
మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లాలనుకున్న ప్రభుత్వానికి మొదటి నుంచి నిరాశే ఎదురవుతోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత చేసిన 2 ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల ఘోరంగా విఫలమయ్యాయి. వాస్తవానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండుంటే మే నెల 28వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానిని ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. అయితే కోర్టు కేసులు, పాలన వికేంద్రీకరణ బిల్లులు అమలుకు నోచుకోకపోవడం, ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన తదితర అంశాల వల్ల విశాఖ నుంచి ప్రభుత్వం పాలన ప్రారంభించ లేకపోయింది. అయితే ప్రభుత్వం త్వరలో మరో ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మరో అయిదు నెలల సమయం ఉంది.
విశాఖను రాజధానిగా మార్చడానికి ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి రోజున ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎంకు ఆధ్యాత్మిక మార్గదర్శి విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఈ ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. అంతవరకూ మంచి రోజులు లేకపోవడంతో ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసం కోసం ఇప్పటికే బీచ్ రోడ్డులోని గ్రేహౌండ్స్ కార్యాలయంలోని భవనాన్ని ఎంపిక చేశారు. ఉద్యోగులు, మిగిలిన విభాగాలకు కూడా భవనాలు అందుబాటులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే మార్చి 25 ఉగాది ముహూర్తం, మే 28 ముహూర్తాలను స్వామి సూచించినా అనుకోని విపత్తు అయిన కరోనా వల్ల తరలింపు సాధ్యం కాలేదు.
తాజాగా నిర్ణయించిన కొత్త ముహూర్తానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటంతో రాజధాని తరలింపునకు ఉన్న చిక్కులను తొలగించడానికి అవకాశం ఉంటుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదింపునకు, కోర్టులో ఉన్న కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బిల్లులు ఆమోదం పొందే వరకూ తరలించబోమని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
ఈ చిక్కులన్ని తొలగించుకుని ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజధానిని తరలించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే స్వామి పెట్టిన ఈ మూడవ ముహూర్తం గట్టి ముహూర్తమేననిపిస్తోంది. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదని కూడా ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొద్ది రోజుల కిందట స్పష్టం చేసిన నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం ఈ ముహూర్తానికి బలం చేకూర్చేలా ఉంది.
ఇదిలా ఉండగా.. శారదాపీఠం సోషల్ మీడియా విభాగం మాత్రం కొత్త ముహూర్తం విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, తమనేవారూ సంప్రదించలేదని ప్రకటించడం కొసమెరుపు.