Home Blog Page 8483

మహేష్ ను చూస్తూ ఆగలేకపోయిన నమ్రత

లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు బీజీగా ఉండే స్టార్లు తమకు కలిసొచ్చిన ఈ సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. లాక్డౌన్లో తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి నిత్యం ఏదోఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. తాజాగా మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్ట్రాలో మహేష్ బాబుతో ఆడిన ఓ గేమ్ ను పోస్టును చేసింది. చాలా రోమాంటిక్ గా ఉన్న గేమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CAc6_6EjKIJ/

నమ్రత తన భర్త మహేష్ బాబుకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వారిద్దరు ఆడిన ఓ రోమాంటిక్ గేమ్ ను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. అదే బ్లింక్ అండ్ యు లూజ్ కాంపిటేషన్ గేమ్. కనురెప్ప వల్చకుండా ఎదుట వ్యక్తిని చూస్తూ ఉండాలి.. కనురెప్పలు వేయకూడదు. ఎవరు ముందుగా కళ్లార్పితే వాళ్లు ఓడినట్లు. ఇందులో నమ్రత మహేష్ చూస్తూ ఒక్కసారిగా నవ్వుతుంది. దీంతో నమ్రత ఈ గేమ్ లో ఓడిపోతుంది. అయితే ‘ఈ ఆటలో నేనే ఎక్స్ పర్ట్  అయినా నేను ఈ అబ్బాయిని ఓడించలేకపోతున్నాను’ అంటూ నవ్వుతూ ఉన్న వీడియోను నమ్రత మీడియాలో పోస్టు చేసింది. అయితే మహేష్ బాబు చిలిపిగా చూడటం వల్ల నమ్రత ఓడినట్లుగా కన్పిస్తోంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సర్కార్ నిర్ణయాలపై సర్వే..!

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆరు నెలల్లో మీ అందరి చేత మంచి సీఎం అనిపించుకుంటా అని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా తన ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీసుకున్న ప్రతి అంశంపై రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టి లబ్దిపొందేందుకు ప్రయత్నం చేసున్నాయి. ఈ విమర్శలను అధికార పక్షం పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోతుంది. ఈ సర్వేతో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు.

ఇందుకు థర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ బాధ్యతను ప్రముఖ మీడియా సంస్థ ఎన్.డి.టీవీకి అప్పగించారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఆంగ్ల చానల్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై త్వరలో సంస్థకు ప్రభుత్వం మార్గ నిర్దేశనం చేయనుంది. రాష్ట్రంలో ఏడాది కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాన్ని నిస్పాక్షికంగా సేకరించాలని సర్వే భాద్యతలు అప్పగించిన మీడియా సంస్థకు సూచించారు.

ఏడాది కాలంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్ దూకుడుగానే ముందుకు వెళ్లారు. కరోనా గడ్డు కాలంలో సంక్షేమ కొత్త పథకాలను ప్రకటించి అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇదే రాజకీయ విశ్లేషకులకు విమర్శనాస్త్రంగా మారింది. అభివృద్ధి పథకాలను పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గి ఆదాయం లేక అప్పుల పాలవుతుంది అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే
సర్వే సంస్థతో ప్రభుత్వ కీలక నిర్ణయాలైన మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు, మద్య నిషేధం అమలు, పోలవరం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి అంశాలు, అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, పీజు రీయింబర్స్మెంట్ ఇతర సంక్షేమ పథకాలపై సర్వే నిర్వహించనున్నారు.

సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం తన పరిపాలన తీరులో మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై మరింతగా పట్టు సాధించాలని ఈ నిర్ణయం వెనుక వ్యూహంగా సమాచారం.

మారటోరియం మరో మూడు నెలలు పెంచిన ఆర్బీఐ

కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన ఆర్బీఐ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

గతంలో ఈఎమ్ఐలపై మూడు నెలల మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో చాలామందికి భారీ ఊరట లభిస్తుంది. గతంలో మార్చి నుంచి మే31 వరకు మారటోరియం ఇచ్చారు. ప్రస్తుతం జూన్ 1 నుంచి ఆగష్టు 31 మారటోరియం గడువును పెంచింది.

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో 0.4 శాతం వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రెపో రేటును 4.4 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించింది. దాంతో వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి.

ఆర్బీఐ బ్యాంకులకు నగదు లభ్యతను పెంచింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. లాక్డౌన్‌ వల్ల ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కుదేలయిందని ఆయన తెలిపారు.

ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగినట్లు ఆయన తెలిపారు. విదేశీ మారకం నిల్వలు 487 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని చెబుతూ ఏడాది చివరివరకు కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశముందని ఆయన చెప్పారు. పైగా, 2021లోనూ జీడీపీ పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని ఆయన తెలుపుతూ మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై కరోనా ప్రభావం ఎక్కువగా పడిందని ఆయన వివరించారు.

అంతలేదంటున్న తమన్నా

కొద్దిరోజులుగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై మిల్కీ బ్యూటీ తమన్నా ఫైర్ అవుతోంది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ తమన్నా ఓ సినిమా కోసం భారీగా పారితోషకం డిమాండ్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగులు ఆగిపోవడంతో సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో పలువురు తారలు తమ పారితోషికం తగ్గించుకుంటుంటే తమన్నా మాత్రం భారీ పారితోషికం డిమాండ్ చేయడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తమన్నా క్లారిటీ ఇచ్చింది.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ కోసం తమన్నాను నిర్మాతలు సంప్రదించగా ఆమె మూడు కోట్లు డిమాండ్ చేసిందనే వార్తలు వచ్చాయి. నిర్మాతలు 2.5కోట్ల ఇస్తామని ఆఫర్ చేసినా ఆమె ఒప్పుకోలేదని సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం జరిగింది. దీనిపై తమన్నా స్పందిస్తూ నేను మూడు కోట్లు డిమాండ్ చేశానని చెప్పడం అవాస్తమని చెప్పింది. కెరీర్లో తానేప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయలేదని కావాలంటే తనతో పనిచేసిన నిర్మాతల్ని అడిగి తెలుసుకోవచ్చని తమన్నా అంటోంది. తనకు పాత్రలు నచ్చితే కొన్ని సినిమాలకు సగం రెమ్యూనరేషన్ కే పనిచేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.

కాగా ఇటీవల కాలంలో తమన్నాపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమన్నాకు సినిమా ఆఫర్లు తగ్గాయని.. తమన్నా కెరీర్ ముగిసినట్లేనంటూ పలు కథనాలు వచ్చాయి. దీనిపై కూడా తమన్నా తీవ్రస్థాయిలో మండిపడింది. తాను సినిమాలతో బీజీగా ఉన్నానని తనపై తప్పుడు ప్రచారాలు చేయద్దంటూ విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ మిల్కీ బ్యూటీపై పుకార్లు ఆగకపోవడం గమనార్హం.

కేసీఆర్ పై ఈటెల అసహనం!

సుమారు నెలరోజులుగా కరోనా టెస్ట్ లను తగ్గించి తెలంగాణాలో అసలు కరోనా లేదని అంటూ రోగుల కుటుంబాల ఇళ్లను తప్ప మొత్తం రాష్ట్రాన్ని ` గ్రీన్ జోన్’ గా కేసీఆర్ ప్రకటించడం పట్ల కరోనా పై పోరులో ముందుండి నడిపిస్తున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఆసహనానికిలోనవుతున్నారా?

రాష్ట్రంలో కరోనా టెస్ట్ లను తగ్గించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ రాష్ట్ర ప్రభుత్వంకు వ్రాసిన లేఖపై ఈటెల స్పందించిన తీరు అటువంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నది. ఒక వంక కేంద్ర ప్రభుత్వం లేఖ వ్రాయడం పట్ల అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఆమె చేసిన ఆరోపణలను పూర్తిగా సమర్ధిస్తున్నట్లు మాట్లాడటం పలువురికి విస్మయం కలిగిస్తుంది.

టెస్ట్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో చెప్పే ప్రయత్నం చేయకుండా ఆవేశంతో ఊగిపోవడం ఒక విధంగా ఆయన నిస్సహాయ పరిస్థితిని వెల్లడి చేస్తున్నది. `దారినపోయే దానయ్యలకు పరీక్షలు జరపాలా’ అంటూ టెస్ట్ ల తగ్గింపుపై స్పందించిన తీరు ఒక మంత్రి హోదాకు తగినట్లు కనిపించడం లేదు.

పైగా, “మీరేం(కేంద్రం) కోరుకుంటున్నారు? ఈ దశలో వందల సంఖ్యలో కేసులు రావాలని కోరుకుంటున్నారా? వందల శవాలు రావాలని కోరుకుంటున్నారా?’’ అని మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రంపై ధ్వజమెత్తారు. “ఈ దశలో” అంటే రంజాన్ దశలో అని అర్థమా అనే అనుమానం తలెత్తుతుంది.

మిత్రపక్షమైన ఎంఐఎం నాయకత్వం వత్తిడులకు లొంగి కరోనా పరీక్షలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. పరీక్షలు సరిగా జరిపితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు బైట పడతాయని మంత్రి గారి మాటలలోనే వెల్లడి అవుతున్నది. ఈ విధంగా వెల్లడి కాకుండా కప్పిపుచ్చడం కోసమే పరీక్షలను జరపడంలేదని కూడా స్పష్టం అవుతుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు, చికిత్సలు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొనడం  పరోక్షంగా తాను నిమిత్త మాత్రుడిని మాత్రమే అనే సంకేతాన్ని ఇచ్చిన్నట్లు వెల్లడి చేస్తున్నది. అవసరం ఉన్నా పరీక్షలు సరిగ్గా చేయడం లేదని పరోక్షంగా అంగీకరించినట్లు పలువురు భావిస్తున్నారు.

మొదట నెలరోజుల పాటు దేశం మొత్తం లోనే కరోనా కట్టడికి సమర్ధవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వంగా కేసీఆర్ గుర్తింపు పొందారు. అందుకు ప్రధాన సూత్రధారి ముందుండి ఈ పోరాటం నడిపించిన రాజేందర్.

అయితే గత నెల రోజులుగా రాజకీయ వత్తిడుల కారణంగా ఒక విధంగా ఆయన నిస్సహాయులుగా ఉండిపోయారా? అందుకనే ఆయన ఈ విధంగా కేంద్రం ఇచ్చిన లేఖపై స్పందిస్తున్నారా? అనే అనుమానాలు ఈటెల స్పందనలో వ్యక్తం అవుతున్నాయి.

భారత్‌ ఈ విపత్తును ఎదుర్కోలేదు..!

భారత్‌ ప్రస్తుతం భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే పోరాడలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ‘నేను చాలా ఆందోళన చెందుతున్నది మనం (భారత్‌) ఎదుర్కొంటున్న విపత్తు మరింత ముదురుతున్నదనే. ప్రధాన మంత్రి కార్యాలయం ఒక్కటే దీనిపై పోరాడలేదు. తప్పక ప్రతిపక్షాలను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

దేశంలోని నిపుణులు, ప్రతిభావంతులను సంప్రదించాలని, అలాంటివారు రాజకీయ ప్రత్యర్థులైనా సంశయం వద్దని హితవు చెప్పారు. వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఒక్కటే ఇప్పుడు సవాల్‌ కాదన్న రాజన్ గత ఆర్థిక వైభవాన్ని అందుకోవడం కూడా కీలకమేనని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులున్నారని, వారందరికీ పిలుపునివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ద్రవ్యలోటు పెరిగితే రేటింగ్‌ ఏజెన్సీల స్పందన ఎలా? ఉంటుందోనన్న భయాలను ప్రభుత్వం వీడాలని రాజన్‌ హితవుపలికారు. బహుశా దీనివల్లేనేమో ఆర్థికపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే స్పందిస్తున్నదని పేర్కొన్నారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఖర్చుల పెంపు అత్యవసరమని స్పష్టం చేశారు. ఏదిఏమైనా త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ.. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోదని రాజన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని, దీన్ని పరుగులు పెట్టించాలంటే ఈ ప్యాకేజీలు ఎంతమాత్రం సరిపోవని తేల్చి పారేశారు. మరిన్ని గొప్ప ఉద్దీపనల అవసరం ఉందని సూచించారు.

నిజానికి కేంద్ర ప్యాకేజీలో కొన్ని మంచి నిర్ణయాలున్నా.. ఇంకా అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక నిర్మాణ, మౌలిక రంగాల అభివృద్ధితో కూడిన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఇప్పుడు అసలైన పరీక్ష అని రాజన్‌ తెలిపారు. వైరస్‌తో పోరాటం కంటే దేశ జీడీపీని వృద్ధి బాట పట్టించడమే చాలా ముఖ్యమని సూచించారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను వ్యూహాత్మకంగా జయించడం కూడా ప్రధానమేనని స్పష్టం చేసారు.

వలస కూలీలకు మరో ముప్పు..!

వలస కూలీల వెతలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ వందలు, వేల కిలోమీటర్లు వీరు కాలినడకన గమ్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతున్నారు. రైలు, రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. ఇప్పుడు వీరికి మరో ముప్పు పొంచి ఉంది. వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చి వడగాలులు వేయడంతో వడదెబ్బకు గురవుతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 43 నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండకు, వడగాలులకు ఇళ్లలో ఉండే ప్రజలే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో నడక ప్రయాణమంటే ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్లే. రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లిలో ఈ విషాద సంఘటన జరిగింది.

జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీ ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. మృతుడు జార్ఖండ్‌కు చెందిన అనిల్ సర్కార్(47)గా గుర్తించారు. చెన్నై నుంచి కాలినడకన 20 మంది వలస కూలీలు జార్ఖండ్ వెళ్తున్నారు. చిన్న ఆవుటపల్లికి చేరుకోగానే అనిల్ సర్కార్‌కు తీవ్రమైన నీరసంతో కుప్పకూలిపోయాడు. ఎండలో నడవటమే కారణంగా చెబుతున్నారు. కిందపడిన కొద్దీ సేపటికే అతను మృతి చెందాడు. అయితే అతని బృందంలో మిగిలిన వారు అనిల్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ సర్కార్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరోవైపు రాష్ట్రంలో వలస కూలీలు ఎవరు నడిచి వెళ్లేందుకు అవకాశం ఇవ్వొద్దని, వారిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకూ చేర్చాలని ముఖ్యమంత్రి జగన్ అదేశించినప్పటికీ కొంతమంది వలస కూలీలు కాలినడకన ప్రయాణం చేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వలస కూలీల నడక ప్రయాణాన్ని అధికారులు సరైన విధంగా స్పందించక పోవడంతోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యుత్ బిల్లులను రద్దు చేయండి..!

విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేక ప్రజలు అల్లాడుతుంటే దొడ్డి దారిన విద్యుత్ బిల్లులు పెంచి దొంగదెబ్బ తీశారంటూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడు నెలల విద్యుత్ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విజయవాడలో కేశినేని భవన్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కరోనా వల్ల రెండు నెలలుగా ప్రజలు లాక్ డౌన్ లో ఉంటే విద్యుత్ చార్జీల పెంచడం దారుణమని తెలిపారు. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ అన్ని చోట్ల ఆందోళనలకు పార్టీ పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని 160 నియోజకవర్గాల్లో, 620మండలాల్లో టిడిపి నిరసన దీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు 180 మంది, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు 400 మంది పాల్గొన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే నిరసన దీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ 3నెలలు కరెంటు ఛార్జీలు పూర్తిగా మాఫీ చేయాలని, పాత శ్లాబు విధానమే కొనసాగించాలనే డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కాంతులు – జగన్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు. అప్పుడు కరెంటు తీగ పట్టుకుంటే షాక్. ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్. మేనిఫెస్టోలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదని హామీ..ప్రమాణ స్వీకార వేదికపై కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ. మాట తప్పడం – మడమ తిప్పడం జగన్ నైజం..షేమ్ షేమ్ అంటూ టిడిపి నిరసన దీక్షల సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రకాశంలో వైసిపి ఆకర్ష్ …. టిడిపి ఇక ఖాళీ!

కొంత కాలంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై ద్రుష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగనా మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్ష నేతలను ఆకర్షించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకొక్క జిల్లాల్లో ఆ పార్టీ బలాన్ని హరించే ప్రయత్నాలకు తిరిగి శ్రీకారం చుట్టారు. మొదటగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేకుండా చేయడం కోసం సిద్దపడిన్నట్లు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో టిడిపికి ఉన్న నలుగురు ఎమ్యెల్యేలలో టిడిపిలో అత్యంత బలమైన నేతగా పేరొందిన, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కారణం బలరామకృష్ణ మూర్తి ఇప్పటికే వైసిపి చెంత చేరారు. ఇక మిగిలిన ముగ్గురిని కూడా టిడిపికి దూరం చేయడం కోసం ముహర్తం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 30న ఆ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేసి మే 30 తేదీ నాటికి ఏడాది అవుతుంది. అదే రోజు నాటికి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలనూ వైసిపిలోకి చేర్చుకొంటే జిల్లాలో టిడిపి మొత్తం ఖాళీ అవుతుంది అని వైసిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో టిడిపికి 23 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు.

మరో ముగ్గురిని వైసిపి తీర్థం పుచ్చుకునేలా చేస్తే శాసన సభలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అందులో భాగంగానే జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుబాటులో, టచ్‌లో ఉన్న టిడిపి నేతలతో మంతనాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.

వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిబంధన ఉండటంతో టిడిపి ఎమ్యెల్యేలు ప్రధానంగా వెనుకడుగు వేస్తున్నారు. అందులో చేరినా మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు గదా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే టిడిపిలో కొనసాగితే వ్యాపార పరంగా, పోలీసుల పరంగా వేధింపులకు గురికావలసి వస్తుందని భయపడవలసి వస్తున్నది. కేవలం రక్షణ కోసమే అధికార పక్షంలో చేరుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా సొంతపార్టీలో సహితం తన మాట వినని వారిపై దూడకుడుగా వ్యవహరిస్తూ అనేక హింసాయుత సంఘటనలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న కారణం బలరామకృష్ణ మూర్తి వంటివారు సహితం వైసిపి ప్రభుత్వంలో దౌర్జన్యాలను ఎదుర్కొనలేక దాసోహం కావలసి రావడం గమనార్హం.

మరో పది రోజుల్లో మహేష్ కొత్త సినిమా ప్రారంభం?


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘సరిలేరునీకెవ్వరు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. 2020 సంక్రాంతి కానుకగా ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ రిలీజై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ సక్సస్ తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశీలకు విహారయాత్రకు వెళ్లాడు. మహేష్ తిరిగొచ్చాక మహేష్ కొత్త మూవీ స్టార్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనుకున్న సమయానికి దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రీప్ట్ రెడీ కాకపోవడంతో మూవీ ఆలస్యమైంది. ఈ గ్యాప్ మహేష్ పలువురి దర్శకుల కథలను విన్నాడు. దర్శకుడు పరుశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ బాబు అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినానికి మహేష్ బాబు ప్రతీయేటా ఏదోఒక అప్డేట్ ఇస్తుంటాడు. మహేష్ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, ట్రైలర్, టీజర్, రిలీజ్ డేట్ వంటి  ఏదొక అప్డేట్ ఇస్తూ  కృష్ణ అభిమానులను మహేష్ సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మహేష్ బాబు కొత్త మూవీని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ వాయిదాపడిన సంగతి తెల్సిందే. కేవలం మహేష్ కొత్త మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ ఇవ్వడమే కాకుండా సినిమాను ప్రారంభించేందుకు సిద్ధపడుతుండటం విశేషం. దీంతో దర్శకుడు పర్శురామ్ మే 31న సినిమాను కొంతమంది సమక్షంలో ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాడు.

మే 31తో దేశంలో లాక్డౌన్ 4.0 ముగియనుంది. ఇప్పటికే లాక్డౌన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సడలింపులు ఇచ్చారు. నాలుగో విడుత లాక్డౌన్ తర్వాత షూటింగులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో మహేష్ బాబు తన కొత్త మూవీని మే 31న ప్రారంభించి లాక్డౌన్ అనంతరం రెగ్యూలర్ షూటింగు ప్రారంభించాలని చూస్తున్నారు. ఎలాగూ మహేష్ బాబుకు తన కొత్త మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు లేదు. తొలి నుంచి మహేష్ బాబు ఇది సెంటిమెంట్ గా వస్తోంది. దీంతో మే 31న మహేష్ బాబు కొత్త మూవీ ప్రారంభం కావడం ఖాయమని ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. మరో పదిరోజుల్లో మహేష్ బాబు కొత్త మూవీ స్టాట్ అవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

దట్టమైన పొగలు.. పరుగులు తీసిన ప్రజలు..!


విశాఖపట్నం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయ భ్రాంతులకు గురిచేశాయి. ఎల్.జి పరిశ్రమ నుంచి స్టైరీన్ లీకయిన నాటి నుంచి విశాఖ వాసులు ఎక్కడ గ్యాస్ లీక్ అయినా, పొగలు కమ్ముకున్నా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున తెల్లని పొగ అలుముకోవడంతో ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనకు గురై ఇళ్ల నంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

సంఘటనపై హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం స్పందిచింది. రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించాం. దీంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దాం. పొగ కొద్దీ సేపు మాత్రమే వచ్చిందని, దాన్ని వెంటనే అదుపు చేసినట్లు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హెచ్‌పీసీఎల్‌ ప్రతినిధి వివరించారు. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన మరవక ముందే అలాంటి ఘటన మరొక్కటి చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే నిమిషాల వ్యవధిలోనే పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిశ్రమ పునఃప్రారంభం చేసే సమయంలో యాజమాన్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

మలయాళ మెగాస్టార్ కు టాలీవుడ్ మెగాస్టార్ విషెస్


నేడు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ 60వ జన్మదినం. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకే విక్టరి వెంకటేష్ ప్రియమైన స్నేహితుడి జన్మదిన శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శనలతో మమ్మల్ని అలరించండి సార్ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కు తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పారు ఈ సందర్భంగా మోహన్ లాల్ తో దిగిన ఫొటోను మెగాస్టార్ ట్వీట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

‘నా ప్రియమైన లాలెట్టన్ మోహన్‌లాల్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీలాంటి వెర్సటైల్ యాక్టింగ్ లెజెండ్-సూపర్ స్టార్ ఉన్న కాలంలోనే చిత్ర పరిశ్రమలో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. మీరు ఇలాగే మీ నటనతో అందరిలో స్ఫూర్తినింపుతూ.. సోదరభావాన్ని పంచుతూ.. రాబోయే కాలంలోనూ ప్రేక్షకులను ఆహ్లాదపరచాలని కోరుకుంటున్నాను..’ అంటూ చిరంజీవి మలయాళంలో మోహన్‌లాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోహన్ లాల్ దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ గానే కాకుండా ఇండియన్ యాక్టర్ గా మోహన్ లాల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 60ఏళ్ల వయస్సులోనూ అభిమానులను తన నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. గురువారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ‘దృశ్యం-2’ సిక్వెల్ కు సంబంధించిన ట్రైలర్ తన ట్వీటర్లో విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా మోహన్ లాల్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి మరో మెగాస్టార్ మోహన్ లాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ వైరల్ అవుతోంది.

భారత్ -నేపాల్ లొల్లి.. చక్రం తిప్పుతున్న చైనా?

భారత్ – నేపాల్ మధ్య కొత్త రహదారి వివాదానికి కారణమైంది. టిబెట్ లోని భారతీయులు పవిత్రంగా భావించే మానస సరోవర్ యాత్రకు చేరుకోవడానికి భారత దేశం ఉత్తరఖండ్-నేపాల్ సరిహద్దుల్లో లిపులేఖ్ మార్గాన్ని నిర్మించింది. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. నేపాల్ దేశం ఏకంగా సాయుధ పోలీస్ దళాన్ని కాలాపానీ సమీపంలో మోహరించి భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది.

*అసలేంటి వివాదం
భారతీయులు శివుడు కొలువై ఉంటాడని నమ్మే కైలసమైన టిబెట్ లోని మానస సరోవర్ యాత్రకు భారత్ నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ ద్వారా వెళుతుంటారు. మానస సరోవర్ యాత్రకు ఇన్నాల్లు వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సి వచ్చేది. చైనా భూభాగం నుంచి 9 కి.మీలు నడిచే వెళ్లాల్సి ఉండేది. దీంతో భారత్ ఉత్తరాఖండ్ లోని దర్బులా రోడ్డుకు అనుసంధానించి లిపులేఖ్ పాస్ రోడ్డును ఈనెల 8న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించాడు. దీని ద్వారా మానససరోవర్ కు తొందరగా చేరుకోవచ్చు. వాహనంలోనే ప్రయాణించవచ్చు. ఇదే నేపాల్ అగ్రహానికి కారణమై చిచ్చు రేగింది.

*ఈ భూభాగం తమదేనంటున్న నేపాల్
భారత్ తమ భూభాగంలో రోడ్డు నిర్మించిందని నేపాల్ దేశం వ్యతిరేకత వ్యక్తం చేసింది. భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవి అంటూ తాజాగా కొత్త మ్యాపును నేపాల్ మంత్రిమండలి ఆమోందించి తీర్మానాన్ని నేపాల్ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది . గత పాలుకుల మాదిరి తాము భారత్ కు ఆ ప్రాంతాలు విడిచిపెట్టమని.. దక్కించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

*దీటుగా స్పందించిన భారత్
కాగా నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్ దీటుగా స్పందించింది. నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఈ కొత్త మ్యాప్ ను తాము అంగీకరించబోమని.. ముమ్మాటికీ లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

*నేపాల్ ఎదురుతిరుగుడు వెనుక చైనా?
చైనా అండతోనే నేపాల్ చెలరేగిపోతోందని.. వివాదాన్ని రాజేస్తోందని భారత్ అనుమానిస్తోంది. ప్రస్తుతం మానస సరోవర్ యాత్ర కోసం భారత్ వేసిన రోడ్డు చైనా సరిహద్దు వరకు ఉంది. యుద్ధ సమయంలో మన సైనికులు అక్కడికి తొందరగా చేరుకునేలా ఈ రోడ్డు ఉంది. దీంతో రక్షణ పరంగా వూహాత్మకంగా మన దేశానికి ఈ రహదారి కీలకమైంది. అందుకే నేపాల్ తో ఈ ప్రాంతాన్ని దక్కించుకునేందుకే చైనా నాటకాలాడుతోందని.. నేపాల్ ను రెచ్చగొడుతోందని భారత్ భావిస్తోంది. .

*మిత్రదేశం నేపాల్ తో చెడిన సంబంధాలు
ఇన్నాళ్లు భారత్ కు ఫేవర్ గా ఉండే తోటి హిందూదేశం నేపాల్ ఈ వివాదంలో చైనా చేతిలో కీలుబొమ్మగా మారిందన్న అనుమానాలను భారతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రధాని చైనా అండతో చెలరేగిపోతున్నారన్న అనుమానాలకు బలం చేకూరేలా పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. భారతీయుల పవిత్రక్షేత్రం మానస సరోవర్ కు రాకుండా.. చైనాకు డైరెక్ట్ రూట్ లేకుండా చేయాలనే డ్రాగన్ దేశం నేపాల్ తో ఇలా చేయిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

-నరేశ్ ఎన్నం

కేసీఆర్, జగన్ ల వ్యూహానికి ప్రతిపక్షాల కుదేలు

అంతన్నారు.. ఇంతన్నారు.. మన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. చివరకు అందరినీ రెచ్చగొట్టి మౌనముద్ర వేశారు. నిజానికి ఇది ఇద్దరూ ఆడించిన ఆట అనే అనుమానం కలుగకమానదు. ఎందుకంటే ఆ అంత టామ్ జెర్రీలా సాగిన ఈ వ్యవహారంలో కేసీఆర్, జగన్ అంత త్వరగా కూల్ అయిపోయి విమర్శలు చేసుకోకపోవడం గమనిస్తే అలానే అనిపిస్తోంది మరీ..

*మౌనం దాల్చిన సీఎంలు..
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ నీటి వివాదానికి చెక్ పడింది. కేంద్ర గ్రీన్ ట్రిబ్యూనల్ బ్రేక్ వేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో టాపిక్ ను డైవర్ట్ చేసి తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్షాలను బుక్ చేశాయని చెప్పవచ్చు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశాయి. దిక్కుతోచక ప్రభుత్వాలకే మద్దతు ఇచ్చే పరిస్థితిని కేసీఆర్, జగన్ కల్పించారనే చెప్పాలి. ఇంత పెద్ద రచ్చ జరిగాక రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు మౌనంగా ఉండడం నిజంగానే అనుమానాలకు తావిస్తోంది.

*జగన్ తో దోస్తీకే కేసీఆర్ మొగ్గు.. నో విమర్శలు
మొన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ ను ప్రతిపక్షాలు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలతోపాటు ఎల్లో మీడియా ఆసక్తిగా గమనించాయి. కేసీఆర్ పోతిరెడ్డిపాడుపై స్పందిస్తాడని.. ఏపీని తిడుతాడని.. జగన్ తో ఫైటింగ్ చేస్తాడని అందరూ భావించారు. కానీ జగన్ ను ఒక్క మాట అనకుండా కేసీఆర్ ప్రెస్ మీట్ ముగించాడు. ఏపీతో స్నేహాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. దీంతో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కాచుకు కూర్చున్న ఎల్లో మీడియాకు షాక్ తగిలింది. ప్రతిపక్షాల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రచ్చ చేద్దామనుకున్న ఎల్లోమీడియా, టీడీపీకి కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.

*జగన్ సైతం అదే బాట..
ఇక జగన్ సైతం కేసీఆర్ ను ఒక్క మాట అనకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులపై ఫిర్యాదులతోనే సరిపుచ్చారు. సీరియస్ గా స్పందించలేదు. వైసీపీ మంత్రులు, ఎంపీలు కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే కేసీఆర్ సామరస్యంగా మాట్లాడారని పొగడడం విశేషం. చంద్రబాబు ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. ఇక పోతిరెడ్డిపాడుపై ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఏపీలో అందరూ సైలెంట్ అయ్యారు.

*జగన్ సన్నిహితుడి క్లారిటీ
ఏపీ సీఎం జగన్ సలహాదారు కూడా ఈ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చిస్తుందని సమస్య పరిష్కరిస్తుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తాజా విలేకరుల సమావేశంలో ఇదే అన్నారు.

*ఇద్దరి సీఎంల స్కెచ్చా?
దీన్ని బట్టి ఇద్దరు సీఎంలు తమ ప్రాంత, జల సమస్యలపై పోరాడుతున్నట్టు చాలా కలరింగ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. జలాలు, ప్రాజెక్టుల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గరన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించారు. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు సైతం జగన్, కేసీఆర్ ప్రభుత్వాలకు మద్దతిచ్చి బుట్టలో పడిపోయాయి. దీన్ని ఇద్దరు సీఎంలు అనుకునే ఈ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. వీళ్ల వ్యూహాలకు పాపం ప్రతిపక్షాలే బలైపోయాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-నరేశ్ ఎన్నం