Home Blog Page 8463

సచివాలయంలో కరోనా వ్యాప్తిపై సీఎం అసహనం..!


సచివాలయంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో కొత్త కేసులు నమోదు అవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

మరోవైపు సచివాలయంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ ముఖ్య కార్యదర్శి అటెండర్ కి కరోనా నిర్దారణ కావడం ఐఏఎస్ అధికారుల్లో కలకలం మొదలయ్యింది.

ఇప్పటికే వ్యవసాయ, సాధారణ పరిపాలన శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఇద్దరికి కరోనా సోకింది. వీరిద్దరూ రూమ్ మేట్స్. అదేవిధంగా సచివాలయ ప్రాగణంలో ఉన్న అసెంబ్లీ భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో 300 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం వినతితో ఇప్పటికే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 710 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. సచివాలయంలో కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

మత సామరస్యం-హిందూత్వానికి సవాళ్లు (భాగం9)

జాగృత హిందూ సమాజ చారిత్రక నేపధ్యం 

పోయినభాగం లో హిందూ సమాజం ఎలా జాగృతమయ్యిందో, అధికారాన్ని ఎలా సుస్థిర పరుచుకుందో చూసాం. అదేసమయం లో ఇది పూల బాటే కాదు ఎన్నో అవరోధాలు పొంచిఉన్నాయనేది దృష్టి లో వుంచుకోవాలనేది ఈ భాగం సారాంశం. దాదాపు 1300 ఏళ్ళు మెజారిటీ హిందువులు ప్రధాన భూభాగం లో ఇతరుల ప్రభుత్వాల్లోనే వుండాల్సివచ్చింది. దీనికి కారణాలు అనేకం. భారతదేశం ఆధ్యాత్మికంగా ఒకదేశమైనా పరిపాలనా పరంగా అనేక రాజులు, రాజ్యాలుగా ఉండటంతో పశ్చిమ సరిహద్దు నుంచి వచ్చిన దాడుల్ని సమర్ధంగా ఎదుర్కోలేకపోయినవి. మొదట్లో హిందూ రాజులు ఒకరికొకరు మద్దత్తు తెలుపుకున్నా అది సరిపోలేదు. ఒక పెద్ద రాజ్యానికుండే అంగబలం, అర్ధ బలం వేరు అదే చిన్న రాజ్యాలు యుద్ధం లో కలవటం వేరు. ఇదే ప్రధాన కారణం. ఎక్కడయితే పటిష్ట హిందూ రాజ్యముందో అక్కడల్లా ప్రతిఘటనలు తీవ్రంగా ఉండేవి. అస్సాం లాంటి ప్రాంతాలు చివరిదాకా చోటు దక్కనీయలేదు. ఒరిస్సా లోనూ చాలా కాలం అదే జరిగింది. దక్షిణాదిన విజయనగర సామ్రాజ్యం చాలా కాలం ఇతరుల ప్రాబల్యాన్ని నిరోధించగలిగింది. మొఘలుల చివరిదశలో మరాఠా పోరాటం చరిత్రలో మైలురాయి. అదే ఒకే సామ్రాజ్యం వుండివుంటే చరిత్రగతి వేరుగా వుండేది. ఇది చరిత్ర నేర్పిన పాఠం. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పరిపాలన అన్నింటా అధునాతన ఆయుధాలతో మిన్నగా వుండటం తో హిందువులు, ముస్లిం లు కలిసి పోరాటం చేసినా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు కూడా పటిష్టమైన ఒక సామ్రాజ్యం లేకపోవటం కూడా కారణం. అప్పటికే మొఘలుల రాజ్యం బలహీనపడింది. మిగతా ప్రాంతాల్లో స్వతంత్ర రాజులు  బ్రిటిష్ వారి అధునాతన ఆయుధాలతో సరితూగే శక్తిలేదు. దానితో  మరో 200 సంవత్సరాలు ఇతరుల పాలనలో మగ్గవలసి వచ్చింది. చివరకు స్వాతంత్రం కూడా బ్రిటిష్ షరతులకు లోబడి దేశాన్ని రెండు ముక్కలుచేసి ( ప్రస్తుతం మూడు ముక్కలు) సాధించుకోవల్సివచ్చింది. కనీసం ఆ తర్వాతయినా సరైన పంధాలో నడవలేదు. దేశ భక్తియుత సమాజం , దేశ పునర్నిర్మాణ పట్టుదల కలిగిన సమాజంగా పరిణతి చెందలేదు. అభివృద్ధి పధం లో పయనించిన జపాన్, చైనా, దక్షిణ కొరియా , ఆగ్నేయ ఆసియా లా కాకుండా గమ్యంలేని ప్రయాణం కొనసాగించింది. ఇప్పుడిప్పుడే తన స్వంత దేశీయ పంధా వైపు అడుగులేస్తుంది.

ఇది ఒకఎత్తయితే వారసత్వ సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విభజన గాయాలు ఈ రోజుకీ మనన్ని బాధిస్తూనే వున్నాయి. ఉత్తర భారతం, తూర్పు భారతం లో హిందువులు, ముస్లింలు ఇప్పటికీ రెండు ప్రత్యేక సమాజాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక వాయవ్య ప్రాంతం కాశ్మీర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. కొంతమేర దక్షిణాన , పశ్చిమాన ఆ ఘర్షణ వాతావరణం లేదు ( ఏదో కొన్ని స్థలాల్లో తప్ప ). కారణం ఎక్కువభాగం ఒకే మతస్థులైన హిందువులే ఉండటంతో మైనారిటీ లయిన ముస్లిం లు కూడా కలిసిమెలిసి సహజీవనం చేస్తూ మతం పెద్దగా అవరోధంగా లేదు. ముఖ్యంగా దక్షిణాది లో ఈ సంస్కృతి బాగా వుంది. అదే ఉత్తర భూభాగం అలాలేదు. విభజన గాయాలు పాతతరం లో ఇరువైపులా అలాగే వుండిపోవటం, గత 72 సంవత్సరాల్లో వాటిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోకపోగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వీటిని వాడుకోవటం తో సమాజం మరింతగా విడిపోయింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ముస్లింలు మైనారిటీలు అనేదానికన్నా సమాన స్థాయిలో గణనీయ సంఖ్యలో వున్న ఇంకో మతస్తులుగా వుండటం తో మెజారిటీ-మైనారిటీ సంబంధాల కన్నా రెండు సమానస్థాయి మతస్తుల సంబంధాలుగా చూడాల్సివుంటుంది. సహజంగానే అటువంటి సంబంధాలు సున్నితంగా వుంటాయి. ఈ ప్రత్యేకతని గమనించకుండా మైనారిటీ లుగానే పరిగణించి రాయితీలు, బుజ్జగింపు చర్యలు చేపట్టటంతో మెజారిటీ హిందువులు తమకన్యాయం జరుగుతుందనే భావన పెరిగి బిజెపి కింద సమీకృత మయ్యారు. రెండోది, దక్షిణ భారతం తో పోలిస్తే ఉత్తర భారతంలో మతభావనలు ఎక్కువగా వుండటం కూడా కారణం. అందుకే రామజన్మ భూమి ఉద్యమం వాళ్ళ మనస్సులో నాటుకుపోయింది. మూడోది, ముస్లిం లు మెజారిటీగా వున్న కాశ్మీర్ లో హిందువులను వెల్లగొట్టటం కూడా ఉత్తర భారత హిందువులు సమీకృతం కావటానికి కారణమయ్యింది. వీటికి ఇంకా ఎన్నో కారణాలు కూడా జత చేరాయి. అదే తూర్పు భారతం పరిస్థితి వేరు. తూర్పు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం లో హిందువులు అత్యంత మెజారిటీగా వుండటంతో సంబంధాలలో ఘర్షణ కన్నా సామరస్య వాతావరణం తో వుండేది. అదే రాను రాను మార్పులకు గురయ్యింది. తూర్పు పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వలసలు నిరంతరం జరగటం తో ముస్లిం లు గణనీయంగా జనాభా లో సమాన స్థాయి మతస్తులు గా మారారు. ఈరోజు ఆరెండు రాష్ట్రాల్లో దాదాపుగా మూడింట ఒక వంతు జనాభాగా ముస్లింలు వున్నారు. ఈ పరిణామం హిందువుల ఆలోచనల్లో మార్పుని తీసుకొచ్చింది. అంతర్జాతీయ మీడియా కాశ్మీర్ డోమిసైల్ చట్టాన్ని గురించి గోరంతని కొండంతలుగా చిత్రీకరిస్తుంది గానీ తూర్పు భారతం లో జరిగిన జనాభా మార్పుని ఏరోజూ ప్రపంచ దృష్టికి తీసుకురాలేదు. ఈ పరిణామం హిందువులు ఆ రెండు రాష్ట్రాల్లో సమీకృతం కావటానికి దోహదపడింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారం లోకి రాగలిగింది. ఈ సంవత్సరం చివరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. ఈ సమస్యల్ని సమగ్రంగా పరిశీలించకుండా మనం మత ఘర్షణ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేమని అర్ధంచేసుకోవాలి. ఇప్పుడు బిజెపి హిందూ సమాజ జాగృతి తో అధికారం లోకి రెండోసారి వచ్చిన తర్వాత ఎదుర్కుంటున్న సవాళ్ళను పరిశీలిద్దాం.

జాగృతమైన హిందూ సమాజం ఎదుర్కుంటున్న సవాళ్లేంటి?

అన్నింటికన్నా ముఖ్యమైన సవాలు ఇతర మతస్తుల మదిలో  ఇది అందరి ప్రభుత్వమనే భావన తీసుకురాగలగటం. మోడీ రెండో సారి ఎన్నికయిన తర్వాత తీసుకున్న నినాదం ‘ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఈ సవాలు ని దృష్టిలో పెట్టుకొనే ఇచ్చినట్లు కనబడుతుంది. మోడీ ప్రభుత్వానికి ఇది కేంద్రబిందువుగా ఉండాలనే ఆ నినాదం సరయిన దిశలోనే వుంది. అయితే ఆరు నెలల్లోనే ముస్లిం లు ఆ నినాదాన్ని నమ్మటం లేదని జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇందుకు కారణమేమిటో పరిశీలిద్దాం. మొదటి ఆరు నెలలు మోడీ దూకుడుగా సామాజిక అంశాల్ని ముందుకు తీసుకు రావటం జరిగింది. అన్నింటికన్నా ముందుగా ముస్లిం మహిళల్ని దృష్టిలో వుంచుకొని ముమ్మూరు తలాక్ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇది ముస్లిం మత పెద్దలకి కోపాన్ని తెప్పించింది. అదేసమయం లో మేము వ్యతిరేకించినా పార్లమెంటు చట్టం చేసిందనే అసంతృప్తి పేరుకుపోయింది. ఆ తర్వాత కాశ్మీర్ కి సంబంధించి ఆర్టికల్ 370 ని రద్దుచేయటం, రాష్ట్రాన్ని రెండుగా చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించటం కూడా మత పెద్దల్లో అసంతృప్తిని పెంచింది. కాశ్మీర్ సమస్య ప్రత్యక్షంగా మత సమస్య కాకున్నా కాశ్మీర్ ప్రజలు మెజారిటీ ముస్లిం లు కావటం తో ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమనే భావన అందరిలో కాకపోయినా ఎక్కువమంది మత పెద్దల్లో గూడుకట్టుకుంది. తర్వాత సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు ఇవ్వటం, రామాలయం కట్టుకోవటానికి అనుకూలంగా ఈ తీర్పు వుండటం ఈ అసంతృప్తి ని మరింత పెంచి పెద్దదిచేసింది. అటు ప్రభుత్వం, ఇటు సుప్రీంకోర్టు కూడా తమ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే భావన, ఏమీ చేయలేకపోతున్నామనే భావన మత పెద్దలు, మేధావుల్లో ఏర్పడింది. వాస్తవానికి మొదటి రెండింటిలో ముస్లిం ప్రయోజనాలకి వ్యతిరేకమైనది ఏమీ లేదు. మూడోది అతి సున్నితమైన సమస్య. అందరూ కోర్టు తీర్పుకి కట్టుబడి వుంటామని ముందుగానే ఒప్పుకుందే. వాస్తవానికి మధ్యవర్తిత్వ పరిష్కారానికి ఒప్పుకొని వుంటే ఇంత కన్నా మెరుగైన పరిష్కారం ముస్లిం లకు దక్కేదని పరిశీలకుల అభిప్రాయం. వీటితోపాటు మోడీ వచ్చిన తర్వాత మదరసాలను నియంత్రించి    ఆధునిక విద్యను  ప్రవేశపెట్టటం, ఒంటరిగా ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయాన్ని కల్పించటం, ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పధకం లో ముస్లిం మహిళలు ఎక్కువమందికి లబ్ది చేకూరటం  లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టటం జరిగింది.

ఈ నేపధ్యం లో మోడీ ప్రభుత్వం పార్లమెంటు లో పౌరసత్వ సవరణ బిల్లు ని ప్రవేశపెట్టటం ఆమోదింప  చేసుకోవటం చక చకా జరిగింది. దీనితో ముస్లిం మత పెద్దల అసంతృప్తి పరాకాష్టకు చేరింది. వాస్తవానికి ఈ చట్టం భారతీయ పౌరులకు సంబంధించింది కాదు. బయట దేశాలనుంచి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇవ్వటానికి సంబంధించింది. కానీ దీనితోపాటు జనాభా పట్టిక, పౌరసత్వ పట్టిక లు వస్తే దేశం లోని ముస్లిం లు కూడా పౌరసత్వం కోల్పోవలసివస్తుందని చేసిన ప్రచారం ముస్లిం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ప్రధానమంత్రి స్వయంగా పౌరసత్వ పట్టిక గురించి ప్రాధమిక చర్చలు కూడా జరగలేదని వివరణ ఇచ్చినా నిరసన జ్వాలలు ఆగలేదు. కారణం , ఇది కేవలం ఓ వంక మాత్రమే. ఇది ఒకదానిమీద ఒకటిగా  పేరుకుపోయిన అసంతృప్తి,కోపం కలగలిపి పెల్లుబికిన నిరసనగానే చూడాలి. ఇస్లాం మత పెద్దలు, ఇస్లాం మేధావులు వున్నవి లేనివి కలిపి సామాన్య ముస్లింలలో భయాందోళనలు సృష్టించటంలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా డిల్లీ నిరసనలు పెద్దఎత్తున జరిగాయి. అందులో ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం వుపసంహరించుకోవాలనేదే ప్రధాన డిమాండ్. అది ఏవిధంగా దేశంలోని ముస్లిం లకు వ్యతిరేకమో చెప్పలేదు. అంటే పరోక్షంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అందరికీ పౌరసత్వం ఇవ్వాలనేదే వారి కోరిక. తర్వాత జరిగిన డిల్లీ అల్లర్లు నాగరిక సమాజానికే మాయని మచ్చ. అక్కడా ఒకవర్గానికే అన్యాయం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగటం కూడా కుట్రలో భాగమే. ఘర్షణలో ఇరువర్గాల వారు చనిపోవటం, అల్లర్లకు ముందు నిధులు బ్యాంకులనుంచి తీయటం లాంటి నిర్దిష్ట సమాచారం తో ప్రభుత్వం ఛార్జ్ షీట్ దాఖలు చేయటం చూసాం. ఇంతకుముందే చెప్పినట్లు మత ఘర్షణల్లో రెండు వర్గాలవారు ఉంటారనేది సత్యం. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం కంటే దీనిలో ఎవరు ముద్దాయిలున్నా వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరముంది. అప్పుడే ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇందులో ఒక మతస్తులకు కొమ్ము కాయకుండా ముద్దాయి లందరినీ సమానంగా చూసినప్పుడే ‘ సబ్ కా విశ్వాస్ ‘ నినాదం పై నమ్మకం కుదురుతుంది. మోడీ ప్రభుత్వం అలా చేస్తే ముస్లిం సమాజం లోని అభ్యుదయవాదులు హర్షిస్తారు. వాళ్ళలో ప్రభుత్వం నిష్పక్షపాతంగాపనిచేస్తుందనే భావన ఏర్పడుతుంది. ఇది మోడీ ప్రభుత్వం పై విశ్వసనీయతని పెంపొందిస్తుంది.

మోడీ ‘సబ్ కా విశ్వాస్ ‘ దిశగా చేయాల్సిన పనులు

ప్రభుత్వం అందరిదీ అనే భావన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం నడిపే వారి మీదనే వుంటుంది. అవతలివారు అపోహలు, అపార్ధాలు కలిగించినా వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే వుంటుంది. ఉదాహరణకు కావాలనే మోడీ పై, ప్రభుత్వం పై ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారనే అనుకున్నా అది నిజం కాదని ముస్లిం లకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారం లో వున్న పార్టీ మీద వుంది. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు పార్టీలో కొంతమంది ముస్లిం లపై అవాకులు, చెవాకులు పేలుతూ వుంటే వాళ్ళను నియంత్రించాల్సిన  బాధ్యత పార్టీ అధ్యక్షుడి పై వుంది. అలాగే మంత్రులు అలా ప్రవర్తించినప్పుడు వాళ్ళను హెచ్చరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పై వుంది. ముస్లిం సమాజం లో సంస్కరణలకు మత పెద్దలు వ్యతిరేకమని తెలిసినప్పుడు ముస్లిం సమాజం లో ఎక్కువమందిని విశ్వాసం లోకి తీసుకొని వాళ్లకు వివరించాల్సి వుంది. చివరగా ఈ సంస్కరణలు ఆమోదించాల్సింది ముస్లిం సమాజమని మరిచిపోవద్దు.

పౌరసత్వ సవరణ చట్టం లో ఎటువంటి ముస్లిం వ్యతిరేక నిబంధనలు లేవని ముస్లిం లను ఒప్పించటం లో ప్రభుత్వం విఫలమయ్యిందని చెప్పొచ్చు. ఆ విషయం లో ముస్లిం సమాజంతో మరింత విస్తృత సంప్రదింపుల ప్రక్రియ జరిపి వుండాల్సింది. ఒక్కోసారి అపోహలు, అపార్ధాలే మనస్సులో లోతుగా నాటుకు పోతాయి. ఓపికతో వాటిని తొలగించే ప్రజా సంబంధాల ప్రక్రియని గట్టిగా, విస్తృతంగా చేయగలగాలి. అలా చేయకుండా నేను కరెక్టుగానే వున్నాననుకుంటే సరిపోదు. కొన్ని సమయాల్లో కరెక్టుగా వున్నట్లు కనిపించాల్సిన అవసరం కూడా వుంది. మధ్యయుగ, ఆధునిక భారత చరిత్ర చూసిన తర్వాత దానినుంచి గుణపాఠాలు  తీసుకొని ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని విశ్వాసం లో తీసుకొనే చర్యలు ప్రభుత్వం, పార్టీ చేపట్టినప్పుడే ‘సబ్ కా విశ్వాస్ ‘ నినాదం విజయవంతమవుతుంది.

చివరగా , మోడీ ప్రభుత్వం జాగృతమైన హిందూ సమాజానికి ప్రతినిధి అనుకున్నప్పుడు ఆ హిందూ సమాజ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించాల్సివుంది. ఒక్కసారి హిందూ రాజ్యాల చరిత్ర పరిశీలిస్తే అందరినీ, అన్ని మతాల వారిని సమానంగా ఆదరించి గౌరవించిన సంస్కృతి. బహుకొద్ది రాజ్యాలే దీనికి మినహాయింపు. అంటే సెక్యులర్ భావాలు అనాదినుండి వున్నాయి. అన్ని వాదనలు భౌతిక వాదాన్ని ప్రతిపాదించిన చార్వాకుడి వాదనలతో సహా సమానంగా గౌరవింపబడిన సంస్కృతి. మరి ఈరోజు హేతువాదులు వరసగా హత్యకు గురికాబడటం ఆ వారసత్వానికి మాయని మచ్చ. అలాగే అన్ని మతాలవారు సమానంగా సహజీవనం చేసే వాతావరణాన్ని కలిగించటం కూడా ఆ వారసత్వపు ప్రతినిధులకు బాధ్యతే. ఈ వారసత్వ సంస్కృతిని జాగృతమైన హిందూ సమాజం పరిరక్షిస్తుందని , కక్ష సాధింపు చర్యలకు ఇందులో తావు లేదని గ్రహించాలి. అప్పుడే సెక్యులర్ రాజ్యాంగాన్ని, హిందూ సమాజ చారిత్రక వారసత్వాన్ని కొనసాగించిన వాళ్ళవుతారు. ఇది మెజారిటీ హిందూసమాజ బాధ్యత.

మరి ఇన్ని మతాల సమూహంగా వున్న భారత్ లో మత సామరస్యం బలంగా ప్రజల మనస్సులో నాటుకుపోవాలంటే ఏం చేయాలి. ఇది ప్రభుత్వ చట్టాల ద్వారా సాధ్యం కాదు. ప్రజల మనోబలంతోనే సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమో చివరి భాగం లో చూద్దాం. అంతవరకూ సెలవు.

 

 

చురుగ్గా ముందుకు కదులుతున్న రుతుపవనాలు!

Rains

మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలను తాకనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయి. చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, కన్యాకుమారి, దక్షిణ కర్ణాటక, బెంగళూరు వరకు మేఘాలు పరుచుకుని వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణాలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న ఏరువాక పౌర్ణమి. రైతుల విత్తనాలు నాటేందుకు నాగలి పడతారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో నైరుతి ఆగమనం అంటూ వాతావరణ శాఖ రైతుల్లో ఆనందం నింపింది. మరోవైపు నిసర్గ తుఫాను మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటి అల్పపీడనంగాగా మారింది. ఉత్తర విదర్భ, దక్షిణ మధ్య ప్రదేశ్ ప్రాంతంలో బలహీనపడింది. దాని ప్రభావం వల్ల విదర్భ, ఛత్తీస్ గఢ్, దక్షిణ, తూర్పు తెలంగాణాల్లో ఆకాశం మేఘావృతమైంది. అక్కడడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Beautiful Pictures of Raashi Khanna

కృష్ణా బోర్డులో వాడివేడి వాదనలు ఇవే..!

Krishna board

కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశంలో తెలుగు రాష్ట్రాలు వాడివేడి వాదనలు వినిపించాయి. ముందుగా తెలంగాణ, తర్వాత ఏపీ వారి వారి వాదనలు వినిపించాయి. తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. వాటినే తాము కొనసాగిస్తున్నామని వివరించారు.. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఏపీ తరపున ఆదిత్యనాథ్ దాస్ వాదనలు వినిపించారు. తెలంగాణ వాదనను ఏపీ తప్పుబట్టింది. ఏపీకి నీటి కేటాయింపుల ఆధారంగానే…పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్ మార్చిందని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా భావించాలని వాదించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని అన్నారు.

దేశాన్ని మోడీ అన్ లాక్ చేసే సాహసం చేస్తారా?

modi

modi

లాక్ డౌన్ నిబంధనలు ప్రధాని మోడీ సడలించడం మొదలు పెట్టాక దేశంలో కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా 8-9వేల వరకు కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దేశంలో 2.17 లక్షలు దాటింది. దీంతో ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ సర్కార్ చేతులెత్తేసింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు అంతా రోడ్డెక్కడం.. ఉద్యోగాలు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అందరూ బయటకు రావడం.. కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మాస్క్ లు, శానిటైజర్లు వంటివి వాడకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తి దేశంలో పెరిగిపోతోంది. ఇక పాజిటివ్ వచ్చాక 14 రోజులకు లక్షణాలు బయటపడుతున్నాయి. కానీ ఆ వైరస్ సోకిన వ్యక్తి ఈ 14 రోజుల్లో వందల మందికి వైరస్ అంటించేస్తున్నాడు. ఇది కూడా దేశంలో వైరస్ కేసులు భారీగా పెరగడానికి కారణమవుతోంది.

ఇక ముంబై, ఇతర రాష్ట్రాలకు పనినిమిత్తం వెళ్లిన వలస కార్మికులు వైరస్ ను వెంటబెట్టుకొని సొంతూళ్లకు రావడం కూడా వైరస్ పెరగడానికి కారణమవుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఇప్పుడు కరోనా చిచ్చు రేపుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో సామాజికవ్యాప్తి దశలోకి వచ్చింది. ఎవరి నుంచి.. ఎక్కడి నుంచి ఎవరికి సోకుతుందనేది చెప్పడం కష్టం. సో ఇక నుంచి కంటైన్మెంట్ జోన్లు పెట్టడం.. మొత్తం ఆ వీధులు, గ్రామాలు లాక్ డౌన్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నది. కాబట్టి ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే ఆ వీధి, గ్రామ ప్రజలంతా కంటైన్మెంట్లతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

జూన్ 8 నుంచి దేశంలో ఆలయాలు, హోటల్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు రెండు లక్షలు దాటుతున్న దృష్ట్యా దీనిపై పునరాలోచన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థలకు అనుమతులు ఇచ్చి రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కు సైతం అనుమతులు ఇవ్వరాదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా లాక్ డౌన్ తో మూత పడి వేలకోట్ల నష్టాన్ని చవిచూస్తున్న సినీ పరిశ్రమకు సైతం కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. దేశ సినీ పరిశ్రమను తిరిగి తెరవాలని కేంద్ర మంత్రి జవదేకర్ ను సినీ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించలేదు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశం జూన్ తర్వాతేనని స్పష్టం చేయడంతో సినీ పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

జూన్ తర్వాత కేసులు తగ్గుముఖం పడితేనే థియేటర్ల విషయంలో ఆలోచిస్తామని కేంద్రమంత్రి జవదేకర్ తెలిపారు. తగ్గకపోతే మరో నెలపాటు థియేటర్స్ బందేనని స్పష్టం చేశారు. దీంతో కనీసం మూడు నెలల వరకైనా సినిమా థియేటర్స్ బంద్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ సినీ పరిశ్రమకు ఈ వార్త శరాఘాతంగా మారింది. థియేటర్ యాజమాన్యాలు దివాళా తీసే పరిస్థితి ఏర్పడనుంది. ఈ పరిణామం సినిమా పరిశ్రమకే పెద్ద షాక్ గా అభివర్ణిస్తున్నారు.

ఇలా ఇప్పటికే సడలింపులతో లాక్ డౌన్ ను నెమ్మదిగా ఎత్తివేస్తున్న ప్రధాని మోడీ జూన్ 8న కనుక అన్నింటిని ఓపెన్ చేయిస్తే మరిన్ని కేసులు పెరుగడం ఖాయం. ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లో పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతారు. ఇప్పటికే వైరస్ విస్తృతి పెరుగుతున్న దృష్ట్యా మోడీ సర్కార్ దేశాన్ని అన్ లాక్ చేస్తుందా? మొత్తం ఓపెన్ చేసే సాహసం చేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

-నరేశ్ ఎన్నం

చైనాపై గూగుల్ కి ఎందుకో.. అంత ప్రేమ?!

Kerala

Mitron china removers app

గూగుల్ కి చైనాపై కొంచం ప్రేమ ఎక్కువైనట్లు ఉంది. భారత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న రెండు భారతీయ యాప్స్‌ ని ప్లే స్టోర్ నుంచి తొలగించి గూగుల్‌ భారీ షాకిచ్చింది. ఆ రెండు యాప్ ల్లో ఒక యాప్ టిక్ టాక్ కి బదులుగా వాడే యాప్ కాగా మరొకటి చైనా యాప్స్ ని గుర్తించే యాప్. అయితే ఈ రెండు యాప్స్ ‘మిత్రో‌’, ‘చైనా యాప్స్‌ రిమూవ్‌’ యాప్‌ లను గూగుల్‌ తొలగించింది. ఈ రెండు యాప్‌ లకు భారత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఒక్కసారిగా వీటిని తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించివేయడం పట్ల ఆశ్చర్యపోవడం ఐటీ నిపుణుల వంతవుతోంది. భారత సరిహద్దులో చైనా దూకుడుకు నిరసనగా ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌ చుక్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు యాప్‌ లను లక్షల్లో యూజర్లు డౌన్‌ లోడ్‌ చేసుకొన్నారు. మిత్రోను భారతీయ టెకీలు తయారుచేయగా.. “రిమూవ్‌ చైనా యాప్స్‌” యాప్‌ ను వన్‌ టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ సిద్దంచేసింది.

అయితే, తమ ప్లేస్టోర్‌ నుంచి ఈ రెండు యాప్‌ లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో.. దాని వెనుకున్న కారణాలను గూగుల్‌ ఇప్పుడు వివరిస్తూ స్పందిస్తున్నది. టిక్‌ టాక్‌ యాప్‌ నకు పోటీగా భారతీయుడు తయారుచేసిన మిత్రో యాప్‌.. ఇప్పటికే ఉన్న టిక్‌ టిక్‌ యాప్‌ ను పోలీ ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇకపోతే, రిమూవ్‌ చైనా యాప్స్‌ అనే యాప్‌.. స్మార్ట్‌ఫోన్లలో మూకుమ్మడిగా చైనా యాప్స్‌ ను తొలగించడాన్ని గుర్తిస్తుంది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే భారతదేశ ధోరణి కారణంగా ఈ యాప్‌ ప్రజాదరణ నోచుకొంటున్నది. ‘ఈ నెల ప్రారంభంలో పలు సాంకేతిక విధానాల ఉల్లంఘనలకు పాల్పడిన ఒక వీడియోను తొలగించాం. సమస్యలను పరిష్కరించేందుకు, ఆయా సంస్థలకు సహాయపడేందుకు డెవలపర్లతో కలిసి పనిచేసే స్థిరప్రక్రియ మా వద్ద ఉన్నది. వీరికి మార్గదర్శనం చేశాం. సమస్యలను పరిష్కరించుకొన్న తర్వాత ఆ డెవలపర్‌ తిరిగి ప్లే కావచ్చు’ అని ఆండ్రాయిడ్‌ గూగుల్‌ ప్లే వైస్‌ ప్రెసిడెంట్ సమీర్‌ సమత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గూగుల్‌ ఎత్తిచూపుతున్న సమస్యలను పరిష్కరించుకొన్న తర్వాత తిరిగి ప్లే స్టోర్‌ లోకి వచ్చేందుకు మిత్రో యాప్‌ కు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, రిమూవ్‌ చైనా యాప్స్‌ అనే యాప్‌ తిరిగి ప్లే స్టోర్‌ లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐటీ నిపుణులు చెప్తున్నారు. రిమూవ్‌ చైనా యాప్‌.. గూగుల్‌ ప్లేలో దాదాపు మిలియన్‌ డౌన్‌ లోడ్లను సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. కాగా, మిత్రో యాప్‌ 5 మిలియన్‌ డౌన్‌ లోడ్లను అందుకొని గూగుల్‌ ప్లేస్టోర్‌ లో 4.7 స్టార్‌ రేటింగ్‌ ను కలిగివుండటం విశేషం.

ప్రతిష్ఠాత్మక దవాఖాన డాక్టర్లకు కరోనా!

Aiims

Aiims

ఢిల్లీలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ లో డాక్టర్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తెలడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 480 మంది కరోనా పాజిటివ్ అని తేలగా ఇందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 14 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

19 డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు, మిగిలినవారు రెసిడెంట్‌ డాక్టర్లు. కరోనాతో ఈ అత్యున్నత దవాఖానలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్‌ శానిటేషన్‌ సిబ్బందికి ఇన్‌ చార్చి ఉన్నారు. హాస్పిటల్‌ లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హాస్పిటల్‌ లో మార్చి నెలలో ఔట్‌ పేషెంట్‌ విభాగాన్ని మూసివేశారు. ఇలా ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని మూసివేయడం ఎయిమ్స్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.

దిలీప్‌రాజా దర్శకత్వంలో ‘లాక్‌డౌన్’..

Director Dileep Raja

Director Dileep Raja
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్‌డౌన్’ అనే టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆమోదం ఇచ్చినట్లుగా ఆయన తెలియజేశారు. గతంలో ప్రముఖ హాస్యనటుడు ఆలీతో ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రానికి దర్శకత్వం వహించిన దిలీప్‌రాజా తాజాగా ‘యూత్’(కుర్రాళ్ళ గుండె చప్పుడు) చిత్రాన్ని ప్రారంభించారు. ఒక షెడ్యూల్ అనంతరం లాక్‌డౌన్ రావడంతో ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చే వరకు ఆ చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేశారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారతదేశానికి సోకిన అనంతరం జరిగిన పరిణామాలపై వాస్తవిక సంఘటనలు ఆధారంగా ‘లాక్‌డౌన్’ చిత్రం రూపొందిస్తామని దర్శకుడు దిలీప్‌రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ‘లాక్‌డౌన్’ చిత్ర విశేషాలను తెలుపుతూ.. ‘‘విజయ్ బోనెల, ప్రదీప్ దోనూపూడి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ‘లాక్‌డౌన్’ చిత్రంలో వలస కార్మికుడే హీరో. ఆంధ్రప్రదేశ్‌లో ‘లాక్‌డౌన్’ చిత్రం షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాము. కథ విషయానికి వస్తే.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులను స్వగ్రామంలోనే వదిలి భార్యాబిడ్డలతో కూలిపని కోసం ఓ మహానగరానికి చేరుకుంటారు. అక్కడ భార్యబిడ్డలతో పనిచేసుకుంటుండగానే ‘లాక్‌డౌన్’ ప్రకటించడంతో తల్లిదండ్రులను చేరుకునే దారిలేక కాలినడకన బయలుదేరుతారు. నడిచి నడిచి తన బిడ్డల కాళ్లు పగిలిపోయి నెత్తురోడుతుంటాయి. చేతిలో డబ్బుల్లేక, ఆకలికి సమాధానం చెప్పలేక.. రాత్రివేళల్లో వేలాది కిలోమీటర్లు నడుస్తూ..

దారిలో తగిలిన గ్రామాల్లో అడుక్కు తింటూ బయలుదేరిన ఆ వలసకూలీ తన తల్లిదండ్రులను చేరుకుంటాడా? లేదా? అనే అంశాన్ని సినిమాలో చూపిస్తున్నాం. ఒక వైపు కరోనా వైరస్ నుంచి కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలి బతుకు చిత్రమే ఈ చిత్రం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుంది. మరోవైపు పాటల రికార్డింగ్ అవుతున్నాయి. కరోనాపై అప్రమత్తంగా లేకపోతే కరోనా కాటేసి తీరుతుందని ఈ చిత్రంలో చూపిస్తున్నాము. ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి. భారతదేశంలో ‘లాక్‌డౌన్’ పేరుతో తొలిసారిగా ఈ చిత్రం రూపకల్పన చేస్తున్నాము..’’ అని దిలీప్‌రాజా తెలిపారు.
ఈ సినిమాకు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్‌రాజా

సీఎం నివాసానికి సమీపంలో కరోనా ఉధృతి..!

AP CM House

AP CM House

రాజధానిలోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేటలో గురువారం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు సచివాలయంలో సీఎంఓ బ్లాక్ కు కరోనా చేరుకోగా ఇటు సీఎం నివాసానికి చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో, వైసీపీ నాయకుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. తాడేపల్లిలో వెలుగు చూసిన నాలుగు కేసులు సీఎం నివాసానికి అతి చేరువలో రావడం వలన ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

తాడేపల్లిలో కరోనా సోకిన నలుగురిలో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు మరింత భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వాలంటీర్లు ఇద్దరు మూడు రోజుల క్రితం వారి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని శానిటేషన్ పనులను చేస్తున్నారు. రాక పోకలను నియంత్రించేందుకు బారిగేట్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరికి కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు వారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 130 నుంచి 180 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం 3,377 కేసులు ఇప్పటి వరకూ నమోదు అయ్యాయి. 2,273 మంది కొలుకోగా 1,033 మంది చికిత్స పొందుతున్నారు. 71 మంది మరణించారు.

నిర్మలకు మోడీ గుడ్ బై.. దేశానికి కొత్త ఆర్థికమంత్రి?

Nirmala-Sitharaman-Modi

Nirmala-Sitharaman-Modi

పేరుకు.. 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. కానీ ఏమున్నది గర్వకారణం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. ఇంత భారీ ప్యాకేజీ ప్రకటించినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉట్టి ఉత్తుత్తి ప్యాకేజీ అన్న విమర్శలు వచ్చాయి.మోడీ ప్యాకేజీ గాలి బుడగ అని మేధావులు, మీడియా ఆడిపోసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి మోడీ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మార్చబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలకి.. కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర కేబినెట్ విస్తరణకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్రమంత్రుల పనితీరుపై సమీక్షించిన మోడీ వారి పురోగతి దాదాపు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. మంత్రివర్గంలో చేరికలు.. తీసివేతలతోపాటు మంత్రివర్గ శాఖల మార్పులు కూడా ఉండవచ్చని వార్తలు వెలువడుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక రంగాన్ని మాత్రం నిలబెట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పైగా దక్షిణాది ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో ప్రాధాన్యత దక్కింది. కానీ ఆర్తిక వ్యవస్థ బలోపేతానికి నిర్మలకు మోడీ గుడ్ బై చెప్పి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.

నిర్మల స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా సీనియర్ బ్యాంకర్ , ప్రముఖ ఆర్థిక నిపుణులు కేవీ కామత్ ను తీసుకురాబోతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్ గా ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకున్న కామత్ వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. ఆయనకే కేంద్ర ఆర్థిక మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మల పేరు గతంలో మారుమోగింది.. పైగా సీనియర్ నాయకురాలు. కానీ ఆమె హయాంలో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఆర్థికమంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్టు సమాచారం.

కామత్ కు ఆర్థిక నిపుణుడిగా పేరుంది. బ్యాంకింగ్ రంగంలో ఆయన విస్తృత సేవలందించారు. ధీరుబాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్, అనిల్ అంబానీల ఆస్తుల పంపకాన్ని చేపట్టింది ఇదే కామత్ కావడం విశేషం.

కరోనా-లాక్ డౌన్ తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కామత్ ను కేంద్ర ఆర్తిక మంత్రిగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
-నరేశ్ ఎన్నం

హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు శుభవార్త..!

avanthi srinivas

avanthi srinivas
కరోనా వ్యాప్తితో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా మూతబడి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరంతా గతంలో నిర్వహించిన విధంగానే వ్యాపార కార్యక్రమాలు పునః ప్రారంభించు కునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాలను పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. లాక్ డౌన్‌ నిబందనలు సడలించిన నేపధ్యంలో ఈ నెల 8 నుంచి టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు,‌ రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. తొమ్మిది కమాండ్ కంట్రోల్‌ రూం లను ముఖ్యమంత్రి జగన్ వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నారని చెప్పారు.

కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభమైన తర్వాత బోట్లను పునరుద్దరిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారమే నడుచుకొనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి,‌ కాకినాడ పట్టణాల్లో హోటల్లు, రెస్టారెంట్లను 8 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎపిలో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అన్ని వనరులున్నాయన్నారు. టెంపుల్ టూరిజం ను ప్రోత్సహిస్తున్నామని, యాత్రికులకు కావాల్సిన హోటల్లు, రెస్టారెంట్లు అన్నీ సిద్దంగా ఉంచామని తెలిపారు. ఇతర టూరిస్టులకు కరోనా దృష్ట్యా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

గత సంవత్సరంలో టూరిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని, రాబోయే రోజుల్లో అరకు, మారెడిమిల్లి లాంటి టూరిజం ప్రదేశాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ పెట్టాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి హోటల్స్ బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవచ్చన్నారు.

కరోనా దృష్ట్యా పర్యాటకంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, టూరిస్టులు కరోనా కారణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎపిలో టూరిజం రంగానికి లాక్ డౌన్ ద్వారా మూడు నెలలకు రూ.30 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే వరకు సహజీవనం చేయడమేనన్నారు. ప్రపంచ టూరిజం మ్యాప్ లో ఎపి టూరిజంని ఉంచాలన్నదే లక్ష్యమని చెప్పారు.

రోజాగారు…ఇంత దిగజారుడు అవసరమా?

Roja

 

Roja

వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన హోదాను మరిచి ఇటీవల దిగజారుడు పనులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో తన నియోజకవర్గం నగరిలో ఒక గ్రామాన్ని సందర్శించి కొత్త బోర్‌ వెల్ ప్రారంభించారు. ఆ సమయంలో అధికారపార్టీ ఎమ్మెల్యే నడుస్తున్న దారిలో పూలు వేదజల్లుతూ.. స్వాగతం పలికించుకొని విమర్శలు పాలయ్యారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో టాపిక్ తో వార్తల్లో నిలిచారు.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా నోటి దురుసుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసారు. ఒకప్పుడు ఆయన చేయించుకున్న గుండు పై ఆమె మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోను హీరోయిన్ పూనమ్ కౌర్ లైక్ చేయడం హాట్ టాపిక్‌ గా మారింది.
పవన్ పై విమర్శలు చేస్తూనే మరోవైపు రోజాని వెనకేసుకొని రావడంతో పూనమ్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.

విమర్శలలో నిజమెంత?

పరిటాల రవి చనిపోయే నాటికి రాయలసీమలో ఆయనకు సెపేరేట్ క్రేజ్ ఉండేది. అప్పట్లో ఏదో ఇష్యూపై  ఆయన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు గుండు కొట్టించారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఒక ఇంగ్లీష్ పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. దానికి నిరసనగా పవన కళ్యాణ్ ఆ పత్రికా ఆఫీసు ముందు ధర్నా కూడా చేసారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను అప్పట్లో అందరిలాగే నేను కూడా గుండు చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక పరిటాల రవిని తాను ఎప్పుడు కలవలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో, 2014లో కూడా పవన్ కళ్యాణ్‌ కు గుండు కొట్టించారని రోజా సెటెర్లు వేసింది.

బ్యాంకింగ్‌ మోసాల బ్యాక్‌డ్రాప్‌లో ‘సర్కారు వారి పాట’!

Sarkaru Vari Pata

Sarkaru Vari Pata

శ్రీమంతుడు, స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ.. సూపర్ స్టార్ మహేశ్బాబు ఐదేళ్లుగా నటించిన చిత్రలు. వీటన్నింటిలో ఓ కామన్ పాయింట్‌ కనిపిస్తుంది. అన్ని సినిమా ల్లోనూ సమాజానికి సందేశం ఉంటుంది. లుక్‌, క్యారెక్టరైజేషన్‌లో వైవిధ్యం చూపిస్తున్నా.. తన మూవీ ద్వారా ఏదో ఒక మేసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నడు మహేష్. దాంతో, తన తాజా చిత్రం సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ ఎలాంటి సందేశం ఇస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లూక్‌ పోస్టర్చూస్తే మహేశ్ పాత్ర ఫుల్ మాస్‌గా కనిపిస్తోంది. ఇంకోవైపు డైరెక్టర్ పరశురామ్‌ గత చిత్రాలను చూస్తే కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తుంటాడు. అయితే, మహేశ్ఫ్యాన్స్‌ ఆశించే మాస్‌ అంశాలతో పాటు తన మార్కు ఫ్యామిలీ వాల్యూస్‌ను పొందుపరిచిన పరశురామ్‌… ‘సర్కారు వారి పాట’ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రం బ్యాంకింగ్ మోసాల బ్యాక్డ్రాప్‌లో జరిగే కథాంశమని సమాచారం. ప్రీలుక్‌లో మహేశ్ మెడపై రూపాయి టాటూను చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్‌ మోసాలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే.

అలా తమ కుటుంబాన్ని మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే క్యారెక్టర్లో మహేశ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే హీరోయిన్‌ కాసినోలలో జూదం ఆడుతుందట. అక్కడే హీరోకు పరిచయం అవుతుందట. ఈ పాత్రకు కియారా అడ్వాణీ, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భరత్‌ అనే నేనుతో కియారా, మహర్షితో పూజా ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరిలో ఎవరు మహేశ్తో రెండోసారి నటించే అవకాశం కొట్టేస్తారో చూడాలి.

ఆ కరోనా పెషంట్ ఏమైనట్లు?: హైకోర్టు సూటి ప్రశ్న

Telangana-High-Court

Telangana-High-Court

తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన కరోనా పెషంట్ ఆ తర్వాత కన్పించకుండా పోవడం మిస్టరీగా మారింది. దీనిపై ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన సదరు పెషంట్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆ కరోనా పెషంట్ విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అతడు బ్రతికి ఉన్నాడా? లేదా అనే విషయాన్ని జూన్ 5లోగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఆ పెషంట్ మృతిచెందితే అంత్యక్రియలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశించింది.

ప్రభుత్వం చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మధుసూధన్ అనే వ్యక్తి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న మధుసూధన్ భార్య మాధవి కోలుకుంది. తన భర్త విషయంపై ఆరా తీయగా కోలుకుంటున్నాడని ఒకసారి చెప్పగా.. మరోసారి చనిపోయారని చెప్పినట్లు తెలుస్తోంది. మధుసూధన్ చనిపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం అందించలేదనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. కనీసం డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మాధవి ఆరోపించింది.

తన భర్త బ్రతికే ఉంటాడని మాధవి అంటోంది. ఈ విషయంపై గతంలోనే మంత్రి కేటీఆర్ కు ట్వీటర్లో ఫిర్యాదు చేసింది. తన భర్త చనిపోతే కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎలా అంత్యక్రియలు చేస్తారని ప్రశ్నించింది. డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకపోవడంపై కూడా నిలదీసింది. దీనిపై అఅధికారులు పొంతనలేని సమాధానం ఇస్తుండటంతో ఆమె హైక్టోర్టును ఆశ్రయింది. ఆ పెషెంట్ కు జీహెచ్ఎంసీ అధికారులు అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు చెప్పడంపై హైక్టోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి మాధవి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

అయితే అధికారులు మాత్రం అప్పటికే ఆ కుటుంబంలో ఒకరు కరోనాతో మృతిచెందారని పేర్కొంటున్నారు. మధుసూదన్ కూడా చనిపోయాడని చెబితే ఆ కుటుంబం షాక్‌కు గురవుతుందనే చెప్పలేదని అంటున్నారు. డెడ్ బాడీని మార్చురీలో ఉంచే పరిస్థితి కూడా అప్పట్లో లేకపోవడంతో అంత్యక్రియలు చేసినట్లు చెబుతోన్నారు. వీరి వాదనలు విన్న హైకోర్టు జూన్ 5లోగా మధుసూధన్ విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పాలని ఆదేశించింది. మధుసూధన్ చనిపోయాడా? లేక బ్రతికి ఉన్నాడా? తెలిపాలని పేర్కొంది. మృతిచెందింతే అతడి అంత్యక్రియలకు సంబంధించి ఆధారాలకు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

టీడీపీని నిలబెట్టేలా చంద్రబాబు ప్లాన్లు..

mahanadu

mahanadu
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆన్ లైన్ లో నిర్వహించిన మహానాడు ద్వారా చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చినట్టుందట.. నేతల అసంతృప్తులు, అసమ్మతులు తెలిసివచ్చాయట.. పార్టీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అందరి సలహాలు, సూచనలు విన్న చంద్రబాబు ఏపీలో తిరిగి తన పార్టీని పునరుద్ధరించడానికి క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం..

మహానాడు ద్వారా చంద్రబాబుకు కూడా ఎవరు తనతో ఉన్నారు.. ఎవరు లేరనే విషయం బోధపడింది. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా కొందరు సీనియర్ నాయకులు మహానాడు సమావేశాలకు దూరంగా ఉన్నారని చంద్రబాబుకు స్పష్టమైంది. దీన్ని గ్రహించిన చంద్రబాబు పార్టీలోని ప్రతి నాయకుడితో వారి వారి అసంతృప్తుల గురించి మాట్లాడారు. తద్వారా భవిష్యత్ ప్రణాళికలకు సలహాలు స్వీకరించారు. ఈ మొత్తం క్రోడీకరించి తిరిగి ఏపీలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు రెడీ అయ్యారట..

ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నోరా వారిని చంద్రబాబు కూల్ చేసినట్టు తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో పార్టీతో కలిసి ఉండాలని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తారా? లేక ఇతర పార్టీలోకి వెళ్లి టీడీపీ విడిచి పెట్టి సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా అని చంద్రబాబు వారి ముఖం మీదే అడిగినట్లు తెలిసింది. ఎందుకంటే పార్టీ విధేయులతోనే తాను తిరిగి టీడీపీని ఏపీలో బలోపేతం చేయాలనుకుంటున్నానని.. పార్టీ మారే అవసరం లేదని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది.

ఇక అదే సమయంలో ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు స్థానంలో టీడీపీ చీఫ్ ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన మరో బలమైన నాయకుడిని నియమించాలని ఆలోచిస్తున్నారు. కళా వెంకటరావు ఎన్నికల్లో ఓడిపోవడంతో స్వయంగా టీడీపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని కొత్త వారికి చాన్స్ ఇచ్చారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడిని చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే వివాదాస్పద నేత కావడంతో ఆయనను పలువురు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. పైగా ఆ కుటుంబానికి చంద్రబాబు ఇప్పటికే పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారు.

ఇక పార్టీని బలోపేతం చేయడం.. కేడర్ ధైర్యాన్ని పెంచేందుకు నియోజకవర్గం వారీగా కమిటీలను నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నాడట.. తద్వారా వైసీపీ దాడిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

అయితే ఎన్ని చేసినా ప్రస్తుతం వైసీపీని ఢీకొట్టే పరిస్థితిలో పార్టీ లేదు. తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, పార్టీ కోలుకోవడానికి చాలా బలం అవసరమని చెప్పవచ్చు.

సీఎంఓ బ్లాక్ కు పాకిన కరోనా..!

Secretariat employees

corona-in-ap-secretariat

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ కు కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. సచివాలయంలో మొదటి బ్లాక్ లో సీఎంఓ, సాధారణ పరిపాలన శాఖ (జి.ఏ.డి)లు ఉన్నాయి. జి.ఏ.డిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. దీంతో సీఎంఓ లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆధికారులు, అక్కడి సిబ్బంది మినహా ఇతరులను అనుమతించడం లేదు. ఇప్పటికే మూడు, నాల్గవ బ్లాక్ లలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

కొద్ది రోజుల కిందట వ్యవసాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా సోకగా ఆ శాఖ ఉద్యోగులు అందరికీ కరోనా పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖలో కరోనా సోకిన వ్యక్తి రూమ్ మేట్ గా ఉన్న సాధారణ పరిపాలన శాఖలోని ఉద్యోగికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ అమలుకు ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. మరోవైపు అసెంబ్లీ భద్రతా విధుల్లోని కానిస్టేబుల్‍కు కరోనా సోకడంతో అసెంబ్లీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ కేటాయించారు. రెండ్రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ విధుల నిర్వహణకు అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల విధులకు హాజరైన కొద్దిరోజుల్లోనే సచివాలయంలో కరోనా మరోమారు ఉద్యోగులకు వర్క్ ప్రం హోమ్ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.