
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇది అది అని కాకుండా అన్ని రంగాలూ కుదులేయ్యాయి. ఈ రంగాల్లో ప్రధానమైనది సినీ పరిశ్రమ. ప్రపంచ వ్యాప్తంగా సినిమా, సీరియల్ షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇండియాలో సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడంతో గుర్తింపు ఉన్న సినీ కార్మికులకు రెండు నెలలుగా నిత్యావసరాలు అందుతున్నాయి.
కానీ, టాలీవుడ్‌లో గుర్తింపు కార్డులు లేని కార్మికులు, దినసరి వేతనంతో పని చేసే వాళ్లు మరెంతో మంది ఉన్నారు. పని లేక రోడ్డున పడ్డ వాళ్లంతా షూటింగ్‌లు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు సమావేశమై.. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలిశారు. పరిశ్రమ పెద్దల విజ్ఞప్తి మేరకు.. కార్మికుల సంక్షేమం దృష్ట్యా షూటింగ్‌లకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ మొదటి వారం నుంచి సినిమా, సీరియల్ షూటింగ్‌లతో పాటు ఇతర పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందం నెలకొంది. ఎప్పుడెప్పుడు క్లాప్ కొడదామా? షూటింగ్‌లు మొదలు పెడదామా? అని ఆత్రుతగా ఉన్నారు. అయితే, ఆత్రుత ఉంటే సరిపోదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్లాప్ కొట్టేందుకు ఓకే అంటున్నా.. కండిషన్స్ అప్లై అంటోంది. అంటే.. షూటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. వాటిని పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం షూటింగ్ సెట్స్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే సిబ్బందిని అనుమతించాలి.
అలాగే, ప్రతి ఒక్కరూ మాస్క్, గ్లౌజ్ ధరించాలి. అంతేకాదు మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్స్ తప్పనిసరిగా పీపీఈ కిట్లు వేసుకోవాలి. మేకప్ చేసిన తర్వాత చేతులను శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికి ఔట్‌డోర్ షూటింగ్స్‌కు అనుమతి లేదు. ఇండోర్, స్టూడియాల్లో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే, షూటింగ్కు హాజరయ్యే ప్రతి ఒక్కరి టెంపరేచర్ చెక్ చేశాకే అనుమతించాలి. వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సెట్స్‌లో జూనియర్ డాక్టర్, నర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని మార్గనిర్దేశకాల్లో స్పష్టం చేశారు. అంతేకాదు 60 ఏళ్ల పైబడిన వ్యక్తులను షూటింగ్‌కు అనుమతించకూడదు. మరి, ఈ కండిషన్స్‌ను పాటిస్తూ షూటింగ్స్ ఎలా జరుగుతాయో చూడాలి.