Home Blog Page 8482

చిరంజీవి నయా లుక్.. అభిమానులు ఖుషీ


మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు కన్పిస్తుంది. లాక్డౌన్ అందరూ ఇంట్లో ఉండటంతో హీరోహీరోయిన్లంతా బరువు పెరిగిపోతుంటే చిరంజీవి మాత్రం చాలా ఫిట్ గా మారారు. ప్రస్తుతం చిరంజీవికి 64ఏళ్లంటే నమ్మడం కష్టమే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా దిగిన ఫొటోలు చిరంజీవి ఫిట్నెస్ కు అద్ధం పడుతున్నాయి. చిరంజీవి నయా లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను మెగాస్టార్ అభిమానులతోపాటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నారు. ఇందులో రాంచరణ్ కీరోల్ చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. లాక్డౌన్ వల్ల షూటింగులు వాయిదా పడటంతో చిరంజీవి ఇంటికే పరిమితమయ్యారు. ఓవైపు ‘సీసీసీ మనకోసం’ పనులు చక్కబెడుతూ మరోవైపు చిరంజీవి ఫిట్నెస్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే జిమ్ చేస్తూ చిరంజీవి తన వయస్సును సగానికి తగ్గించుకున్నట్లు కన్పిస్తుంది. మెగాస్టార్ చాలా ఫిట్ గా, యంగ్ హీరో మాదిరిగా మారిపోయారు. ‘సైరా’లో కన్పించిన చిరంజీవేనా అన్నట్లుగా మెగాస్టార్ మారిపోయారు. ‘ఆచార్య’లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల కోసమే చిరంజీవి ఇలా మారినట్లు తెలుస్తోంది. తాజాగా కేసీఆర్‌తో మీటింగ్‌కు వచ్చిన చిరంజీవిని చూసి అంతా షాక్ అయ్యారు. కేసీఆర్ పక్కన చిరంజీవి నయా లుక్ అదిరిపోయిందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

వ్యవసాయ రంగంలో కొత్త వ్యూహాలు!

CMKCR

రాష్ట్రంలో వ్యవసాయం పరిణితి సాధించడానికి స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా,  వేసిన పంటంతా పూర్తిగా అమ్ముడయ్యే విధంగా తెలంగాణలో పంటసాగు జరగాలంటున్నారాయన. అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నిపుణులతో సమావేశమై చర్చించారు.

రైతు పండించిన పంట యథావిథిగా ప్రస్తుత మార్కెట్లో అమ్ముతున్నారని… అలా కాకుండా దానికి వాల్యూ యాడ్‌ చేస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందన్నది ప్రభుత్వ మాట. అందుకేపెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతోంది. వాటికి కావాల్సిన ముడి సరుకు నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం సాగాలని… నాణ్యమైన సరుకు తయారీతో తెలంగాణ బ్రాండ్‌ కు ఓ ఇమేజ్ కేసీఆర్‌ ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేటట్టు చేస్తే ఇటు పారిశ్రామిక, సేవా రంగాలు కూడా విస్తరిస్తాయని లెక్క కడుతోంది ప్రభుత్వం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంట మార్పిడి కూడా జరగాలని… ఇదంతా రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలని కేసీఆర్‌ సూచించారు. వ్యవసాయంలో మార్పులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం… సంస్కరణలు వెంటనే అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది. దీనివల్ల ఖచ్చితంగా పరిస్థితిలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాస్ అక్కర్లేదు…ఎందుకంటే..!

లాక్ డౌన్ కష్టాల నుంచి రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే వారికి పాస్ లు తీసుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. రాష్ట్రంలో పాస్ లేకుండా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ప్రజలకు లభించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతి పత్రాలు, పాస్ లు అవసరం లేదని పోలీసు శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రజలు ప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా పాస్ తీసులివాల్సి ఉంది. లేనిపక్షంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజలు కొందరు “వ్యక్తిగత అవసరాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నాము, పాస్ తీసుకోవాలా” అంటూ ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించగా పాసులు అవసరం లేదని పోలీసు శాఖ సమాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్ల లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉన్న ప్రజలకు బయటకు వెళ్లేందుకు కొంత వెసులుబాటు లభించినట్లయ్యింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేవారు మాత్రం అధికారుల నుంచి అనుమతి పత్రాలు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌ పోర్ట్‌ కు దగ్గరలో కూలిన విమానం 99 మృతి

పాకిస్థాన్‌ కరాచీలోని ఎయిర్‌ పోర్ట్‌ కు 4 కిలోమీటర్ల దూరంలోని మోడల్ కాలనీ సమీపంలో విమానం కుప్పకూలింది. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ఉన్నట్టు…అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో జనం పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్‌ నటి ఆయేజా ఖాన్‌ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్‌ తైమూర్‌ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్‌ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది.

కోర్టు తీర్పులు బాబుకు ముందే తెలుస్తున్నాయి.. ఎలా?


హైకోర్టులో ఇచ్చే తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు కాల్ లిస్ట్ బైట పెట్టాలని డిమాండ్ చేశారు. చిల్లరి రాజకీయాలు మానుకోవాలని బాబుకు హితవు పలికారు. వైసీపీ నాయకులు ప్రజల వెంట తిరుగుతున్నామని, టీడీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దళిత కార్డు వాడి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని విమర్శించారు. గతంలో సిఎంగా చంద్రబాబు సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఊసరవెల్లిలా రంగులు మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వంకు చెంప పెట్టు, షాక్ అని టీడీపీ పెంపుడు మీడియా వార్తలు రాస్తున్నాయని తెలిపారు. షాక్, చెంప పెట్టు తగిలితే టీడీపీకి తగులుతుందని చెప్పారు. 23 సీట్లు వచ్చిన టీడీపీకే చెంప పెట్టు లాంటి పదాలు బాగా సూట్ అవుతాయని అన్నారు. డాక్టర్ సుధాకర్ ఒక విఐపి కాదు, పది మందికి తెలిసిన వాడు కాదని, సీఎంను ఇష్టానుసారంగా దూషించాడని చెప్పారు. సైకోలా సుధాకర్ వ్యవహరించాడని తెలిపారు. బాబు డైరెక్షన్ లోనే సుధాకర్ సైకో లా వ్యవహరించాడన్నారు. ఇలాంటి వేషాలు ఇంకా ఎంతో మందితో వెయిస్తాడని ప్రశ్నించారు. ఆయనకు ఇలాంటి విద్యలు కొత్తకాదన్నారు. పోలీసులు సుధాకర్ అరెస్టు కు బలమైన సాక్ష్యాధారాలు సీన్ లో కనిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు దళితులను వాడుకోవడం మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. దళితులో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఈ మాటలను దళితులు మర్చిపోలేదని చెప్పారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసిన వ్యక్తి అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరని, చదువుకోరని టీడీపీ నేతలు హేళన చేశారని తెలిపారు. బాబు జీవితమంతా స్టేలు మాయమన్నారు. సుధాకర్ వ్యవహారంలో పోలీసులు ఓపికకు దండం పెట్టాలని చెప్పారు. కోర్ట్ లను, లాయర్లను ప్రతిపక్ష నేత మేనేజ్ చేస్తున్నాడని, ఆయన బతుకు అంతా మేనేజ్మెంట్ మయమని అన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే తాము కోరుకుంటున్నామని, దీంతో అన్ని వాస్తవాలు బైటకు వస్తాయని తెలిపారు. సుధాకర్ వ్యవహారంలో నిజనిర్ధారణ జరగాలన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలని బాబు కంకణం కట్టుకున్నారని తెలిపారు. పేద వాడికి అవసరమైన ఇంగ్లీషు మీడియంపై స్టే తెచ్చారని, సుధాకర్ వీడియోలను అవసరం మేరకు కట్ చేసి టీడీపీ ఛానెల్స్ ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

ప్రభాస్ కు జోడీ సెట్ చేసిన రాజమౌళి..!


దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరిసుల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బాహుబలి’ సీరీసులు ఇండియాలోనే కాకుండా విడుదలైన అన్నిచోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ మూవీతో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ ‘సాహో’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు సుజిత్ హాలీవుడ్ రెంజ్లో ‘సాహో’ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీతో తెలుగులో అనుకున్న విజయం సాధించకపోయినా బాలీవుడ్లో మాత్రం ఘన విజయం సాధించింది. అయితే రాజమౌళి డార్లింగ్ ప్రభాస్ పక్కన ఓ బాలీవుడ్ బ్యూటీని రికమెండ్ చేయడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘RRR’. ఈమూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమూవీలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా నటిస్తున్నారు. ఇందులో అలియా భట్ సీత క్యారెక్టర్లో నటిస్తుంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ‘RRR’ షూటింగు వాయిదా పడింది. అయితే ఈ మూవీ షూటింగులో పాల్గొన్న అలియాభట్ నటనకు జక్కన్న ఫిదా అయ్యాడట. ఈనేపథ్యంలో ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీలో హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

సైంటిఫిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో తన పక్కన ఎవరైతే బాగుంటుందని ప్రభాస్ రాజమౌళిని అడుగగా అలియాభట్ పేరు సూచించారని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ కూడా అలియాభట్ అయితే బాగుంటుందని భావించాడట. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ కు చెప్పగా ఆమెను సంప్రదించారట. ప్రభాస్ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ‘రాధే’, ‘డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించింది. ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా మరో బాలీవుడ్ భామ అలియాభట్ కు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాల్సిందే..!

హైకోర్టులో ఏపీకి మూడు ఎదురుదెబ్బలు!

ఈరోజు ఏపీ హైకోర్టు లో జగన్ సర్కార్ కి మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. అందులో ఒకటి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై  ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, సస్పెన్షన్ విధించిన కాలానికి సంబంధించి కూడా ఆయనకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రెండోవదిగా పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 623జీవోను కొట్టివేసింది.

వైద్యుడు సుధాకర్‌ వ్యవహారంపై విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం విశాఖ సెషన్స్ మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది

దేశంలో భారీ ఆర్థిక విపత్తు ఖాయం.!


అగ్రరాజ్యం అమెరికా 21 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. తమ దేశ పౌరుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసింది. అదే భారత దేశం కేవలం 2 ట్రిలియన్ డాలర్లు (20 లక్షల కోట్లు) మాత్రమే ప్యాకేజీ ప్రకటించింది. అదే నేరుగా భారతీయుల ఖాతాల్లో పడలేదు. పరిశ్రమలు, వివిధ రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలలాగా.. బ్యాంకులు, కార్పొరేట్లకు పంచిపెట్టింది.సామాన్యుడికి మోడీ సర్కార్ నేరుగా ఇచ్చింది రూ.500 మాత్రమే. అదీ జన్ ధన్ ఖాతాల్లోనే. అగ్రరాజ్యం అమెరికా ఈ మహావిపత్తు నుంచి నేరుగా అమెరికన్లకు డబ్బులు పంచి కోలుకునే సత్తా ఉంది. జపాన్ సహా అగ్రదేశాలన్నీ ఇదే ఫార్ములా అప్లై చేశాయి. మన మోడీ సార్ మాత్రం భారతీయులకు నేరుగా డబ్బులు పంచే సాహసం చేయలేదు. దీంతో పేద, మధ్యతరగతి , వలస కూలీలకు చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతున్నారు. మోడీ చెప్పినట్టు ఈ సమయంలో బ్యాంకుల ఎదుట క్యూలు కట్టి రుణాలు తీసుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. దీంతో మున్ముందు భారతదేశం భారీ ఆర్థిక విపత్తును చవిచూడబోతోందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*మోడీ ఫెయిల్యూరేనా?
మహమ్మారి వైరస్ ధాటికి భారతదేశం భారీ ఆర్థిక విపత్తులోకి జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ 20 లక్షల ప్యాకేజీ ఉట్టి గాలి బుడగ అని తెలిసి స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దుర్భర దారిద్ర్యం.. ఆకలిచావులు, నిరుద్యోగం దేశంలో పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ దీన్ని హ్యాండిల్ చేయలేడని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎవరూ కాపాడలేరని ప్రఖ్యాత ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వ్యవస్థ భారీ విపత్తుకు లోనై కుప్పకూలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు..

*రఘురాం రాజన్ చెప్తున్న వాస్తవాలు
తాజాగా రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఎదుర్కోబోయే విపత్తు గురించి ఆందోళనగా ఉందని.. ప్రభుత్వం, ప్రతిపక్ష సలహాలు తీసుకోకుండా ప్రధాని మోడీ ఒంటిచేత్తో ఏమీ చేయలేరని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో చేయాలని.. లేదంటే దేశం భారీ ఆర్థిక విపత్తులోకి కూరుకుపోతుందని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల భారత్ పెను సంక్షోభాన్ని ఎదుర్కోనుందని.. దేశంలోని నిపుణులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని రాజన్ సలహా ఇచ్చారు. కరోనాతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఒక్కటే కాదని.. మూడు నాలుగేళ్ల కిందటి ఆర్థిక వైభవం అందుకోవడం కీలకమన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూడవద్దని.. కలిసి పనిచేయాలని మోడీకి రాజన్ హితవు పలికారు. నైపుణ్యం గల వారి సలహాలు తీసుకోవాలన్నారు.

* మోడీ 20 లక్షల కోట్లు సరిపోవు.. అది ఉత్త ప్యాకేజేనా?
ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఉత్త గాలిబుడగ అని ఆర్థిక వేత్తలు ఇప్పటికే విమర్శించారు. భారత్ లో మహమ్మారి వల్ల కలిగిన నష్టంతో పోలిస్తే ఇది సరిపోదని ఆర్థిక వేత్తలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. లేదంటే ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే ప్రమాదముందంటున్నారు. మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. ద్రవ్యలోటు పెరిగి, అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు దేశ పరపతి రేటింగ్ ను తగ్గిస్తాయనే ఆందోళన పక్కనపెట్టి సాయం చేయాలని సూచిస్తున్నారు.

*భారత్ లో కుప్పకూలిన రంగాలివే..
అమెరికా వలే భారత దేశంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సాధ్యం కాదని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే మోడీసార్ పట్టించుకోకపోవడంతో ఎయిర్ లైన్స్, పర్యాటకం, మ్యాను ఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాలు భారత్ లో కుప్పకూలాయి. సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్ వ్యవస్థీకరణతోపాటు మూల ధన సాయం కూడా మోడీ ప్రభుత్వం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. .

*వలస కార్మికులను ఆదుకోని మోడీజీ?
దేశంలో హృదయవిదారకంగా మారిన బతుకులు ఎవరివైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అవి వలస కార్మికులవే. వేల కిలోమీటర్లు కాలినడకన నడిచిన దైన్యం.. పట్టాలపై ప్రాణాలు పోగొట్టుకున్న దారుణాలు దేశంలో జరిగాయి. ఇప్పటికీ రవాణా సౌకర్యాలు లేక వందలాది మంది నడిచివెళుతున్నారు. వాహనాల్లో వెళుతూ ప్రమాదాల్లో బలి అవుతున్నారు. వీరి విషయంలో మోడీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. లేటుగా నడిపిస్తున్న రైళ్లు బండ్లు సరిపోవడం లేదు. వారి ఆకలి కేకలు, ఆర్థిక భరోసా కల్పించడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీరిని మోడీ ప్రభుత్వం ఆదుకోవాలని.. వారికి నిత్యావసరాలు, షెల్టర్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇంతవరకు వారి విషయంలో మోడీ సర్కారు స్పందించలేదు. పేదలకు, వలస కూలీలకు రేషన్ ఇస్తే సరిపోదు. ఉచిత నగదు కూడా చేతికి ఇచ్చినప్పుడే వారు తిరిగి నిలబడతారు.. ఆర్థిక వ్యవస్థను నిలబెడుతారు. పేదలు, మధ్యతరగతి , నిమ్న వర్గాల చేతుల్లో ఇప్పుడు డబ్బులు లేవు. చేసేందుకు పని లేదు. ఈ సమయంలో వారికి డబ్బులు డైరెక్టుగా అందినప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ లేస్తుంది. లేదంటే కుప్పకూలుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీన్ని మోడీ సర్కార్ పాటిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

-నరేశ్ ఎన్నం

సినిమావాళ్ళు కూడా బతకాలిగా..:కేసీఆర్

CMKCR


లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను తిరిగి పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు.

లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ-ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

మళ్లీ పట్టాలెక్కబోతున్న టాలీవుడ్


టాలీవుడ్ చిత్రసీమను తిరిగి గాడిలో పెట్టేందుకు సీనిపెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం మెగాస్టార్ ఇంట్లో సీనిపెద్దలు బేటీ అయ్యారు. రెండు నెలలుగా థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగులు వాయిదాపడటంతో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించారు. ప్రభుత్వం ఎప్పటి నుంచి షూటింగులకు అనుమతి ఇస్తుందో చెప్పాలని మంత్రి తలసానిని సినీ పెద్దలు కోరారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తెలిపారు. అయితే షూటింగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దే తుది నిర్ణయం తెలిపారు. దీంతో సినీ పెద్దలు ముఖ్యమంత్రి కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి వినతిప్రతం అందజేస్తామని తెలిపారు. దీనిపై రెండ్రోజుల్లోనే తేల్చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈనేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సీనిపెద్దలు ముఖ్యమంత్రితో బేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టాలీవుడ్ సీనిపెద్దలు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో బేటీ అయి తమ సమస్యలను విన్నవించారు. రెండునెలలు షూటింగులు లేకపోవడంతో ఇండస్ట్రీని నమ్ముకొని జీవిస్తున్న వేలాదిమంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం షూటింగులకు అనుమతిస్తే ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేస్తామని వారు వివరించారు. సీనిపెద్దలు చెప్పిన విషయాన్నింటిని సావధానంగా ముఖ్యమంత్రి విన్నారు. సీని పరిశ్రమ మంచిగా బతకాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈమేరకు పోస్టు ప్రొడక్షన్ పనులు రెండు మూడురోజుల్లో చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా విభృంభిస్తుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించాలని సూచించారు.

ఎంతమందితో షూటింగులు నిర్వహించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను చేస్తుందని తెలిపారు. ఈ నిబంధనలు పాటిస్తూ షూటింగులు జరుపుకోవచ్చని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ మార్గదర్శకాలను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి రెండ్రోజుల్లో షూటింగులకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేయనుంది. అదేవిధంగా సినీ కార్మికులకు ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోనుంది. ఈమేరకు జూన్ మొదటివారంలో సినిమా షూటింగులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సినీపెద్దలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆ జీవోను రద్దు చేసిన హైకోర్టు..!


రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగుతూనే ఉన్నాయి. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగులు వేయడంపై మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా జీవోను కోర్టు దిక్కరణగా ఎందుకు భావించకూడని ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది. మే 28వ తేదీ లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో అనంతరం కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు చెప్పిందని 623 జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం చేసిన చింతపాటి సోమయాజులు తెలిపారు.

గతంలో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని, ఎటువంటి రంగులు వేయాలనేదానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టును సమర్థిస్తూ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 623 జీవోను జారీ చేసింది. మూడు రంగులకు పైన టెర్రా కోట్(మట్టిరంగు) రంగును బార్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. పైగా ఈ మూడు రంగులు దేనికి సంకేతమో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మళ్లీ అవే రంగులు ఎంపిక చేసి జీవోను ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. జీవో 623 పై దాఖలు అయిన ఫీల్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా ఈ రోజు హైకోర్టులో దీనిపై వాదనలు జరిగాయి.

మతం కంటే మానవత్వం మిన్న.. ది హ్యుమానిటీ


మన సమాజానికి కావాల్సింది మతం కాదు మానవత్వం’ అనే అంశాన్ని తీసుకుని… అత్యున్నత ప్రమాణాలతో ‘ది హ్యుమానిటీ’ టైటిల్ తో 30 నిమిషాల నిడివి గల ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించారు యువ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్. ‘పైసా-పొట్టి-ప్రాబ్లెమ్, దావత్ ఏ షాది, సలామ్ జిందగి’ వంటి సూపర్ హిట్ డెక్కన్ చిత్రాలతో తన ప్రతిభను ఘనంగా నిరూపించుకొని- హిందీలో రెండు భారీ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్న సయ్యద్ హుస్సేన్.. ‘ది హ్యుమానిటీ’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో ఉరూసా రహీంతో కలిసి తెరకెక్కించారు.

హీనా షేక్, చారు కదరియా, నరేందర్ శర్మ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వెల్లూరు మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. అష్ఫాకుద్దీన్-నిసార్ అక్తర్ లతో కలిసి ఈ ఫిల్మ్ కు రచన చేసిన హుస్సేన్.. ఇందులో ఒక పాత్ర కూడా పోషించడం కూడా గమనార్హం. హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ లలో భారీ బడ్జెట్ తో తెలుగు-డెక్కనీ-హిందీ భాషల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. రైలు ప్రమాదంలో అనాధగా మారిన ఓ ముస్లిం బాలికకు ఆశ్రయం కల్పించడం కోసం.. జర్నలిస్ట్ గా పని చేసే ఓ బ్రాహ్మణ యువతి చేసిన పోరాటం నేపథ్యంలో నడుస్తుంది. ‘ముస్లిం అమ్మాయి మనింట్లో ఉండడానికి వీల్లేదనడమే కాకుండా తనపై చేయి చేసుకున్న భర్తతో పాటు.. అతనికి వత్తాసు పలికిన అత్తమామలు.. చివరికి ముస్లిం బాలికను హృదయాలకు హత్తుకోవడం వెనుక గల హృద్యమైన కథేంటో తెలియాలంటే… ‘ది హ్యుమానిటీ’ చూడాల్సిందే’ అంటున్నారు దర్శక నిర్మాత మరియు నటుడు అయిన బహుముఖ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్.

పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ‘ది హ్యుమానిటీ’ ఎంపిక కావడం గర్వంగా ఉందని, త్వరలోనే తెలుగు-డెక్కన్-హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సయ్యద్ హుస్సేన్ తెలిపారు!!

మరో పోలీసుకు కరోనా పాజిటివ్!

ఇటీవల కరోనా సోకి చనిపోయిన పోలీసు కానిస్టేబుల్ దయాకర్‌ రెడ్డి మృతిని మరువక ముందే మరో ఏఎస్ఐ కి కరోనా పాజిటివ్ అని తేలడం అనేకమందిని బాధకు గురి చేసింది. బాలాపూర్‌ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న సుధీర్ కృష్ణ కు కరోనా వైరస్ సోకింది. దీంతో సుధీర్‌ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. లాక్‌ డౌన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సుధీర్ విధులు నిర్వహించాడు. విధులు నిర్వహిస్తున్నప్పుడు కరోనా సోకి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు ఉండడంతో స్థానిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను కలిశారు. అతడికి ఫీవర్ ఆస్పత్రిలో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి అతడిని తరలించారు. సదరు పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బందిని క్వారంటైన్‌ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యుల హోంక్వారంటైన్ చేసి కరోనా టెస్టు చేస్తున్నారు.

టాలీవుడ్ పై మేలుకున్న కేసీఆర్!

ఎప్పుడైనా పీకలదాకా మునిగే సందర్భం వస్తేనే మన తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తుంటారనే టాక్ ఉంది. ఇప్పుడూ అదే జరిగింది. లాక్ డౌన్ కరోనా విపత్తు తర్వాత ఈ మధ్యే తెలంగాణ, ఏపీలో ఇద్దరు సీఎంలు అన్నింటికి ద్వారాలు తెరిచారు. అయితే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోలేదు కేసీఆర్. మొత్తం టాలీవుడ్ హైదరాబాద్ లో ఉండడంతో వారికి ఈ పరిణామం మింగుడు పడలేదు. అదే సమయంలో ఏపీలో షూటింగ్ లకు సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో అటు వెళదామని అనుకున్నారు. అయితే పరిశ్రమ ఇక్కడే ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కోసం సినీ ప్రముఖులు వేచి ఉన్నారు. సీఎం జగన్ టాలీవుడ్ ను లాగేస్తాడన్న అనుమానం రావడంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. తాజాగా ఈ సాయంత్రం టాలీవుడ్ సినీ పెద్దలతో స్వయంగా భేటి అయ్యారు.

*నిన్న తలసానితో.. నేడు కేసీఆర్ తో సినీ పెద్దల భేటి
నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించిన టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఇప్పటికే సినిమా పెద్దలు లేవనెత్తిన సమస్యలపై నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాలపై ఈరోజు కేసీఆర్ తో సినీ పెద్దలు చర్చించనున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలకు లోబడి సినిమా షూటింగ్ లు చేసుకోవడం.. థియేటర్లు తెరవడంపై ఆయనతో చర్చించనున్నారు.

*సినీ పెద్దల డిమాండ్లు ఇవీ..
సినీ పెద్దలు తాజాగా లాక్ డౌన్-కరోనాతో కుదేలైన సినిమా పరిశ్రమకు రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేసీఆర్ ను కోరనున్నారు. రిలీజ్ కాబోయే సినిమాలకు పన్ను రాయితీని అడగబోతున్నారు. ఇక షూటింగ్ లు మొదలు పెడితే పరిమిత సంఖ్యలో 50 మందితో ఇన్ డోర్, ఔట్ డోర్ షూటింగ్ లు ఎలా చేస్తామన్నది ప్రజంటేషన్ రూపంలో సీఎంకు సమర్పించనున్నారు. థియేటర్లలో సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ సీట్లను కేటాయించి ప్రదర్శనలు చేస్తామని.. వాటికే ట్యాక్స్ కట్టేలా చూడాలని కోరనున్నారు. ఇక షూటింగ్ లకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు లేనందున ఇక్కడ ఉన్న లోకేషన్లలో షూటింగ్ చేసుకునేందుకు కొంత రాయితీ ఇవ్వాలని కేసీఆర్ ముందు ప్రతిపాదనలు చెయ్యనున్నారు.

* జగన్ ఎఫెక్ట్ తో త్వరపడ్డ కేసీఆర్..
ఏపీలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం.. థియేటర్ల ఓపెన్ కు జగన్ సిద్దంగా ఉండడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోయేందుకు రెడీ అవుతోందన్న వార్తలు సీఎం కేసీఆర్ ను అలెర్ట్ చేశాయి. మంత్రి తలసాని, మంత్రి కేటీఆర్ లు కూడా ఈ విషయంలో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని తెలిసింది. దీంతో కేసీఆర్ వెంటనే సినీ పెద్దలతో ఈ సాయంత్రం మీటింగ్ పెట్టారు.

*వరాలు ఇచ్చేందుకు రెడీ
సినీపెద్దల సమస్యలు, వాటికి పరిష్కారాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. వారి కోరికలు, సమస్యలను తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ లు, ప్రోస్ట్ ప్రొడక్షన్ కు కేసీఆర్ అనుమతి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.ఇక థియేటర్స్ ఓపెనింగ్ పై కూడా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ సినీ పరిశ్రమకు గొప్ప ఊరటగా చెప్పవచ్చు.

-నరేశ్ ఎన్నం

‘చిరుత’తో నటించాలని ఉందంటున్న హాట్ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రాంచరణ్ ‘చిరుత’ మూవీతో తెరగ్రేటం చేశాడు. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ 2007లో తెరకెక్కింది. ఈ సినిమాతో రాంచరణ్ బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ కు జోడీగా నేహ శర్మ నటించింది. వీరిద్దరి కెమెస్ట్రీ అభిమానులను అలరించింది. డబ్బు ఉందనే పొగరు చూపించే అమ్మాయి క్యారెక్టర్లో నేహశర్మ అద్భుతంగా నటించి మెప్పింది. ఇక రాంచరణ్ ఈ మూవీలో అద్భుతమైన ఫార్మమెన్స్ కనబరిచాడు. ఫైట్స్, డ్యాన్స్, యాక్షన్ల సీన్లలో రెచ్చిపోయి నటించారు. తొలి సినిమాతోనే తండ్రితగ్గ తనయుడిగా రాంచరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న నేహశర్మ ఆ తర్వాత వరుణ్ సందేశ్ పక్కన ‘కుర్రాడు’ మూవీలో నటించింది. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ బాలీవుడ్ ఆఫర్లు రావడంతో అక్కడే సెటిలైపోయింది. తొలినాళ్లలో మోడలింగ్ కెరీర్ ఎంచుకున్న ఈ భామ తెలుగులో ‘చిరుత’తో పరిచమైంది. ప్రస్తుతం బాలీవుడ్లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ముందుకెళుతోంది. తాజాగా అజయ్ దేవగన్ నటించిన ‘తన్హాజి’లో ఓ కీ రోల్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయే ఈ హాట్ బ్యూటీకి తెలుగులో మళ్లీ నటించాలని ఉందని స్టేట్మెంట్ ఇస్తోంది. అది కూడా తన తొలి హీరో రాంచరణ్ తో నటించాలని ఉందట. దర్శకుడుని ‘చిరుత’ మూవీ సీక్వెల్ తీయాలని కోరుతుంది. ఈ మూవీలో రాంచరణ్ పక్కన మరోసారి రోమాన్స్ చేయాలని ఉందని ప్రకటిస్తుంది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ మూవీతో బీజీగా ఉన్నాడు. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ మూవీలతో బీజీగా మారాడు. పూరి-చెర్రీ కలిస్తేగానీ ఈ భామ కోరిక తీరేలా కన్పించడం లేదు. నేహశర్మ కోరిక తీరాలని అభిమానులు కూడా గట్టిగానే ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ సీక్వెన్స్ మూవీల హవా కొనసాగుతోంది. దీంతో ‘చిరుత’ కాంబినేషన్ కూడా పట్టాలెక్కే ఛాన్స్ కన్పిస్తున్నాయి. అయితే అది ఎప్పట్లోగా అనేది మాత్రం పూరి-చెర్రీలపైనే ఆధారపడి ఉంది. ఈ భామపై పూరి-చెర్రీలు ఎప్పటికీ కరుణిస్తారో.. చిరుత సీక్వెల్ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఆ కానిస్టేబుల్‌ అంత్యక్రియలపై రేవంత్ అసహనం!

కరోనాపై పోరులో ముందుండే డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, పోలీసుల పట్ల కేసీఆర్ సర్కార్ తీరును కాంగ్రెస్ నేత మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఇటీవల వైరస్ సోకి చనిపోయిన పోలీసు కానిస్టేబుల్ దయాకర్‌ రెడ్డి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా డ్యూటీ చేస్తూ మరణించిన దయాకర్‌ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయకుండా ప్రభుత్వం అవమానించిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అహర్నిశలు కరోనాపై జరిపిన పోరులో విధులు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ కు అనాథ శవంలా అంత్యక్రియలు చేశారని పేర్కొన్నారు. కనీసం అంత్యక్రియలను పోలీసు ఉన్నతాధికారులెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఐసీఎంఆర్‌, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కరోనా డ్యూటీ చేస్తూ మరణించిన దయాకర్‌ రెడ్డికి ప్రభుత్వం వెంటనే రూ.కోటి ఆర్థిక సాయం అందించాలన్నారు. కరోనాతో మరణించిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున రూ.లక్ష ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు వివరించారు