Home Blog Page 8456

ఉద్యోగులను రోడ్డున పడేసిన అధికార పత్రిక

పేరుకు అధికార పత్రిక.. ఇంతటి కరోనా-లాక్ డౌన్ లోనూ తట్టుకొని నిలబడిందని ఇన్నాళ్లు శభాష్ అనుకున్నాం.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలే తట్టుకోలేక ఉద్యోగులను వదిలించుకుంటే నమస్తే చరిష్మా చూసి అబ్బురపడ్డాం. కానీ తమ కత్తికి కూడా పదును ఉందని.. తమ ఉద్యోగుల విషయంలోనూ అదే కాఠిన్యం అని తెలంగాణలో అధికార పత్రిక నిరూపించుకుంది. నవ వసంతాల ‘నమస్తే తెలంగాణ’ సొంత ఉద్యోగులను నడి రోడ్డున పడేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. వరంగల్ లో 10 మంది.. కరీంనగర్ లో 3.. నిజమామాద్, ఖమ్మం ఇలా ఎడిషన్లలో తీసివేతలు మొదలయ్యాయి. ఇలా సాగనంపే కార్యక్రమాలను బాగానే చేస్తోంది అధికార పార్టీ పత్రిక. పక్కరాష్ట్ర పత్రిక ‘సాక్షి’ సైతం ఉద్యోగులను తొలగించకుండా.. వారికి జీతాల్లో ఇప్పటిదాకా కోత విధించకుండా ఇంకా ఠీవీగా నిలబడింది. తెలంగాణలో ఈనాడు, జ్యోతి బాటలో నమస్తే ఉద్యోగులను రోడ్డున పడేయగా.. ఒక్కసాక్షిలో మాత్రం ఇంకా వారి ఉద్యోగులపై కనికరం చూపుతోంది. బహుషా ఏపీలో అధికారం ఆ పత్రికకు వరంగా మారిందనుకుంటా.. కానీ ఎంత పోల్చుకున్నా.. ఇన్ని వనరులు, అధికారం ఉండి కూడా నమస్తే ఇంతటి కాఠిన్యం ప్రదర్శించడంపై జర్నలిస్టు వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

సొంత ఉద్యోగులను నడి రోడ్డున పడేస్తున్నది తెలంగాణలోని అధికార పార్టీ పత్రిక. తెలంగాణకు దారి దీపం అని చాటింపు వేయించుకున్న ఆ పత్రిక ఇప్పుడు తన సొంత సంస్థలోని ఉద్యోగులను చీకట్లోకి నెడుతోంది. ‘మీడియా సంస్థల్లో ఉద్యోగుల జీతాలకు కోత పెట్టినా.. తొలగించినా తెల్ల కాగితం మీద రాసివ్వండి.. దానినే కంప్లయింట్ గా భావిస్తాం.. చర్యలు తీసుకుంటామన్న’ సీఎం కేసీఆర్… ఇప్పుడు తన నమస్తే తెలంగాణ పత్రికలోని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నా ఉలుకుపలుకూ లేకపోవడమే జర్నలిస్టులను అమితంగా బాధిస్తోంది. మరి ఇప్పుడేం చర్యలు తీసుకుంటారన్నది కేసీఆర్ సారే సమాధానం చెప్పాలి… ఇది మానవత్వమేనా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర పత్రికలు విషం చిమ్ముతున్న సమయంలో ప్రముఖ తెలంగాణ పారిశ్రామికవేత్త సీఎల్ రాజం పదేళ్ల క్రితం నమస్తే తెలంగాణ పత్రికను ప్రజల ముందుకు తీసుకువచ్చి.. మనకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికే ఊపిరిగా నిలిచింది నమస్తే తెలంగాణ పత్రిక.. సీమాంధ్ర పాలకుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆర్థిక ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డది. అప్పటి ఎడిటర్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా తెలంగాణ ఉద్యమంలో తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న జీతాలతో సర్దుకొని ఉద్యమానికి గొంతుకయ్యారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష… 2014లో నెరవేరింది. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నమస్తే తెలంగాణ సిబ్బంది.. తెలంగాణ వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరాయని భావించారు.

అదే సమయంలో సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ముందు చేసిన పని… నమస్తే తెలంగాణ పత్రికను వ్యవస్థాపకుడు సీఎల్ రాజం నుంచి బలవంతంగా మార్పించేశాడన్న అపప్రదను మూటకట్టుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఐదేళ్లు గడిచాయి. నమస్తే తెలంగాణ పత్రిక ఫక్తు గులాబీ పత్రికగా మారిపోయింది. పెద్ద పెద్ద హెడ్డింగులతో లక్ష ఉద్యోగాల భర్తీ అంటూ వారానికోసారి నమస్తే తెలంగాణ పత్రికలో అచ్చు వేయించుకున్నారు. కేసీఆర్ ను ఇహలోక కలియుగ దైవంగా పత్రికలో కీర్తిస్తుంటారు. కరోనా కష్టకాలంలో ఏ సంస్థ కూడా ఉద్యోగులను తీసేయవద్దు.. జీతాలు కోత పెట్టద్దు అని ప్రెస్ మీట్లలో ఇదే కేసీఆర్ అంటుంటాడు. మీడియా సంస్థల్లో ఉద్యోగుల జీతాలకు కోత పెడుతున్నారని ఓ విలేకరి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించగా.. నాకు దరఖాస్తు ఇవ్వండి.. అదే కంప్లయింట్ గా భావించి, చర్యలు తీసుకుంటామని చెప్పాడు. కానీ సీఎం కేసీఆర్ తన పత్రికగా భావించే నమస్తే తెలంగాణ పత్రికలోని ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టాడు. ప్రస్తుతం ఆదాయం లేదు కదా అని ఉద్యోగులు సైతం సర్దుకున్నారు. సాఫ్ట్ వేర్ సంస్థ లు, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని మంత్రి కేటీఆర్ కూడా స్టేట్ మెంట్లు ఇచ్చాడు.

కానీ దాదాపు 15 రోజులుగా నమస్తే తెలంగాణ పత్రికలోని సిబ్బంది తొలగింపు కూడా మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ ఎడిషన్ల పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగులను ముందస్తు నోటీసు లేకుండా తొలగించారు. తొలగించిన సిబ్బందిని ఆయా ఎడిషన్ కార్యాలయాలకు రానివ్వద్దంటూ సెక్యూరిటీ గదుల వద్ద నోటీసులు కూడా అంటించారు. దాదాపు తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడమే కాకుండా, అసలు విషయం ఏమిటో తెలుసుకోనివ్వకుండా ఆఫీసులకు కూడా వారిని రానివ్వద్దంటూ నోటీసులు అంటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష ఉద్యోగాల భర్తీ హామీలు ఇచ్చిన కేసీఆర్ తను హస్తగతం చేసుకున్న పత్రికలోని ఉద్యోగులను రోడ్డున పడేయడమే ఇక్కడ శోచనీయం అని చెప్పవచ్చు.

కన్నీళ్లు పెట్టిస్తున్న గూగుల్ సీఈవో స్టోరీ


ఒక మొక్కగా ఉన్నప్పుడు అది ఎవరికీ పట్టదు.. కానీ పెరిగి పెద్దదై మానై నిలుచున్న వేళ దాని కింద సేదతీరుతాం.. దాని గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు సీఈవో మన భారతీయుడు.. చెన్నై వాసి సుందర్ పిచాయ్. ప్రపంచప్రఖ్యాత సంస్థకు సీఈవోగా అదృష్టంతో కాలేదు. ఆయన పడ్డ కష్టాలను తాజాగా ఏకరువు పెట్టాడు. అంత కష్టపడి అంత ఎత్తుకు ఎదిగిన సుందర్ పిచాయ్ స్టోరీ ఆ విద్యార్థులకు కన్నీళ్లు పెట్టించింది.. స్ఫూర్తిని నింపింది. కరోనా-లాక్ డౌన్ అవకాశాలు లేవని మథనపడుతున్న వారికి కష్టాలతో ఎలా అధిగమించవచ్చో సుందర్ పిచాయ్ వివరించారు.

2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాను ఈ స్థాయికి ఏదో ఊరికే అదృష్టంతో ఎదగలేదని.. ఎన్నో కష్టాలు.. టెక్నాలజీ అంటే తనకున్న పిచ్చి వల్ల ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చాడు. సుందర్ పిచాయ్ చెప్పిన స్టోరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.

చెన్నైలో పుట్టిపెరిగిన సుందర్ పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా.. స్టాన్ ఫర్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2004లో గూగుల్ లో చేరి నేటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను తయారు చేసి ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన బ్రౌజర్ గా నిలిపాడు

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కరోనా-లాక్ డౌన్ వేళ విద్యార్థుల్లో అద్భుతంగా స్ఫూర్తి నింపారు. తన చిన్నతనంలో ఎంత కష్టపడ్డది.. తాను గూగుల్ సీఈవో అయ్యే క్రమంలో పడ్డ కష్టాన్ని వివరించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. తన తండ్రి పడ్డ కష్టం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

మాతరం కనీసం కలలో కూడా ఊహించని కొత్తవాటిని ఈ తరం సుసాధ్యం చేయవచ్చన్నారు. గ్రాడ్యూయేట్లు ఆశావహంగా ఉండాలని.. సహనంతో ముందుకు సాగాలని సూచించారు. కరోనా-లాక్ డౌన్ తో కృంగిపోవద్దని.. ఏదీ శాశ్వతం కాదని.. కష్టాల నుంచే కొత్త దారులు వెతుక్కోవాలని సుందర్ వివరించారు.

గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తాను కష్టపడ్డానని సుందర్ పిచాయ్ వివరించారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు అమెరికా వెళ్లేటప్పుడు విమాన టికెట్ కొనేందుకు తన తండ్రి ఏడాది జీతాన్ని ఖర్చు చేయాల్సి వచ్చిందని సుందర్ పిచాయ్ వివరించారు.

అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని.. అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని.. బ్యాగ్ కొనాలంటే భారత్ లో తన తండ్రి నెలజీతం అంత మొత్తం వెచ్చించాల్సి వచ్చేదని తన అనుభవాలను పంచుకున్నారు.

ఇలా తన కష్టాలను సుందర్ పిచాయ్ పంచుకొని అందరిలో స్ఫూర్తినింపారు. ఎంత ఎదిగినా తన ఎదుగుదల వెనుక తన తండ్రి కష్టం ఉందని వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. సుందర్ పిచాయ్ చెప్పిన ఆయన స్టోరీ ఇప్పుడు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది.

-నరేశ్ ఎన్నం

కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ


తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి అమ్మకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణ చేశారు. కృష్ణా నీళ్లను ఏపీ తరలించేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అదేవిధంగా నియంత్రిత సాగు పేరుతో రైతులపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పెట్టుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని అర్వింద్ విమర్శించారు.

ఇక నిజామాబాద్ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. నిజామాబాద్ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డి జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టాలనే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు విధానం తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతులు ఏ పంటలు వేయాలో ఆంక్షలు విధించడం అందులో భాగమేనని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరుతో మొక్కజొన్న రైతులు ఇప్పటికే నిరాశకు గురయ్యారని అన్నారు.

ఎంఐఎం నేత ఓవైసీ ఓ దేశ ద్రోహి అంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ చట్ట వ్యతిరేక, దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. వలస కార్మికుల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల వరకు అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా మోదీ ఉండటం అందరి అదృష్టమని అర్వింద్ కొనియాడారు.

సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తెలుగు సినీరంగ ప్రముఖులు కలుసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత డి.సురేష్ బాబు తదితరులు సినిరంగానికి చెందిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెల్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.

సమావేశం అనంతరం వివారాలను ప్రముఖ నటులు చిరంజీవి మీడియాకు వెల్లడించారు. సినీ కళాకారులను ప్రోత్సాహహించేందుకు నంది అవార్డులు ప్రకటించాలని కోరగా 2019-20 లో సినిమాలకు త్వరలో అవార్డులు ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్నందున థియేటర్లకు మినిమమ్ ఫిక్స్డ్ చార్జెస్ ఎత్తివేయాలని కోరామన్నారు. దీనికి సీఎం అంగీకరించారని తెలిపారు. టికెటింగ్ లో పారదర్శకత ఉండాలని మేము కోరగా, దానిపై కూడా త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటమన్నారు.

సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ ధర పెంచే, తగ్గించే విధానాన్ని ముంబై, చెన్నై, బెంగుళూరులలో అనుసరిస్తున్నారని ఇక్కడ అదే విధానాన్ని అమలు చేయాలని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి షూటింగ్ లకు రాష్ట్రంలో అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ పరిశ్రమకు 300 ఎకరాలను కేటాయించారని, అలానే ఉన్న ఆ భూములపై త్వరలో పునఃపరిశీలించి సినీ పరిశ్రమ అభివృద్ధికే కేటాయిస్తానని సీఎం చెప్పారన్నారు. ఈ చర్చలు ఎంతో సానుకూలంగా జరిగాయన్నారు. ఈ భేటీలో సినీ ప్రముఖులు సి.కల్యాణ్, దిల్‌రాజు, రాజమౌళిలు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి షాక్ ఇచ్చిన శిద్దా..!


ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకోనేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తన కుమారుడితో కలిసి బుధవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ముందస్తు సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని శిద్దా అనుచర వర్గాల సమాచారం.

మహానాడుకు ముందే పార్టీ వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చినా వారికి ఇచ్చే ప్రాధాన్యతపై అధికార పార్టీ నుంచి సరైన క్లారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల వరకూ పార్టీ మరే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి. వీరిలో ముందు వరుసలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ముందడుగు వేశారు. మరోవైపు కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసమే శిద్దా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని భావించిన ఆయన వైసీపీలో చేరడమే సరైన నిర్ణయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ప్రయాణంలో ఆయన వెనుక ఎవరెవరు ఉంటారనే విషయం ఆసక్తి కరంగా మారింది.

టీడీపీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉన్న శిద్దా రాఘవరావు పార్టీని వీడటం కోలుకోలేని దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రానైట్ క్వారీల వ్యాపారంలో ఉన్న ఆయన వైసీపీ వత్తిడుల కారణంగా పార్టీ మారతారనే చర్చ గతంలో జరిగింది. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ క్వారీ నిర్వహకులపై వత్తిళ్ళు ఎక్కువైనట్లు తెలుస్తోంది. శిద్దా మార్గంలో మరికొందరు పార్టీ మరే యోచనలో ఉన్నారని అంటున్నారు.

‘కార్తికేయ 2’ కోసం నిఖిల్ అంత సాహసం చేస్తాడా?


కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు మూత పడడంతో పూర్తయిన సినిమాల విడుదల కూడా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మినహాంపులు ఇచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలో షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చిత్ర పరిశ్రమకు కాస్త ఊరట కలిగింది. ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులు, రోజువారీ వేతనంతో పని చేసే కార్మికులు పని దొరుకుతుందని ఉత్సాహంగా ఉన్నారు. అయితే, గవర్నమెంట్ అనుమతి ఇచ్చినా.. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి షూటింగ్స్ మొదలు కావడానికి కొంత సమయం పడుతుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఏదేమైనా అనుమతి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరిలో మాత్రం ఆందోళన ఇంకా తగ్గలేదు. ఎందుకంటే తమ కథ డిమాండ్ ప్రకారం కొంతమంది దర్శక, నిర్మాతలు విదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేశారు. ఆ జాబితాలో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘కార్తికేయ 2’ మూవీ ఒకటి. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. కార్తికేయకు సీక్వెల్. నిఖిల్, స్వాతి కాంబినేషనల్‌లో వచ్చిన ఆ మూవీ ఘన విజయం సాధించించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ మొత్తాన్ని ఇండియాలోనే చిత్రీకరించారు. కానీ, ‘కార్తికేయ 2’ కథ ప్రకారం మూవీలో కీలక భాగాన్ని కంబోడియా దేశంలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అనుమతుల కోసం చందు అండ్‌ కో ఆ దేశం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, మన దేశంలో ఇంకా లాక్‌డౌన్‌ ముగియలేదు. పైగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం ఉంది. దాన్ని ఎప్పుడు ఎత్తి వేస్తారో తెలియదు. ఒకవేళ ఎత్తి వేసినా… ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న టైమ్‌లో ఇతర దేశాలకు వెళ్లడం ఎంత వరకు భద్రమో తెలియదు. ఈ పరిస్థితుల్లో చిత్ర యూనిట్‌తో కలిసి నిఖిల్ కంబోడియా వెళ్లే సాహసం చేస్తాడా? చూడాలి.

కమల్ హాసన్ సినిమాలో యంగ్ బ్యూటీ !


గ్రేట్ డైరెక్టర్ శంకర్, గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా నుండి ఓ యువనటి తప్పుకుందట. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్ర అని, అందుకే ఆమె పాత్రలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరోయిన్ శ్రుతి శర్మను తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జూలైలో జరగనున్న షెడ్యూల్ లో శ్రుతి శర్మ కూడా షూట్ లో పాల్గొంటుందట. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు కేటాయించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషిస్తున్నాడు.

యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2021లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

పదో తరగతి పరీక్షలు ఎప్పుడెప్పుడు రద్దయ్యాయో తెలుసా?


తెలంగాణలో తరగతి పరీక్షలు కొనసాగిస్తారా? లేదా అనే సస్పెన్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారమే ముగింపు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న 5.34లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించింది. వీరంతా పరీక్షలు రాయకుండా పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ప్రతీయేటా పదో తరగతి విద్యార్థులకు నిర్వహించి ప్రీ ఫైనల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ రూపొందించే పనిలో పడింది. ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలు గతంలో ఎప్పుడెప్పుడు రద్దయ్యాయి అనే అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చర్చ మొదలైంది.

తెలంగాణ కరోనా విభృంభిస్తుండటంతో హైకోర్టు హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా పదో పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించే మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ పదో తరగతి పరీక్షలు రద్దయిన సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. గత 51ఏళ్లలో తెలంగాణలో పదో విద్యార్థులు నేరుగా ప్రమోట్ కావడం ఇది మూడోసారిగా తెలుస్తోంది.

1951-52లో నిజాం రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం పెద్దఎత్తున జరిగింది. నాలుగు నెలలపాటు ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో అప్పట్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొలడంతో పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేశారు. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఆ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని నాటి అధికారులు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దీంతో ప్రభుత్వం నామమాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరూ పాస్ అయినట్లు ప్రకటించింది. తాజాగా కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

‘ప్రభాస్’ దృష్టి అంతా దాని పైనే !


నేషనల్ స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా పైనే, తన దృష్టి అంతా పెట్టాడు. కాగా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేశారు టీం. అయితే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా నేపథ్యం కనబడేలా సెట్ వేస్తున్నారట, ఈ సెట్ విషయంలో ప్రభాస్ కూడా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక జూలై సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను తీయనున్నారు.

కాగా ఈ ‘రాధే శ్యామ్’ గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని, అత్యంత ధనికుడిగా ఆ రోజుల్లోని ఓల్డ్ గెటప్ లో ఒకలా.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. పైగా 1960 కాలంలో ఈ సినిమా కథ సాగుతుందట,

‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఈ సినిమాలో టాల్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. 2021లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!


రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన గడువును ప్రకటించింది. ప్రభుత్వ పథకాలకు అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే బియ్యం కార్డు, పింఛన్‌, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇకపై సంక్షేమ పథకానికి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా అందజేయకుంటే సంబంధింత అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తే ఏడాది తరువాత ఇచ్చే వారని, అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలో 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. పెన్షన్ లు 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని, అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. పథకాల అమలు విషయంలో కలెక్టర్లు, అధికారులదే బాధ్యత వహించాలన్నారు.

యాక్షన్ హీరోకి ప్లాప్స్ చాలా నేర్పించాయట !


ఓటమి వల్ల చాల కోల్పోతాం గాని, కొన్నిసార్లు ఓటమే మనకు ఎన్నో నేర్పిస్తోంది. యాక్షన్ హీరో గోపీచంద్‌ కి కూడా ప్లాప్ లు చాల నేర్పించాయట. గోపీచంద్‌ లో మార్పు తెచ్చిందట. మార్పు అంటే గెటప్ లో సెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే ఈ మాస్ హీరోలో ఇప్పుడు యాక్షన్ అంటేనే ఓవర్ గా వద్దు అంటున్నాడని తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది డైరెక్షన్ లో స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సిటీమార్’ రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. మిల్క్ బ్యూటీ తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ చిత్రంలో కొన్ని ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని, ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే మూవీలో పక్కా కామెడీ సీక్వెన్సెస్ హైలెట్ అయ్యే విధంగా మూవీని ప్లాన్ చేయమని.. అలాగే బడ్జెట్ ను తగ్గిస్తే మంచిదని గోపీచంద్ సంపంత్ నందికి చెప్పడంతో, సంపత్ ఈ లాక్ డౌన్ ఖాళిలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక ఫైనల్ గా ప్లాప్ అనిపించుకోవడం ఎందుకని గోపీచంద్ ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని కోరుతున్నాడు.

ఇక సంపత్ నంది కూడా బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. పైగా కామెడీ కోసం గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని… సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే మూవీలో కామెడీ బాగా వస్తోందట. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద సినిమా ప్లాప్ అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా కష్టపడుతున్నాడు.

బాలయ్య బర్త్‌డే స్పెషల్‌.. ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌!


అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మరే హీరోకు లేని హార్డ్‌ కోర్ ఫ్యాన్‌బేస్‌ బాలయ్య సొంతం. బాలయ్య తిట్టినా.. కొట్టినా సరే దగ్గరి నుంచి చూడాలని.. ఆయనతో ఫొటో దిగేందుకు పోటీ పడుతుంటారు. బాలకృష్ణ సినిమా రిలీజ్‌ అవుతున్నా.. ఆయన పుట్టిన రోజు వచ్చినా వాళ్ల హంగామా మామూలుగా ఉండదు. జూన్‌ పదిన.. అంటే రేపే ఆయన బర్త్‌డే. దీనికి మరో విశేషం ఉంది. ఎందుకంటే ఆయన 60వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. అంటే షష్టి పూర్తి వేడుక అన్నమాట. దాంతో, అభిమానుల సందడి ఇప్పటికే మొదలైంది. ఏపీలో అయితే బాలయ్య భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. బాలకృష్ణ బర్త్‌డే ‘కామన్‌ డీపీ’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో ఒక్క చోట ఎక్కువ మంది గుమికూడే పరిస్థితి లేకపోవడంతో ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు‌ ఇప్పటికే ఫ్యాన్స్‌ అన్నీ సిద్ధం చేశారు.

తన పుట్టిన రోజు సందర్భంగా ఇంత చేస్తున్న ఫ్యాన్స్‌కు తన వైపు నుంచి కూడా అదే రేంజ్‌లో ట్రీట్‌ ఇచ్చేందుకు బాలయ్య కూడా రెడీ అయ్యారు. ఈ రోజే డబుల్ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం బాలయ్య స్వయంగా పాడిన ఓ పాటను ఈ రోజు సాయంత్రం 5.03 నిమిషాలకు పాట రిలీజ్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఎన్‌బీకే ఫిల్మ్స్‌ చానల్లో ఈ పాట అందుబాటులోకి వస్తుంది. ఆపై, మరో రెండు గంటల్లోనే ఇంకో సర్ప్రైజ్‌ రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న తదుపరి చిత్రం నుంచి ఆ సర్ప్రైజ్ రానుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు సింహ, లెజెండ్ భారీ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌ హిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీన్ని ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్ డైరెక్టర్. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ ఈజ్‌ బ్యాంక్.. #BB3 అంటూ ఓ పోస్టర్ ట్వీట్‌ చేసిన ద్వారకా క్రియేషన్స్‌ ఈ రోజు రాత్రి 7.09 గంటలకు ఫస్ట్‌ రోర్ (తొలి గర్జన) అని ప్రకటించింది. అంటే.. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మరోసారి గోపీచంద్‌తో రకుల్ రొమాన్స్‌!


గోపీచంద్, రకుల్ ప్రీత్‌ సింగ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘లౌక్యం’ . 2014లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అంతకుముందు వాంటెడ్, మొగుడు చిత్రాలతో ఫ్లాప్‌లో ఉన్న గోపీ మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘లక్ష్యం’తో అతనికి తొలి కమర్షియల్ హిట్ అందించిన నివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లవ్‌, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘లౌక్యం’లో గోపీ, రకుల్‌ జోడీ చక్కగా కుదిరింది. తెర‌పై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పడింది. ఈ హిట్‌ పెయిర్ మరోసారి జోడీ కట్టబోతున్నారట.

గోపీ మొదటి సినిమా తొలి వలపు ఫ్లాప్‌ కావడంతో తాను తీసిన ‘జయం’, ‘నిజం’ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు తేజ. ఇప్పుడు గోపీచంద్‌ హీరోగా ‘అలివేలుమంగ వెంటకరమణ’ పేరుతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తేజ.. ఇప్పటికే స్క్రీప్ట్‌ పని కూడా పూర్తి చేశాడట. కొన్ని రోజుల నుంచి హీరోయిన్‌ను అన్వేషించే పనిలో ఉన్నాడు. తొలుత సాయి పల్లవిని సంప్రదిస్తే ఆమె ఒప్పుకోలేదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కాజల్, అనుష్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, రకుల్‌ ప్రీత్ సింగ్‌ను తేజ ఖరారు చేసినట్టు సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముంబైలో ఉన్న రకుల్‌కు తేజ ఫోన్‌ ద్వారా కథ వినిపించగా.. ఆమె సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. డేట్స్‌ అడ్జస్ట్ అయితే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఆరోగ్య సేతు యాప్.. హెచ్చరిస్తున్న ఇంటలిజెన్స్


దేశంలోని చైనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు ఉండనుంది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా కేంద్రం ఆరోగ్య సేతు యాప్ రూపొందించిన సంగతి తెల్సిందే. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సంగతి తెల్సిందే. భారతీయులు అధికంగా వినియోగిస్తున్న ఆరోగ్యసేతు యాప్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. దీంతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సేతు యాప్ పేరుతో కొన్ని నకిలీ లింకులు పంపుతున్నారని తెలంగాణ ఇంటలిజెన్స్ గుర్తించి ప్రజలను అలర్ట్ చేస్తుంది. నకిలీ లింకులను ఓపెన్ చేస్తే మొబైల్ హ్యక్ అయి డాటా మొత్తం చోరి అవుతుందని హెచ్చరించింది. ఎవరికైనా నకిలీ లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయద్దని తెలంగాణ నిఘా విభాగం సూచిస్తోంది.

తెలంగాణ ప్రజలు నకిలీ లింకులు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలగాణ ఇంటలిజెన్స్ సూచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా ఈ నకిలీ లింకులు ఫార్వడ్ అవుతున్నాయని పేర్కొంది. అండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారంతా ఫేక్ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటలిజెన్స్ ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఆరోగ్య సేతు యాప్ పేరుతో వచ్చే నకిలీ లింకులను ఓపెన్ చేస్తే ‘చాట్ మీ’ యాప్ డౌన్లోడ్ అవుతుందని పేర్కొంది. ఆ తర్వాత మొబైల్ హ్యాక్ అయి సమాచారం అంతా చోరికి గురవుతుందని తెలిపింది. పాక్ సైబర్ నేరగాళ్లు ఈ లింకులను పంపుతున్నారని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ సూచిస్తుంది. ఎవరి మొబైల్ అయినా హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్ వినియోగదారులు ఇప్పటికైనా ఏ లింకు పడితే ఆ లింకును ఓపెన్ చేయకుండా.. ఫేక్ లింకులపై అవగాహన పెంచుకోవాలని ఇంటలిజెన్స్ సూచిస్తుంది.

దేవి ‘పుష్ప’తో అదరగొట్టేస్తాడట !


మహేష్ బాబు కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, అయితే ఆ సినిమా హిట్ అయినా.. దేవికి మాత్రం మ్యూజిక్ పరంగా పెద్దగా నేమ్ అయితే రాలేదు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోయాడనే వార్త ఫిల్మ్ వర్గాల్లో దేవి ఇమేజ్ ని డామేజ్ చేసింది. మరో పక్క తమన్ రెచ్చిపోతుంటే.. దేవి మాత్రం రొటీన్ మ్యూజిక్ తో ఇబ్బంది పెడుతున్నాడని కామెంట్స్ వినిపించడంతో ‘దేవి శ్రీ’లో కసి పెరిగిందట.

ప్రస్తుతం దేవి బన్నీ ‘పుష్ప’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, సాంగ్స్ అన్నీ పూర్తి సంతృప్తిగా ఉండనున్నాయని తెలుస్తోంది. పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ఇక ఈ క్ర‌మంలో ఓ సాంగ్ ను రెడీ చేసి డైరెక్టర్ సుకుమార్ కి అండ్ బ‌న్నికి వినిపించ‌డం, వాళ్ళ‌కు సాంగ్ బాగా న‌చ్చ‌డం, హ్యాపీగా ఫీల‌వ‌డం కూడా జ‌రిగింద‌ట‌.

ప్రస్తుతం దేవి ఐటం సాంగ్‌ను కంపో చేసే పనిలో ఉన్నాడ‌ట. మ‌రి సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు.

‘ఆదిత్య 999’కు రెడీ అవుతున్న బాలయ్య!


అగ్ర కథానాయకుడు, నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు. ఫ్యామిలీ, ఫ్యాక్షన్‌, యాక్షన్‌ చిత్రాలతో పాటు చారిత్రక, పౌరానిక సినిమాల్లో నటించారు. అవన్నీ ఒకెత్తయితే ‘ఆదిత్య 369’ మరో ఎత్తు. మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సైన్ ఫిక్షన్‌ చిత్రం బాలయ్య కెరీర్లో ఓ మైలురాయి. టైమ్ మెషీన్‌ నేపథ్యంలో సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అబ్బుర పరిచింది. దీనికి సీక్వెల్ తీయాలని బాలకృష్ణ చాలా ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. మరో ‘ఆదిత్య 369’ చూడాలని బాలయ్య ఫ్యాన్స్‌ కూడా ఉబలాటపడుతున్నారు.

బాలయ్య ఆశ, అభిమానుల కోరిక నెరవేరనుంది. ఆదిత్య 369 సీక్వెల్‌పై బాలకృష్ణ దృష్టి పెట్టాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా సీక్వెల్‌ త్వరలో వస్తుందని చెప్పిన బాలయ్య దీనికి ‘ఆదిత్య 999’ అనే టైటిల్‌ ఖరారు చేశారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు బాలకృష్ణ. లాక్‌డౌన్‌కు ముందు ఐదు రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో ఓ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకు ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ మూవీ షూటింగ్‌ పూర్తయిన వెంటనే… ‘ఆదిత్య 999’ను పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్‌ చేస్తున్నాట. దీన్ని కూడా సింగీతం శ్రీనివాసరావే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారట. అయితే, ఆయన వయసు ఇప్పుడు 88 ఏళ్లు. సినిమాలకు దూరమై చాలా కాలమైంది. చివరగా 2013లో ‘వెల్‌కమ్‌ ఒబామా’ అనే టైటిల్‌తో ఓ మరాఠీ మూవీని రీమేక్ చేశారు. మరి, బాలయ్య భారీ స్థాయిలో రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని అంత పెద్ద వయసులో సింగీతమే డైరెక్ట్ చేస్తారా? లేక వేరే వాళ్లు మెగాఫోన్‌ పట్టుకుంటారా? చూడాలి.

మనోజ్ మరణంతో బయటపడ్డ షాకింగ్ నిజాలు


జర్నలిజం.. ఇప్పుడు విలువలేనిదన్నది నిజం.. కరోనా కాటుకు బలైందన్నది కఠిన నిజం. లాక్ డౌన్ తో జర్నలిస్టులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అదే కరోనా కవరేజ్ కు వెళ్లిన వారిని కబళిస్తున్న మీడియా యాజమాన్యాలు కళ్లుండి చూడలేని కబోధుల్లా మారిపోయాయన్న విమర్శలున్నాయి. ఏ మీడియా చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా మారింది. అగ్ర మీడియా నుంచి చిన్న మీడియా వరకు కోతలు, ఉద్యోగాలు తొలగించి వాతలు.. మొత్తం జర్నలిస్టుల బతుకే ఆగమైన పరిస్థితి తెలంగాణలో ఉంది.

ఇదో విషాదకమైన సంఘటనే. గుండెలు పిండేసేంత హృదయవిదారకమే.. ఒక యువ క్రైం రిపోర్టర్.. నిండా 33 ఏళ్లు కూడా లేవు. కరోనా కూడా ఏం చేయలేని వయసు. అయినా ప్రాణాలు పోయాయి.. ఎవరు కారకులు? ఆ కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది.? ఇంత జరిగినా ఆ రిపోర్టర్ బాధను ఏ మీడియా హైలెట్ చేయలేదు. చేయదు కూడా. ఎందుకంటే చేస్తే తమ క్రూరత్వం బయటపడుతుంది. ఇలా జర్నలిస్టు బతుకులు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయాయి. చచ్చినా ఆ చావుకు విలువలేని పరిస్థితి ఎదురైంది. కరోనాతో మరణించిన హైదరాబాద్ రిపోర్టర్ మనోజ్ మరణం జర్నలిస్టుల బతుకుల్లోని విషాదకోణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. అసలు ఏ రక్షణలు, ఏ భరోసాలు లేకుండా.. ప్రతి యుద్ధంలోనూ ముందుండేది. సమాజంలోని ప్రతి వర్గానికీ అండగా ఉండేది, పోరాడేది, చివరకు తనే గాయపడి, నిశ్శబ్దంగా నిష్క్రమించేది జర్నలిస్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జర్నలిజం.. సమాజంలో పతనమవుతోంది. చెప్పుకునేందుకే విలువలున్నాయి. అమల్లోకి రాని విలువలు జర్నలిస్టులను రోడ్డున పడేస్తున్నాయి. అన్నిరకాలుగా సున్నితంగా మారిపోయిన బతుకులు ఎవరివీ అంటే… జర్నలిజాన్ని, ఈ కొలువుల్ని కెరీర్‌గా మార్చుకుని బతికే వాళ్లవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రత్యేకించి ప్రింట్ మీడియా జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా దుర్దినాలే ఉండబోతున్నయ్. ఇంకా టీవీ మీడియా జర్నలిస్టులకు సెగ తగలడం లేదు. కానీ పత్రికలు మూతపడుతున్నయ్, కొలువులకు భద్రత లేదు. జీతాలు కోస్తున్నారు. అసలే అరకొర.. అందులోనూ కోతలు… అసలు నిలబడతామా, బజారున పడతామా..? తెలుగు, హిందీ, ఇంగ్లిష్… భాషాభేదం ఏమీ లేదు… అన్ని పత్రికలదీ అదే దురవస్థ…

టీవీ మీడియాలో ఫీల్డ్ రిపోర్టర్ల పరిస్థితీ అంత గొప్పగా ఏమీలేదు.. పరుగు, పరుగు… కాలంతో పరుగు… వృత్తిపరమైన ఒత్తిళ్లతో… అకాల వృద్ధాప్యాలు, అర్ధంతరంగా చావులు…

అసలు జర్నలిస్టు బతుకే ఫుల్ రివర్స్… దొరికే ఈమాత్రం జీతానికి సెలవులు సరిగ్గా దొరకవు, ఏ సాయంత్రమూ మనది కాదు… వేరే వృత్తులకూ దీనికీ అస్సలు పొసగదు… బంధువులో, మిత్రులో దేనికి పిలిచినా వెళ్లే సీన్ ఉండదు, అందరూ దూరం అవుతుంటారు… అందరూ వాడుకునేవాళ్లే, తీరా ఆపదొస్తే ఎవ్వడూ ఆదుకోడు… కరివేపాకు బతుకులు… ఆరోగ్యానికి భద్రత లేదు… ఆర్థికానికి భద్రత లేదు… ఏ నలభై దాటాకో, యాభై దాటాకో వెనక్కి తిరిగి చూసుకుంటే… బీపీలు, సుగర్లు, అల్సర్లు… ముందే పలకరించే ముసలితనం… ఇక ఏ పనికీ అక్కరకురాని చెరుకు పిప్పి..! కొన్ని వందల ఉదాహరణలు…

కరోనా కల్లోలానికి ఆగమైన బతుకులు ఎవరివైనా ఉన్నాయంటే అవి జర్నలిస్టులవే.. ఫ్రంట్ వారియర్స్ అని పేరుకు పొగడ్త… కానీ పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు, డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్‌కు… చివరకు కరెంటోళ్లను కూడా ఇదే జాబితాలో చేర్చారు పాలకులు.. కానీ జర్నలిస్టులకు ఏ దిక్కూ లేదు.. మరీ మరీ అడిగితే పది కిలోల బియ్యం, అయిదు కిలోల కూరగాయలు పంపిణీ.. అదీ జర్నలిస్టుల బతుకు…

పుసుక్కున ప్రాణగండం వస్తే… బీమా లేదు, ధీమా లేదు… భార్యాబిడ్డలకు దిక్కూ లేదు… మేనేజ్మెంట్లు వదిలేస్తాయి, ప్రభుత్వాలు పట్టించుకోవు… ఎంత దారుణం అంటే..? ఓ పత్రిక హెడ్డాఫీసులో ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్… మిగతావారిలో భయం… పరీక్షలు చేయించండి మహాప్రభో అని మొత్తుకుంటే కనికరించినవారు లేరు… మరో పత్రికలోనూ అదే దుర్గతి… జాతీయ చానెళ్ల వీడియోమెన్, ఢిల్లీలో జర్నలిస్టులూ ఈ కరోనా సెగను అనుభవించారు…

అందుకే ఇప్పుడు జర్నలిజం అనే వృత్తి వైపు ఎవరూ రావడం లేదు.. నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఈ వృత్తి వైపు రావాలని కోరడమూ అన్యాయమే.. జర్నలిజం అనేది ఈరోజుల్లో మీడియా హౌజుల ఓనర్ల ప్రయోజనాలకు మాత్రమే… సమాజానికి కాదు, జర్నలిస్టులకు అంతకన్నా కాదు.. ఎంత సర్దిచెప్పుకున్నా, ఈ భావనను ఎంత దాచేసుకుంటున్నా సరే… పదే పదే పైకి లేచి వికృతరూపంలో వికటంగా నవ్వుతూ వెక్కిరిస్తున్న చేదునిజం ఇదే…

ప్రస్తుతం కరోనాతో 33 ఏళ్లకే మరణించిన ఓ ప్రముఖ న్యూస్ చానెల్ క్రైం రిపోర్టర్ దీనగాథ జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.. అతడు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చూసిన దైన్యాన్ని వాట్సాప్ లో ఫ్రెండ్స్ కు షేర్ చేసుకున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మనోజ్.. ఇది ఏమాత్రం బాగాలేదని.. నన్ను ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని స్నేహితులను వేడుకున్న ధైన్యం కనిపించింది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని.. తనను బతికించండి అని వేడుకుంటూ స్నేహితుడికి వాట్సాప్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయని.. రోగం వచ్చిందని గాంధీ ఆసుపత్రికి వెళ్లే కన్నా.. స్వశానానికి వెళ్లి పడుకోవడం ఉత్తమం అని మనోజ్ అన్న మాట ఇప్పుడు తెలంగాణలో కరోనా కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి లోగుట్టును బయటపెడుతోంది.

మనోజ్ చావు బతుకుల మధ్య పంపిన ఈ వాట్సాప్ స్క్రీన్స్ షాట్స్ తో తెలంగాణలో వైద్య ఆరోగ్యం పరిస్థితి కళ్లకు కట్టింది. మీడియా మనోజ్ లాంటి జర్నలిస్టు వార్తలు బయటపడకుండా జాగ్రత్త పడుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయి. ఇంకా ఎంతమంది ఇలాంటి చావులు చూశాకైనా ఈ మీడియా, ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయో చూడాలి మరీ..