Home Blog Page 8455

ధనుష్ డ్రీమ్ ప్రాజెక్టులో నాగార్జున కీ రోల్?


ప్రయోగాలు చేయడంలో, కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పుడూ భిన్నమైన కథల కోసం పరితపిస్తుంటాడు. సీనియర్ హీరో అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తుంటాడు. తెలుగులోనే కాకుండా.. హిందీలో కూడా నాగ్‌ పలు మల్టీస్టారర్స్‌ చేశాడు. రీసెంట్‌గా నానితో కలిసి దేవదాస్‌లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్ కపూర్లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో యాక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా నాగ్‌ మరో మల్టీస్టారర్ కు కూడా గ్రీన్‌ సిన్నల్‌ ఇచ్చినట్టు సమచారం. ఇది తమిళ చిత్రం కావడం విశేషం. దీనికి తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించనున్నాడు.

ధనుష్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ముందుగా ఆ పాత్రకు ధనుష్ తన మావయ్య, సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను అనుకున్నాడట. కానీ, ఇప్పటికే ఉన్న కమిట్మెంట్ల వల్ల రజనీ ఈ మూవీకి డేట్స్‌ కేటాయించే అవకాశం లేకపోవడంతో నాగ్‌ను సంప్రదించినట్టు సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతో నాగార్జున వెంటనే ఓకే చెప్పాడట. ఇదంతా జరిగి ఏడాది అయిందట. ఈ మూవీకి ధనుష్ ‘రుద్ర’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. కానీ, తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. అయితే, ఇప్పుడు కరోనా కారణంగా విరామం లభించడంతో ‘రుద్ర’ స్క్రిప్ట్‌పై ధనుష్ మళ్లీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాను ఓకే చెప్పిన సినిమాలు ముగిసిన వెంటనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని నాగ్‌కు చెప్పినట్టు సమాచారం. ఈ మూవీలో నాగ్‌తో అదితీరావు హైదరీ, శరత్ కుమార్, ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.

‘లవ్ స్టోరీ’ మళ్ళీ స్టార్ట్ కానుంది !


శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. మరి ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా.. సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది.

ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ ముందు నుంచీ ఈ సినిమాకి బల్క్ డేట్స్ కేటాయించారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమా మరి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేస్తుందా..? లేదా..? అనేది చూడాలి.

‘జగనన్న’ చేదోడు ప్రారంభం!

జగ

ఏపీ సీఎం జగన్ మరో అద్భుతమైన పథకం ప్రారంభించారు. జగనన్న చేదోడు కార్యక్రమం కింద నాయిబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు పదివేల రూపాయల ఆర్దిక సాయం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేశారు. జగన్ మాట్లాడుతూ తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు.

సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు.3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి చెప్పారు.

హైకోర్టులో కేటీఆర్ కు ఊరట


తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి కేటీఆర్ అక్రమంగా జన్వాడలో ఫౌంహౌజ్ నిర్మించాడని కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ తన ఫౌంహౌజ్ రహదారి కోసం ఏకంగా చెరువును పూడ్చివేసి అక్రమంగా రోడ్డు నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్(ఎన్జీటీ) మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే.

తనకు గ్రీన్ ట్రీబ్యూనల్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తాజాగా ఎన్టీటీ ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే మంత్రి కేటీఆర్ కూడా ప్రతిపక్షాల దాడిని అంతే సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో గ్రీన్ ట్రీబ్యునల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. జన్వాడలోని ఫాంహౌజ్ కు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే గ్రీన్ ట్రీబ్యూనల్ నిజాలను పరిశీలించకుండానే తనకు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. దీంతో తాను హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కొందరు కక్ష్యపూరితంగానే తనపై కేసులు వేశారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ప్రజల కోసం పని చేయాలని సూచించారు. లేకుంటే ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారన్నారు.

నితిన్ సినిమాలో విలన్‌గా సాగరకన్య!


హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అ ఆ’ తర్వాత లై, చల్ మోహన్‌ రంగా, శ్రీనివాస కళ్యాణం అంతగా ఆడకపోయినా.. తన స్టయిల్‌కు భిన్నంగా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. వీటితో పాటు బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అంధాదూన్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. మేర్లపాక గాంధీ దీనికి డైరెక్టర్. ఠాగూర్ మధు సమర్పనలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించనున్నారు.

ఈ మూవీలో నితిన్‌ అంధుడి పాత్ర పోషించనున్నాడు. కథ ప్రకారం ఇందులో లేడీ విలన్‌ ఉంటుంది. బాలీవుడ్‌లో ఈ పాత్రలో సీనియర్ నటి టబు నటించింది. తెలుగులో ఈ పాత్రకు తగిన లేడీ ఆర్టిస్ట్ కోసం చిత్ర యూనిట్‌ చాన్నాళ్లుగా అన్వేషిస్తూనే ఉంది. తొలుత అనసూయ పేరు వినిపించింది. డిమాండ్‌ ఉన్న నటి కావడం, ఇప్పటికే ‘క్షణం’ సినిమాలో కూడా విలన్‌గా యాక్ట్ చేసి మెప్పించిన నేపథ్యంలో అనసూయ అయితే బాగుటుందని చాలా మంది భావించారు. కానీ, ఆమె నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో రమకృష్ణ కూడా అనుకున్నారు. తాజాగా, ఇప్పుడు సీనియర్ నటి శిల్పా శెట్టి పేరు తెరపైకి వచ్చింది. చిత్ర బృందం ఆమెను సంప్రదించగా.. వెంటనే ఓకే చెప్పేసిందని టాలీవుడ్‌ టాక్‌.

1996లో వెంకటేశ్ సరసన ‘సాహస వీరుడు సాగరకన్య’ మూవీతో తెలుగు తెరకు పరిచమైన శిల్పా శెట్టి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. సాగరకన్యగా అద్భుతంగా నటించిన శిల్ప.. తెలుగులో చివరగా 2001లో బాలకృష్ణ మూవీ ‘భలేవాడివి బాసు’లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైన బడా వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుంది. తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాదే హిందీలో రెండు చిత్రాలకు సంతకం చేసింది. అలాంటి శిల్ప.. తెలుగు మూవీలో.. పైగా నెగిటివ్‌ రోల్‌లో నటిస్తే గొప్ప విషయమే. అదే జరిగితే దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

బోనాల వేడుకలను రద్దు చేసిన ప్రభుత్వం


కరోనా ఎఫెక్ట్ బోనాల పండుగపై పడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈసారి బోనాల వేడుకలను రద్దు చేసేందుకే మొగ్గుచూపింది. మంత్రులు, అధికారులతో బోనాల వేడుకల అంశంపై సుదీర్ఘంగా చర్చించి తాజాగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఈసారి ప్రజలంతా ఇళ్లలోనే బోనాలు చేసుకోవాలని సూచింది. ఆలయాల్లో బోనాలు సమర్పించాడని అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బోనాల వేడుకల రద్దు నిర్ణయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా కేసుల దృష్ట్యా ఈ సంవత్సరం సామూహిక బోనాల వేడుకలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలంతా ఈసారి ఎవరి ఇళ్లలో వారే బోనాల చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయాల్లో పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. పూజారులే ఘటాలను ఊరేగిస్తారని.. పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలంతా విధిగా పాటించాలని కోరారు.

ఇప్పటికే కరోనా కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగలు కళతప్పిన సంగతి తెల్సిందే. హైదరాబాద్లో ప్రతీయేటా ఘనంగా నిర్వహించే బోనాల పండుగపై తాజాగా ఈ ప్రభావం పడింది. కరోనా ప్రభావం ఇలానే కొనసాగితే వచ్చే దసరా, వినాయక చవితి వేడుకలపై ప్రభావం ఉండబోతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దసరా వరకు కరోనా కట్టడి అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ ఏడాది అన్నిపండుగలు కళ తప్పిపోయే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు.

‘పది’ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!


రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ స్పందించారు. ఇతర రాష్ట్రాలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీలో మాత్రం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరిని ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా గ్రేడ్ లు నిర్ణయిస్తారు.

తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం జరుగుతుంది. పరీక్షలు రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు పోస్టులు పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు.

షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాకపోతే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను అనవసరమైన ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంపై కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.

రణరంగంగా మారిన గాంధీ ఆస్పత్రి ప్రాంగణం


దేశంలో కరోనా మహ్మమరి విజృంభిస్తున్నప్పటికి వైద్యులు నిరంతరంగా వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. అలాంటి వైద్యులపై కొందరు దాడులకు దిగటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు వైద్యులు దాడులు జరిగిన సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని అతడి తరుపు బంధువులు జూనియర్ వైద్యులపై దాడికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో వైద్యులు రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు.

వైద్యులపై దాడిని నిరసిస్తూ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన మధ్యాహ్నం వరకు తీవ్రరూపం దాల్చింది. రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు.పెద్దసంఖ్యలో వైద్యులు, పీజీ మెడికోలు, ఇతర వైద్య విద్యార్థులు ఏకంగా కావడంతో నిరసన తీవ్రం రూపం దాల్చింది. వీరంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగడంతో పోలీసులకు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చేరిన కరోనా పేషంట్ ఆస్పత్రిలో బాత్రూమ్ వెళుతూ కాలుజారి కిందపడి మృతిచెందినట్లు తెలుస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల అతడు కాలుజారి కిందపడి చనిపోయిన విషయాన్ని వైద్యులు బంధువులకు చెప్పలేదని సమాచారం. అనుమానం వచ్చిన వైద్యులను రోగి బంధువులు నిలదీయగా మృతదేహాన్ని చూపించారు. దీంతో కన్నీరు మున్నీరైన రోగి బంధువులు ఆవేశంలో డాక్టర్లపై దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఎస్‌ఈసీ కేసులో జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాల ప్రకారం నిమ్మగడ్డ నియామకం చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ప్రభుత్వం కోరిన విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని, నోటీసులు రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగదని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్‌ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారితో ఆటలాడుకోవద్దని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేసులో హైకోర్టు.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయడంతో పాటు జస్టిస్ కనగరాజ్ నియామకానికి సంబంధించిన జి.ఒలను రద్దు చేసింది. అదే సమయంలో ఎస్.ఈ.సిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆదేశించిన విషయం విదితమే. ప్రభుత్వం మాత్రం ఈ తీర్పుపై తొలుత హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అనంతరం ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

‘గో’ వధ పై యోగి జైలు శిక్ష ఆర్డినెన్స్!

Yogi adhitya bjp

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోవును వధించిన వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ యోగి ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. గోవును వధించిన వారికి మొదటిసారి నేరం చేస్తే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించాలని యూపీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది.

గోవును రెండోసారి వధిస్తే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది. గో వధ నివారణ చట్టం 2020 పేరిట యూపీలోని యోగిఆదిత్యనాథ్ సర్కారు ఈ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. యూపీ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించారు.

‘రైతుబంధు’పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్


తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధును ఎగ్గొట్టొద్దని.. అవసరమైతే మరింత పెంచుతామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లాలోని బందన్‌కల్ గ్రామంలోని ఊర చెరువులోకి ప్రవేశించిన గోదావరి జలాలకు హారతి ఇచ్చే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కేటీఆర్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టులు వంటివి చేపట్టారన్నారు. కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చే రైతుబంధును ఎగొట్టడటం లేదని కొత్తవాళ్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రైతులను పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులను రాబందులా పీక్కుతిన్నవారు నేడు రైతు బంధు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం నియంత్రిత సాగును అమలు చేసేది రైతుల బాగుకోసమేనని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను తెలంగాణలో పండిస్తే మార్కెట్లో అధిక ధర లభిస్తుందని తెలిపారు. డిమాండ్ లేని పంటల వేయడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రైతులు కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దని సూచించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలోనే రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తుంటారని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి చెరువులు నిండి.. పొలాలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.

సిరిసిల్లలో 666 చెరువులు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువశాతం చెరువులను గోదావరి జలాలతో నింపుతామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో హరిత, నీలి, క్షీర విప్లవాలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

‘రైతుబంధు పేరుతో కేసీఆర్ కొత్త మోసం!’

Bjp arvindh

రైతు బంధు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో అవినీతికి తెరతీశాడని బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని.. ఇప్పుడు అవసరాలు, డిమాండ్, సప్లై అని కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మొక్కజొన్న రైతులు మనస్తాపానికి గురయ్యారని చెప్పారు.

బీజేపీతో పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని హెచ్చ‌రించారు. వలస కార్మికుల వ్యవహారంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ వర్గాలకు బాసటగా ఇస్తామని తేల్చిచెప్పింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని వివరించారు.

పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచుతామని ఏపీ సర్కార్ జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్ మిన్నకుండిపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఇప్పటివరకు కంపెనీలు/పరిశ్రమలను బెదిరించిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను బెదిరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిప‌డ్డారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కృష్ణ జలాలను జగన్‌కు కేసీఆర్ అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగబాబు, పోసాని.. సడన్ ఛేంజ్?


టాలీవుడ్ మారుతోంది. మునుపటి వాసనలు పోగొట్టుకుంటోంది. గతానికి భిన్నంగా ముందుకెళుతోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ అంటే తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు వెంటే టాలీవుడ్ సినీ జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ అయ్యాక మారారు. జగన్ సీఎంగా ఎక్కి ఏడాది దాటాక ఆయనను కలుసుకునేందుకు వచ్చి షూటింగ్ లకు పర్మిషన్ తీసుకెళ్లిపోయారు.

ఇక మొన్నటి ఎన్నికల వేళ జగన్ ను, వైసీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మెగా బ్రదర్స్, జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాగబాబులు.. ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు ఏకంగా జగన్ ను మెచ్చుకున్నాడు. చంద్రబాబు, టీడీపీ తిట్ల వర్షం కురిపించాడు. ఇది సినీ, రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు.. టీడీపీకి అనుకూలంగా బాకా ఊదే పచ్చ మీడియా సంస్థలకు ఏపీ సీఎం జగనే కరెక్ట్ మొగుడని మెగాబ్రదర్ నాగబాబు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి వైసీపీని, జగన్ ను తమ వ్యతిరేకిగా భావించి జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులు విమర్శించడం ప్రజలు చూస్తునే ఉన్నారు. అయితే తాజాగా మెగాబ్రదర్ నాగబాబు సడెన్ గా ఫ్లేటు ఫిరాయించాడు. సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఆయనకు ఎందుకిలా వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ, సినీ ప్రముఖుల్లో మొదలైంది.

ఇక పోసాని కూడా తొలిసారి తన తప్పు తెలుసుకొని సారీ చెప్పడం టాలీవుడ్ లో మరో విశేషం. 50 లక్షల రూపాయల లంచం ఇస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని.. ఇదే కేసులో రేవంత్ జైలుకు వెళ్లారని.. అలాంటి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ను విమర్శించే అర్హత లేదని పోసాని ఆదివారం నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ లాంటి మంచి నాయకుడిని రేవంత్ లాంటి నాయకుడు విమర్శించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మంచి నాయకులపై ఆరోపణలు చేయడం మంచిది కాదని రేవంత్ రెడ్డికి పోసాని హితవు పలికారు. కేటీఆర్ పై ఆధారాలు చూపిస్తే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని పోసాని సవాల్ చేశారు.

అయితే రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ ఫాంహౌస్ అక్రమాలపై కొన్ని ఆధారాలను విలేకరుల సమావేశంలో చూపెట్టడం.. రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోసాని తన విమర్శలను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో రేవంత్ రెడ్డిని అవమానించేలా మాట్లాడడం సరైంది కాదని.. తాను ఎటువంటి చెడు వ్యాఖ్యలు చేయలేదని పోసాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికార పార్టీపై ఆరోపణలు చేసేటప్పుడు సరైన సాక్ష్యాలు ఉండాలనే తాను సలహా ఇచ్చానని పోసాని తెలిపారు.

ఇలా టాలీవుడ్ సినీ జనాలు జగన్ ను కలవడం.. ఎప్పుడూ జగన్ ను తిట్టిపోసే మెగా బ్రదర్ నాగబాబు తొలిసారి జగన్ కు మద్దతు పలకడం.. ఇక తెలంగాణ రాజకీయాలపై నోరుపారేసుకొని పోసాని క్షమాపణ చెప్పడం.. ఇలా మూడు సంఘటనలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు భిన్నమైన వైఖరిని తీసుకోవడం చర్చనీయాంశమయ్యాయి.

–నరేశ్ ఎన్నం

టీడీపీపై మరో బాంబు పేల్చిన నాగబాబు


మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజా పరిస్థితులు, రాజకీయాలు, సినిమాలపై నాగబాబు చేసే కామెంట్స్ వివాదం అవడంతోపాటు చర్చనీయాంశంగా మారుతోన్నాయి. ఇటీవల నాగబాబు తన ట్వీటర్లో ‘గాడ్సే.. దేశ భక్తుడు’ అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెల్సిందే. అదేవిధంగా బాలకృష్ణ నోరుజారి భూములు పంచుకున్నారా అన్న మాటలకు కౌంటర్ గా నాగాబాబు ‘మీరేమీ కింగ్ కాదు.. జస్ట్ హీరో’ అని కామెంట్ చేయడంతో టాలీవుడ్లో రచ్చ మొదలైంది. నాగబాబు వర్సెస్ బాలయ్య ఇష్యూగా మారిన సంగతి తెల్సిందే. నాగబాబుపై బాలకృష్ణ ఫ్యాన్స్ ఇష్టంమొచ్చిన రీతిలో కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరిన సంగతి తెల్సిందే..

తాజాగా నాగబాబు తన ట్వీటర్లో టీడీపీపై బాంబు పేల్చారు. ఈ ట్వీట్ వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ శ్రేణులు కూడా నాగబాబుకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు జగనే కరెక్ట్ అనిపిస్తుందంటూ ఆయన ట్వీటర్లో కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబులు తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. టీడీపీ అనుసరిస్తున్న నీచ రాజకీయాల వల్లే నాగబాబు వైసీపీకి అనుకూలంగా కామెంట్స్ చేసినట్లు కన్పిస్తుంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మంగళవారం చిరంజీవి నేతృత్వంలో సినీపెద్దలు కలిసిన సంగతి తెల్సిందే. అయితే బాబుకు బాకాలుదే పచ్చమీడియా ప్రతికూల ప్రసారాలు చేయడంతో నాగబాబు హార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎంతో బేటి కావడానికి ముందు చిరంజీవి, సినీ ప్రముఖులు బస చేసిన గెస్ట్ హౌజ్ ముందు కొందరు మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ అంశాన్ని ప్రసారం చేస్తూ చిరంజీవిని టార్గెట్ చేసేలా కథనాలు ప్రసారం చేయడంపై నాగబాబు మండిపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన సోషల్ మీడియాలో బాబుకు అనుకూలంగా ఉండే ‘కుల’ మీడియాపై సైటర్లు వేశారు.

‘టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడుగారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబోరి +

ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే’ అంటూ నాగబాబు తన ట్వీటర్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

 

విజయవాడలో పెరిగిన కంటైన్మెంట్ జోన్లు..!


విజయవాడ నగరంలో కంటైన్మెంట్ జోన్ ల సంఖ్య పెరగడం అటు స్థానికుల్లో, ఇటు అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కొత్త కంటైన్మెంట్ జోన్ ల జాబితాను అధికారులు విడుదల చేశారు. 4వ విడత లాక్ డౌన్ సమయంలో 32 వార్డులే ఈ జాబితాలో ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 42 కు పెరగడం నగరంలో కరోనా కేసుల ఉధృతికి అద్ధం పడుతోంది. రోజుకు 20 నుంచి 30 కేసుల వరకూ నమోదు అవుతున్నట్లు సమాచారం. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 64 వార్డులు ఉండగా 22 వార్థులను మినహాయించి మిగిలిన 42 వార్డులని కంటైన్మెంట్ జోన్ లగా గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కంటైన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా, కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా లక్షణాలు కలిగిన వారు, జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలగు అనారోగ్య సమస్యలు ఉన్నా ఆయా వార్డు వాలంటీర్ల కు లేక ఎ ఎన్ ఎమ్, సంబంధిత వార్డు వైద్యులను గాని సంప్రదించాలి అని అధికారులు కోరుతున్నారు. నగరంలో కంటైన్మెంట్ జోన్ వివరాలోకి వెళితే 1 నుండి 5 వార్డులు, 8 ,11 ,15 వార్డులు, 16, నుండి 22 వార్డులు, 26 నుండి 29, 32 వార్డులు, 36 నుండి 41,43,44 వార్డులు, 46 నుండి 56,58,59,63,64 వార్డులు అన్నియు కంటైన్మెంట్ ఏరియలుగా ప్రకటించారు.

మరోవైపు మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గ గుడి కూడా ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటంతో భక్తులకు దర్శనానికి అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే దుర్గ గుడిలో దర్శనాలకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు ఈ అంశంపై ఇంత వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. నగరంలోని రైతు బజార్లను ప్రారంభించలేదు. కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 11 గంటల వరకే కొనసాగిస్తున్నారు.

లాక్ డౌన్ మళ్ళీ పొడిగింపు!

Telangana-High-Court

Telangana-High-Court

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సడలింపులతో దాదాపు లాక్‌ డౌన్ ఎత్తివేసినంత పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ న్యాయ వ్యవస్థకు సంబంధించి లాక్‌ డౌన్‌ ను జూన్ 28 వరకు పొడగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులు, ట్రిబ్యూనళ్లకు జూన్ 28 వరకు, జిల్లా, మేజిస్ట్రేట్, ట్రిబ్యూనళ్ల లాక్‌ డౌన్ ఈనెల 14 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అత్యవసర, తుది విచారణ కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలంటూ జిల్లా కోర్టులకు స్పష్టం చేసింది.

అయితే రెండు వైపులా లాయర్లు ప్రత్యక్ష విచారణ కోరితే మాత్రం జ్యూడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేసుకోవచ్చి హైకోర్టు తెలిపింది. దీనికితోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో నేరుగా పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

భారీ చోరీ.. ఇంటి దొంగల పనేనా?


ఏటీఎం క్యాష్ లోడింగ్ వాహనం నుంచి రూ.39 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సంచలనం సృష్టించింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో రైటర్ సేఫ్ ఏజన్సీ సిబ్బంది ఏటీఎంలలో క్యాష్ లోడింగ్ చేసేందుకు వివిధ బ్యాంకుల నుంచి రూ.39 లక్షలు నగదును సేకరించి వాహనంలో ఉంచి మరో బ్యాంక్ లో నగదు సేకరించే క్రమంలో దొంగతనం చోటు చేసుకుంది. నగరంలోని ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో నగదు తీసుకునేందుకు క్యాష్ లోడింగ్ వాహనాన్ని బ్యాంక్ కు సమీపంలో ఆపారు. ఇద్దరు సిబ్బంది బ్యాంక్ లోకి వెళ్లగా సెక్యూరిటీ ఏటీఎం వద్దకు, ఇంకొకరు టీ స్టాల్ వద్దకు వెళ్లారు. వాహనం వద్ద ఎవరు లేరు. బ్యాంక్ లోకి వెళ్లిన సిబ్బంది నగదు తీసుకుని వాహనం వద్దకు వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటం, బ్యాంక్ ల నుంచి సేకరించిన రూ. 39 లక్షలు వాహనంలో లేకపోవడంతో సిబ్బంది కేకలు పెట్టారు. క్యాష్ లోడింగ్ వాహనం కావడంతో నగదు నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వాహనంలో ఉన్నాయి.

సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఎన్నో చిక్కు ప్రశ్నలు వేధించాయి. వాహనాన్ని సీసీ కెమెరాకు చిక్కకుండా నిలపడం, నెంబర్ లాక్ ఉన్న క్యాష్ లాకర్ డోర్ పగల గొట్టకుండా తెరుచు కోవడం, వాహనం దగ్గర ఒక్కరూ లేకుండా అందరూ వెళ్లి పోవడం, తాళాలు, డోర్ పగల గొట్టినట్లు తాము చూడలేదని బ్యాంక్ సమీపంలోని షాపుల యజమానులు చెప్పడం వంటి చిక్కు ప్రశ్నలతో పాటు సిబ్బంది పొంతన లేని సమాధానాలతో పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రైటర్ సేఫ్ ఏజెన్సీ సిబ్బంది తిరుమలరావు, భుజంగరావు, వెంకట నాగేంద్ర, ప్రవీణ్‌ కుమార్ లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ దొంగతనం ఇంటిదొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.