగాణకు సరిహద్దుగా ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఇక వలసదారులు లారీలు, రైళ్లు ఇతర మార్గాల ద్వారా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే నిన్న 41 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 10మంది వలసదారులే ఉండడం గమనార్హం. మరణాల సంఖ్య 34కు చేరింది. తెలంగాణలో వలస కార్మికులు లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి.. దీంతో వారిని రాకుండా అడ్డుకోలేం. అలాగని కరోనా ముప్పును నియంత్రించలేని పరిస్థితి. చూస్తుంటే మున్ముందు వలస ముప్పుతో తెలంగాణలో కరోనా కేసులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

-నరేశ్ ఎన్నం

హైద్రాబాద్ లో చిక్కుకున్న ఏపీ వాసులకు శుభవార్త!

 

లాక్‌ డౌన్ కారణంగా హైదరాబాద్‌ లో చిక్కుకున్న ఏపీవాసులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే.. స్వస్థలాలకు వెళ్లాక క్వారంటైన్‌ లో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు పొందే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర హైఎండ్‌ సర్వీసుల్లో 50% ప్రయాణికులనే అనుమతిస్తారు. ఈ మేరకు సీట్ల అమరికను మార్చాలని సూచించినట్టు తెలుస్తోంది. దూర ప్రాంత బస్సుల్లో టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే, బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బస్టాండ్‌లో కండక్టర్లకు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా చార్జీ చెల్లించి ప్రయాణికులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు.

హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భౌతిక దూరం పాటిస్తూ 50 శాతం ప్రయాణికులతోనే బస్సులు నడపాలని భావిస్తోంది. రెండో దశలో బెంగళూరు, చెన్నై నుంచి బస్సులు నడపాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

ఆ భూములు కొంటే శిక్షార్హులే..!

రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం పేరుతో మరో కొత్త కుంభకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేసే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో ఆ భూములు కొన్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా తెదేపా అధికారంలోకి రాగానే ఆ భూములన్నీ ప్రభుత్వానికే దక్కేలా చేస్తామన్నారు.

భూముల వేలంకు బాధ్యులైన అధికార్లు, సహకరించిన వాళ్ళు, కొన్నవాళ్లు అందరూ
శిక్షార్హులవుతారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూదోపిడీలో భాగస్వాములవ వద్దని హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి రాగానే భూ వేలంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని భూములను ప్రభుత్వం స్వాధీన పరుచుకుంటుంది. రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఆపాలన్నారు.

తెదేపా అనుమతులిచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం తిరిగి అనుమతులిచ్చి గొప్పలు పోతోందని చెప్పారు. తెదేపా హయాంలో 25 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఆపేశారని, కోస్తాంధ్ర పట్టిసీమ, పురుషోత్తమపట్నం పోలవరం ప్రాజెక్టులో 70శాతం, వెలుగొండ, సంఘం నెల్లూరు ప్రాజెక్టులు , హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చరిత్ర సృష్టించామన్నారు.

రెడ్ జోన్ , గ్రీన్ జోన్ ఆరేంజ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ మిషన్ మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ఖజానాలో రూ.13వేల కోట్ల డబ్బుఉందని, రూ.20 వేల కోట్లు జీఎస్టీ కింద, కరోనా కట్టడికి కేంద్రం రూ.20 వేల కోట్లు అందించింని చెప్పారు. మరి ఇవాళ రూ.200 కోట్ల డబ్బుకోసం 9 స్థాలాలు విశాఖ, గుంటూరులో స్థలాల అమ్మకం ఎందుకని ప్రశ్నించారు.

రెండో రోజు ఆకట్టుకున్న నిర్మలమ్మ పధకాలు

రెండో రోజు మన తెలుగింటి కోడలు నిర్మలమ్మ మరికొన్ని వర్గాలకు, రంగాలకు వరాలు ప్రకటించారు. ఈరోజు అత్యంత పేద వర్గాలకు ఉపశమన చర్యలు ప్రకటించింది. నిన్న ప్రధానంగా సప్లై సైడ్ దృష్టి సారిస్తే ఈరోజు డిమాండ్ సైడ్ దృష్టి పెట్టింది. నిన్న ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి లో 35 శాతం , ఎగుమతుల్లో మూడింట ఒక వంతు ఉండటంతో ముందు దానిపై దృష్టి సారించారు. ఈ రోజు అత్యంత పేద వర్గాలు పడుతున్న కష్టాల మొర కొంతమేర ఆలకించింది. నిన్న ప్రధానంగా ద్రవ్య లభ్యతపై కేంద్రీకరించగా ఈ రోజు ఉపశమన చర్యలపై కేంద్రీకరించింది. ముఖ్యంగా వలస కార్మికులు, చిరు వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్, అలాగే చిన్న, సన్నకారు రైతులు ఈ ఉపశమనం పొందిన వారిలో వున్నారు. మధ్యతరగతికి సంబంధించి గృహ రుణాల్లో వడ్డీ సబ్సిడీ పై నిర్దిష్ట ఉపశమన చేసింది. అవేమిటో స్థూలంగా చూద్దాం.

వలస కార్మికులు
• ఉచిత ఆహార రేషన్ పధకాన్ని ఇంకో రెండు నెలలు పొడిగించారు .
• రేషన్ కార్డులు లేని వాళ్లకు కూడా ఉచిత రేషన్ ఇస్తారు.
• దీనికింద 8 కోట్ల వలస కార్మికులు ప్రయోజనం పొందుతారు.
• షుమారు 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.
జాతీయ పోర్టల్ ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. దీనికింద ఆగష్టు 31 వ తేదీ లోపల 83 శాతం అంటే 67 కోట్ల మంది ని తీసుకొస్తారు. మార్చి 2021 లోపల 100 శాతం మందిని ఇందులోకి తీసుకొస్తారు. అంటే రేషన్ కార్డు వున్న వాళ్ళు దేశం లో ఎక్కడ వున్నా అక్కడ రేషన్ షాప్ లో తీసుకోవచ్చు. ఇది ప్రధానంగా వలస కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఒక దేశం, ఒక రేషన్ పదకంగా పిలుస్తున్నారు.
వలస కార్మికుల కోసం ఇంకో పెద్ద పధకాన్ని ప్రకటించారు. అదేమిటంటే చౌక అద్దెకి వసతి కల్పించటం. ప్రస్తుతం వలస కార్మికులు తాత్కాలిక వసతి (ఎక్కువభాగం రేకుల షెడ్లు) లో ఉంటూ నానా ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తారు. కొన్ని ప్రభుత్వం, కొన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ,మరికొన్ని యజమానుల చొరవతో నిర్మించ నున్నారు. ఇది కనుక అమలయితే వలస కార్మికులకు పెద్ద ఉపశమనమే.

చిన్న ముద్ర రుణ దారులకు
• 50 వేల రూపాయలు లోపు తీసుకున్న ముద్ర రుణ గ్రహీతలకు ఇంకో 12 నెలలు 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తారు.
• దీనివలన 1.62 లక్షల కోట్ల రుణాలకు 3 కోట్లమందికి లబ్ది చేకూరుతుంది.
• దీనికి ప్రభుత్వానికి 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.

వీధి వ్యాపారస్తులు
• మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ ని కేంద్ర పధకాల పరిధి లోకి తీసుకొచ్చింది.
• దీనిద్వారా 50 లక్షల మంది కి 5 వేల కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున రుణ సదుపాయం కల్పిస్తారు.
• తిరిగి వ్యాపారం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.

చౌకగా గృహ రుణాలు
• దిగువ మధ్య తరగతి వర్గానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 వరకు గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. దీనికింద 3.3 లక్షల మంది లబ్ది పొందారు.
• ఈ పధకాన్ని ఇప్పుడు మార్చి 2021 వరకు పొడిగించారు. దీనివలన అదనంగా 2.5 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా.
• దీనివలన ప్రభుత్వానికి 70 వేల కోట్లు భారం పడుతుంది.
• ఈ ప్రోత్సాహకం ద్వారా గృహ నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ లాంటి అనేక రంగాలకు ఊతం దొరుకుతుంది.

చిన్న , సన్నకారు రైతులకు
• ఇప్పటికే ఇచ్చిన 30 వేల కోట్లకు అదనంగా మరో ౩౦ వేల కోట్ల రూపాయలు అత్యవసర వర్కింగ్ కాపిటల్ కింద నాబార్డ్ కి ప్రభుత్వం ఇస్తుంది. ఇది చిన్న, సన్నకారు రైతులకి సహాయపడుతుంది.
• అదనంగా 2.5 కోట్లమందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ సదుపాయం కల్పిస్తుంది. 2 లక్షల కోట్ల చౌక రుణ సదుపాయం దీని ద్వారా కలుగుతుంది.
• ఈ సదుపాయం మత్స్యకారులకు, డైరీ ( పాల ) రంగానికి కూడా విస్తరించారు.

ఆదివాసులకు
• రాష్ట్ర ప్రభుత్వాలు కంపా నిధుల కింద 6 వేల కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించాయి. వాటిని 10 రోజుల్లో అనుమతిస్తారు. దీనివలన అటవీకరణ తో పాటు ఆదివాసులకు ఉపాధి దొరుకుతుంది.
• ఇవీ రెండో రోజు ప్రకటించిన ఉద్దీపనా చర్యలు. దీనితో పాటు ఇప్పటికే ప్రభుత్వం ఈ రెండు నెలల్లో తీసుకున్న అనేక కార్యక్రమాలను కూడా వివరించింది. అందులో ముఖ్యమయినది వలస కార్మికుల కోసం ఇప్పటికే ఇచ్చిన 11 వేల కోట్ల రూపాయలు కూడా వున్నాయి. ఇప్పటివరకూ వలస కార్మికులకు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం కేంద్రం నుంచే నిధులు అందుతున్నట్లు దీన్నిబట్టి అర్ధమవుతుంది. అలాగే కేంద్రం దగ్గర పడివున్న కంపా నిధులు ఖర్చు చేయటం కోసం కేవలం 6 వేల కోట్ల ప్రతిపాదనలే కేంద్రం దగ్గర పెండింగ్ లో వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వున్న నిధుల్ని రాష్ట్రాలు వాడుకోలేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా ఎక్కువ ప్రతిపాదనలు రాష్ట్రాలు కేంద్రానికి పంపించి నిధులు వాడుకుంటాయని ఆశిద్దాం.

• ఇప్పటివరకూ ఈ రెండు రోజుల్లో ప్రకటించిన పధకాలు , ఉద్దీపనా చర్యలు ప్రజలకు వుత్తేజానిస్తున్నాయి. అనుకున్నదానికన్నా ఆలస్యమయినా ప్రభుత్వ పధకాలు కింది ప్రజల్ని దృష్టి లో పెట్టుకొని తయారుచేయటం ఆహ్వానించదగ్గది. ఇక రేపు ఏమి వస్తాయో వేచి చూద్దాం.

ఏపీలో పది పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..!

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. జులై 10వ తేదీ నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పేపర్ కు 100 మార్కులు ఉండే విధంగా పేపర్ లను సిద్ధం చేశారు. కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి సురేష్ ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9.30 ప్రారంభమై మధ్యాహ్నం 12.45 వరకూ జరుగుతాయి.

10-07-2020 (శుక్రవారం) – ఫస్ట్ లాంగ్వేజ్

11-07-2020 (శనివారం)- సెకండ్ లాంగ్వేజ్

12-07-2020 (ఆదివారం)- థర్డ్ లాంగ్వేజ్

13-07-2020(సోమవారం) – గణితం

14-07-2020(మంగళవారం) – జనరల్ సైన్స్

15-07-2020(బుధవారం) – సోషల్ స్టడీస్

16-07-2020(గురువారం) – OSSC మెయిన్ లాంగ్వేజ్

17-07-2020(శుక్రవారం) – SSC వొకేషనల్ కోర్సు

ఇది ఢిల్లీ వాసుల విన్నపం:కేజ్రీవాల్

 

‘ఇది ఢిల్లీ వాసుల విన్నపం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోడీ కి ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన అనేక అంశాలను పొందుపరిచారు. మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లు తెరవాలని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్లు కోరుకుంటున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. బేసి-సరి పద్ధతిలో రోజు మార్చి రోజు సగం దుకాణాలు తెరవాలని సూచించారని చెప్పారు. రెడ్‌ జోన్లు లేని చోట హోటళ్లు మూసివేసి హోం డెలివరీ చేసేలా రెస్టారెంట్లు తెరవాలని చాలామంది సూచించారని కేజ్రీవాల్ చెప్పారు. బార్బర్ షాపులు, స్పా‌లు, సెలూన్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, తెరవొద్దనే విషయంలో ఏకాభిప్రాయం ఉందన్నారు. వేసవి సెలవులు అయిపోయేవరకూ పాఠశాలలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని చాలామంది సూచించారని కేజ్రీవాల్ చెప్పారు. లాక్‌డౌన్ కొనసాగించాలని ఎక్కువ మంది ఢిల్లీ వాసులు కోరుకుంటున్నారని సీఎం తెలిపారు. 5 లక్షల మంది ఢిల్లీ వాసులు తమకు సూచనలు అందించారని చెప్పిన ఆయన ఈ వివరాలను ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ ద్వారా కేంద్రానికి అందిస్తామన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్3.0 కొనసాగుతోంది. ఈ నెల 17 వరకూ ఇది అమల్లో ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే నెలాఖరు వరకూ లాక్‌ డౌన్ పొడిగించాయి. ఈ తరుణంలో కేంద్రం లాక్‌ డౌన్‌‌ పై తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేసీఆర్ సర్కార్ కి ‘పెసరపప్పు’ ఆదేశం!

పాతకాలం నుండి ఒక సామెత బాగా ఫేమస్ అయింది, ఏమిటంటే…”అసలు లేదురా మొగుడా.. అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట” ఈ రోజు హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు ఇలానే ఉన్నాయి. రాష్ట్రంలో అధికసంఖ్యలో టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ఐసోలాషన్ లో ఉంచాల్సిన పనినే కేసీఆర్ సర్కార్ సరిగా చేయడం లేదు. అలాంటిది మృతదేహాలకి కూడా కరోనా టెస్టులు చేయమనడం ఎంత వరకు సబాబో హైకోర్టు న్యాయవాదులకే తెలియాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే… తెలంగాణలో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే… కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని వాదించారు. దీంతో మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఈ నెల 26న నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.

ఈ విషయం పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న జగన్ సర్కార్ ప్రతిఇంటిలో ఒకరికి కరోనా టెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అందుకు తగినట్లుగానే ఏపీ అధికారులు అడుగులు వేస్తున్నారు. కానీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడం, అప్పటినుండి రోజు రోజుకి కోవిద్ టెస్టులు భారీ స్థాయిలో తగ్గించారు. మరణాల సంఖ్య కూడా తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం దీనికి తోడు మృత దేహాలకి కూడా టెస్టులు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.