
దేశంలోని చైనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు ఉండనుంది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా కేంద్రం ఆరోగ్య సేతు యాప్ రూపొందించిన సంగతి తెల్సిందే. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సంగతి తెల్సిందే. భారతీయులు అధికంగా వినియోగిస్తున్న ఆరోగ్యసేతు యాప్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. దీంతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సేతు యాప్ పేరుతో కొన్ని నకిలీ లింకులు పంపుతున్నారని తెలంగాణ ఇంటలిజెన్స్ గుర్తించి ప్రజలను అలర్ట్ చేస్తుంది. నకిలీ లింకులను ఓపెన్ చేస్తే మొబైల్ హ్యక్ అయి డాటా మొత్తం చోరి అవుతుందని హెచ్చరించింది. ఎవరికైనా నకిలీ లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయద్దని తెలంగాణ నిఘా విభాగం సూచిస్తోంది.
తెలంగాణ ప్రజలు నకిలీ లింకులు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలగాణ ఇంటలిజెన్స్ సూచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా ఈ నకిలీ లింకులు ఫార్వడ్ అవుతున్నాయని పేర్కొంది. అండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారంతా ఫేక్ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటలిజెన్స్ ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఆరోగ్య సేతు యాప్ పేరుతో వచ్చే నకిలీ లింకులను ఓపెన్ చేస్తే ‘చాట్ మీ’ యాప్ డౌన్లోడ్ అవుతుందని పేర్కొంది. ఆ తర్వాత మొబైల్ హ్యాక్ అయి సమాచారం అంతా చోరికి గురవుతుందని తెలిపింది. పాక్ సైబర్ నేరగాళ్లు ఈ లింకులను పంపుతున్నారని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ సూచిస్తుంది. ఎవరి మొబైల్ అయినా హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్ వినియోగదారులు ఇప్పటికైనా ఏ లింకు పడితే ఆ లింకును ఓపెన్ చేయకుండా.. ఫేక్ లింకులపై అవగాహన పెంచుకోవాలని ఇంటలిజెన్స్ సూచిస్తుంది.