
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆన్ లైన్ లో నిర్వహించిన మహానాడు ద్వారా చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చినట్టుందట.. నేతల అసంతృప్తులు, అసమ్మతులు తెలిసివచ్చాయట.. పార్టీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అందరి సలహాలు, సూచనలు విన్న చంద్రబాబు ఏపీలో తిరిగి తన పార్టీని పునరుద్ధరించడానికి క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం..
మహానాడు ద్వారా చంద్రబాబుకు కూడా ఎవరు తనతో ఉన్నారు.. ఎవరు లేరనే విషయం బోధపడింది. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా కొందరు సీనియర్ నాయకులు మహానాడు సమావేశాలకు దూరంగా ఉన్నారని చంద్రబాబుకు స్పష్టమైంది. దీన్ని గ్రహించిన చంద్రబాబు పార్టీలోని ప్రతి నాయకుడితో వారి వారి అసంతృప్తుల గురించి మాట్లాడారు. తద్వారా భవిష్యత్ ప్రణాళికలకు సలహాలు స్వీకరించారు. ఈ మొత్తం క్రోడీకరించి తిరిగి ఏపీలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు రెడీ అయ్యారట..
ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నోరా వారిని చంద్రబాబు కూల్ చేసినట్టు తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో పార్టీతో కలిసి ఉండాలని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తారా? లేక ఇతర పార్టీలోకి వెళ్లి టీడీపీ విడిచి పెట్టి సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా అని చంద్రబాబు వారి ముఖం మీదే అడిగినట్లు తెలిసింది. ఎందుకంటే పార్టీ విధేయులతోనే తాను తిరిగి టీడీపీని ఏపీలో బలోపేతం చేయాలనుకుంటున్నానని.. పార్టీ మారే అవసరం లేదని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది.
ఇక అదే సమయంలో ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు స్థానంలో టీడీపీ చీఫ్ ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన మరో బలమైన నాయకుడిని నియమించాలని ఆలోచిస్తున్నారు. కళా వెంకటరావు ఎన్నికల్లో ఓడిపోవడంతో స్వయంగా టీడీపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని కొత్త వారికి చాన్స్ ఇచ్చారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడిని చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే వివాదాస్పద నేత కావడంతో ఆయనను పలువురు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. పైగా ఆ కుటుంబానికి చంద్రబాబు ఇప్పటికే పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారు.
ఇక పార్టీని బలోపేతం చేయడం.. కేడర్ ధైర్యాన్ని పెంచేందుకు నియోజకవర్గం వారీగా కమిటీలను నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నాడట.. తద్వారా వైసీపీ దాడిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
అయితే ఎన్ని చేసినా ప్రస్తుతం వైసీపీని ఢీకొట్టే పరిస్థితిలో పార్టీ లేదు. తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, పార్టీ కోలుకోవడానికి చాలా బలం అవసరమని చెప్పవచ్చు.